దాడులు వైసీపీవి.. కేసులు తెలుగుదేశం కార్యకర్తలపై
posted on Sep 6, 2023 @ 3:07PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా భీమవరం నియోజకవర్గం తాడేరు వద్ద లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా ఈ రాళ్ల దాడి జరిగింది. లోకేశ్ పాదయాత్ర కాన్వాయ్ పై వైసీపీ మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. యువగళం కాన్వాయ్ లోని పలు వాహనాలను ధ్వంసం అయ్యాయి. దీంతో పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన ఉన్న భవనాల పైకి ఎక్కి రాళ్ల దాడికి పాల్పడడంతో పాటు వైసీపీ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. వైసీపీ నేతలు ఎంత కవ్వింపు చర్యలకు దిగినా సహనం కోల్పోకుండా నిలిచిన తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లదాడితో తిరగబడ్డారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు వైసీపీ కార్యకర్తలకు రక్షణగా నిలిచారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మొదటి నుంచి వైసీపీ ఆటంకాలు కలిగిస్తూనే ఉంది. యువగళంపై దాడులు చేస్తున్నది. వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పి ఘర్షణలు సృష్టిస్తున్నది. లోకేష్ ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చూస్తూ రకరకాల కేసులు పెడుతున్నారు. ఏకంగా పోలీసుల అండతోనే వైసీపీ ఈ దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పుంగనూరు, ఎమ్మిగనూరు, పెదపారుపూడి.. ఇలా అనేక ప్రదేశాల్లో వైసీపీ లోకేష్ పాదయాత్రలో ఘర్షణలు సృష్టించింది. పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ అన్ని సందర్భాలలోనూ పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తాజాగా భీమవరం నియోజకవర్గం తాడేరు పాదయాత్రలో కూడా అదే జరిగింది.
తాడేరులో పాదయాత్ర కొనసాగుతుండగా.. వైసీపీ కార్యకర్తలు చుట్టుపక్కల భవనాల పైనుంచి వైసీపీ జండాలు ఊపుతూ టీడీపీ శ్రేణులను కవ్వించారు. అదే భవనాలపై నుంచి ముందుగానే సిద్ధం చేసుకున్న రాళ్ళు, సోడా సీసాలూ విసురుతూ దాడులకు తెగబడ్డారు. అదే సమయంలో పాదయాత్ర జరుగుతున్న రోడ్డు పక్కనే కర్రలతో సిద్దంగా ఉన్న మరికొందరు వైసీపీ కార్యకర్తలు యువగళం వాలంటీర్లను చుట్టుముట్టి చితకబాదారు. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో సహా పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మూడు వైపుల నుంచి ఒకేసారి దాడులు జరుగడంతో ఊహించని ఈ పరిణామానికి నారా లోకేష్‌తో సహా అందరూ షాక్ అయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వైసీపీ కార్యకర్తలను అడ్డుకొనే ప్రయత్నం చేయకపోగా వారు కూడా యువగళం వాలంటీర్లపైనే తమ ప్రతాపం చూపడంతో కాసేపు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈ దాడుల అంశంలో మంగళవారం అర్ధరాత్రి ప్రాంతంలో యువగళం క్యాంప్ సైట్ పై పోలీసులు దాడి చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ పాదయాత్రతో అలసిపోయి నిద్రిస్తున్న వాలంటీర్లు, కిచెన్ సిబ్బంది సహా మొత్తం 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు వాహనాల్లో యువగళం వాలంటీర్లను తరలించారు. ఈ వాలంటీర్లను రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ చితకబాదారు. అనంతరం బుధవారం ఉదయం సిసిలీలోని వైసీపీ నేతకు చెందిన రాజ్యలక్ష్మి మెరైన్ ఎక్స్ పోర్ట్స్ ఫ్యాక్టరీలో బంధించారు. విషయం బయటకి పొక్కడంతో అందరిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తుంది.
పోలీసుల అదుపులో ఉన్న యువగళం వాలంటీర్లపై 307 సెక్షన్ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ కార్యకర్తలను భీమవరం, నర్సాపురం, వీరవాసరం పోలీస్ స్టేషన్లకు తిప్పారని, చివరికి వైసీపీ నేత ఫ్యాక్టరీలో బంధించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. రాళ్ల దాడిలో దెబ్బలు తిన్న తమనే అరెస్టు చేయడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించాకే యాత్ర చేపట్టమని, వైసీపీ కార్యకర్తలతో కవ్వింపు చర్యలు చేపట్టి, ఇప్పుడు వాలంటీర్లను అరెస్టులు చేశారని మండిపడుతున్నారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని తెలుస్తుండగా.. వైసీపీ వర్గాలు ఇలాంటి ఏర్పాట్లు చేసుకొంటున్నారని ముందే తెలిసినప్పటికీ పోలీసులు వారిని నిలువరించలేదు. పైగా ఘర్షణలలో వారికే అండగా నిలబడి.. చివరికి తిరిగి టీడీపీ కార్యకర్తలు, వాలంటీర్లపైనే కేసులు పెట్టడం చూస్తుంటే రాష్ట్రంలో ఎలాంటి అరాచక పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.