ప్రస్తుత సమాజాన్ని తప్పుదోవలో నడుపుతున్నది ఎవరు?

ప్రస్తుతసమాజాన్ని వ్యాపారసంస్కృతి నిర్దేశిస్తున్నది. వ్యాపారంలో ప్రచారం అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందంటే ప్రస్తుతం వ్యాపార ప్రచారం ఇరవై నాలుగు గంటలూ ప్రతి నట్టింటా వికృతరూపంలో నర్తనమాడుతోంది. పుట్టినప్పటి నుంచీ జీవితంలో అనుభవించగల సౌఖ్యాలు ప్రతివాడికీ ప్రతి వయసు నుంచీ తెలుస్తున్నాయి. ఆ సౌఖ్యాల సాధనకు ఏకైక మార్గం డబ్బు సంపాదన. దాంతో వ్యక్తి అభివృద్ధిని డబ్బు సంపాదనతో కొలవటం తప్పనిసరి అయింది. తమ పిల్లవాడు డబ్బు సంపాదించకపోతే పనికి రానివాడన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. దాంతో ప్రతివాడి జీవితలక్ష్యం ఎలాగోలాగ, వీలైన రీతిలో డబ్బు సంపాదించటమే అన్నది స్థిరమైపోయింది. సమాజం అవినీతిమయమై విలువలు తరగటంలో ప్రధానంగా తోడ్పడిన అంశం ఇది. డబ్బు మీద ఆశను కల్పించి, పెంచటంలో పాశ్చాత్య ప్రచారసంస్థలు గణనీయమైన విజయాన్ని సాధించాయని చెప్పవచ్చు.

ప్రేమప్రచారం సమర్థంగా జరిగింది. యువతీ యువకులు కలిస్తే ప్రేమించి తీరాలన్న అభిప్రాయం ఏర్పడింది. కాలేజీలకు వెళ్ళేది ప్రేమించటం కోసమేనన్న అభిప్రాయం విస్తృతంగా ప్రచారమైంది. టూత్ పేస్టుతో పళ్ళు తోముకుంటే అమ్మాయి వచ్చి ఒళ్ళో వాలుతుంది. ఓ మోటర్ సైకిల్ కొంటే, ఇతరుడితో ఉన్న అమ్మాయి, వాడిని వదిలి వీడి దగ్గరకు వచ్చేస్తుంది. ఓ షేవింగ్ లోషన్ వాడగానే అమ్మాయి ప్రత్యక్షమైపోతుంది. ఇంకో మౌత్ ఫ్రెష్నర్ ఉపయోగిస్తే అమ్మాయిలు ఎగురుకుంటూ వచ్చి పడిపోతారు. ఇంకేదో సువాసన ద్రవ్యం వాడితే అమ్మాయిలు వెర్రెక్కి వెంటపడతారు. మరింకేదో కంపెనీ కళ్ళద్దాలు పెట్టుకుంటే, అమ్మాయిలు నిజంగానే పడిపోతుంటారు. ఈ ప్రచారం వల్ల, అబ్బాయిలకు అమ్మాయిలంటే ఎంతగా చులకన అభిప్రాయం కలుగుతుందో ఆలోచిస్తే, ఈ తరానికి మనం చేస్తున్న అన్యాయం అర్థమౌతుంది.

అలాగే, ఓ అమ్మాయి "మిస్ యూనివర్స్" గా ఎన్నికై, సినిమాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించింది. ఆమె మిగతావారందరికీ ఆదర్శమైంది. ప్రతి వారూ అందంగా ఉండాలని పోటీలు మొదలుపెట్టారు. విదేశీ కాస్మెటిక్ కంపెనీలకు లాభం. విదేశీ ఎక్సర్ సైజ్ పరికరాల తయారీదారులకు లాభాలు. ఇక అమ్మాయిలు ఉన్నది అబ్బాయిలను ఆకర్షించేందుకే అన్న ప్రచారం పుట్టినప్పటి నుంచీ ఉగ్గు పాలతో అబ్బాయిలు నేర్చుకుంటున్నారు. ఓ అమ్మాయి ఓ క్రీమ్ వాడగానే అబ్బాయిలు వెంటపడతారు. ఓ హెయిర్ షాంపూ వాడితే ముగ్ధులైపోతారు. కంపెనీ ఐస్ క్రీమ్ అసభ్యంగా తింటూంటే కుర్రాళ్ళు సర్వం మరచిపోతారు.

 ముఖం మీద మొటిమలు ఉంటే అబ్బాయిలు మెచ్చరు. కాబట్టి ఓ కంపెనీ మొటిమల మందు వాడితే ఇక అబ్బాయిలు క్యూలు కడతారు. ఇంకేదో పౌడరు, మరింకేదో అందాన్ని పెంచే వస్తువు.... కానీ అన్నీ అబ్బాయిలను ఆకర్షించేందుకే. ఐతే వీటన్నిటికీ డబ్బు కావాలి. డబ్బు కావాలంటే పరీక్షల్లో పాసవాలి. మార్కులు రావాలి. అప్పుడు కార్లు కొనవచ్చు, అమ్మాయిల్ని వెంట తిప్పుకోవచ్చు. ఇదీ ప్రస్తుతసమాజం ఆలోచిస్తున్న దిశ. 

పైన చెప్పుకున్నవి అన్ని గమనిస్తే వ్యాపార సామ్రాజ్యాలు చాలావరకు ప్రస్తుత సమాజానికి నష్టం చేకూరుస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

                                    ◆నిశ్శబ్ద.