ఎర్రగొండ పాలెం పోలీసు స్టేషన్ మూతపడిందా?
posted on Apr 26, 2023 @ 11:55AM
ఎర్రగొండ పాలెం పోలీసు స్టేషన్ కు తాళం వేసేశారా? అంటే ఇండియన్ పోస్ట్స్ ఔననే అంటోంది. ఈ మేరకు తపాలా శాఖ ఇచ్చిన ఒక మెసేజ్ తీవ్ర కలకలం సృష్టించింది. కేసులు నమోదు చేయడం, చేయకపోవడం విషయంలో ఏపీలో పోలీసు శాఖ కూడా అవినాష్ రెడ్డి టెక్నిక్ ను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది.
చంద్రబాబుపై ఎర్రగొండపాలెంలో ఈ నెల 21న తెలుగుదేశం అధినేత పర్యటన సందర్భంగా ఆయనపై రాళ్ల దాడి జరిగంది. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలంటూ మంగళగిరి మండలం క్రిష్టాయిపాలేనికి చెందిన సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి.గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. చంద్రబాబును హత్య చేయాలన్న కుట్రతో మంత్రి ఆదిమూలపు సురే శ్ ఈ దాడి చేయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఫిర్యాదును ఆయన ఈనెల 24న రిజిస్టర్ పోస్టు ద్వారా ఎర్రగొండపాలెం పోలీసు స్టేషన్ కు పంపారు.
కానీ మంత్రిపై వచ్చిన ఫిర్యాదు కావడంతో ఆ రిజిస్టర్డ్ కవర్ ను తీసుకోవడానికి ఎర్రగొండపాలెం పీఎస్ లో ఎవరూ ధైర్యం చేయలేదు. అది వెనక్కు వెళ్లిపోయింది. దీంతో ఫిర్యాదు దారుడు తన రిజిస్టర్ పోస్టును ట్రాక్ చేయగా డోర్ లాక్డ్, నాట్ డెలివర్డ్ అని తేలింది. ఈ సమాచారం 24 తేదీ 5.44 గంటలకు ఎర్రగొండపాలెం పోస్టాఫీస్ నుంచి సమాచారం వెళ్లింది. నిబంధనల ప్రకా రం పని వేళల్లో ప్రభుత్వ కార్యాలయాలు డోర్ లాక్ అయ్యి ఉండటానికి వీళ్లేదు. దీంతో ఈ విషయం వైరల్ అయ్యింది.
సామాజిక మాధ్యమంలో ఎర్రగొండ పాలెం పోలీసు స్టేషన్ కు తాళం వేశారా? ఆ పీఎస్ ను మూసేశారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఉండగా ఎర్రగొండపాలెం ఎస్సై ఈ విషయంపై స్పందిస్తూ తమ పోలీసు స్టేషన్ కు ఎటువంటి రిజిస్టర్డ్ పోస్టూ రాలేదనీ, తమ పోలీసు స్టేషన్ డోర్ ఎప్పుడూ లాక్ చేసి లేదనీ వివరణ ఇచ్చారు.
మొత్తం మీద సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి.గంగాధర్ ఫిర్యాదు రిజిస్టర్డ్ పోస్టులో పంపినా ఎర్రగొండ పాలెం పోలీసు స్టేషన్ లో డెలివరీ కాకపోవడం, పీఎస్ లాక్ చేసి ఉందంటూ మెసేజ్ రావడం సంచలనంగా మారింది.