జగన్ యాత్ర.. ప్రజలకు దూరంగానేనా?
posted on Sep 8, 2023 @ 1:20PM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ.. భవిష్యత్త్ గ్యారంటీ, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు పేరుతో చేపట్టిన యాత్రలు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహీ యాత్రతో... ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సాధారణంగా ఎన్నికల సంవత్సరంలో అధికార పార్టీ కూడా తన పాలనలో ప్రజలకు అందించిన ప్రయోజనాలు, సంక్షేమం, రాష్ట్ర ప్రగతి తదతర అంశాలతో ప్రజలలోకి విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అయితే ఏపీలో అధికార వైసీపీ మాత్రం ఆ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చేసింది, చెప్పుకోవడానికీ ఏం లేదన్న భావనా, గడపగడపకూ, జగనన్నే మా నమ్మకం కార్యక్రమాలలో ఎదురైన అనుభవమే మళ్లీ పునరావృతం అవుతుందన్న భయమో కానీ వైపీపీ ఇంత వరకూ ప్రజల ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన తరువాత వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రజలలో మమేకం కావడానికి ఓ యాత్ర చేపట్టేందుకు నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ ఆ పర్యట నుంచి తిరిగి రాగానే యాత్రకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు. గతంలో అంటే విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేశారు. అయితే ఈ సారి యాత్ర మాత్రం పాదయాత్ర కాదు.. ప్రజా యాత్రలాగా రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలు పేర సంక్షేమ పథకాలంటూ బటన్ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లోకి నగదు జమచేస్తున్నారు. ఆ విషయాన్నే ప్రధానంగా ప్రచారం చేస్తూ.. ప్రజలకు తన ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని మరోసారి వారికి వివరించడం, అదే సమయంలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం లక్ష్యంగా జగన్ ఈ యాత్రకు సంకల్పించినట్లు చెబుతున్నారు. అన్నీ కుదిరితే వచ్చే నెల చివరి వారం నుంచీ జగన్ యాత్ర ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్, ఏర్పాట్లు తదితర అంశాలను ఖరారు చేసేందుకు జగన్ ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఓ కమిటీని వేసినట్లు చెబుతున్నారు.
ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు సీఎం జగన్ బస చేసి స్థానిక ప్రజలతో మమేకం అవుతారనీ, పనిలో పనిగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుంటారనీ, అలాగే ఆయా నియోజకవర్గంల్లోని పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే పని కూడా చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
జగన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రచ్చబండ కార్యక్రమాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో 2009, సెప్టెంబర్ 2 వ తేదీ.. కర్నూలు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన సంగతి విదితమే. అప్పట్లోవైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు గ్రామస్థాయిలోని ప్రజలకు అందుతున్నాయా లేదో తెలుసుకోవడం లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం నిర్వమించేవారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి వైఎస్ పథకాలకు అద్భుతమైన ప్రజాస్పందన అప్పట్లో వచ్చింది. అందుకే ఆయన రచ్చబండ కార్యక్రమానికి ధైర్యం చేయగలిగారు. అయితే అందుకు భిన్నంగా జగన్ పథకాలకు ప్రజాదరణ సంగతి అటుంచి తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తున్నది. ఈ తరుణంలో జగన్ రచ్చబండ పేరుతో ప్రజల మధ్యకు వెళ్లితే.. ప్రజల నుంచి వ్యతిరేకతను ఆయన ప్రత్యక్షంగా చూసే వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత పట్టించుకోలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విపక్ష నేతగా రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చి.. ఆ తర్వాత మూడు రాజధానులను తెరపైకి తీసుకు వచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్నే కాదు.. ప్రత్యేక హోదాను సైతం పక్కన పెట్టేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల మధ్యకు సీఎం జగన్ వెళ్తే... ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఆయన స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందని పరిశీలకులు అంటున్నారు.
అదీకాక సీఎంగా జగన్ ఇప్పటి వరకూ చేపట్టిన పర్యటనల్లో రహదారులకు ఇరువైపులా పరదాలు కట్టుకొని వెళ్లారు. అలాగే సీఎం పర్యటన కావడంతో భారీగా పోలీసులు మోహరించి జనం ఆయన సమీపానికి రాకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నారు. చెట్లను సైతం నరికేశారు. వీటన్నిటికీ మించి సీఎం క్యాంప్ కార్యాలయానికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరానికి సైతం ఆయప హెలికాఫ్టర్‌లో వెళ్తున్నారు. అలాంటి సీఎం జగన్ రాజధాని అమరావతి ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించగలరా? అని రాజకీయ విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వేళజగన్ ఆ ప్రాంతానికి వెడితే గిడితే భూములు ఇచ్చిన రైతుల ఆవేదనను, ఆవేశాన్ని, వారి ఆగ్రహాన్ని చవి చూడక తప్పదని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ రచ్చబండ కార్యక్రమం అంటూ ప్రజల్లోకి వెళ్లడం అంటూ జరిగితే.. గతంలో గడపగడపకూ కార్యక్రమంలో ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎదుర్కొన్న చేదు అనుభవాలు జగన్ కు కూడా ఎదురు కాక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా కాకుండా ఆయన అధికారిక పర్యటనల్లాగే పరదాలు అడ్డు పెట్టుకుని పోలీసులను మోహరించి ప్రజలకు దూరంగా జగన్ యాత్ర జరిగితే.. ఆయన పట్ల, ఆయన ప్రభుత్వం పట్లా ఇప్పటికే ఉన్న ప్రతికూలత మరింత పెరగడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించదని అంటున్నారు.