అందంతో విశ్వాన్ని గెలిచేసింది!! 

చాలామంది అందంది ఏముందిలే మనసు బాగుండాలి కానీ అంటారు. అవును నిజం మరి అందం లేకపోయినా మనసు బాగుంటే చాలు. కానీ అదే మనుషులు ఇతరులలో  లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు అందం ఉన్నా వ్యర్థమే. అయితే మనసు, అందం రెండూ ఉన్నవాళ్లు కొంతమంది ఉంటారు. కానీ బయటకు ఎక్కువగా తెలియదు వీళ్ళందరి గురించి కారణం వాటి గురించి అందరికీ తెలిసే సందర్భం రాకపోవడమే. అందాన్ని మనసును స్ఫూర్తి వంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి విశ్వానికి అంతటికీ విజేతగా నిలిచిన మన భారతీయ మగువ విజయాన్ని చూస్తే గర్వాంగానూ, ముచ్చటగాను అనిపిస్తుంది. 2000 సంవత్సరంలో లారా దత్తా మిస్ యూనివర్స్ గా ఎంపికైన తరువాత సుమారు 21 సంవత్సరాలకు భారతదేశం ఖాతాలో మిస్ యూనివర్స్ కిరీటం చేరడం పట్ల దేశం మొత్తం ఆనంద సంబరాల్లో ఉందనే చెప్పాలి.  సంధూ విజయ కేతనం!! పంజాబ్ రాజధాని చండీఘడ్ కు చెందిన హర్నాజ్ కౌర్ సంధూ భారతదేశం నుండి చివరిసారిగా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ గా లారా దత్తా ఎంపికైనప్పుడే పుట్టారు. ఈమె ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఈమె వయసు 21 సంవత్సరాలు, భారతదేశానికి ఈమె 21 సంవత్సరాల తరువాత యూనివర్స్ కిరీటాన్ని అందించారు. ఈ అంకెలు ఇలా కలవడం యాదృశ్చికమే అయినా కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కూడా. అందాల పోటీలలో పాల్గొంటూ ఒక్కో మెట్టూ ఎక్కి వచ్చిన హర్నాజ్ కౌర్ సంధూ 2017 లో మిస్ చండీగఢ్ గానూ, 2018 లో మిస్ మాక్స్ ఎమర్జింగ్ స్టార్ గానూ, 2019లో ఫెమినా మిస్ ఇండియా  పంజాబ్ గానూ నిలిచారు. ఇక 2021 సంవత్సరంలోనే లీవా మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని కూడా అందుకున్నారు. ఈమె కొన్ని పంజాబీ చిత్రాలలో కూడా నటించారు.  అలాంటి సంధూ 2021 సంవత్సరంలో తొలిసారిగా ప్రపంచ అందాల పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఇజ్రాయెల్ లో అందాల పోటీలో పాల్గొని విశ్వసుందరిగా విజయకేతనం ఎగరేశారు. ఈ పోటీలో సుమారు 79 మంది పాల్గొనగా అందరినీ దాటుకుని విజయాన్ని ఒడిసిపట్టారు. ఓ ప్రశ్న ఓ జవాబు!! అందాల పోటీలు అంటే శరీరాన్ని చూసి ఇచ్చే బహుమతులు, తలమీద పెట్టె కిరీటాలు అనుకుంటే పొరపాటే. వ్యక్తిత్వాన్ని, ఆలోచనను ఇంకా చెప్పాలంటే మనోవిజ్ఞానశాస్త్ర ఆధారంగా మనుషుల ఆలోచనా తీరు ఎలాంటిది?? ఏ సమస్యకు ఎలాంటి నిర్ణయం తీసుకోగలుగుతారు?? ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది కూడా పరీక్షించడం జరుగుతుంది.  అలా సంధూ కు ఒక ప్రశ్న ఎదురయ్యింది. దానికి సరైన సమాధానం ఇచ్చి సంధూ విజేతగా నిలబడింది. యువతకు ఒక స్ఫూర్తి మంత్రం!! ప్రస్తుతం యువత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఒత్తిడిని జయించడానికి నువ్వైతే ఎలాంటి సలహా ఇస్తావు అనే ప్రశ్నను ఆమె  ముందు ఉంచారు న్యాయనిర్ణేతలు. తమ మీద తమకు పూర్తిస్థాయి నమ్మకం లేకపోవడమే యువత ఒత్తిడి ఎదుర్కోవడంలో ఎక్కువగా కారణం అవుతుంది.  ఎవరి ప్రత్యేకత వారు గుర్తించడంలోనే నిజమైన అందం దాగి ఉంటుంది. బయటకు రండి, మీకోసం మీరు గొంతెత్తండి, మీ జీవితానికి మీరే నాయకులు, నాకు నామీద పూర్తి నమ్మకం ఉంది అందుకే ఈరోజు నేను ఇక్కడిదాక రాగలిగాను. అని స్ఫూర్తివంతమైన సమాధానం ఇచ్చింది సంధూ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారే, ఎవరూ మరొకరికి పోటీ కాదు, పోలిక అసలే కాదు. ఎప్పుడైతే ఎవరి జీవితాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం మొదలుపెడతారో అప్పుడే వాళ్ళు నిజమైన విజయాలను చవిచూడగలరు  వంటి ఎన్నో అంతర్గత విషయాలు సంధూ ఇచ్చిన సమాదనంలో దాగున్నాయి. ఇలాంటి పరిపక్వత కలిగిన సమాధానాన్ని ఇచ్చింది కాబట్టే విశ్వసుందరిగా నిలిచింది అనుకోవడంలో సందేహం లేదు. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే ప్రపంచంలో యువతకు ఎన్నో రంగాలు ఉన్నాయి. ఎవరి ఆసక్తిని బట్టి వాళ్ళు కృషి చేస్తూ ఉంటే తప్పకుండా విజేతలు అవుతారు.  విశ్వాన్ని కూడా జయించగలుగుతారు. ◆ వెంకటేష్ పువ్వాడ

 అర్ధశతాబ్దపు విజయం!!

అర్ధశతాబ్దపు విజయాన్ని గుర్తుచేసుకుంటూ దేశమంతా ఆనంద సందోహల్లో మునిగిన దినం డిసెంబర్ 16. విజయ్ దివస్ గా పిలుచుకునే ఈ దినాన సరిగ్గా యాభై సంవత్సరాల కిందట భారత్ యుద్ధరంగంలో పోరాటంలో  పాకిస్థాన్ పై విజయం సాధించింది. రెండు దేశాలు, ఓ యుద్ధం, ఓ విజయం, ఓ కొత్త కొత్త దేశం అవతరణ, ఆ దేశానికి స్వేచ్ఛ వెరసి విజయ్ దివస్ ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది. యుద్ధం అంటేనే హింస. అలాంటి హింస ఈ యుద్ధంలో చెప్పుకోవాల్సొలినంత చెప్పలేనంత ఉంది.  పాకిస్థాన్ నుండి విముక్తిని ఇవ్వడానికి బంగ్లాదేశ్ కు భారదేశం సహాయం అందిస్తూ జరిగిన ఈ యుద్ధంలో సుమారు పది మిలియన్ల జనాభా శరణార్ధులుగా వలస పోయింది. దాదాపు మూడు మిలియన్ల మంది ప్రజలు పాకిస్థాన్ సాయుధ దళాల చేతిలో చంపబడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధం తరవాత జరిగిన తొలి యుద్ధం ఇదే కావడం అందులోనూ ఎంతో హింసాత్మకత కొనసాగడం. ఎట్టకేలకు భారత్ విజయం సాధించి బంగ్లాదేశ్ కు పాకిస్థాన్ చెర నుండి విముక్తి లభించడం వంటి చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ నుండి విడిపోయాక స్వాతంత్ర్య దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాన్నే తమ జాతీయగీతంగా స్వీకరించి మన దేశానికి, మన దేశ కవికి తగిన గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు.  ఇక ఈ యుద్ధంలో పాకిస్థాన్ వైపు నుండి ఎనిమిది వేల మంది సైనికులు చనిపోయారు, ఇరవై ఐదు వేల మంది సైనికులు గాయపడ్డారు.  భారతదేశం మూడువేల మంది సైనికులను కోల్పోయింది. పన్నెండు వేల మంది సైనికులు గాయపడ్డారు. పాకిస్థాన్ వారి తొంభై మూడు వేల మంది సైనికులను భారత్ యుద్ధఖైదీలుగా, యుద్ధంలో వాళ్ళందరిని బంధించింది. ఫలితంగానే భారత్ కు నాటి యుద్ధంలో విజయం సులువైందని చెబుతారు. అయితే పై లెక్కలు చూస్తే ఒక యుద్ధం, ఒక దేశస్వతంత్రం పలితంగా  ఇరు దేశాల నుండి పదకొండు వేల మంది ప్రాణాలు యుద్ధభూమిలో కలిసిపోయాయి.   పదమూడు రోజుల పాటు సాగిన యుద్ధంలో పదకొండు వేల ప్రాణాలు అంటే ఈ దేశాలకు పౌరులు తమ ప్రాణాలను ఎలా పణంగా  పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ మరణించిన సైనికుల కుటుంబాలకు దేశంలో దక్కుతున్నది ఏమిటి అంటే అయోమయం నెలకొంటుంది. అది వేరే విషయం కావచ్చు. కానీ ఈ యుద్దానికి కారణం పాకిస్థాన్ అత్యుత్సాహమే అనిపిస్తుంది. బెంగాలీల భాషను కాదని ఉర్ధూను జాతీయ భాషగా మార్చి అంతటినీ ఉర్ధూ కిందకు తీసుకురావాలని ఆలోచనతో చిన్నగా మొదలైన కాంక్ష క్రమంగా వ్యతిరేకత చూపించే అందరి మీదా దాడులు చేయించడం, చంపించడం ఊచకోత చేపట్టడం మొదలుపెట్టింది. ఫలితంగా కాలేజీలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల పై దాడి చేయించడం, విద్యార్థినిలను, మహిళలను అత్యాచారం చేయించడం. మానభంగాలు వంటి అకృత్యాలు చేయించడం మొదలుపెట్టింది. పలితంగా వీరి పైశాచికత్వంలో ముప్పై లక్షల మందిని ఛాంపినట్టు, నాలుగు లక్షల మంది మహిళపై అత్యాచారాలు చేసినట్టు బంగ్లాదేశ్ అధికారిక వర్గాలు విశ్లేషణ చెబుతుంది. ఇంతటి గోరానికి  పాల్పడిన దేశం మెడలు వంచడానికి భారత్ కృషి చేసి విజయం సాధించడంతో చరిత్రలో గొప్ప సుదినంగా  నమోదైంది విజయ్ దివస్. ఇది మన దేశ విజయం అయితే.  స్వేచ్ఛ, స్వాతంత్రం లభించి ఒక కొత్త దేశంగా స్వాతంత్ర్య వాయువులు పీల్చుకుంటూ కొత్త జీవితాలను ప్రారంభించిన బంగ్లా సోదర, సోదరీమణులకు సంతోషాన్ని ఇచ్చిన రోజు.  కాబట్టి ఓ యుద్ధం కొన్ని మరణాలు పురివిప్పిన స్వతంత్రం, స్వేచ్ఛ వెరసి విజయ్ దివస్.  నాటి సైనికులకు అందరికీ సలాం చేయాల్సిందే!! ◆ వెంకటేష్ పువ్వాడ

నోబుల్ ప్రైజ్ అంటే ఏంటో తెలుసా ?? 

ప్రపంచ దేశాలు అన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బహుమతులలో నోబుల్ బహుమతి ఒకటి. ఈ నోబుల్ బహుమతి ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబుల్ గౌరవార్థం ప్రతి సంవత్సరం ప్రధానం చేస్తారు. ముఖ్యంగా శాంతి బహుమతి పురస్కారం తప్ప మిగిలిన అయిదు రంగాలు అంటే భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలలో కృషి చేసిన వారికి డిసెంబర్ 10 వ తేదీన ఆల్ఫ్రెడ్ నోబుల్ వర్ధంతి రోజు ప్రదసనం చేస్తారు.  ఈయన కుల, మత, లింగ, జాతి వివక్షలు లేకుండా వారు సూచించిన రంగాలలో కృషి చేసిన వారికి ప్రోత్సాహకంగానూ మరియు ప్రతిభను గుర్తించే కోణంలోనూ ఈ బహుమానాన్ని ప్రధానం చేయవలసిందిగా తన వీలునామలో  ప్రస్తావిస్తూ తన 90 లక్షల డాలర్లను బహుమతి ప్రధానం కోసం ఉపయోగించవలసిందిగా కూడా పేర్కొన్నాడు.  1901 సంవత్సరంలో ప్రారంభమైన ఈ బహుమతుల ప్రధాన పరంపర సాగుతూనే ఉంది.  వంద సంవత్సరాల పైన కాలంలో ఇప్పటి వరకు మన భారతదేశం నుండి ఎనిమిది మంది ఈ నోబుల్ పురస్కారాన్ని అందుకుంటే వీళ్ళలో కేవలం ఐదు మంది మాత్రమే పూర్తిగా భారతీయులు. మిగిలిన ముగ్గురు భారతదేశంలో నివసించినవారూ మరియు విదేశాలలో స్థిరపడిన భారత సంతతి వారు.  సాహిత్యానికి వన్నె తెచ్చి గీతాంజలి ద్వారా కవిత్వపు సొగసును ఖండాంతరాలు వ్యాపించేలా చేసిన రవీంద్రనాథ్ టాగూర్ నోబుల్ బహుమతిని 1913 సంవత్సరంలో అందుకున్న తొలి భారతీయుడు కాగా సుబ్రహ్మణ్య చంద్రశేఖరన్ విదేశాల్లో స్థిరపడిన భారత సంతతిగా 2009 సంవత్సరంలో నోబుల్ పురస్కారం అందుకున్నారు. ఈయన జీవరసాయన శాస్త్రవేత్త.  ఈ విధంగా నోబుల్ బహుమతులు పరంపర సాగుతుండగా భారతదేశం నుండి దీన్ని అందుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోతోంది. కారణం గురించి ఆలోచిస్తే ఎందరికో అర్ధమయ్యే ఒక చేదు నిజం. ప్రతి రంగంలో ఎంతో విశేష కృషి జరుగుతున్నా అవన్నీ ఆర్థిక కోణంలో మరియు రాజకీయ లబ్ది కొరకు ఇంకా చెప్పాలి అంటే ప్రతి రంగాన్ని వ్యాపారదృక్పథంలో చూస్తూ అసలైన పరిశోధనలు, దీర్ఘకాలిక పరిశీలనలు జరగకపోవడమే కారణం అని చెప్పవచ్చు.  నోబుల్ బహుమతి ఆశిస్తూ దాదాపు యాభై సంవత్సరాల పాటు ఎదురు చూసిన వారున్నారు అంటే ఈ పురస్కారం ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుస్తుంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వడపోతలో ఎంపికయ్యే ఈ బహుమతి విలువ కూడా అంతే ప్రాచుర్యం పొందిందని చెప్పచ్చు. సుమారు ఏడు కోట్లా, ఇరవై రెండు లక్షల (7,22,00,000) రూపాయల విలువ చేసే నగదు బహుమతి ఈ నోబుల్ ప్రైజ్ కింద ఇవ్వబడుతుంది. ఇంతటి ప్రఖ్యాతి పొందిన నోబుల్ బహుమతి భవిష్యత్తు భారతదేశ ఖాతాలో ఎప్పుడు చేరుతుందో చూడాలి మరి.  ◆ వెంకటేష్ పువ్వాడ  

కళ కోసం ఓ సినిమా !!

భర్తృహరి అద్భుత పద్యం కళాతపస్వి అద్భుత దృశ్యకావ్యం!! 【శ్లోకం:- జయంతి తే సుకృతినో | రససిద్ధాః కవీశ్వరాః || నాస్తి తేషాం యశః కాయే | జరామరణజం భయమ్ || సిద్ధౌషధ సేవవల్ల ముసలితనాన్ని – మరణాన్ని సైతం అతిక్రమించవచ్చు ! అయితే – అది ఇట్టి ఔషధం యోగులకు మాత్రమే అందుబాటులో ఉండి, వారే సేవించగలుగుతారు. విద్వాంసులైన వారికి ‘ కీర్తి ‘ రూపంలో మరణానంతరం కూడ జీవం ఉండి, సిద్ధౌషధంలా వారిని జీవింపచేస్తుంది. ఇటువంటి ధన్య జీవులు ఎవరు ? కవులు – పండితులు వీరు సద్ధౌషధం సేవించిన యోగులవంటివారు.】 పై పద్యం భర్తృహరి రచించిన నీతి శతకంలోనిది. ఆ పద్యాన్ని, దాని భావాన్ని వివరంగా పరిశీలిస్తే, దాన్ని అర్థం చేసుకుంటే కళ ఎంత గొప్పదో అర్థమవుతుంది. కవులు, పండితులు సిద్దౌషధం సేవించినటువంటి వారని ఆయన అంటాడు. ఇంతకు సిద్ధ ఔషధం ఏమిటి అంటే ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంలాంటిది శక్తివంతమైన వైద్యం సిద్దవైద్యం కూడా. సిద్ధులు శైవ భక్తులు, వీరు పద్దెనిమిది మంది ఋషులు. ఆయుర్వేదాన్ని ఎలాగైతే ధన్వంతరీ మహర్షి అభివృద్ధి చేశారో అలాగే సిద్ధులు కూడా సిద్దవైద్యాన్ని అభివృద్ధి చేశారు. ఈ సిద్ధులలో అగస్త్య మహర్షి ముఖ్యమైనవాడు. ఇక విషయంలోకి వెళ్తే ఆ సిద్ధ ఔషధం అమృతంతో సమనమైనది. దాన్ని తీసుకున్నవాడు మరణాన్ని జయిస్తాడు. అయితే అది సాధారణ మనుషులకు అందుబాటులో ఉండదు. యోగులు, ఋషులకు అందుబాటులో ఉండి వాళ్ళు మాత్రమే దాన్ని సేవించగలుగుతారు. కానీ….. విద్వాంసులు అంటే కవులు, పండితులు, కళలలో నైపుణ్యం సంపాదించినవారు. వీళ్ళందరూ సాధారణ మనుషుల్లోనే ఉన్నా, వీళ్ళు మరణించినా వారిలో ఉండే కళ, దాని నైపుణ్యం కారణంగా వాళ్ళు అందరి మనసులలో జీవించే ఉంటారు. అంటే భౌతికంగా మరణించినా, మానసికంగా అందరి మనసులలో బతికే ఉండటం. ఇలాంటి వాళ్ళు సిద్ధ ఔషధం స్వీకరించిన యోగులు, ఋషుల వంటి వారు. మనుషుల్లో ఉన్న గొప్పవాళ్ళు వీళ్ళు.  దీని వల్ల కళ గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం, బొమ్మలు గీయడం, పాటలు పాడటం, విశిష్ట ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరు కూడా పైన భర్తృహరి చెప్పినట్టు అమృతంతో సమానమైన ఔషదాన్ని సేవించినవాళ్ళ లాంటి వారే. ఇక ఈ పద్యం ముఖ్యంగా భర్తృహరి నీతి పద్యంగానే కాకుండా కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం సాగరసంగమంలో ఈ పద్యాన్ని ప్రస్తావిస్తారు. అంటే ఆ సినిమాలో కూడా కళ గురించి తపించిన వారు కళను ప్రేమించి, ప్రతిభ ఉన్నవారికి భౌతికంగా మనరణం సంభవించినా మానసికంగా మరణం అనేది ఉండదనే విషయాన్ని అందులో చెప్పారు. కాబట్టి కళను గౌరవించి, ప్రేమించాలి. ముఖ్యంగా నేటితరం సంప్రదాయ కళలను ప్రోత్సహించాలి. ◆ వెంకటేష్ పువ్వాడ  

ఏమి చెబుతున్నాయి హక్కులు??

 Human rights. ప్రస్తుత ప్రపంచంలో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన భారతదేశంలో చిన్న నుండి పెద్ద వరకు, గల్లీ నుండి ఢిల్లీ వరకు, ఇంట్లో మనుషుల నుండి సమాజంలో కూటములైన సంఘాలు, సంస్థలు వాటిలో పనిచేసే వారి వరకు. ఇలా సకల ప్రజానీకం ఎక్కువగా మాట్లాడే పదం, ఉపయోగించే పదం "హక్కు" మనిషికి తన జీవితంలో కొన్ని స్వేచ్చలు ఉన్నాయి వాటిని పొందడానికి, ఆ స్వేచ్ఛకు తగ్గట్టు బతకడానికి ఐక్యరాజ్యసమితి తీర్మానం చేపట్టి ఆమోదించినవే మానవ హక్కులు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐక్యరాజ్యసమితి పేర్కొన్న హక్కులను పొందే సౌలభ్యం ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది, ఉండాలి కూడా. అయితే ఐక్యరాజ్యసమితి పేర్కొన్న హక్కులు ఏమిటి?? మనం డిమాండ్ చేస్తున్నది ఏమిటి?? వీటిని గూర్చి ఆలోచిస్తే  జాతి, మత, లింగ, కుల, వర్ణ, రాజకీయ లేదా ఇతర కారణాలతో ఏ విధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. కానీ మన సమాజంలో ప్రతి మనిషితో మాట్లాడే ముందు కచ్చితంగా కులం, మతం చూసుకుంటూ ఉంటారు. వీటి ప్రస్తావన లేకుండా వాటి గురించి అసలు ఆలోచించకుండా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువని చెప్పవచ్చు. పరోక్షంగా ఎందరో చర్యల ద్వారా ఈ రకమైన వివక్షకు గురవుతూనే ఉంటారు. ఇక ఈ సమాజంలో ప్రస్తుతం  ఉన్న అతి పెద్ద సమస్య రాజకీయ కారణాలు. చెప్పుకోవడానికి విచిత్రంగా ఉన్నా సాధారణ పౌరులు ఈ రాజకీయ వర్గాలు మధ్య నలిగిపోతూ ఉంటారు.  చిత్రహింసలు మరియు క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కును మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది కానీ దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలు సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రహింసలు మరియు క్రూరత్వానికి బలి అవుతున్న వాళ్లలో ఆడవాళ్లు అధికశాతం మంది, తరువాత పిల్లలు, వృద్ధులు ఉన్నారు. కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా వీఎటి బారిన పడుతున్నారు. చేదైన నిజం ఏమిటంటే చిత్రహింసలు, క్రూరత్వం కుటుంబ సభ్యులనుండే ఇవన్నీ ఎదురవ్వడం. వ్యక్తిగత దాడులు, ఆర్థికపరమైన కారణాలు, కక్షలు, కుట్రలు వంటి వాటిలో బాగా తెలిసినవారి నుండి, లేదా కుటుంబ సభ్యుల నుండి పై సమస్యలు ఎదుర్కొంటారు. వెట్టిచాకిరీ, బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కును మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. బానిసత్వం మన భారతదేశంలో వేళ్లూనుకుపోయింది. ఎంతగా అంటే పక్క దేశాలు చెప్పినదానికి తలలు  ఊపుతూ వాగ్దానాలు చేసి దేశంలో ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకునే స్థాయిలో. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఎన్నో ఒప్పందాలు, వాటి రహస్యాలు సామాన్య ప్రజలకె కాదు ధనికులకు కూడా తెలియదు సరిగ్గా.  ఒక కుటుంబంలో ఆడపిల్లను ఎలాగైతే బాధ్యత, పరువు అనే పేరు కింద స్వేచ్ఛను తుంచి బానిసగా ఉంచుతారో అలాంటివి సమాజంలో, జీతీయం, అంతర్జాతీయ స్థాయిలలో కూడా జరుగుతుంటాయి. ఆర్థిక, విద్య, వైద్య రంగాలలో ఇలాంటివి ఎన్నో ఉంటాయి.  నిర్బంధించబడకుండా ఉండే హక్కు మానవ హక్కుగా పేర్కొన్నారు. నిర్బంధం అంటే కట్టడి చేయడం. సరైన కారణం లేకుండా ఒక మనిషి స్వేచ్ఛను హరించడం, ఆ మనిషిని అన్ని రకాలుగా అన్నిటికీ దూరం చేయడం. ఆంక్షలు విధించడం, ఇష్టాలకు గౌరవం ఇవ్వకుండా ఉండటం. ప్రస్తుత సమాజంలో ఈ రకమైన నిర్బంధం ఆడవాళ్ళ విషయంలోనూ, పిల్లల విషయంలోనూ చాలా జరుగుతున్నాయి.  పక్షపాతం లేకుండా ఉండటం. అనేది మానవ హక్కు కానీ ఇంటా బయట ఈ పక్షపాత ధోరణి పుష్కలంగా కనిపిస్తుంది. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్లలో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఉంటే అక్కడ పక్షపాత ధోరణి కచ్చితంగా ఉంటుంది. లింగవివక్షలో మెండుగా ఉండే ఈ పక్షపాతం వల్ల ఎంతో నష్టపోతారు. ఇషి మాత్రమే కాకుండా పేద,  ధనిక వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య ఇలా అన్ని వర్గాలలో పక్షపాతం ఉంటుంది. పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా జీవించే హక్కు, సామాజిక భద్రతాహక్కు, భావ స్వాతంత్య్రహక్కు, విద్యాహక్కు, పిల్లలు ఆడుకొనే హక్కు, ప్రజాస్వామ్య హక్కు, కాపీరైటు హక్కు, జాతీయత హక్కు, ఏ మతాన్ని అయినా స్వీకరించే హక్కు వంటి మానవ హక్కులు ఎన్నో ఉన్నాయి. అయితే హక్కుల పేరుతో వీటిని ఎందసరో దుర్వినియోగం చేస్తున్నారు కూడ. ముఖ్యంగా యువత స్వేచ్ఛ అనే హక్కును, జీవించే హక్కును కాస్త అడ్డదారిలో వెల్తూ అది నా హక్కు అని, స్వేచ్ఛగా ఉండటంలో తప్పులేదని అతిగా వాదిస్తుంది.   హక్కుల ప్రాముఖ్యత తెలుసుకుని వాటిని సరైన దిశలో అనుసరిస్తే అప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది.   ◆ వెంకటేష్ పువ్వాడ  

ఆలోచన బాగుంటే మెదడు కూడా ఎదుగుతుంది

మనిషి నుదురు విశాలంగా ఉంటే అది అతని పెద్ద మెదడుని సూచిస్తుందనీ, పెద్ద మెదడు తెలివితేటలని సూచిస్తుందనీ పెద్దలు చెబుతూ ఉండేవారు. ఇందులో నిజానిజాల గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు తర్జనభర్జనలు పడుతూనే ఉన్నారు. ఆ సంగతేమో కానీ ఇప్పుడు మెదడు ఆకారాన్ని పరిశీలిస్తే, సదరు మనిషి మనస్తత్వం బయటపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు! ఆ మనస్తత్వం ఆధారంగా భవిష్యత్తులో అతను ఎదుర్కోబోయే మానసిక సమస్యలని కూడా అంచనా వేయవచ్చని ఆశిస్తున్నారు.   ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, మెదడులో ఉండే కార్టెక్స్‌ అనే ముఖ్యభాగం తీరుని బట్టి వ్యక్తుల ధోరణిని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఈ కార్టెక్స్‌ ఎంత మందంగా ఉంది, ఎంత పెద్దదిగా ఉంది, ఎంతవరకు ముడుచుకుని ఉంది అనే మూడు అంశాల ఆధారంగా ఐదు రకాల లక్షణాలను పసిగట్టారు. నిరాశావాదం (neuroticism), కలుపుగోలుతనం (extraversion), విశాల దృక్పథం (openness), పరోపకారం (altruism), ఆత్మస్థైర్యం (conscientiousness) అనేవే ఆ ఐదు లక్షణాలు.   ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు దాదాపు 500 మంది వ్యక్తుల మెదడు తీరుని గమనించారు. కార్టెక్స్‌ బాగా మందంగా ఉన్న వ్యక్తులలో నిరాశావాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి దృక్పథం ఉన్న వ్యక్తులు సహజంగానే మానసికమైన రోగాలను కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా విశాలమైన దృక్పథం ఉన్న మనుషులలో కార్టెక్స్ తక్కువ మందంతోనూ, ఎక్కువ వైశాల్యంతోనూ కనిపించింది.   మెదడు ఓ చిత్రమైన అవయవం. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచీ యవ్వనం వచ్చేంతవరకూ కూడా ఆ మెదడులో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మన ఆలోచనా తీరు, మన అలవాట్లు కూడా మెదడు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. మెదడులోని కార్టెక్స్ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకోవాలంటే దానికి ఒకే ఉపాయం ఉంది. అది తన మందాన్ని తగ్గించుకుని వైశాల్యాన్ని పెంచుకోవాలి. అలా పెరిగిన వైశాల్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముడతలు పడాలి.   ఒక్క మాటలో చెప్పాలంటే రబ్బరు షీటుని మడిచిపెట్టినట్లుగా కార్టెక్స్‌ కూడా మడతలు మడతలుగా మారడం వల్ల తనకి ఉన్న ప్రదేశంలోనే ఎక్కువ విస్తరించగలుగుతుందన్నమాట. మెదడులో ఇలాంటి మార్పులు వచ్చేందుకు మన ఆలోచనలు కూడా దోహదపడతాయని ఇప్పుడు తెలిసిపోయింది. మనుషులు పెద్దవారయ్యే కొద్దీ వారిలో తిరుగుబాటు ధోరణి, బాధ్యతారాహిత్యం, నిరాశావాదం తగ్గడానికి కారణం కూడా మెదడులో వచ్చే మార్పులే కారణం అంటున్నారు. అదీ విషయం! అంటే మన మెదడు శుభ్రంగా ఎదగాలంటే ఆలోచనల్లో పరిపక్వత ఉండాలన్నమాట!   - నిర్జర.

ఆకాశమే హద్దురా!! 

మనిషి ఆత్మవిశ్వాసాన్ని గురించి మాట్లాడేటప్పుడు, జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి చర్చిస్తున్నపుడు చాలామంది చెప్పే మాట ఆకాశమే హద్దుగా సాగిపో అని. అంటే అంత ఆత్మవిశ్వాసంతో ఉండాలని. ఆకాశం ఒక అనంత దృశ్యం. నింగికి ఎగరడం ఒక అపురూప విజయ బావుటా ఎగరేసినంత సంతోషం. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదిన పౌర విమానయాన దినోత్సవం జరుపుకోబడుతుంది. గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలకు సరిహద్దులు చేరిపి మనిషి ప్రయాణం సాగిస్తున్నాడు. అయితే దేశాలను దాటి ఖండాంతరాలు దాటి ప్రతిభను పెంచుకుంటూనో, జీవితాన్ని మెరుగుపరుచుకుంటూనో సాగుతున్నాడు. రెక్కలు కట్టుకుని ఏమీ ఎగిరిపోవడం లేదు కానీ, రెక్కల కృత్రిమ విహంగాలలో గాల్లో తేలినట్టుందే అని పాడుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నాడు. ఇదంతా పౌర విమానయాన శాఖ కల్పిస్తున్న సౌకర్యమే. రైట్ బ్రదర్స్!! రైట్ రైట్ బ్రదర్స్!! విమానాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు వైట్ బ్రదర్స్. వీళ్ళ పుణ్యమా అని గాల్లో ఎగురుతూ తిరుగుతోంది కోట్ల ప్రజానీకం. దాని ద్వారా ఎంతో మందికి ఉపాధి. ఫైలట్ లు, ఎయిర్ హోస్ట్ లు మాత్రమే మనకు తెలుసు. దాని వెనుక బోలెడు యంత్రాంగం, యంత్రాల తయారీకి బోలెడు ఇంజనీరింగ్ సైన్యం ఉంటుంది. ఇదంతా ఒక వైపు విషయం అయితే  మనుషుల ఆర్థిక స్థాయిల కొద్దీ వారి కోరికలు ఉంటాయి. స్థాయి పెరిగేకొద్దీ అవి కూడా పెరుగుతాయి. చిన్నతనంలో ఆకాశంలో విమానం ఎగురుతూ పోతుంటే దాన్ని చూసి చేతులు ఊపుతూ గంతులు వేసిన బాల్యానికి అదే విధంగా తాము విమానంలో ప్రయాణించి రెక్కల చాచుకున్న పక్షిలా  మనసును ఎగరేస్తూ దేశం దాటాలని, విదేశాలలో విద్య, ఉద్యోగం, విశిష్ట సందర్భాలు, విహారయాత్రలు వగైరాల వంకతో ఆకాశాన్ని ముద్దాడుతూ ప్రయాణించాలని అనుకుంటారు.   కల మీద సంతకం!! అలా కలలు కన్న వాళ్లకు, కన్నవాళ్ళ తోడ్పాటు చుట్టాలు, స్నేహితులు ఇలా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండనే  ఉంటుంది. అయితే చాలామంది మధ్యతరగతి వారికి ఇలాంటి కలలు కలలుగానే మిగిలిపోతుంటాయి. నిజానికి విమనప్రయణం మరీ అంత ఆర్థిక భారం ఏమీ కాదు. సాధారణ జీవితంలో ఖర్చులలో  కొన్ని సేవింగ్స్ వల్ల హాయిగా ఏరోప్లేన్ ఎక్కేయచ్చు.  ఆశించదగ్గ చదువు,తెలివి తేటలు ఉంటే విదేశాలలో ఎంచక్కా ఉద్యోగాలు కూడా చేయచ్చు. కాబట్టి మొదట మనిషి విద్య పరంగా మంచి స్థాయిని చేరుకుంటే ఆకాశంలో ఎగరావచ్చు, మేఘాలలో తేలావచ్చు. సగటు మనిషి కూడా కలను తీర్చుకోనూవచ్చు.  యువత కల!!  చాలామంది యూత్ కల ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం సంపాదించడం. పెద్దోళ్ళు ఏమో రిస్క్ జాబ్ వద్దంటారు. కానీ రిస్క్ లేని ఉద్యోగం అంటూ ఏదీ ఉండదు. నిజానికి నైపుణ్యం సంపాదిస్తే అన్ని ఉద్యోగాలు సహజంగానే ఉంటాయి. అలాగే ఈ ఎయిర్ ఫోర్స్ జాబ్స్ కు ఇండియన్ ఆర్మీ లెవల్ లో సెలెక్షన్స్ ఉంటాయి. నైపుణ్యం నుండి శరీర దారుడ్యం వరకు, అన్ని రకాలుగా సంసిద్ధతగా ఉన్నవాళ్లకే పట్టం కడతారు.  కాబట్టి ఆకాశంలో ఆ కృత్రిమ రెక్కల విహంగాన్ని నడపడంలోనూ, ఆ రెక్కల విహంగంలో ఎగరడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది, ప్రస్తుత మన భారతం నుండి విదేశాలలో ఉద్యోగాలు, చదువుల దృష్ట్యా వెళ్లివస్తున్నది,  స్థిరపడుతున్నది ఎక్కువగా యువతనే. కాబట్టి యువత ఆకాశమే హద్దుగా సాగిపోవాలి. అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోవాలి. కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్ళా కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు, విమానయానం, నౌకాయానం, అంతరిక్షయానం కాదేదీ యువత మేధస్సుకు అనర్హం. అందుకే కలాం చెప్పినట్టు, కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!! ◆ వెంకటేష్ పువ్వాడ  

సిగిరెట్‌ మానడం తేలికే!

‘మనిషి తల్చుకుంటే సాధించలేనిది ఏదీ లేదు’... వగైరా వగైరా వాక్యాలు మనం చాలానే వింటూ ఉంటాము. వినడానికి కాస్త అతిగా ఉన్నా, వాటిలో తప్పేమీ లేదని మనకి తెలుసు. అందుకే సిగిరెట్‌ మానడం కూడా ఏమంత కష్టం కాదని తేల్చేస్తున్నారు పెద్దలు. కావాలని అంటించుకున్న వ్యసనం, పొమ్మంటే పోకుండా ఉంటుందా! పోయేదాకా పొగపెడితే సిగిరెట్టైనా పారిపోకుండా ఉంటుందా! కాకపోతే చిన్నపాటి జాగ్రత్తలు పాటించేస్తే సరి... ప్రణాళిక ఏర్పరుచుకోండి: సిగిరెట్టుకి దూరం కావాలి అని నిర్ణయించుకోగానే, ఒక ప్రణాళికను ఏర్పరుచుకోండి. కనీసం ఒక నెల రోజులన్నా మీరు సిగిరెట్టుకి దూరంగా ఉండేందుకు ఏమేం చేయాలో నిర్ణయించుకోండి. మీ నిర్ణయాన్ని కుటుంబసభ్యులతో సహా మీ సన్నిహితులందరికీ తెలియచేయండి. మీరు ఏమాత్రం మీ లక్ష్యం నుంచి దూరమైనా, వాళ్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు. పొగకు దూరమైనప్పుడు మీ శరీరంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి? వాటిని మీరు ఎలా ఎదుర్కోవాలి? ఇలా ఎన్నాళ్లు ఓపిక పట్టాలి?... వంటి విషయాలన్నింటి మీదా ఒక అవగాహనను ఏర్పరుచుకోండి. వ్యాపకం మీరు ఉద్వేగంగా ఉన్నప్పుడో లేక ఖాళీగా ఉన్నప్పుడో సిగిరెట్‌ తాగాలని నోరు పీకేయడం సహజం. అందుకనే ఏదో ఒక వ్యాపకాన్ని అలవర్చుకోండి. సిగిరెట్ తాగాలని మీ నోటికి అనిపించినప్పుడల్లా చూయింగ్‌ గమ్‌ నమలడమో, మంచి నీరు తాగడమో చేయండి. చేతులతో వీడియో గేమ్ ఆడటమో, రాయడమో చేయండి. అదీ ఇదీ కాకుంటే కాసేపు ధ్యానం చేయండి లేదా ఓ నాలుగడుగులు అలా వీధి చివరిదాకా వెళ్లిరండి. మొత్తానికి సిగిరెట్‌ తాగడం తప్ప మరేదన్నా పనికొచ్చే పనిచేయండి. వాతావరణం పొగని గుర్తుచేసే అన్ని వస్తువులనీ కట్టకట్టి అవతల పారేయండి. మీ సిగిరెట్‌ ప్యాకెట్లు, లైటర్లు, యాష్‌ట్రేలు.... వీటన్నింటినీ చెత్తబుట్టలో పారేయండి. ఇక పొగని గుర్తుచేసే ప్రాంతాలకి (ఉదా॥ సినిమా హాళ్లు, బార్లు...) దూరంగా ఉండండి. మీ స్నేహితులలో తెగ పొగ తాగేవారికి కొన్నాళ్లు దూరంగా ఉండండి. వారి సాన్నిహిత్యంలో మీకు పొగ గుర్తుకురావడం మాట అటుంచి, మీతో మళ్లీ పొగ తాగించేందుకు వాళ్లు విశ్వ ప్రయత్నం చేస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు! సలహాసంప్రదింపులు సిగిరెట్టు వ్యసనానికి ముఖ్య కారణం అందులో ఉండే నికోటిన్‌ అనే పదార్థమే! కాబట్టి నికోటిన్‌ వ్యసనం నుంచి తప్పించుకునేందుకు వైద్యుల సలహా తప్పకుండా ఉపయోగపడుతంది. నికోటిన్‌ రిప్లేస్‌మెంట్‌ పేరుతో కొన్నాళ్ల పాటు తక్కువ మోతాదులో నికోటిన్‌ ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. నికోటిన్‌ వ్యసనం నుంచి దూరం చేసేందుకు మందులూ ఉన్నాయి. మన పరిస్థితిని బట్టి మనకి ఎలాంటి చికిత్స అవసరమో వైద్యులు గుర్తిస్తారు. అదీ ఇదీ కాదంటే మనకి కౌన్సిలింగ్ ఇచ్చి, సిగిరెట్‌ వ్యసనం నుంచి దూరమయ్యేందుకు సాయపడే సైకాలజిస్టులూ అందుబాటులో ఉన్నారు. కాబట్టి అవసరం అనుకుంటే ఏమాత్రం మొహమాటం లేకుండా వైద్యుల సాయాన్ని తీసుకోవాలి. సిద్ధంగా ఉండండి సిగిరెట్‌ మానేసిన మొదటి రోజు నుంచి తలనొప్పి మొదలుకొని నానారకాల ఇబ్బందులూ మీ శరీరాన్ని పీడించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు... వారాల తరబడి నానారకాల సమస్యలూ మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆకలి వేయదు, నిద్ర పట్టదు, దేని మీదా ధ్యాస నిలువదు. నిస్సత్తువ, అజీర్ణం, దగ్గు... మనల్ని కుంగతీస్తాయి. వీటన్నింటినీ తట్టుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీకు ఇష్టమైన కుటుంబ సభ్యుల కోసం, మీ దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం కొన్నాళ్లపాటు వీటిని భరించక తప్పదని గుర్తుంచుకోండి. ఒకో వారం గడిచేకొద్దీ మీ ప్రయత్నాన్ని మీరే అభినందించుకోండి. మీకు మీరే బహుమతిగా ఇష్టమైన వస్తువులను కొనుక్కోండి.   - నిర్జర.

మన చర్మం మీద ఒక జీవి బతుకుతోంది తెలుసా!

మనకి పైపైన కనిపించే చర్మం వేరు. కాస్త సూక్ష్మంగా చూస్తే అందులో ఒక ప్రపంచమే ఉంటుంది. స్వేదరంధ్రాలు, బ్యాక్టీరియా, వెంట్రుకల కుదుళ్లు... ఇలా చర్మం కాస్త వింతగా కనిపిస్తుంది. కానీ దాని మీద ఒక ఏకకణ జీవి (unicellular organism) కూడా బతికేస్తోందని ఈ మధ్యనే బయటపడింది. ఇక అప్పటి నుంచి దాని లక్షణాలు ఏమిటి, లాభనష్టాలు ఏమిటి అన్న చర్చ మొదలైంది.   మన చర్మం మీద ఆర్కియా అనే ఏకకణజీవి బతుకుదోందని ఈమధ్యనే గ్రహించారు. ఏడాది వయసున్న పిల్లవాడు మొదలుకొని 75 ఏళ్ల వృద్ధుల వరకూ అనేకమందిని పరిశీలించిన తర్వాత తేలిన విషయమిది. ఎక్కడో అంటార్కిటికా మంచుపలకల మీదా, వేడి నీటి బుగ్గలలోనూ మాత్రమే ఉందనుకునే ఈ చిత్రమైన జీవి ఏకంగా మన శరీరం మీదే నివసిస్తోందని బయటపడింది.   ఆర్కియా మన చర్మాన్ని ఆశించి బతికేస్తోందని తేలిపోయింది. కానీ దీని వల్ల లాభమా నష్టమా అన్న ఆలోచన మొదలైంది. పొడిచర్మం ఉన్నవారి మీద ఈ ఆర్కియా చాలా ఎక్కువ మోతాదులో కనిపించింది. బహుశా వారి చర్మాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఇది దోహదపడుతూ ఉండవచ్చు. అలాగే 12 ఏళ్లలోపు పిల్లలలోనూ, 60 ఏళ్లు దాటిన వృద్ధులలోనూ ఆర్కియా ఎక్కువగా కనిపించింది. బహుశా ఆయా వయసులలో సున్నితంగా ఉండే చర్మాన్ని ఈ ఆర్కియా కాపాడుతూ ఉండవచ్చు.   అంతేకాదు! చర్మం మీద కనిపించే ఆర్కియా, అమ్మోనియా మీద ఆధారపడి జీవిస్తోందని తేలింది. మన చెమటలో అమోనియా ఒక ముఖ్యభాగం. ఆ అమోనియా మన చర్మం మీద పేరుకుపోకుండా ఈ ఆర్కియా ఉపయోపడుతోందని భావిస్తున్నారు. చర్మం మీద PH లెవల్స్ని తగ్గించడంలో కూడా ఈ జీవి ఉపయోగపడుతోందన్నది మరో విశ్లేషణ. PH లెవల్స్ తక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్లు కూడా తక్కువగా ఏర్పడతాయి.   ఆర్కియా ఉపయోగాలు సరే! మరి అది మన శరీరం మీద అధిక మోతాదులో పేరుకుపోతే కలిగే అనర్థాలు ఏమిటో తెలియడం లేదు. పైగా వ్యోమాగాములు అంతరిక్షంలో తిరిగేటప్పుడు, వారితో పాటుగా ఈ జీవులు కూడా ఇతర గ్రహాల మీదకి చేరే అవకాశం ఉంది. MARS వంటి గ్రహాల మీదకి కనుక ఈ ఆర్కియా చేరితే, అక్కడి వాతావరణం మొత్తం కలుషితం అయిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.   లాభమో, నష్టమో! మొత్తానికి మన చర్మానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంగతి బయటపడింది. ఇహ వైద్యప్రపంచంలో ఆర్కియాకి ఒక కొత్త అధ్యాయం మొదలైంది. - నిర్జర.  

న్యాయం కోసం సంతకాలు చేద్దామా!! 

ఈ ప్రపంచంలో ఏ విషయం ను అయినా రెండు కోణాల్లో చూస్తారు. ఒకటి న్యాయం, రెండోది అన్యాయం. ముఖ్యంగా భారదేశానికి చట్టాలు ఏర్పడ్డాక ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ ప్రతి వ్యవస్థలోనూ న్యాయాన్ని కాపాడటానికి న్యాయవ్యస్థను ఏర్పాటు చేసి, న్యాయం కోసం కృషి చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949 సంవత్సరం నవంబర్ 26 వ తేదీన తొలి ముసాయిదా కమిటీ సభ్యులు సంతకాలు చేశారు. అదే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని అందరికీ అందించడం. అలా ముసాయిదా కమిటీ సంతకాలు చేసిన ఆరోజును జాతీయ న్యాయదినోత్సవంగా జరుపుకోవాలని సుప్రీంకోర్టు ప్రకటించింది. అదే నేటి నేషనల్ లా డే.  న్యాయం ఎక్కడ!! న్యాయం ఎక్కడుంటుంది అంటే కోర్ట్ లో మాత్రమే అనుకోవడం పొరపాటు. ఈ న్యాయ దినోత్సవం అర్థం న్యాయవాదులు న్యాయం రక్షించడం కోసం కృషి చేయడమే కావచ్చు కానీ నిజానికి ప్రస్తుతం న్యాయాన్ని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే తయారయ్యాయి. అందుకే ప్రతి ఒక్కరూ న్యాయాన్ని డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చేదు నిజం ఏమిటంటే డబ్బు పెట్టి ఏది నమ్మిస్తే అదే న్యాయం అయిపోవడం. అంటే అన్యాయాన్ని కూడా డబ్బు పెట్టి న్యాయంగా మార్చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుత సమాజంలో కోకొల్లలు.  మరేం చేద్దాం!! న్యాయానికి నల్లకోటు ప్రామాణికం కాదు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. నిజానికి అందరికీ తెలుసు కూడా కానీ తెలియనట్టే ఉంటారు. ఈ సమాజంలో, మన చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నో విషయాలు, అవకతవకలు మొదలైన వాటిని ఎవరి శక్తి మేరకు వాళ్ళు పరిష్కరిస్తూ, తమ ప్రమేయం ఉన్న ఏ విషయంలో అయినా నీతిగా ఉండటం అందరూ చేయదగిన పని. న్యాయం కోసం!! చాలామంది కొన్ని విషయాలు నేరుగా చూసి అందులో తమ పాత్ర ఉన్నా ఏదో నష్టం జరుగుతుందనో లేక మనకెందుకులే అనే ఆలోచనతోనో ఆ విషయాన్ని చూసి చూడనట్టు ఉంటారు. అది ఎంత తప్పో చాలామందికి అర్థం కాదు. తమ మాట వాళ్లకు ఎంత గొప్ప పరిష్కారాన్ని చూపిస్తుందో అర్థం కాదు. ఎప్పుడో పాఠశాలల్లో చదువుకున్న ఐకమత్యం అనే విషయాన్ని జీవన సరళిలో ఎప్పుడో వదిలేసుకున్న మహానుభావులం మనం. ప్రతీది ఆర్థిక కోణంలో చూసే ఆర్థికశాస్త్ర విశ్లేషకులం. ఇంకా చేస్తున్న పనులను సమర్థించుకుంటూ వాటికి ఉదాహరణలు కూడా బయటకు చెప్పగల గొప్ప ప్రవచనాకారులం. ఇలాంటి మన మధ్య న్యాయం కావాలంటే అంత సులువుగా దొరుకుతుందా?? నమ్మకాల వంతెన!! నిజానికి న్యాయానికి, నమ్మకానికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. కానీ నమ్మకం ఉన్నచోట న్యాయానికి వెక్కిరింపు ఎదురవుతుంది కూడా. ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరీ సహాయం చేసిన చోట ఇచ్చిన నమ్మకాన్ని, పొందిన సహాయాన్ని మరచి నమ్మకద్రోహం జరిగితే ఎవరూ న్యాయం కోసం ముందుకు రారు. ఉదాహరణకు ఈమధ్య కాలంలో కొందరు ఉద్యోగస్తులు లోన్ల విషయంలో ష్యురిటీ సంతకాలు పెట్టడానికి జంకుతున్నారు కారణం తీసుకున్నవారు  వాటిని కట్టడానికి వెనుకడుగు వేసి కట్టడం వదిలేస్తే సంతకాలు పెట్టిన సగటు వ్యక్తిని ఆ సంస్థ వారు కోర్ట్ ల చుట్టూ తిప్పి ఎన్నో ఇబ్బందులకు గురిచేయడం. నమ్మకంతో సంతకాలు పెట్టిన సగటు వ్యక్తికి జీవితమే ప్రశ్నార్థకమైతే మరెక్కడ న్యాయం.కాబట్టి ఇలాంటి  విషయాలలో పూర్వపరాలు పరిశీలించి కోర్ట్ వారు ఇచ్చే తీర్పు సగటు న్యాయమైన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు బాధ్యతగా ఉండాల్సిన అవసరం అందరిపైనా ఉంది. ◆ వెంకటేష్ పువ్వాడ

ఈ కాలంలో నీతి ఎలా ఉంది?? 

మనుషుల జీవితాలలోనూ, వారి మధ్య ఇమిడిపోయినవి కొన్ని ఉంటాయి. వాటిని మనం అనుబంధాలు, విలువలు, సెంటిమెంట్లు ఇట్లా బోలెడు రకాలుగా చెప్పుకుంటాం. ప్రతి మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటి ఆధారంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అయితే ద్రవ పదార్థాలను ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఒదిగిపోయినట్టు మనిషి కూడా ఒదిగిపోతూ ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాడు. కొంతమంది ఇలాగే ఉండాలి అంటారు, మరికొందరు అలా ఉండకూడదు అంటారు. కానీ మొత్తానికి ఈ సమాజంలో మనిషి ఇట్లా ఉండాలి అని కొన్ని ఆపాదించారు. మనిషి వాటినే అంటిపెట్టుకుని, పాటిస్తూ ఉంటే వ్యక్తిత్వం అంటారు. అలా ఉంటేనే నీతిగల వాడు అని గుర్తిస్తారు. నిజానికి ఈ నీతి అంటే ఏమిటి?? ప్రస్తుత సమాజంలో నీతి ఎవరికి ఎంత వరకు తెలుసు. చాలామంది మనిషి ఎట్లా ఉండాలి అని విషయం ప్రస్తావనకు వచ్చినపుడు చాణుక్యున్ని ఉదహరణగా చెబుతూ ఉంటారు. నిజమే కావచ్చు చాణుక్యుడు ఒక గొప్ప వ్యూహకర్త. అయితే ఆయన ఆలోచనలను, ఆయన సిద్ధాంతాలను పూర్తిగా తెలుసుకుంటేనే మనిషి దాన్ని గ్రహించగలుగుతాడు. లేకపోతే సగం సగం తెలిసిన జ్ఞానంతో తనకు నచ్చిదాన్ని, ఎక్కడో తన ప్రవర్తనను సమర్థించే నాలుగు వాక్యాలను పట్టుకుని వాటినే మననం చేసుకుంటూ వాటిలోనే నీతి మొత్తం ఉందని అందరికీ చెబుతూ బావిలోని కప్పలాగా ఉండిపోతాడు.  కృష్ణ నీతి... అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అందరూ చెప్పుకోవాల్సిన ఒక గొప్ప మనోవిజ్ఞాన స్వరూపుడు ఎవరన్నా ఉన్నారంటే అది శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు పాటించింది ఏమిటి?? మంచికి మంచి, చెడుకు చెడు, నీతికి నీతి, నమ్మినవాళ్లకు సహాయం చేయడం, ఏదైనా చిటికెలో తాను పరిష్కరించే నేర్పు ఉన్నా, తాను అందుబాటులో ఉన్న అదంతా తను చేసేయ్యక చుట్టూ ఉన్న అందరితో ఆ పనిని చేయించడం. ఆ ఫలితాన్ని వాళ్లే అనుభవించేలా చేయడం. డ్ఈని అర్థం ఏమిటి అంటే, ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి. ఏదో శక్తి, సామర్త్యాలు ఉన్నాయి కదా అని ఇతరుల పనులను చేతుల్లోకి తీసుకుని దాన్ని చిటికెలో చేసిపెడితే అవతలి వాళ్లకి ఆ పని నైపుణ్యత అలవాటు కాదు. ప్రతి తల్లిదండ్రి పిల్లల విషయంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం ఇదే.  ఇక ప్రస్తుతం గురించి చెప్పుకుంటే తన తరువాతే ఇతరం. విషయం ఏదైనా కావచ్చు మొదట తన అవసరం తీరాలి, తన సమస్యలు సద్దుమనగాలి ఆ తరువాత ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఇతరుల కోణంలో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి తన గురించి తను చూసుకోవడం మంచిదే. తనని తాను నియంత్రించుకునేవాడు, తనని తాను చక్కబెట్టుకునేవాడు ఇతరులకు భారంగా మారడని ఒక నమ్మకం. అయితే చాలా చోట్ల ఒకే ఒక విషయంలో రివర్స్ కనబడుతుంది. అదే ఇతరుల్ని చూసి ఓర్వలేకపోవడం. తన జీవితంలో సమస్యలు ఉన్నా లేకపోయినా ఇతరుల జీవితంలో సమస్యలు ఉంటే ఆనందపడిపోవడం. ఇది ఏ తాలూకూ ప్రవర్తన అంటే సాడిజం అని సులువుగా చెప్పేయచ్చు. ఇవ్వడమూ, తీసుకోవడమూ కాదు దోచుకోవడం నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఒకప్పుడు ఇతరులకు ఇవ్వడం అనే విషయం ఎంతో సంతోషంతో కూడుకుని ఉండేది, తీసుకోవడమూ అంతే సంతోషంతో ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండు పేర్ల ముసుగులో దోచుకోవడం అనే ప్రక్రియ ఎంతో దర్జాగా జరిగిపోతుంది. అది దోచుకోవడం అని అందరికీ తెలుసు కానీ ఎవరూ దాన్ని పల్లెత్తు మాట అనరు. అది సమంజసమే అంటారు. ఎందుకంటే దానివల్ల కలుగుతున్న ప్రయోజనం అలాంటిది. ఇంకా పిల్లలకు చెప్పే ఎన్నో నీతులు, విలువలు, నియమాలు, పద్ధతులు ఇవన్నీ కేవలం నీటి మాటలుగా ఉంటూ,  పెద్దలు విరుద్ధ మార్గాలు అనుసరిస్తూ పిల్లలకు ఒకానొక మార్గదర్శకులుగా మారుతున్నారు. ఈ నీతిని సరైన దిశలో మార్చాలంటే ప్రతి ఇంట్లో ఆ కృష్ణ నీతి, కృష్ణ వాక్కు వినబడాలి. భగవద్గీత అందరి ఇళ్లలో ఉండాలి.  ◆ వెంకటేష్ పువ్వాడ  

దేనికైనా సమయం రావాలి!

అనగనగా ఓ కుర్రవాడు. అతనికి ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించాలని తెగ కోరికగా ఉండేది. తన దాహాన్ని తీర్చేందుకు తగిన గురువు ఎక్కడ దొరుకుతారా అని, ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇక ఎలాగైనా సరే... ఓ గొప్ప గురువు దగ్గరకి వెళ్లి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాలని బయల్దేరాడు. కుర్రవాడు అలా బయల్దేరాడో లేదో... అతని ఊరి చివరే ఒక పెద్దాయన కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరకి వెళ్లి ‘నేను ఓ గొప్ప గురువు దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను. మీ దృష్టిలో అలాంటి గురువు ఎవరన్నా ఉంటే చెప్పగలరా!’ అని అడిగాడు. ‘ఓ దానిదేం భాగ్యం! నాకు తెలిసిన కొందరి పేర్లు చెబుతాను. వారి శిష్యరికంలో నీకు తృప్తి లభిస్తుందేమో చూద్దాం,’ అంటూ కొన్ని పేర్లు చెప్పాడు. పెద్దాయన చెప్పిన మాటలను అనుసరించి కుర్రవాడు ఆయా గురువులను వెతుక్కుంటూ బయల్దేరాడు. కానీ అదేం విచిత్రమో! ఎవ్వరి దగ్గరా తనకి తృప్తి లభించలేదు. అతని జ్ఞాన తృష్ణ చల్లారలేదు. అలా ఒకరి తర్వాత ఒకరిని వెతుక్కుంటూ, గాలిపటంలా దేశమంతా తిరుగుతూ తన యాత్రలను సాగించాడు. ఎక్కడా అతనికి తగిన బోధ లభించలేదు. అలా ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు గడిచిపోయాయి. అతనిప్పుడు కుర్రవాడు కాదు, యువకుడు! చివరికి నిరాశగా కాళ్లీడ్చుకుంటూ తన ఊరివైపు బయల్దేరాడు. యువకుడు ఊళ్లోకి అడుగుపెడుతుండానే అతనికి ఒకప్పుడు తారసపడిన పెద్దాయన కనిపించాడు. కానీ ఎందుకనో ఆ పెద్దాయన మొహం చూడగానే ఆయన గొప్ప జ్ఞానిలా తోచాడు. ఆయన దగ్గరకి వెళ్లి మాట్లాడుతున్నకొద్దీ... తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న గురువు ఆయనే అనిపించింది. ‘నేను పదేళ్ల క్రితం గురువుని వెతుక్కుంటూ మీ దగ్గరకి వచ్చినప్పుడే... మీరు నన్ను శిష్యుడిగా ఎందుకు స్వీకరించలేదు! నా జీవితంలో పదేళ్లు వెతుకులాటలో వృధా కాకుండా ఉండేవి కదా!’ అంటూ నిష్టూరమాడాడు యువకుడు. యువకుని మాటలకు పెద్దాయన చిరునవ్వులు చిందిస్తూ.... ‘నువ్వు పదేళ్ల క్రితం చూసినప్పటికీ, ఇప్పటికీ నేను పెద్దగా మారలేదు. మారింది నువ్వే! ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ నువ్వు అన్ని రకాల వ్యక్తులనూ చూశావు. ఏ మనిషి ఎలాంటివారు అని బేరీజు వేయగలిగే విలువైన నైపుణ్యాన్ని సాధించగలిగావు. ఆ నైపుణ్యంతోనే ఇప్పుడు నన్ను గుర్తించగలిగావు. అందుకే ఈ పదేళ్లు వృధా కానేకాదు. ఏ విషయం మీదైనా ఆసక్తి ఉంటే సరిపోదు. దాన్ని నెరవేర్చుకోగలిగే నైపుణ్యం కూడా సాధించాలి. అప్పుడే నీ లక్ష్యాన్ని సాధించగలిగే అర్హత ఏర్పడుతుంది,’ అంటూ యువకుడిని తన శిష్యునిగా స్వీకరించాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

ఇంటర్నెట్ ఓ అందమైన వ్యసనం

ఇప్పుడు ఇంటర్నెట్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. బ్రాడ్బ్యాండ్, 4G లాంటి సాంకేతికతత పుణ్యమా అని గంటల తరబడి వందలకొద్దీ సైట్లను చూడవచ్చు. కానీ ఇంటర్నెట్ వాడకం తర్వాత మన రక్తపోటు, గుండెవేగంలో కూడా మార్పులు వస్తాయని సూచిస్తున్నారు.   ఇంగ్లండుకి చెందిన Swansea University పరిశోధకులు ఇంటర్నెట్ వాడిన వెంటనే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 18 నుంచి 33 ఏళ్ల లోపు వయసున్న ఓ 144 మందిని ఎన్నుకొన్నారు. కాసేపు ఇంటర్నెట్ చూసిన తర్వాత వీరందరిలోనూ గుండెవేగం, రక్తపోటు కనీసం 4 శాతం పెరిగినట్లు గమనించారు. తమలో ఉద్వేగపు స్థాయి కూడా మరీ ఎక్కువైనట్లు వీరంతా పేర్కొన్నారు.   రక్తపోటు, గుండెవేగంలో ఓ నాలుగు శాతం మార్పు వల్ల అప్పటికప్పుడు వచ్చే ప్రాణహాని ఏమీ లేకపోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఇది తప్పకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. పైగా వీటికి ఉద్వేగం కూడా తోడవ్వడం వల్ల హార్మోనులలో మార్పు వస్తుందనీ, అది ఏకంగా మన రోగనిరోధకశక్తి మీదే ప్రభావం చూపుతుందనీ హెచ్చరిస్తున్నారు.   ఒక అలవాటు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆరోగ్యంలో వచ్చే మార్పులని withdrawal symptoms అంటారు. మద్యపానం, సిగిరెట్, డ్రగ్స్లాంటి వ్యసనాలు ఉన్నప్పుడు ఈ withdrawal symptoms కనిపిస్తూ ఉంటాయి. ఆ వ్యసనం కొనసాగితే కానీ సదరు లక్షణాలు తగ్గవు. ఆ వ్యసనం వైపుగా మళ్లీ మళ్లీ పరుగులు తీసేందుకు అవి దోహదం చేస్తాయి. అలాగే ఇంటర్నెట్ ఆపిన తర్వాత పెరిగిన ఉద్వేగం, తిరిగి అందులో మునిగిపోయిన తర్వాత కానీ తీరలేదట.   ఇంతాచేసి తమ ప్రయోగంలో పాల్గొన్నవారంతా కూడా ఇంటర్నెట్ను అదుపుగా వాడేవారే అంటున్నారు పరిశోధకులు. ఇక ఇంటర్నెట్లో గేమ్స్, షాపింగ్, సోషల్ మీడియా వంటి సైట్లకి అలవాటు పడినవారిలో ఈ ‘వ్యసనం’ మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉందని ఊహిస్తున్నారు. నిజానికి ఇంటర్నెట్ వల్ల మన ఆరోగ్యంలోనూ ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయన్న హెచ్చరికలు కొత్తేమీ కాదు. ఇలాంటి సమస్యలకు digital-behaviour problems అని ఓ పేరు కూడా పెట్టేశారు. ఆరోగ్యం సంగతి అలా ఉంచితే సుదీర్ఘకాలం ఇంటర్నెట్ వాడటం వల్ల డిప్రెషన్, ఒంటరితనం లాంటి సమస్యలు వస్తాయనీ... మెదడు పనితీరే మారిపోతుందని ఇప్పటికే పరిశోధనలు నిరూపించాయి. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని పెద్దలు ఊరికే అన్నారా! - నిర్జర.

మగమహారాజుల మెన్స్ డే!!

ఇంగ్లీష్ క్యాలెండర్లో బోలెడు డే లు. ఉపాధ్యాయులు, మహిళలు, వృద్ధులు, సైనికులు, పిల్లలు ఇలా ఉన్న అందరికీ డే లు పెట్టి వాళ్ళను సంవత్రానికి ఒకసారి ఘనంగా తలచుకోవడం పరిపాటి. అయితే ఆ లిస్ట్ లో పురుషులు ఉన్నారు. ఇంటర్నేషనల్ మెన్స్ డే పేరుతో నవంబర్ 19 న పురుషులకూ ఒక రోజును కేటాయించారు.  పితృస్వామ్య వ్యవస్థ అయిన మన భారతదేశంలో అన్ని విషయాలలోనూ మొదటి నుండి పురుషులదే పైచేయి. అలాంటి దేశంలో ఇప్పుడు పురుషుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అనుకున్నా ఒకప్పటికి, ఇప్పటికి మారిన పరిస్థితులను బట్టి మగవాళ్ళ గురించి చెప్పుకోవాల్సింది ఉంది. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే ప్రతి ఆడదాని విజయం వెనుక కూడా మగవాడు ఉంటాడు. పదస్తుతం అన్ని రంగాలలో మహిళలు మగవాళ్లకు తక్కువేమీ తీసిపోము అన్నంత పోటీ ఇస్తున్నారన్నా, గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారన్నా అందులో ఆ ఇంట్లో వాళ్ళను ప్రోత్సహించిన తండ్రులు, భర్తలు, కొడుకులు ఇట్లా మగవాళ్ళ పాత్ర ఉంటుందని చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే స్త్రీ తన సమానత్వం కోసం పోరాడుతూ ఉంటే చాలా మంది మగవాళ్లు ఇంట్లో వంట నుండి కుటుంబాన్ని చక్కదిద్దడం వరకు అన్ని పనులు పంచుకుంటూ వాళ్లే సగాన్ని ఆడవాళ్లకు వదిలేస్తున్న మహానుభావులు బోలెడు ఉన్నారని మాత్రం మర్చిపోలేం. మరేం చేద్దాం అనుకుంటున్నారా?? కొంచం సందడి సందడి అంటే ఎదో పండుగ కాదు. అలాంటి వాతావరణం అన్నమాట. ఇంట్లో ఉన్న మగవాళ్లకు అందునా మీకోసం ఎంతో తాపత్రయ పడుతూ మీకు సపోర్ట్ ఇస్తున్నవాళ్లకు నచ్చిన పంటకం చేసిపెట్టి, దగ్గరుండి వడ్డించి వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని చూడాలి, ఎప్పుడూ కుటుంబంలో గొడవలు, ఆర్థిక సమస్యలు అంటూ వాధించుకుని, గోడవపడే విషయాలను వదిలిపెట్టి వీలైనవరకు ప్రశాంతగా ఉండటానికి వాళ్ళను ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు. సరదాగా బయటకు వెళ్లడం, భర్తకోసం అయితే వాళ్లకు నచ్చిన రంగు దుస్తులు వేసుకోవడం, వాళ్లకు నచ్చిన చోటుకి వెళ్లడం కలసి జీవిస్తున్నందుకు, కలసి అన్ని పంచుకుంటున్నందుకు ప్రేమా, ఆప్యాయతలు ఎప్పటికి నిలబెట్టుకుంటాం అనెంతగా వారికి వ్యక్తం చేయడం. మరికొంచం కృతజ్ఞత కృతజ్ఞత పదం నాలుగే అక్షరాలు అయినా దానిలో ఉన్న అర్థం మాత్రం ఎంతో గొప్పది. కృతజ్ఞత అనేది మన జీవితంలో మనకోసం ఏదైనా చేసేవారి పట్ల కచ్చితంగా ఏర్పరచుకోవలసిన గుణం. అలాంటిది కుటుంబం కోసం ఎంతో చేస్తున్న మగవాళ్ళ విషయంలో కృతజ్ఞత చూపించడానికి తగిన సమయం ఇలాంటి మెన్స్ డే అని చెప్పచ్చు. అంతేనా నిజానికి ఒక మాట చెప్పాలంటే ఆడవాళ్లు ఉద్యోగం చేయకపోయినా, సంపాదించకపోయినా, ఇంటిని చూసుకుంటూ, వంట చేసి పెడితే చాలు ఉద్యోగాల గొడవలు గురించి అడిగే వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ మగవాళ్లకు మాత్రం ఇవన్నీ కచ్చితమైన బాధ్యతలు. వాళ్ళు బయట ఎన్నో సంఘర్షణలు పడుతూ కుటుంబాలకు లోటు రానివ్వకుండా చూసుకోడానికి ఎంతో కష్టపడతారు. అలాంటి వాళ్లకు కృతజ్ఞత చెప్పుకోవాలి. అలాగే ఆడవాళ్లను ప్రోత్సహించేవారిని ఎంతో గొప్పగా ప్రస్తావించాలి.  చిన్నవో పెద్దవో శక్తిని బట్టి బహుమానాలు. జీవితాన్ని సంతోషంగా ఉన్నందుకు కొన్ని సంతోష సమయాలు, నిజానికి ఇవ్వడమనే అలవాటు ఉన్న మగవాళ్ళు వస్తువులు, బహుమతులు కాదు భార్య, కూతురు, కోడలు మొదలైన వాళ్ళ నుండి ప్రేమ, ఆప్యాయత, అభిమానాన్ని కోరుకుంటారు. కాబట్టి అలాంటివి అందించడం. వాళ్ళ పట్ల ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమాపణ చెప్పి అపార్థాలు చెరిపేసుకోవడం.  ఇంకొక్క మాటలో చెప్పాలంటే సపోర్ట్ ఇస్తూ, కుటుంబాల ఎదుగుదలకు నిరంతరం పాటుపడే మగవాళ్ళ ముందు ఆడవాళ్లు తాము తక్కువే అని ఒప్పుకున్నా నష్టమేమీ లేదు అంటే ఆడవాళ్లను తక్కువైపోమని చెప్పడం ఇక్కడి ఉద్దేశ్యం కాదు. మగవాళ్ళకు ఆ గౌరవం ఇవ్వచ్చు అని. కాబట్టి బాధ్యతాయుతమైన మగవాళ్ళూ అందుకోండి అందరి సలాములు.  ◆ వెంకటేష్ పువ్వాడ

పెళ్లికి పోదాం చలో చలో... 

పెళ్లి అనేది భారతీయుల సాంప్రదాయంలో పండుగ కంటే ఎక్కువ. వధూవరుల చూపులు మనసులు కలిసి, పెద్దల మాటలు ఒక్కటవ్వగానే మొదలయ్యే హడావిడి, బంగారం, చీరలు, బట్టలు షాపింగ్, పెళ్ళిపత్రికల ఎంపిక, కళ్యాణ మండపాల బుకింగ్, వంటల మెనూ ఇలా బోలెడు విషయాల నుండి ఎవరిని పిలవాలి, ఎంతమందికి గదులు బుక్ చేయాలి వంటివి వాటితో కలిపి పెద్ద తతంగమే ఉంది మనకు.అయితే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబాలకి మాత్రమే కాకుండా కాసింత దగ్గరి బంధువులకు కూడా తప్పదు ఈ హడావిడి. మిరుమిట్లు గొలిపే కల్యాణ మండపాల్లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుల శోభకు ఏమాత్రం తగ్గకుండా జిగేలు మని మెరావడానికి పోటీ పడే మగువలు, మగరాయుళ్లకు తక్కువేమీ లేదు. కానీ వాటికోసం షాపింగ్ అవి ఇవీ కాస్త విసుగు తెప్పిస్తాయి, విసుగుతో పాటు జేబులు  కూడా కొల్లగొడతాయి. అలాంటిదేమి లేకుండా హాయిగా పెళ్లికి వెళ్లి రావడానికి కొన్ని చిట్కాలు. షాపింగ్ గోల తప్పించుకోండి ఇలా… సాదారణంగా చాలామంది చేసేపని పండుగ ముందో లేదా పెళ్లిళ్లు, శుభకార్యాల ముందో షాపింగ్ చేయడం. దీనివల్ల ఏదో హడావిడి చుట్టుముడుతుంది. కాబట్టి సింపుల్ గా డబ్బులు దగ్గరున్నపుడు, ఎక్కడైనా దూరప్రాంతాలకు టూర్ లకు వెళ్ళినపుడు అక్కడ ప్రముఖ  షాప్ లలోనో, లేదా ప్రత్యేకంగా పరిగణించబడే దుస్తులో, లేదా జ్యువెలరీనో కొనుక్కోవచ్చు. దానివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఫలానా చోట కొన్నాం అని చెప్పుకుంటే వచ్చే కిక్కు ఒకటైతే, అందరిలోనూ కాసింత ప్రత్యేకత మరియు మీరు చేసిన ప్రయాణం తాలూకూ మంచి గుర్తులుగా మీ షాపింగ్ ఎప్పటికీ మర్చిపోలేనంతగా తీపి జ్ఞాపకాలను మిగులుస్తుంది. అంతే కాదు పెళ్లిళ్ల ముందు తొందర తొందర అని తరిమే పెద్దవాళ్ళ మాటల్లో బట్టల ఎంపికలో బొక్కబోర్లా పడకుండా వేరే పనులు చూసుకునే అవకాశం లభిస్తుంది. జ్యువెలరీ జుయ్ జుయ్!! ఇప్పట్లో జ్యువెలరీ అంటే అందరూ బంగారమే పెట్టేస్తున్నారా ఏమన్నా?? గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఎక్కడ చూసినా లక్షణంగా దొరుకుతుంది. అది కూడా తక్కువ ధరలోనే. ఎక్కడికైనా వెళ్ళినపుడు రంగురంగుల రాళ్లతో పొదిగిన జ్యువెలరీ తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాగే అల్ టైమ్ ఫెవరేట్ గా అందరిలో నిలబెట్టేవి ముత్యాలు. ఇవి కూడా ధరలను బట్టి దొరుకుతాయి. అపుడపుడు ముత్యాల చెవిదిద్దులు, మెడ హారం, గాజులు వంటివి తీసుకుని భద్రపరచుకుంటే పెళ్లిళ్ల కోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టనవసరం లేదు. ప్యాకింగ్ పారాహుషార్!! పెళ్లికి వెళ్తున్నాం అంటే అందరి బట్టలు సర్దడం పెద్ద చిరాకు. అలా కాకుండా సింపుల్ గా జరిగిపోవాలి అంటే, పెళ్లికి వెళ్తున్నన్ని  రోజులు ఏ రోజు ఏ దుస్తులు వేసుకోవాలి, ఏ వస్తువులు కావాలి వంటివి ఎవరికి వారు నిర్ణయించుకుని, ఎవరి బ్యాగ్ వాళ్ళు సర్దుకోవడం ఉత్తమం. దీనివల్ల పెళ్లింట్లో నేను అది చెప్పాను, నువ్ అది పెట్టలేదు, ఇది పెట్టలేదు లాంటి గోల తప్పుతుంది.  కిట్ తో షార్ట్ కట్!! అందరూ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్రష్ లు, పేస్ట్ లు, సోప్ లు, షాంపూ లు, దువ్వెనలు ఇలా అందరివి ఒక కిట్ సెపరేట్ గా ఉంచుకుంటే వాటిని మర్చిపోవడం మధ్యలో కొనడం వంటి అదనపు పనులు తగ్గుతాయి. నిజానికి పెళ్లి అనే కాదు చాలా ప్రయాణాల్లో చాలామంది మర్చిపోయేవి ఇవే. ఇట్లా అన్నీ ఒక ప్రణాళికతో సాగిపోతే పెళ్లికి పోవడం పెద్ద హంగామాలా కాకుండా సింపుల్గా వెళ్లి వచ్చేయచ్చు. పెళ్లిని ఎంతో చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.  ◆ వెంకటేష్ పువ్వాడ      

ఎడమ చేతి వాటం ఎందుకు ఉంటుంది?

మహాత్మాగాంధి గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు. కానీ ఆయనది ఎడమ చేతి వాటం అన్న విషయం తెలుసా! సచిన్‌ టెండుల్కర్‌ని క్రికెట్‌ ప్రపంచం దేవుడిగా ఆరాధిస్తుంది. ఆయన కుడిచేతితో బ్యాటింగ్‌ చేసినా... స్వతహాగా ఎడమచేతి వాటం ఉన్న మనిషన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎడమచేతి వాటం ఉన్న ప్రసిద్ధుల గురించి చెప్పుకోవడం మొదలుపెడితే... ఆ జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. కానీ అలా కొందరికి మాత్రమే ఎడమచేతి వాటం ఉండటం వెనక కారణం ఏమిటి? మన నాగరికత అంతా కుడిచేతి వాటానికి అనుకూలంగా కనిపిస్తుంది. కారు దగ్గర నుంచీ కత్తెర దాకా ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుంది. ఎడమచేతి వాటం ఉన్నవారిని పరిశుభ్రత లేనివారుగానూ, వింతమనుషులుగానూ భావించడమూ కనిపిస్తుంది. ఇప్పుడంటే ఫర్వాలేదు కానీ.... ఒకప్పుడు ఎడమచేతివారిని మంత్రగాళ్లుగా, సైతానుకి ప్రతిరూపాలుగా భావించేవారట. అలా ఎడమచేతి వాటం ఉన్నవారిని తగలబెట్టిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయని అంటారు. ఇంగ్లీషులో sinister అనే పదం ఉంది. దుష్టబుద్ధి కల మనిషి అని ఈ పదానికి అర్థం. అసలు ఈ పదమే sinistra అనే లాటిన్ పదం నుంచి వచ్చిందట. అంటే ఎడమచేయి అని అర్థం. దీనిబట్టి జనం ఎడమచేతి వాటం ఉన్నవారిని ఎలా అపార్థం చేసుకునేవారో గ్రహించవచ్చు. హిందూ సంప్రదాయంలో కూడా తంత్రాలతో కూడిన ఆచారాలను ‘వామాచారం’ అని పిలవడం గమనించవచ్చు. ఎడమచేతి వాటానికి కారణం జన్యువులు అన్న అనుమానం ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే! దీనికి కారణం అయిన జన్యువులని ఆ మధ్య కనిపెట్టామని కూడా శాస్త్రవేత్తలు ప్రకటించారు. PCSK6 అనే జన్యువులో మార్పు కారణంగానే కొందరు ఎడమచేతి వాటంతో పుడతారని తేల్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే... అతనిది కుడిచేతివాటమా, ఎడమచేతివాటమా అన్నది పసిగట్టేయవచ్చని చెబుతున్నారు. ఎడమచేతి వాటం ఉన్నవారు ఈ ప్రపంచంలో పదిశాతమే ఉంటారు. ఒకవేళ జన్యుపరమైన కారణాలు ఉంటే ఈ నిష్పత్తి సరిసమానంగా ఉండవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. దీనికి మన నాగరికతే కారణం అంటున్నారు. మనిషి సంఘజీవి. సాటి మనుషులతో కలిసి పనిచేస్తేనే అతని పని జరుగుతుంది, సమాజమూ ముందుకు నడుస్తుంది. ఈ క్రమంలో అతను తయారుచేసుకునే పరికరాలు అన్నీ కూడా కుడి చేతివాటం వారికే అనుకూలంగా ఉండేలా చూసుకున్నాడు. అలా నిదానంగా ఎడమచేతివాటాన్ని నిరుత్సాహపరుస్తూ వచ్చింది సమాజం. దాంతో క్రమంగా ఎడమచేతి వాటం ఉండేవారి సంఖ్య తగ్గిపోయింది. ఈలోగా భాషకి లిపి కూడా మొదలైంది. ఆ లిపి కూడా కుడిచేతి వాటంవారికే అనుకూలంగా రావడంతో... కుడిచేతివారిదే పైచేయిగా మారిపోయింది. ఈ ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుందన్న విషయంలో అనుమానమే లేదు. కానీ ఇది ఒకరకంగా ఎడమచేతివారికి అదృష్టం కూడా! మిగతావారికి భిన్నంగా ఉండటం వల్ల, కొన్ని పోటీలలో ఎడమచేతి వాటం గలవారికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు బేస్‌బాల్‌ ఆటనే తీసుకోండి. బేస్‌బాల్ ఆటగాడికి కనుక ఎడమచేతి వాటం ఉంటే అతని ఆట తీరుని పసిగట్టడం, శత్రువులకి అసాధ్యంగా మారిపోతుంది. ఈ తరహా లాభాన్ని negative frequency-dependent selection అంటారు. పైగా ఎడమచేతి వాటం ఉన్నవారు ఇతరులకంటే తెలివిగా ఉంటారనీ, వీరిలో సృజన ఎక్కువగా ఉంటుందని కూడా అంటారు.  

పుస్తకం మన ప్రియ నేస్తం

పుస్తకాలు ఎక్కువగా చదివే వాళ్ళని నమ్మకూడదు అని అన్నాడు హెన్రీ డేవిడ్ అనే ఒక రచయిత. కారణం తన ఇంటికి వచ్చిన స్నేహితుడొకరు తన దగ్గరున్న పుస్తకాన్ని చెప్పకుండా పట్టుకుపోయి, అది బాగా నచ్చటంతో తిరిగి ఇవ్వలేదట. ఆశ్చర్యపోవక్కర్లెద్దు ఇలా కూడా ఉంటారండి పుస్తక ప్రియులు. ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది అంటారు. నిజంగానే ఎంత తిరిగినా, ఎంత తిన్నా, ఎంత సేపు పడుకున్నా రాని ఆనందం ఒక మంచి పుస్తకం చదివితే వస్తుంది. ఎప్పుడైనా కాస్త చికాకుగా ఉన్నా, లేదా నిస్పృహలో పడినా పుస్తక పఠనం మనని అందులోంచి బయటకి లాగగలదు. ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఎవరికి వారు ఒక మంచి పుస్తకాన్ని కొని మనకి ఇష్టమైన వాళ్ళకి కానుకగా ఇద్దాం. పుస్తకం మనిషికి అత్యంత ప్రియ నేస్తం కాబట్టి ఇందుకోసం కూడా ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించాలని నిర్ణయించుకున్న యునెస్కో 1995వ సంవత్సరంలో ఏప్రిల్ 23వ తారీఖుని ఖరారు చేసింది. అప్పటి నుంచి మనం ఈ ఇంటర్నేషనల్ బుక్ డేని జరుపుకుంటున్నాం. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మదినాన్ని స్పెయిన్ లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్ లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్ గా ఇస్తారు తెలుసా. ఈ బుక్ రీడింగ్ అలవాటు మనలో సృజనాత్మకతని పెంచుతుంది. మన ఆలోచనా విధానాన్ని కూడా మార్చుతుందనటంలో సందేహమే లేదు. అందుకే పుస్తకం చదివే అలవాటు లేకపోతే వెంటనే అలవాటు చేసుకుంటే చాలా ఉపయోగాలే ఉన్నాయండోయ్. ఒక పుస్తకం మన చిన్నప్పుడు చదివితే మనకు వచ్చే అనుభూతికి, అదే పుస్తకాన్ని కాస్త వయసులోకి వచ్చాకా చదివితే వచ్చే అనుభూతికి మద్య చాలా తేడా ఉంటుంది. కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి. రిటైరయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు చేసే పని ఈ బుక్ రీడింగ్ అనుకుంటే పొరపాటే. అసలు వాళ్ళకన్నా జీవితాన్ని మొదలుపెట్టటానికి ప్రపంచంలోకి అడుగుపెట్టేవారికే  ఇది చాలా అవసరం. ఎందుకంటే పుస్తకాలు చదవటం వల్ల కొత్త విషయాల సేకరణ జరుగుతుంది. ఒక పుస్తకం చదివాకా అందులో ఉన్న విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండటం వల్ల మన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మనం ఏదన్నా రాయాలన్నా బుక్ రీడింగ్ వల్ల మనం అలవర్చుకున్న పరిజ్ఞానం రాయటంలో  ప్రదర్శించచ్చు. ఈ పుస్తక పఠనం వల్ల అన్ని రకాల పుస్తకాలు చదవటం అలవాటయ్యి, ఏదైనా సమస్య ఎదురైనపుడు ఎలా దాన్ని హేండిల్ చెయ్యాలో కూడా మనకి చాలా సులువుగా తెలిసిపోతుంది. ముఖ్యంగా మన ఏకాగ్రత పెరుగుతుంది. కుదురుగా ఒక దగ్గర కూర్చునే అలవాటు లేని వాళ్ళు సైతం బుక్ రీడింగ్ హేబిట్ వల్ల దాన్ని అలవాటు చేసుకుంటారు. నలుగురిలో కలిసే అలవాటు లేనివాళ్ళు చాలా మటుకు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పుస్తకం చదివే అలవాటు చేసుకుంటే ఇక ఎప్పటికి ఒంటరితనం ఫీల్ అవ్వరు. మొత్తానికి ఒక మంచి పుస్తకం అన్ని వయసుల వారిని అలరిస్తుంది. అందుకే మన లైఫ్ లో మనం ఎంత బిజీ అయిపోయినా మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకుని పుస్తకం చదవటంలో ఉండే ఆనందాన్ని అనుభవిద్దాం. ...కళ్యాణి

దయామయులకు వందనం !! 

ప్రపంచంలో ఎన్నో రకాల మనస్తత్వాలు ఉన్నవారు ఉంటారు. ఒకరికి మరొకరు విభిన్నమైన వారు. కొందరిలో క్రూరత్వం, మరికొందసరిలో సాధుస్వభావం ఉంటుంది. ఇవన్నీ కూడా వారు పెరిగిన పరిస్థితుల ఆధారంగానే ఉన్నా, తమ అనుభవాల కారణంగా అటు వారు ఇటు, ఇటు వారు అటు మారిపోయిన, మారిపోతున్న సందర్భాలు కూడా బోలెడు.  అయితే ప్రపంచానికి దయా హృదయాన్ని పంచినవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది ఎమిటో తెలుసుకుని ఆ మాటలను పిల్లలకు చెబితే నేటి పిల్లలు రేపటి దయామయులు అవుతారు.  సాధారణంగా అందరూ చేసే తప్పు ఒకరిని తక్కువగా చూడకూడదు, పేదవారిని ఎగతాళి చేయకూడదు, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి ఇలాంటి మాటలు పిల్లలకు చెప్పడం. ఇవి తప్పు మాటలా అని అందరికి అనిపిస్తాయి. కానీ వంద మాటలు చెప్పడం కన్నా ఒక చిన్న పని పిల్లల చేత చేయించడం ఎంతో ఉత్తమం. నీతి కథలను, వేమన పద్యాలను, సుభాషితాలను పిల్లలచేత వల్లే వేయించి వాళ్లకు నీతిని, దాయను, జాలిని నూరిపోస్తున్నాం అనుకుంటారు కానీ కేవలం మాటల వల్ల మాత్రమే వాటి తాలూకూ విలువలు పిల్లల్లో పెంపొందవు.  పేదవాళ్లకు, కష్టంలో ఉన్న వాళ్లకు సహాయం చేయించాలి. చిన్నదా పెద్దదా అనే సంశయం అక్కర్లేదు. నేటి విత్తనమే రేపటి వృక్షం. పిల్లలతోనే నేరుగా సహాయం చేయించడం వల్ల దాని లోతులు పిల్లలకు తెలుస్తాయి.  మొక్కల పెంపకం ఓ మొక్కను నాటించి దాన్ని సంరక్షించి, నీళ్లు పోసి, కలుపు తీసి దాన్ని పెద్దగయ్యేలా చేయడంలో ఉన్న శ్రమ పిల్లల్లో బాధ్యతను తెలుపుతుంది. పెద్దవారి పట్ల పిల్లలు బాధ్యతాయుతంగా ఉండేలా అది తోడ్పడుతుంది. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల సందర్శన వృద్ధాశ్రమాలలో దిక్కులేని వృద్ధులు బిక్కు బిక్కుమని గడుపుతుంటారు. వారి దగ్గరకు తీసుకెళ్తే వారి దయనీయ పరిస్థితులు, అనాధాశ్రమాలలో పిల్లల జీవితాలు చూడటం ద్వారా జీవితంలో తాము ఎంత మంచి స్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది. వారికి సహాయం చేయాలనే మనస్తత్వం పెంపొందుతుంది.  జంతువుల పట్ల భూతదయ.. ఇంట్లో ఏదో ఫాషన్ కోసమూ, స్టేటస్ కోసమూ పెంపుడు జంతువులను పెంచడం కాదు. వీధి కుక్కలు, పిల్లులుకు ఆహారం పెట్టడం. ఇంటి గోడ మీద వాలే పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం. మూగజీవాలను కొట్టకుండా వాటికీ మనసు ఉంటుందని వాటి చర్యలకు అర్థం వివరిస్తూ జంతువులను అర్థం చేసుకునేలా చేయడం. సమాజంలో తిండి, నీరు, కట్టుకోవడానికి బట్టలు లేక ఉండటానికి సరైన నివాస ప్రాంతాలు లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు జీవితంతో ఎలా పోరాటం చేస్తున్నారో, వీధి బాలలు తమ బాల్యాన్ని చిత్తు కాగితాల మధ్య ఎలా కోల్పోతున్నారో అర్థమయ్యేలా చెబుతూ మీ చుట్టూనే ఉన్నవారిని ఉదాహరణగా చూపించడం వల్ల పిల్లల్లో ప్రత్యక్ష ప్రతిస్పందనలు కలుగుతాయి. ఈ దయ అనేది పిల్లలోనే కాకుండా పెద్దలలో కూడా పెంపొందాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వార్థంలో కూరుకుపోయిన ఎందరో మార్పు చెంది ప్రపంచాన్ని కూడా మార్చాల్సిన సమయం ఆసన్నమయ్యింది.  నవంబర్ 13 ప్రపంచ దయా దినోత్సవం సందర్బంగా అందరిలో ఈ విషయం పట్ల అవగాహన పెంచేందుకు ఇదొక చిన్న ప్రయత్నం. మీరు మీ చుట్టుపక్కల వారిలో మార్పు కోసం ప్రయత్నించండి. మీ చుట్టుపక్కల ఉన్న కరుణా మూర్తులకు వందనం సమర్పించండి. ◆ వెంకటేష్ పువ్వాడ