తారస్థాయికి చేరిన ప్రజా వ్యతిరేకత.. డిఫెన్స్‌లో జగన్?!
posted on Sep 7, 2023 @ 4:59PM
మాది పేదల ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలన్నదే మా ఎజెండా. ఇందుకోసం ఎలాంటి మధ్య వర్తులూ లేకుండా, ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా, రాజకీయాలకు అతీతంగా తమ పథకాలు ప్రజలకు చేరాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇదీ జగన్మోహన్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చెప్పిన మాట. ఇందుకోసం వైసీపీ ప్రభుత్వం ఎంచుకున్న విధానమే నవరత్నాలు. నవరత్నాలలో సంక్షేమంతో పాటు మరికొన్ని అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. అయితే, మిగతా హామీలను పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరిట బటన్ నొక్కి ఖాతాలలోకి నగదు బదిలీ చేయడం మొదలు పెట్టింది. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ లాంటి పేదవాడికి అక్కరకు వచ్చే పథకాలను కూడా కాదని కేవలం బటన్ బటన్ నొక్కుడు కార్యక్రమానికే జగన్ పరిమితమయ్యారు.
ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం దాదాపు రూ. 2.30 లక్షల కోట్ల నగదును బటన్ నొక్కుడు ద్వారా బదిలీ చేసింది. అయినా ప్రజలలో అసంతృప్తి తారస్థాయికి చేరింది. సంక్షేమం పేరిట పంచిన దాని కంటే మూడింతలు ఎక్కువగా ప్రజల నుండి పన్నుల రూపంలో ముక్కు పిండి వసూలు చేయడం, అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి ప్రజల కొనుగోలు శక్తి నశించిపోయినా.. ప్రతి వస్తువు కొనుగోలులో పన్ను పోటు ప్రజలలో అసంతృప్తిని పెంచేసింది. నిజానికి గత ప్రభుత్వంతో పోలిస్తే జగన్ సర్కార్ సంక్షేమానికి ఖర్చు చేసిన నిధులు ఎక్కువేం కాదు. గతంలో రకరకాల మార్గాల ద్వారా ప్రజలకు చేర్చిన నగదును ఇప్పుడు బటన్ నొక్కి ప్రజల ఖాతాలకు చేర్చారు. కానీ గత ప్రభుత్వానికి మించి పన్నుల బాదుడు, ఉపాధి అవకాశాల క్షీణత ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చి పెట్టింది.
రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలకు ఏదో ఒక రూపంలో ఫలాలు అందించినా తమ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత లేదని అధికార పార్టీ ఇప్పుడు తెగ ఆందోళన చెందుతోంది. తలకి ఇంత లెక్కన ప్రజల ఖాతాలలోనే జమ చేసినా ప్రజలలో వ్యతిరేకత పెరుగిపోతుండడం ఇప్పుడు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ప్రజలలో ఏ వర్గాన్ని కదిలించినా అసహనం.. ఏ నోట విన్నా అసంతృప్తి.. ఆగ్రహం, ఎవర్ని కదిలించినా కన్నీటి కష్టాలే. ప్రభుత్వం అంత చేశాం.. ఇంత చేశాం అని చెప్తున్నా ప్రజలలో మాత్రం ప్రభుత్వంపై ఏ మాత్రం సానుకూలత కానరావడం లేదు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. ఈసారి మళ్ళీ తమదే అధికారమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా వైసీపీ నేతలు మనోవేదనకు గురవుతున్నట్లు కనిపిస్తున్నది.
ఇప్పటికే కొన్ని సర్వే ఫలితాలు ప్రజలలోని ఈ అసంతృప్తిని బహిర్గతం చేసి గణాంకాలతో సహా జగన్ పార్టీ పరాజయం అనివార్యం అంటూ తేల్చేశాయి.. దీంతో వైసీపీ, మరీ ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకత, అసంతృప్తిపై డిఫెన్స్ లో పడిపోయినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్ల పాటు అభివృద్ధి, ఇన్ఫ్రా స్ట్రక్చర్, ప్రజల అవసరాలను అన్నీ వదిలేసి.. కేవలం బటన్ నొక్కడం.. తిరిగి పన్నుల పేరిట అంతకంత ముక్కుపిండి వసూలు చేయడంతో ప్రజలు విసిగి వేసారిపోయినట్టు నిర్ధారణ చేసుకున్న జగన్ ఇప్పుడు మరోసారి విజయం కోసం ఏం చేయాలన్నది తెలియక తల బద్దలు కొట్టుకుంటున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
కడుపు మండిన పేదవాడిని నమ్మించి మరో సారి బుట్టలో వేసుకోవడానికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో జగన్, వైసీపీ వ్యూహకర్తలు ఉన్నారంటున్నారు. జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో సగటు ప్రజల ఆదాయాలు పెరగకపోగా.. ఏటేటా ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకవైపు కేంద్రం బాదుతుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అంతకు మించి బాదుడే బాదుడు అంటూ ప్రజలను కుంగదీసింది. తమ జీవన స్థితిగతులు నానాటికీ దిగజారుతుండటంతో జగన్ సర్కార్ పై ప్రజలలో తీవ్ర అసహనం కనిపిస్తోంది. ఆ అసహనమే ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.