ఎర్రచందనం స్మగ్లర్లకు అండ ఎవరు విజయసాయీ?
posted on Aug 28, 2023 @ 1:42PM
స్పందన జీవ లక్షణం, ప్రతి స్పందన మనిషి లక్షణం.. ఈ లక్షణాలు నూటికి నూరు శాతం ఉన్న వ్యక్తి అధికార జగన్ పార్టీలో ఎవరైనా ఉన్నారా? అంటే.. ఆ పార్టీ తొలి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక్కరే ఉన్నారని వైసీపీలోని ఆయన వ్యతిరేక వర్గం పెద్ద గొంతేసుకుని చెబుతారు. దేశంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. దానిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లకు ఆపాదిస్తూ.. ట్విట్టర్ వేదికగా స్పందించడం ఆయన విజయసాయిరెడ్డికి ఉన్న ప్రత్యేక లక్షణం అంటారు.
అలా పోలికలు ఆపాదిస్తూ ఆయన చేసే వ్యాఖ్యలు ఒక్కొక్కసారి బూమరాంగ్ అవుతుంటాయనీ, వాటి వల్ల పార్టీకి పూడ్చలేని నష్టం వాటిల్లుతున్నదని కూడా చెబుతారు. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ వైసీపీకి గట్టిగానే తగిలింది. ఇటీవల పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. దీంతో అల్లు అర్జున్ ను అభినందిస్తూ పలువురు ట్వీట్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా అభినందించారు. వెంటనే విజయసాయి ట్విట్టర్ వేదికగా తన వ్యంగ్య వైభవానికి నగిషీలు అద్దుతూ రంగంలోకి వచ్చేశారు. అల్లు అర్జున్ అభినందించడంతో ఊరుకోకుండా పనిలో పనిగా చంద్రబాబుపై సెటైర్లు వేయడానికి ప్రయత్నించి భంగపడ్డారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టి వైసీపీని నవ్వుల పాలు చేసింది. ఇంతకీ ఆయన ఆ ట్వీట్ లో ఏమన్నారంటే.. నలుగురి దృష్టిని ఆకర్షించే ఘటన ఎక్కడ జరిగినా దానిని తనకే ఆపాదించుకుంటారు చంద్రబాబు గారు. పుష్ప హీరో అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడానికి కూడా తానే స్పూర్తి అని అన్నా అంటారు. తన హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కింది. ఎందరో పుష్పరాజ్‌లను నేనే తయారు చేశా. పుష్ప పార్ట్ 2 కూడా వస్తోంది తమ్ముళ్లూ అని బాబు బాంబు పేలుస్తాడేమో అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అంతే వైసీపీలోని ఆయన వ్యతిరేకులే కాకుండా, తెలుగుదేశం శ్రేణులు కూడా విజయసాయి ట్వీట్ పై తమదైన స్టైల్ లో రివర్స్ సెటైర్లు గుప్పించేశారు. ఆ ట్వీట్ల సారాంశమేంటంటే.. విజయసాయిరెడ్డిగారు చెప్పేది నిజమే.. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశారని.. ఆ టాస్క్‌ఫోర్స్‌కు అధిపతిగా నీతి నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారిని నియమించారని.. ఆ క్రమంలో శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న తమిళ కూలీలపై కాల్పులు జరిపితే.. 20 మంది మరణించారు. ఆ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం విజయసాయిరెడ్డి మరిచిపోయి ఉంటారు. అదీకాక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ.... అటు ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లోనే కాకుండా.. ఇటు శేషాచలం అడవుల్లో పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు పట్టుబడ్డారు. అదే విధంగా రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనాన్ని తరలిస్తూ కూలీలను రెడ్ హ్యాండెడ్‌గా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.. కానీ జగన్ ప్రభుత్వం గద్దెనెక్కన తర్వాత.. ఎర్రచందనం స్మగ్లింగ్ అనే మాటే వినపడం లేదని.. దీంతో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగిపోయిందా? లేకుంటే స్మగ్లింగ్ జరుగుతోందా? జరుగుతుంటే సైలెంట్‌గా జరుగుతోందా? ఓ వేళ స్మగ్లింగ్ ఆగిపోతే ? ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమైనా పట్టిష్టమైన ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందా? అదీకాక జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లో శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం కానీ.. వాటిని ఎత్తుకెళ్తున్న కూలీలు కానీ పట్టుబడ్డారంటూ ఏక్కడా ఒక్క వార్త కూడా అటు మీడియాలో కానీ.. ఇటు సోషల్ మీడియాలో కానీ రాలేదు, దీంతో శేషాచలం అడవులు, ఎర్రచందనం, ఎర్రచందనం స్మగ్లింగ్ అనే పదాలు తెలుగు ప్రజలు దాదాపుగా మరిచిపోయారని.. కానీ పుష్ప సినిమా విడుదల సందర్భంగా... ఎర్రచందనం స్మగ్లింగ్ విషయం ప్రజలకు గుర్తుకు వచ్చింది.
ఆ తర్వాత ఆ విషయం కూడా ప్రజలు మరిచిపోతున్న తరుణంలో.. పుష్ప సినిమా హీరో పుష్ప అలియాస్ ఫుష్పరాజ్‌గా నటించిన అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం.. ఈ నేపథ్యంలో విజయాసాయిరెడ్డి.. ఇలా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడుపై వ్యంగ్యంగా స్పందించడంతో.. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శేషాచలం అడవుల్లో చోటు చేసుకొన్న సంఘటనలు కళ్ల ముందు కదలాడాయని విజయసాయిరెడ్డి వ్యతిరేకులు ట్వీట్టర్ వేదికగా గుర్తు చేస్తున్నారు.
అదీకాక తిరుమల కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది.. అందుకు ఆటు శేషాచలం అడవుల్లో ఉండాల్సిన వైపు వెళ్లాల్సిన కృూర మృగాలు.. అలిపిరి మెట్ల మార్గం వైపునకు దూసుకు వచ్చి శ్రీవారి భక్తులపై దాడులకు పాల్పడుతున్నాయని వారు పేర్కొన్నారు.
అయినా తిరుపతి కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ.. అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన కొల్లం గంగిరెడ్డి బెయిల్‌పై విడుదల చేయించింది నాటి సీఎం చంద్రబాబు హయాంలోనేనా?.... లేకుంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన వెంటనేనా? అనేది మాత్రం తమకు గుర్తుకు రావడం లేదని ఈ సందర్భంగా విజయసాయి వ్యతిరేకులు సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు.