బెదిరింపు కాల్స్ అతనికి కొత్తేం కాదు
posted on Apr 25, 2023 @ 12:49PM
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు కాల్ రావడం మంగళవారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.అత్యవసరాల కోసమని ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీద ప్రారంభమైన టోల్ ఫ్రీ నెంబర్ నుంచే తనకే బెదిరింపు కాల్ రావడం హిందుత్వ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మాఫీయా శక్తుల మీద ఉక్కుపాదం మోపిన కారణంగా బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం.
యోగి ఆదిత్యనాథ్ వివాదా స్పద సీఎం అని చెప్పుకోవచ్చు. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని పోలీసుల చేత దాడులు చేయించినట్లు అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలకు తావులేదు. అయినా యోగి ఆదిత్యనాథ్ హిందూ మతోన్మాదిగా చేసే ప్రసంగాలు అనేక సార్లు వివాదాస్పదమయ్యాయి. యోగి ఆదిత్యనాథ్ పై 2005లో క్రిస్టియన్లను బలవంతంగా హిందువులుగా మార్చిన ఆరోపణలున్నాయి.మదర్ థెరిస్సాను కూడా యోగి ఆదిత్యనాథ్ వదల్లేదు. దేశంలో క్రిస్టియానిటీ పెంచి పోషించింది ఆమేనని వివాదాస్పద ప్రకటన చేశారు. యోగాసనాలు చేయని పక్షంలో శివుడు దేశం విడిచి వెళ్లిపోతాడని యోగి ఆదిత్యనాథ్ అప్పట్లో చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.
ఉత్తర ప్రదేశ్ లో బీజేపీని గెలిపించకపోతే మరో కశ్మీర్ అవుతుందని యోగి ఆదిత్యనాథ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వివాదాస్పద వ్యక్తిగా నిలిచి పోయాడు. ఈ క్రమంలో తాజాగా ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 112 కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. అత్యవసర సర్వీసుల కోసం యోగీ సర్కార్ 112 సర్వీస్‌ను ప్రారంభించింది. బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దీని పై 112 ఆపరేషన్ కమాండర్ సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 506, 507, ఐటీ చట్టం 66 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. “నేను త్వరలో సీఎం యోగిని చంపుతానని ఆ వ్యక్తి 112 సర్వీస్ కు సందేశం వచ్చిందని” కమాండర్ పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు కాల్ రావడం ఇవ్వళ కొత్తేమి కాదు. నిరుడు లక్నో నుంచి ఇలాంటి తరహా కాల్ వచ్చిన సంగతి తెలిసిందే.