Read more!

ఒత్తిడులను అధిగమించకపోతే జరిగే నష్టమిదే...

సమస్య ఎదురవగానే మనస్సు దానిని అసలు గుర్తించదు. అది ఒక గదిలో జంబుఖానా క్రింద దుమ్మును దులపడం లాంటిది. నేలపై బాహ్యంగా ఏమీ కనిపించకపోయినా, జంబుఖానా క్రింద చాలా దుమ్ము ఉంటుంది. కానీ దుమ్మును ఆ విధంగా కప్పి ఉంచడం వల్ల గది అంతా ఎంతో పరిశుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే విధంగా, సమస్య ఉత్పన్నమైనప్పుడు, శిక్షణ లేని మనస్సు ఆ సమస్యను తనకు తెలియకుండానే చైతన్యయుతమైన మనస్సు నుండి బయటకు త్రోయాలని అనుకుంటుంది. అప్పుడా సమస్య జంబుఖానా క్రింది దుమ్ము లాగా అచేతనమైన మనస్సు పొరలలోకి వెళ్ళి, అక్కడ స్థిరపడుతుంది. ఆ సమస్య తీరిపోదు కానీ, జరిగేది ఏమంటే అది మన కళ్ళ ముందు ఉండదు, కనిపించదు. ఏ సమస్య అయినా సరే పై స్థాయిలో కనిపిస్తూ ఉంటేనే మనం దాన్ని పట్టించుకోగలుగుతాం.

కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే.. మనస్సు సమస్యలను ఎదుర్కోలేదు. ఎందుకు ఎదుర్కోలేదు అంటే.. సమస్యలను ఎదుర్కోవడం అంటే బాధాకరం కాబట్టి, సమస్యలు అంటేనే శారీరకంగానో.. మానసికంగానో.. భౌతికంగానో.. ఇబ్బంది పడటం. ఆ ఇబ్బందిని ఓర్చుకోవడం.. చాలామందికి అలా ఓర్చుకోవడంలో కష్టం, బాధ ఎదురవుతాయి. కాబట్టి సమస్యను ఎదుర్కోవడం మనిషికీ.. మనసుకు కూడా అసలు ఇష్టముండదు. కానీ సమస్య అలాగే ఉంటే ఏమి జరుగుతుంది?? అది అట్లాగే ఒక దొంతర కింద దాగిపోయి ఎప్పుడో ఆ దొంతర తొలగ్గానే దుమ్ము మురిగ్గా.. పరిసరాలను అపరిశుభ్రం చేసి, శ్వాసకు ఇబ్బంది కలిగించినట్టు సమస్య కూడా మనిషిని ఇబ్బంది పెడుతుంది.  

కానీ మనసు ఏమి చేస్తుంది??  సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవిక పరిస్థితులను ఆ విధంగా అణచి వేయడం వల్ల సమస్యల పట్ల మనకున్న భయాలు, అపోహలు మనస్సులోని అచేతనమైన పొరకు త్రోసివేయబడతాయి. అప్పుడు ఈ అచేతనపు పొరలలో ఉన్న అచేతన ప్రేరణలు, శక్తులు మనస్సును నియంత్రించడం ప్రారంభిస్తాయి. అప్పుడది సమస్య పరిష్కారాలను అన్ని రకాల పద్ధతుల ద్వారా వాయిదా వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ రోజు ఎన్నడూ రాదు.

సుదీర్ఘకాలం అట్లాగే దాన్ని పరిష్కరించకుండా ఉంచితే చిన్న సమస్యలు కూడా క్లిష్ట సమస్యలుగా మారతాయనే విషయం మనస్సు మరచిపోతుంది. సమస్యలను పరిష్కరించడం ద్వారానే వాటిని అధిగమించగలం. ఒక సామెతలో చెప్పినట్లు, "సరియైన సమయంలో ఒక కుట్టు వేస్తే, తొమ్మిది కుట్లు వేయాల్సిన అవసరం రాకుండా నివారించవచ్చు" ఒక చిన్న నిప్పురవ్వను ఆర్పకపోతే పెద్ద మంట అవుతుంది. నిప్పురవ్వగా ఉన్నప్పుడు దాన్ని ఆర్పడం తేలిక. కానీ సరైన సమయంలో ఆ పని చేయకపోతే, అది ప్రజ్వరిల్లుతుంది. దీని ఫలితంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్య నుండి పారిపోవడం, అసలు చూడకుండా ఉండడం, లేదంటే వాయిదా వేయడం అనే స్వభావాన్ని మానేయాలి.

ఏదో ఒక భయంతో బయటకు చెప్పలేనిదాన్ని మనం తరచూ పూర్తిగా అణచివేసే ప్రయత్నం చేస్తుంటాం. ఉదాహరణకు నలుగురితో చెడుగా ప్రవర్తించడం మర్యాద కాదు కాబట్టి మన కోపాన్ని వ్యక్తపరచం. కానీ అది ఎంతకాలం కొనసాగుతుంది? ఏదో ఒక రోజున అంతా బట్టబయలవుతుంది. ఇతరులపై కోపం చూపలేకపోతే అది మన ఆరోగ్యాన్నే దెబ్బ తీస్తుంది. అది కడుపులో పుండునో, అధిక రక్తపోటునో, లేదంటే గుండె ఆగిపోవడాన్నో, గుండె పోటునో కలగజేస్తుంది. అందుచేత మన లోపల ఉన్న ఈ ఒత్తిళ్ళను అధిగమించడం నేర్చుకోవాలి. అది కూడా ఇతరులను నొప్పించకుండా.. మన అసంతృప్తులు ఇతరుల మీదకు వెళ్లకుండా మన ఒత్తిడులను అధిగమించాలి.

                                       ◆నిశ్శబ్ద.