Read more!

పరామర్శకులు చేస్తున్న పొరపాట్లు ఏమిటో తెలుసా?

కొందరికి అవతలివారిని చూసీ చూడటంతోటే పరామర్శించాలనే బుద్ధి పుడుతుంది. ఈ చేసే పరామర్శకు అట్టే అర్థం కూడా ఉండదు. అవతలివాడిని మరింత బాధకు గురిచేయడానికే పనికి వస్తుంది. చిక్కిపోయినట్లున్నారే అంటాడు. నిజానికి ఇతడు చేయగలిగిన సహాయమంటూ ఏమీ వుండదు. అవతలవాడికి ఆ మధ్య వచ్చిపోయిన జ్వరాన్ని గుర్తుకు తీసుకురావడానికి మాత్రమే ఉపకరిస్తుంది. అది గుర్తు వచ్చేసరికి అసలే బలహీనంగా వున్న మనిషి మరింత నిస్త్రాణకు గురవుతాడు. తనకు ఫలానా జబ్బు వచ్చిన కారణం చేత చిక్కిపోయానని అతడు తన “నేరం” ఒప్పుకునే వరకూ ఇతడా "చిక్కడం" గురించి అంటూనే వుంటాడు. ఆ వ్యక్తి తనుపడ్డ బాధంతా సవివరంగా చెప్పి, అదంతా తలపోసుకున్నందువల్ల మరింత నీరసించిపోతాడు. అంతా విని ఇతడు చేసేదేముంటుంది? ఏమీ వుండదు.

"ఆయుర్వేదంలో దీనికేదో మందున్నదండీ. సమయానికి గుర్తురావడం లేదు. మొన్న మా బావమరిది వాడాడు. కనుక్కొని చెప్తాను" అనో, లేదంటే ఏదో కరక్కాయ వైద్యమొకటి చెప్పి, ఆ వ్యక్తి “ప్రయత్నించి చూస్తా"ననే వాగ్దానం ఇచ్చేవరకూ వదలకుండా వెంటాడి, ఆ తర్వాతగానీ అక్కడనుండి వెళ్ళడు. తాను వైద్యుడు కానప్పుడు తనకా వ్యాధి అనుభవం లేనప్పుడు తను చేసేదేముంటుంది? వ్యాధినుండి కోలుకుంటున్న వారు ఇతడి పాలిటబడితే మరింత వ్యధకు లోనవుతారు. ఈ సానుభూతిపరుడు పెట్టే బాధ, ఒక్కోమారు వ్యాధి బాధను మించిపోతుంటుంది.

ఈ పద్ధతికి పూర్తిగా భిన్నంగా ప్రవర్తించేవారు మరికొందరు. ఎవరికి యే జబ్బూ వున్నదనే మాటనే తొలుత అంగీకరించరు. ప్రతివారినీ పది సూర్య నమస్కారాలు చేయమని సలహా ఇస్తుంటారు. పిడుక్కూ బియ్యానికీ ఒకే మంత్రమన్నట్లు వ్యాధి ఏదైనప్పటికీ సూర్యనమస్కారాలే “ప్రిస్క్రైబ్" చేస్తారు. " మా వ్యాధి ఇదండీ" అని ఎవరైనా అన్నప్పుడు, కాసేపు ఆలోచించి నమస్కారాల సంఖ్యను ఎక్కువచేసి చెప్తారు. వారి దృష్టిలో మనమందరం వ్యాధులను ఊహించుకునే రోగిష్ఠి మనస్తత్వం గల వాళ్ళం. అందుచేత మానసిక శారీరక రుగ్మతలకన్నిటికీ ఈ సూర్య నమస్కారాలే చికిత్స అని వారి అభిప్రాయం.

 " మేము నేర్పుతాం. ప్రొద్దున్నే ఇంటికి వచ్చి నేర్పమంటారా?” అని బలవంతం చేస్తారు. బలహీనులు, రోగిష్ఠులు వీరికో పది నమస్కారాలు పెట్టి వదిలించుకోకపోతే, వీరిద్వారా చాలా బాధకు గురవవలసి వస్తుంది.

రోగులకు ప్రోత్సాహకరమైన మాటలు చెప్తే మానసికోల్లాసం కలుగుతుందనీ, ఆ విధంగా వారి వ్యాధి వేగంగా తగ్గి పోతుందనే విశ్వాసం కొందరిది. దీనినొక విధానంగా రూపొందించి అమలు జరుపుతుంటారు. రోగిలో వ్యాధి కాస్త వెనక్కు తీస్తుంటే, ప్రోత్సాహకరమైన మాటలకు కాస్త ప్రయోజనముంటుంది. అలాంటిదేమీ లేనప్పుడు ఈ విధానాన్ని ప్రయోగిస్తే అసందర్భంగా ఉంటుంది. కాస్త తగ్గితే మరింత తగ్గినట్లుగా మాట్లాడే వీలుంటుంది కానీ అసలేమాత్రం మార్పు కనిపించనప్పుడు ఏదో ఉత్సాహం కలిగించడానికి వెర్రిగా మాట్లాడితే ఎవరికైనా విసుగు జనిస్తుంది.

ఫ్రెంచి ఆర్టిస్ట్ జీన్ లూయీ పోరైన్ మరణశయ్యపై ఉన్నాడు. బంధువులు అందరూ చుట్టూ చేరి అతడికేవో ఆశావహమైన మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

భార్య తన దుఃఖాన్ని దిగమ్రింగుకుంటూ “కాస్త తేటగానే కనిపిస్తున్నారండీ" “ ముఖం పీక్కుపోయినట్లున్నప్పటికీ నాలుగు రోజులనాటి ఉబ్బు లక్షణాలు అన్నది.

"తగ్గినట్లున్నై, అంటే జబ్బు వెనక్కు తీస్తున్నదన్నమాట" అన్నాడు బావమరిది. 

"నిన్నా మొన్నటికన్నా ఊపిరి కాస్త తేలిగ్గా తీసుకోగలుగుతున్నారనుకుంటాను" అన్నాడు కుమారుడు.

పోరైన్ నీరసంగా నవ్వి "అదృష్టవంతుణ్ణి సుమా! వ్యాధి నిర్మూలమయింతర్వాతే నాకు మరణం ఆసన్నమవుతున్నట్లున్నది" అన్నాడు.

ఇదీ నేటి కాలంలో మనుషులు ఇతరుల విధానంలో ప్రవర్తించే తీరు. 

                                   ◆నిశ్శబ్ద