మళ్లీ తెరపైకి రాయల తెలంగాణ
posted on Apr 25, 2023 @ 1:48PM
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారం అయిన దశాబ్ద కాలం తర్వాత రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాదనలు రాజకీయాల్లో మరో మారు చర్చనీయాంశమయ్యాయి.
రాయలసీమను తెలంగాణలో కలపాలని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ... రాయల తెలంగాణ అనేది ఇప్పుడు సాధ్యం కాదని తేల్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే రాయల తెలంగాణ అనే అంశం తెరపైకి వచ్చిందని ఆయన అన్నారు. రాయల తెలంగాణ కానీ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కానీ ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు. తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని పక్క రాష్ట్రాల వారు కోరడం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ఏపీ అభివృద్ధి కూడా కేసీఆర్ తోనే సాధ్యమని... రాయల తెలంగాణ అనే అంశాన్ని వదిలేసి కేసీఆర్ నాయకత్వం దిశగా ఏపీ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని సూచించారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చినట్టు... ఆంధ్రను సువర్ణాంధ్ర చేయడం కూడా సాధ్యమేనని కేసీఆర్ గతంలోనే చెప్పారని అన్నారు. పాలకులను మార్చి రాష్ట్రాన్ని సువర్ణాంధ్రగా మార్చుకోవాలని చెప్పారు. రాష్ట్ర వెనుకబాటుకు కారణమైన పాలకులపై ఏపీ ప్రజలు తిరుగుబాటు చేయాలని జగదీశ్ రెడ్డి సూచించారు.
రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీని ఒప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఈ డిమాండ్ ను బలపరిచిన వారిలో ఉన్నారు. రాయలసీమలో ముస్లిం జనాభా ఎక్కువ. రాయల తెలంగాణ ఏర్పాటు అయితే ఆ పార్టీ అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉండేది. అయితే రాయల తెలంగాణ ప్రతి పాదనను ప్రారంభం నుంచే బీజేపీ వ్యతిరేకించింది. రాయలసీమలో ఉన్న వెనకబాటుతనానికి పాలక పక్ష పార్టీలే కారణమని బీజేపీ నిందించింది. రాయల తెలంగాణ డిమాండ్ ను టీడీపీ ఎప్పుడూ సమర్ధించలేదు. అప్పట్లో టీఆర్ఎస్ ఈ ప్రతి పాదనను వ్యతిరేకించింది. రాజకీయ అస్థిత్వం కోసం రాయల తెలంగాణా నినాదం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.