Read more!

సేంద్రియ సాగుకు జై కొడదాం!!


విద్య, విజ్ఞానం దేశ అభివృద్ధికి అవసరమైనవి అయిన వ్యవసాయం మాత్రం మనిషి మనుగడకు ఖచ్చితంగా ఉండాల్సినది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం మనది. దేశానికి వెన్నెముక రైతు అనే మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాము. అయితే రైతు దిగుబడి మీద ఆశతో తెలిసీ తెలియక తప్పులు చేసేస్తూ ఉంటాడు. ఆ తపుల్లో భాగంగానే పంటలకు రసాయనిక ఎరువులు విపరీతంగా వాడటం చేస్తాడు. ఫలితంగా దిగుబడి కూడా రసాయనిక మూలాలు నింపుకుని రుచి తగ్గడమే కాకుండా అందులో ఎంతో అనారోగ్యం కలిగించే విషబీజాలు ఉంటాయి.


ఇలాంటి వాటిలో నుండి మళ్ళీ పుట్టింది సేంద్రియ వ్యవసాయం. మళ్లీ పుట్టడం ఏంటి అని ఇప్పటి వాళ్లకు చాలామందికి అనుమానం వస్తుంది. కానీ నిజానికి ఈ సేంద్రియ వ్యవసాయం భారతదేశంలో ఎన్నో ఏళ్ల నుండి వారసత్వంగా వస్తున్నదే. ఒకప్పుడు పంట దిగుబడి వస్తే అందులో కొన్ని విత్తనాలను ఆవు పంచితంలో శుద్దిచేసి ఆ తరువాత వాటిని జాగ్రత్త చేసి తిరిగి మళ్ళీ పంట వేయాల్సి వచ్చినప్పుడు విత్తడానికి వాడేవాళ్ళు. అయితే శాస్త్రవేత్తల పుణ్యమా అని ఎన్నో రకాల రసాయనిక మందులు కనుక్కుని, కృత్రిమ వంగడాలు ఆవిష్కరించడం వల్ల అవి వాడితే గొప్ప దిగుబడి ఉంటుందనే వెర్రిలో ఎడా పెడా కృత్రిమ ఎరువులు వాడి భూమిలో సారాన్ని చేతులారా క్షీణింపజేసుకుంటున్నారు. ఫలితంగానే ఆ కృత్రిమ ఎరువులు వాడిన మొదట్లో దిగుబడి బాగా వచ్చి క్రమంగా ఎలాంటి దిగుబడి లేకుండా వరుస నష్టాలు రైతుల పాలిట శాపాలు అవుతున్నాయి.


అవి రైతుల సమస్యలు అయితే క్రమంగా మనిషి ఆరోగ్యం క్షీణించడం కూడా మరొక కారణం. ఈ కారణం వల్ల అందరూ మళ్లీ సేంద్రియ పంటల ద్వారా లభ్యమైన వాటినే కొనుగోలు చేయడానికి తినడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. 


అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్గానిక్స్ హవా కొనసాగుతోంది. 


ముఖ్యంగా జీవరసాయనాలు తయారుచేసి, జీవామృతం సహాయంతోనూ, సహజమైన ఎరువులతోనూ పంటలను పండించి రాసి కన్నా వాసి ముఖ్యం అన్నట్టు దిగుబడులు మరీ బీభత్సంగా రాకపోయినా ఆశాజనకంగా వస్తున్నందుకు ఆ తరహా సాగు వైపు వెల్తూ, భూమికి మళ్ళీ జీవాన్ని ఇస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అగ్రికల్చర్ వైపు యువత అడుగులు వేస్తూ, సాంకేతికతను, సెంద్రియానికి జోడించి వ్యవసాయ రంగాన్ని కొత్తబాటలు పట్టిస్తున్నారు. 


ఆరోగ్యం, సంక్షేమం!!


సేంద్రియ వ్యవసాయం వల్ల రోగాలతో చిక్కిపోయిన ఆరోగ్యాలు మళ్లీ నూతనోత్తేజంతో చిగురులు తొడిగిన పచ్చని ఆకుల్లా మారుతున్నాయనేది వాస్తవం. ఎందరో జీవితాలే ఇందుకు నిదర్శనం కూడా. ప్రకృతికి దగ్గర పంటలు సాగడం వల్ల ఆ పంట దిగుబడిలో ఎంతో రుచి కూడా ఉంటుంది, పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటున్నాయి. 


అయితే నేటి కాలంలో అన్నిచోట్లా ఈరకమైన సాగు ఉండటం లేదు. ముఖ్యంగా సగటు మధ్యతరగతి రైతు ఈ రకమైన వ్యవసాయం వైపు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. స్వంతంగా జీవామృతాలు తయారుచేసుకోవడం అనేది ఒక అదనపు పని అయితే దిగుబడి రాకపోతే ఎలా అనేది చాలా పెద్ద భయం. 


కానీ నేటి వేగవంతమైన ప్రపంచంలో, నూటికి 90% మంది రోగాల బారిన పడినవారే ఉంటున్న రోజుల్లో ఈ సేంద్రియ వ్యవసాయం ఒక ఉద్యమంలా మారాలి. దాని వైపు రైతులను నడిపేలా అందరూ మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చెయ్యాలి, ప్రజలు వాటిని కొనడానికే ముందడుగు వేయాలి. కాసింత ధర ఎక్కువైనా సేంద్రియ ఉత్పత్తులు వాడటం వల్ల మన ఆరోగ్యాలు బాగుపడతాయి, రైతులు బాగుపడతారు, ముఖ్యంగా పుడమితల్లి మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. 


అందుకే సేంద్రియ సాగుకు జై కొడదాం!! సేంద్రియ ఉత్పత్తులు కొనడానికి ప్రాధాన్యత ఇద్దాం. వ్యాపిక్అర సామ్రాజ్యాధిపతులకు మేలు చేయడం వదిలి మన చుట్టూ ఉన్న రైతులకు మేలు చేద్దాం!!


                                                                                                                               ◆వెంకటేష్ పువ్వాడ.