ఈ పనులు చేయండి.. అందరూ మీరు చెప్పిన మాట వింటారు..!

 

నేటికాలంలో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేలా చేయడం, తమ మాటను ఎదుటివారు ఆమోదించేలా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని ఎంతో లోతుగానూ, అంతకు మించి ఇగో తోనూ డీల్ చేస్తుంటారు.  ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుండి ఆఫీసులో కొలీగ్స్,  బాస్  వరకు ప్రతి ఒక్కరిని చాలా విషయాల దగ్గర డీల్ చెయ్యాల్సి ఉంటుంది.   ఏదైనా విషయంలో వాళ్లను ఒప్పించాలంటే  చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.  అయితే అలా కాకుండా మీరు మీ అభిప్రాయాన్ని ఇతరులు ఒప్పుకునేలా చేయాలంటే కొన్ని పనులు చేయాలి. అవేంటో తెలుసుకుంటే..

ఏదైనా ఒక విషయం మంచిదే అయినా దాన్ని చెప్పే పద్దతి సరిగా లేకుండా ఆ విషయాన్ని ఎవరూ ఆమోదించరు. కాబట్టి చెప్పాలనుకునే విషయాన్ని అర్థం అయ్యేలా, ఆకట్టుకునేలా,  దాని వెనుక ఉన్న  లాభాలు,  అందులో ఉన్న ప్రత్యేకత, దాని అవసరం అన్ని వివరంగా చెప్పాలి.  ఇలా చెప్తే ఎవరూ దేన్నీ కాదనరు.


ఎవరికి అయినా ఏదైనా చెప్పేముందు ఆ చెప్పాల్సిన వ్యక్తి ఎలాంటి వారో అర్థం చేసుకోవాలి.  వారి స్వభావాన్ని బట్టి విషయం చెప్పే విధానం మార్చాలి.


ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు చెప్తున్న విషయం పట్ల స్పష్టతతో ఉండాలి.  ఆ విషయం నుండి ఇంకొక విషయానికి డైవర్ట్ కాకూడదు.  ఇది చెప్పాలనుకున్న విషయాన్ని దారి మళ్లిస్తుంది.


ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు సమయం కూడా ప్రదాన పాత్ర పోషిస్తుంది.  ఎదుటి వ్యక్తి ఉన్న మూడ్ ను బట్టి విషయాన్ని వారు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడు ఎలాంటి విషయం చెప్పాలో అర్థం చేసుకోవాలి.


కొందరికి ఎక్కువ సేపు మాట్లాడితే నచ్చదు. కుటుంబ సభ్యులు అయినా సరే విషయాన్ని సాగదీసి సుత్తి కొట్టినట్టు చెబితే తల ఊపుతారు తప్ప విషయాన్ని బుర్రకు ఎక్కించుకోరు.  కాబట్టి చెప్పాలనుకున్న విషయాన్ని సింపుల్ గా, అర్థం అయ్యేలా,  తక్కువ సమయంలో చెప్పాలి.


 చెప్పే విషయం కేవలం మాటల ద్వారానే కాదు కొన్ని సార్లు శరీర హావభావాలు కూడా దానికి మద్దతు ఇస్తాయి. అయితే అతిగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు.  ముఖ్యంగా గొడవలకు సంబంధించిన విషయాలు అయితే చెయ్యి చూపించడం, వేలు చూపించడం,  ఎదుటి వ్యక్తిని ఇమిటేట్ చేసి చెప్పడం  లాంటివి చేయకూడదు.  దీని వల్ల చెప్పాలనుకున్న విషయం కూడా మళ్లీ వివాదానికి,  గొడవకు దారితీస్తుంది.


చెప్పే విషయం సరైనదేనా అని ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.  అది న్యాయబద్దమైనదైనా,  ఇతరులకు ఎలాంటి సమస్య తలపెట్టినది అయినా అప్పడు మాత్రమే దాన్ని ప్రస్తావించాలి. మంచి చెప్పే విషయం లేదా చేసే పని ఇతరులకు మంచి చేయకపోయినా చెడు తలపెట్టకూడదు.


                                            *రూపశ్రీ.