Read more!

చీకటి వెలుగుల రంగేళి!

దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. వెలుగుతున్న దీపాలు చూస్తే ఎంత సంతోషమో, సంతోషంగా ఉన్న జీవితాలను చూస్తే కూడా అంతే సంతోషం కలగాలి మనుషులకు. కానీ అది నిజమేనా…. ఇప్పట్లో సంతోషంగా ఉన్న జీవితాలను చూస్తే సంతోషపడేవారు ఉన్నారా?? అస్తమాను ఎదుటివారి జీవితాలను చూసి కుళ్ళుకుంటూ ఓర్వలేనితనం పెంచుకునే వారే అడుగడుగునా కనబడుతూ ఉంటారు. అయితే జీవితంలో చీకటి, వెలుగు అనేవి ఒకదాని తరువాత ఒకటి వస్తూ వుంటాయని. అవి మనిషి జీవితములో కష్ట సుఖాలలాగే వచ్చి పోయేవి అనే విషయాన్ని స్పష్టం చేయడానికే ఈ ఉపమానాన్ని ప్రస్తావిస్తారని చాలామంది పెద్దలు చెబుతారు. 

చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అని ఒక కవి రాసాడు. చీకటి వెలుగు కష్ట సుఖాల్లాంటివి అవి రెండూ ఉన్న జీవితమే పండుగలా ఉంటుంది. మనిషి ఎప్పుడూ సంతోషమే కోరుకుంటాడు. దుఃఖాన్ని ఎవరూ కోరుకోరు. కనీసం ఊహకు కూడా ఆ విషయం రాదు. కానీ ఎదుటి వాడికి మాత్రం సంతోషాలు వస్తే మనసులో రగిలిపోతాడు, అదే కష్టాలు వస్తే లోలోపల పొంగిపోతాడు. కానీ ఎవరికైనా సరే ఎప్పుడూ సంతోషాలు జీవితంలో ఉంటే నిజానికి సంతోషం విలువ తెలుస్తుందా?? 

ఒక పిల్లాడికి ప్రతిరోజూ నచ్చిన ఆహారం పెడుతున్నారు. వాడికి నచ్చనిది దూరం జరిపి వాడు తినాలని అనుకున్నదే పెడుతున్నారు. కానీ ఒకరోజు వాడు అందుబాటులో లేని ఆహారం అడిగాడు. వేరే ఎన్ని ఖరీదైనవి చూపించినా వాడికి మాత్రం అదే కావాలనే మొండితనం. తనకు కావలసింది ఇవ్వలేదని తల్లిదండ్రుల మీదా ద్వేషం. దేన్నీ లక్ష్యపెట్టని నిర్లక్ష్యం. కోరుకున్నది దక్కకపోతే ఉన్మాదంగా మర్చివేస్తాయి అనే విషయాన్ని మాత్రమే కాదు, అసలు అనుకున్నది, కోరుకున్నది జరగకపోతే ఎలా ప్రవర్తించాలో ఆ పిల్లవాడికి ఏమీ తెలియకుండా పెరగడానికి కారణం అయ్యింది ఆ తల్లిదండ్రులు చేసిన పని. 

నచ్చింది ఇవ్వడం ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు కాదు కానీ ఏదైనా అనుకున్నది జరగకపోతే దాన్ని ఎలా తీసుకోవాలి?? వ్యక్తిత్వం ఎలా ఉండాలి వంటి విషయాలు పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. అందుకే అంటారు సంతోషాన్ని మాత్రమే కాదు పిల్లలకు కష్టాన్ని కూడా పరిచయం చెయ్యాలి అని. కష్టాన్ని వారికి పరిచయం చేసినప్పుడే, వారికి సంతోషం గురించి ఒక స్పష్టమైన అర్థం, అవగాహన కలుగుతాయి.

కష్టాన్ని ప్రేమించాలా??

అవును కష్టాన్ని ప్రేమించాలి. ప్రతి కష్టం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. సంతోషం మనిషిని వాస్తవ ప్రపంచం నుండి దూరంగా లాక్కుని వెళితే కష్టం వారికి వాస్తవ ప్రపంచంలో నిజానిజాలను పరిచి చూపిస్తుంది. అందుకే మనిషికి సంతోషం కంటే కష్టం చేసే మేలు ఎక్కువ. ప్రతి కష్టాన్ని చీకటితో పోలుస్తారు. అందుకే చీకటి ఉంటేనే వెలుగుకు అయినా విలువ ఉండేది అని చెబుతారు. అంటే ఇక్కడ కష్టం అనేది మనిషిని ఇబ్బంది పెట్టకపోతే దాని తరువాత వచ్చే సంతోషాన్ని మనిషి ఆస్వాదించలేడు. అందుకే కష్టాన్ని కూడా ప్రేమించాలి అని చెప్పేది. 

కష్టాన్ని నమ్మిన వాడు, కష్టపడేవాడు ఎప్పటికీ చెడిపోడు. కష్టాలు ఉన్నాయంటే బాధపడుతూ ఉండేవారు కష్టానికి తగిన పలితం తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే కష్టాలలో ఉన్నప్పుడు కూడా తరువాత సంతోషమొస్తుంది అనే ఆశావహ భావన మనిషిని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచేలా చేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా అందరూ ఒప్పుకుంటారు. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అని. కష్టసుఖాలతో సాగే జీవితమే నిజమైన పండుగలాంటిది కాదంటారా??

                                      ◆నిశ్శబ్ద.