ఆగస్ట్ 15 తేదీ వెనుక చాలామందికి తెలియని నిజం!

ప్రస్తుతం భారతదేశం ఎన్నో మతాలకు నిలయం. ఎక్కడినుండో వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటుంది. శరణార్థులకు భరోసా ఇస్తుంది, విదేశీ కంపెనీలకు వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికి వేదిక ఇచ్చింది, పొరుగువారిని ప్రేమించాలి అనే మాటను పాటిస్తుంది. అయితే ప్రపంచదేశాలతో అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్న భారతదేశం ఒకప్పుడు బానిసగా మారి ఉక్కు పిడికిళ్లలో చిక్కుకుని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడి చివరికి ప్రాణత్యాగాలు చేసి తన స్వేచ్ఛను సంపాదించుకుంది.

 

గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి కారణంగా స్వాతంత్ర్య సంబరాలను ఘనంగా జరుపుకున్న దాఖలాలు లేవు. ఈసారి మాత్రం దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా దేశం యావత్తు ఘనంగా వజ్రోత్సవాలు జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

ఎర్రకోట మీద భారతీయ జండాను ఎగురవేసి భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించే ప్రధానమంత్రుల ఆలోచనల్లో నాటి జవాహార్ లాల్ నెహ్రు నుండి నేటి ప్రధాని మోడీ వరకు అందరూ ఆగస్టు 15న కాకుండా జనవరి 26 నే స్వతంత్య్ర దినోత్సవాన్ని ప్రకటించే ఉద్దేశంలోనూ, అదే అసలైన స్వాతంత్ర్య దినమని భావిస్తారట. అయితే దీని వెనుక కారణం ఏమిటనేది పరిశీలిస్తే.

 

జవహర్ లాల్ నెహ్రు తన తండ్రి మోతీలాల్ నెహ్రు నుండి భారతజాతీయ కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరించారు. మోతీలాల్ నెహ్రూకు డొమినియన్ హోదా పట్ల ఆసక్తి ఉండేది. అయితే 40 సంవత్సరాల జవహర్ లాల్ నెహ్రూకు అది నచ్చలేదు ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. బ్రిటిష్ పాలన నుండి పూర్తిగా విడిపోవాలని ప్రతిపాదించారు. అప్పటి జాతీయ కాంగ్రెస్ సభ్యులయిన బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, అరబిందో మరియు బిపిన్ చంద్ర పాల్ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ ప్రతిపాదన కాస్తా భారతదేశ స్వతంత్ర్యాన్ని కోరుతూ డిమాండ్ గా ఏర్పడింది. ఆ తీర్మానం ఆమోదించబడిన కారణంగా 1930 జనవరి చివరి వారంను "పూర్ణ స్వరాజ్" గా నిర్ణయించింది. 

 

దీని ఆధారంగానే జనవరి 26 న స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భారతీయులను కోరింది. అంతకు ముందు 1929, డిసెంబర్ లో లాహోర్ లో రావి ఒడ్డున జాతీయ జెండాను ఎగురవేసిన సందర్భంగా "కాంగ్రెస్ అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటు చేయబోతోంది, స్వాతంత్య్రం కోసం పోరాడండి" అని పిలుపునిచ్చింది. అప్పటి నుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26 నే స్వతంత్రంగా జరుపుకునేవారు.

 

అనేక సంవత్సరాల పోరాటం తరువాత బ్రిటిష్ వారు భారతదేశం మీద తమ ఆధిపత్యాన్ని వదులుకోవలసి వచ్చింది. అప్పుడు భారతదేశానికి చివరి బ్రిటిష్ గవర్నర్ గా లార్డ్ మౌంట్ బాటన్ ఉండేవారు. జూన్ 30, 1948 నాటికి భారతదేశానికి అధికారం బదిలీచేయాలని అతనికి ఆదేశాలు వచ్చాయి. అయితే అది ఆలస్యమవుతుందని, పట్టులో ఉన్న భారతదేశ పోరాటాన్ని ఎక్కడ నీరుగారుస్తారో అని భారతదేశ సమరయోధులకు ఈ తతంగం నచ్చలేదు. భారత జాతీయ కాంగ్రెస్ వారు కూడా దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 

ఈ ఒత్తిడుల కారణంగా మౌంట్ బాటన్ బ్రిటిష్ వారికి ఇంత ఆలస్యం చేయడం వల్ల రక్తపాతం, అల్లర్లు పెరుగుతాయని సూచించాడు. 

 

ఆగస్ట్ 15 తేదీ వెనుక తిరకాసు!!
రెండవప్రపంచం యుద్ధంలో జపాన్ లొంగిపోయింది. అది కూడా ఆగస్ట్ 15 వ తేదీన లొంగిపోయిన కారణంగా అదేరోజును తాను భారతదేశానికి స్వతంత్ర్యాన్ని ప్రకటించడంలో నిర్ణయించుకున్నట్టు మౌంట్ బాటన్ తన మాటలలో వ్యక్తం చేశారు. అదికూడా మొదట ఆగస్ట్ లేదా సెప్టెంబర్ అనే ఆలోచనలో ఉన్నా కేవలం జపాన్ ప్రపంచ యుద్ధంలో లొంగిపోయి రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న కారణంగా దానికే మౌంట్ బాటన్ మొగ్గుచూపారు. అంటే భారతదేశం విషయంలో తాము ఓడిపోయినా భారతీయులకు ఇచ్చిన స్వాతంత్ర్య దినోత్సవ తేదీ విషయంలో తమ విజయాన్ని వ్యక్తం చేసుకున్నారు. 

 

బహుశా ఇదొక పైశాచిక ఆనందం కావచ్చు. భారతీయ ప్రజలకు కేవలం స్వేచ్ఛ దొరికిందనే ఆనందంలో ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు. దీనివల్ల భారతీయులకు నష్టమైతే ఏమి లేదు. కానీ తమ ఓటమిలో కూడా తమదే పైచేయి అనిపించుకున్న ఈ బ్రిటిషు వారి ఆలోచన తెలిస్తే మాత్రం అందరూ ఆగస్టును కాదని జనవరికే జైకొడతారేమో!!

-నిశ్శబ్ద