తెలుగువన్ ముందే చెప్పింది... బీఆర్ఎస్ లోకి తెలంగాణ మాజీ సీఎస్?
posted on Apr 25, 2023 @ 2:42PM
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారా?.. త్వరలో చేరబోతున్నారా?.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఆయన పార్టీలో చేరికకు దారి సుగమం అవుతోందనీ, అందుకే మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ వేదికపై ఆయనకు చోటు లభించిందని విశ్లేషిస్తున్నారు. ఇక నుంచి ఆయన తెలంగాణ బయట జరిగే ప్రతి బీఆర్ఎస్ సభలోనూ ప్రముఖంగా కనిపిస్తారని అంటున్నారు. ఔరంగాబాద్‌లో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం (ఏప్రిల్ 14) జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభలో సోమేశ్ కుమార్ ప్రత్యక్షమయ్యారు. సభలో పాల్గొనడానికి కొన్ని నిమిషాల ముందు మహారాష్ట్ర పొలిటీషియన్ అభయ్ పటేల్ నివాసంలో జరిగిన సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ వేదిక మీద సోమేశ్ కుమార్ కకనిపించడంఇదే మొదటి సారి.
తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వంలో కాదు, బీఆర్ఎస్ లో కీలక పదవి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని తెలుగువన్ ముందే చెప్పింది. ఆయనను బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలబెట్టే దిశగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని కూడా నాడే తెలుగువన్ అంచనా వేసింది.
సోమేష్ కుమార్ స్వరాష్ట్రం బీహార్ లో ఆయనకు బీఆర్ఎస్ బాధ్యతలు అప్పంచే అవకాశాలున్నాయనీ పేర్కొంది. ఆయన తెలంగాణ సీఎస్ గా రిలీవ్ అయ్యి.. ఏపీలో రిపోర్ట్ చేసిన సమయంలోనే తెలుగువన్ ఇక ఆయన అడుగురు రాజకీయంవైపే అని కుండబద్దలు కొట్టింది.
సర్వీస్ నిబంధనల ప్రకారం తెలంగాణలో రిలీవ్ అయిన వెంటనే రాజీనామా చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురౌతాయి కనుక ఏపీలో రిపోర్టు చేసి అక్కడ పోస్టింగ్ తీసుకుంటరనీ, ఆ తరువాత తీరిగ్గా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని కేసీఆర్ వెంట రాజకీయ అడుగులు వేస్తారనీ నాడే తెలుగువన్ విస్పష్టంగా పేర్కొంది. ఇప్పుడు తాజా పరిణామాలను గమనిస్తే నాడు తెలుగువన్ చెప్పింది అక్షర సత్యం అని రుజువైంది.