అనుభవం ఎలా వస్తుంది?

ప్రతి మనిషి తన జీవోతంలో ఏదైనా సాధించాలి అంటే అనుభవం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అనుభవం ఉన్న వారు పని చేసే విధానానికి, అనుభవం లేనివారు పనిచేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. స్వామి వివేకానంద లాంటి గొప్పవాడే అనుభవమే గురువు, అనుభవాల సారమే జీవితం అని అన్నారు. అయితే అనుభవం ఎలా వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అనుభవం అనేది దానికది వచ్చేది కాదు. అనుభవాన్ని సంపాదించుకోవాలి. ప్రతి పనీ ఒక అనుభవాన్ని పరిచయం చేస్తుంది. అందుకే చాలామంది తమపనులు తాము చేసుకోవాలి అని అంటారు. అంటే ఆ పని అనుభవం వ్యక్తికి పరిచయం కావాలని వారి ఉద్దేశ్యమన్నమాట. అయితే నేర్చుకునే అలవాటు ఉంటేనే అనుభవం వస్తుంది. మనిషి ఎలా బ్రతకాలో అనుభవమే నేర్పిస్తుంది. బోధనలు, శాస్త్రాలు అనేవి వినడానికే బాగుంటాయి. వినడం ద్వారా, చదవడం ద్వారా తెలుసుకునేది అవగింజ అంత మాత్రమే. అందుకే  భోధనల ద్వారా నేర్చుకోవడం కొంతవరకే సాధ్యమవుతుందని,  అన్నీ చదివిన వారికంటే అనుభవం ఉన్నవారు ఎన్నో రెట్లు మేలని విజ్ఞానవంతులు చెబుతారు.. ఒక పనిచేయటంలో అనుభవం ఉన్న వారికి ఆ పనిలో ఉన్న మెళకువలు అన్నీ తెలుస్తాయి. తద్వారా వారు ఆ పనిని త్వరగా చేయగలరు. అదే కొత్తగా ఆ పని చేయడానికి వచ్చినవారు చేసేటప్పుడు తడబడుతూంటారు. అనుభవం గలవారి వద్ద ఉంటే మనం ఆ పనిని త్వరగా నేర్చుకోవచ్చు. అలా కాకుండా వాడి దగ్గర నేను నేర్చుకునేదేమిటి నాకు నేనుగానే ఈ పనిని చేయగలను నేర్చుకుంటాను అనుకుంటే ఆ పనిని నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. అంతే కాకుండా కొన్ని కొన్ని సార్లు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయంలో మనకున్న అహం అనేది మనల్ని ఇబ్బందులపాలు చేస్తుంది.  అనుభవం అనేది ఒక పనిని మనం చేసినప్పుడో లేదా నేర్చుకున్నప్పుడో వస్తుంది. అంతేకానీ ఊరికే రాదు. మనం ఒక పనిని నేర్చుకుంటున్నపుడు ఆ పనిలో అనుభవం ఉన్న వారికి మన సందేహాలను చెప్పొచ్చు, వారి ద్వారా పరిష్కారాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఏ విషయంలోనైనా మంచి చెడ్డలు, లాభనష్టాలు దానికి సంబంధించిన అనుభవం ఉన్నవారికే తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు. అందువల్లే అనుభవాన్ని సంపాదించాలి. అనుభవం గలవారు చెప్పే మాటలు అప్పుడప్పుడూ కూడా వింటూ ఉండాలి. వారు అనుభవం కలవారు ఎందుకు చెప్తున్నారో అర్ధం చేసుకోవాలి.  పనిలోగానీ, ఉద్యోగంలోగానీ ఏ రంగంలోనైనా సరే అనుభవం సంపాదించటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటున్నాము మనం ఒక ఉద్యోగాన్ని మాని వేరే ఉద్యోగానికి వెళితే అనుభవం ఉందా అని అడుగుతారు. దానినిబట్టి మనకు ఉద్యోగం ఇవ్వాలా లేదా మనకు ఎంత జీతం ఇవ్వాలి అన్నది. ఆలోచిస్తారు. మనం ఒక పనిని లేదా ఒక ఉద్యోగాన్ని చేస్తున్నప్పుడు దానిని మనం వృధా చేయకుండా కాలాన్ని వృధాగా గడవకుండా అనుభవం సంపాదించటం కోసమే పని చేయాలి. అనుభవం కోసం, పనిలో నైపుణ్యత సంపాదించడం కోసం పనిచేస్తూ పోతే ఖచ్చితంగా గొప్ప అనుభవాన్ని సంపాదించుకున్నవారిగా ఎదుగుతారు. జీవితంలో కావలసినవి అన్నీ ఆ అనుభవమే సమకూర్చుకునేలా సహాయపడుతుంది.                                        ◆నిశ్శబ్ద.

సెప్టెంబర్ 13,  శుక్రవారం వెనక ఉన్న ఈ నమ్మకాల గురించి తెలుసా?

  చరిత్రలో ప్రతి తేదీకి ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది. వీటిలో కొన్ని మంచివి అయితే మరికొన్ని చెడ్డవి.  కొన్ని తేదీలు ప్రపంచ వ్యాప్తంగా,  మరికొన్ని కొన్ని దేశాలకు ప్రత్యేకంగా ఉంటే.. మరికొన్ని తేదీలు విషాదాన్ని,  చెడును సూచిస్తాయి. సెప్టెంబర్ 13, శుక్రవారం కూడా అలాంటిదేనట.  సెప్టెంబర్ 13,  శుక్రవారం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో చెడ్డ దినంగా పేర్కొంటున్నారు.  దీని వెనుక ఉన్న కారణాలేంటంటే.. సరిగ్గా గమనిస్తే కొన్ని భవనాలకు అసలు 13 సంఖ్యతో అంతస్తు ఉండదు. ఎందుకంటే 13 వ సంఖ్యను అశుభంగా పరిగణిస్తారు.  అందులోనూ 13వ తేదీ వచ్చిన శుక్రవారాన్ని అయితే మరీ అశుభప్రదమైనదిగా భావిస్తారు. భారతదేశంలో కాకుండా విదేశాలలో ఈ సెప్టెంబర్ 13వ తేదీ గురించి నమ్మకం ఎక్కువగా ఉంది.  ఇది పవిత్ర గ్రంథం బైబిల్ లో ప్రముఖంగా ప్రస్తావించబడింది. యేసు క్రీస్తు శుక్రవారం రోజునే సిలువ వేయబడ్డాడనే విషయం అందరికీ తెలిసిందే.. ఇదే విషయం బైబిల్ లో కూడా చెప్పబడింది. ఇది మాత్రమే కాకుండా ఆ నాడు చివరి విందులో 13 మంది ఉన్నారని,   ఈ 13మందిలో ఒకరు యేసును అప్పగించారని బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ కారణంగా 13 వ తేదీ అన్నా.. ముఖ్యంగా 13వ తేదీ వచ్చే శుక్రవారం అన్నా ఇష్టపడరు. రచయిత థామస్ విలియం లాసన్ 1907లో  రాసిన ఫ్రైడే ది 13త్ నవల కూడా ఈ మూఢనమ్మకం పెరగడానికి కారణంగా మారింది. ఇది మాత్రమే కాకుండా 1980లో విడుదల అయిన ఫ్రైడే ది 13త్ సినిమా కూడా ప్రజల్లో ఈ మూఢనమ్మకాన్ని మరింత బలపరిచింది. ఇది మాత్రమే కాకుండా ఫిన్లాండ్ లో సెప్టెంబర్ 13న వచ్చే శుక్రవారాన్ని జాతీయ ప్రమాద దినోత్సవంగా జరుపుకుంటారు.  తద్వారా ప్రజలు భద్రతా నియమాలను సరిగా పాటిస్తారు. ఇలాంటి అనేక కారణాల వల్ల సెప్టెంబర్ 13 వ తేదీ శుక్రవారం గురించి ప్రజలలో మూఢనమ్మకాలు చాలా ప్రబలంగా వ్యాపించి ఉన్నాయి. సామాన్య జీవితంలో పెద్దగా మార్పులు లేకపోయినా ఇప్పట్లో జరుగుతున్న సంఘటనలు ప్రజలలో ఈ మూఢ నమ్మకాలను మరింత పెంచుతున్నాయి.                                      *రూపశ్రీ.  

శారీరక స్థితి కలలకు కారణం అవుతుందా?

శారీరక ప్రవృత్తికి, అంటే వాత పిత్త శ్లేష్మ ధర్మాలకు, స్వప్నాలకు(కలలకు) సంబంధం  ఉంటుందని అధర్వణవేదం చెప్పింది. అంటే ఈ మూడు ప్రవృత్తులలో ఏదైన ప్రకోపించినప్పుడు అంటే ఎక్కువైనప్పుడు దాని ఫలితం కలలో వ్యక్తం చేయబడుతుంది. అలాగే శరీరంలో ఏవైన అంతర్గతంగా మార్పులు జరిగినప్పుడు ఆ మార్పులు కూడా కలలో కనిపిస్తాయి. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే శరీరంలో జరిగే మార్పులు సరిగ్గా గమనించుకునే మనుషులే తక్కువగా ఉన్నారు ఈ కాలంలో.  అతిభుక్త సిద్ధాంతం అని ఒకటి ఉంది. అది కూడా ఈ కోవకే చెందుతుంది. ఒక రోజు రాత్రి ఎప్పుడైన అతిగా తినడం వలన కడుపులో సంభవించే మార్పులు ఆరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు వచ్చే కలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఎక్కువగా తిన్న పదార్థాన్ని అరిగించుకోవడానికి, జీర్ణమండలం ఎక్కువ రక్తాన్ని రప్పించుకుంటుంది. ఇందువల్ల  మెదడుకు పోవలసిన భాగం తగ్గిపోతుంది. ఇది కలల మీద ప్రభావం పడటానికి కారణం అవుతుంది.   ఇంతవరకు బాగానే ఉంది, అయితే ఒకే రాత్రి ఒకే ఆహారం తిన్న నలుగురు వ్యక్తులకు నాలుగు రకాల కలలు ఎందుకు వస్తాయో అంటే….. నలుగురు తిన్నది ఒకే పదార్ధం, కలలు మాత్రం వేరు వేరు. దీని గురించి ఆలోచిస్తే ఆ కలలు కనిన రోజు ఉదయం సమయంలో  వారు ఆయా విషయాలను గురించి చర్చించడమో, ఆలోచించడమో, ఆసక్తి చూపడమో జరిగి ఉంటుంది. అందువల్ల అవి వారి వారి స్వప్న విషయాలుగా మారి ఉంటాయి. అయితే శారీరక స్థితి కలకు మూలం ఎలా అవుతుందో తెలుసుకుంటే…...  ఒక రోజు బాగా తీపి పదార్థాలు తిని నిద్రపోవాలి. పడుకోబోయే ముందు దప్పిక అయినా, మంచినీళ్ళు త్రాగవద్దు. అంటే ఎలాగైనా సరే దప్పికతో నిద్ర పోవాలి. అలా నిద్రపోయినప్పుడు తప్పకుండా కల వస్తుంది. ఆ కలలో మీరు నీటినో, చమురునో, రక్తాన్నో లేక మరొక ద్రవ పదార్థాన్నో త్రాగుతూ ఉంటారు. అంటే మనిషి శరీరానికి అవసరమైన దాహం అనేది కలలో అలా ప్రతిబింబిస్తూ ఉంటుంది. దీనిని బట్టి శారీరక స్థితి, దప్పికగొన్న స్థితి, కలకు మూలమవుతుంది అనే విషయం నిర్ధారిత మవుతుంది. అలాగే లైంగికంగా దాహంతో ఉన్న వ్యక్తి విషయంలోను, శారీరకంగా ఆరోగ్యవంతుడైన యువకుడు లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉంటే, ఆ విషయాలకు సంబంధించిన  కలలు కంటాడు. యువకులు తరుచు స్థలన స్వప్నాలకు గురి అవుతూ ఉంటారు. ఈ విషయం  తెలియనిదేం కాదు. శారీరక పరిస్థితి కల స్వభావాన్ని నిర్ణయించినా, కల ఎలాంటిది అనే  విషయాన్ని నిర్ణయించదు. కలలు మొత్తం మీద లైంగికాలే అయినా, అవి వేరు వేరు విధాలుగా ఉండవచ్చు. కలలకు శారీరక స్థితి ఆధారం అనడానికి మరొక కారణం కూడ చెప్పవచ్చు. మెదడులో కొన్ని ప్రదేశాలను ఎలెక్ట్రోడ్ తో గిలిగింతలు పెడితే కొన్నిసార్లు గిలిగింతలకు లోనైన వ్యక్తి కలగంటాడు. ఇది ఆ వ్యక్తి జాగ్రదావస్థలో ఉండగానే జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా పాతజ్ఞాపకాలు కలలో ఎందుకు పునరావృతం అవుతాయో వివరించవచ్చు. కలలు యాదృచ్ఛికాలని వీటికి మనోవైజ్ఞానిక ప్రాముఖ్యం ఏమీ లేదని, మెదడులో ఉద్దీపింపబడిన భాగాన్ని బట్టి ఆయా జ్ఞాపకాలు పునరావృతం  అవుతాయని చెప్పవచ్చు.  ఇలా మనిషి శారీరక స్థితిని బట్టి కలల ప్రభావం ఉంటుందని పరిశోధనల్లో నిరూపితమైంది కూడా.                                           ◆నిశ్శబ్ద.

ఈ ఐదు అలవాట్లకి దూరంగా ఉండండి

మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే మీ అనారోగ్యానికి ఈ అలవాట్లు కారణం అయి ఉండొచ్చు. సాధారణంగా, టాయిలెట్ బౌల్ మరియు మన ఇంటి ఫ్లోర్ అత్యంత మురికైన ప్రదేశాలుగా భావిస్తుంటారు. కానీ, అంత కన్నా అపరిశుభ్రమైన విషయాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ ఐదు అలవాట్లకు దూరంగా ఉండండి.   1 . బాత్రూం లో ఫోన్ వాడడం కొందరికి బాత్రూం లో ఫోన్ వాడడం అలవాటు ఉంటుంది. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందనే విషయం మీకు తెలుసా?  టాయిలెట్ సీట్లు, హ్యాండిల్స్, సింక్ మరియు కుళాయిలపై హానికరమయిన జెర్మ్స్ ఉంటాయి. వీటివల్ల మూత్రసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున, టాయిలెట్ లో మధ్య మధ్యలో ఫోన్ వాడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.   2 . హ్యాండ్ బ్యాగ్ తొలగించకపోవడం హ్యాండ్ బ్యాగ్ లు మరియు పర్సులు నిరంతరం మన చేతుల్లోనే ఉంటాయి. సాధారణ సమయంలో వాటిని ఉపయోగించడం వల్ల పెద్ద నష్టం ఏం ఉండదు. కానీ, బాత్ రూమ్ కి వాటిని మనకి తోడుగా తీసుకెళితే మాత్రం ఇబ్బందే. టాయిలెట్ కి వెళ్ళినపుడు ముందుగా హ్యాండ్ బ్యాగ్ ని అక్కడ ఉండే హుక్ కి తగిలించి వెళ్లడం బెటర్. తర్వాత బ్యాగ్ ని పై నుండి మరియు లోపల యాంటీ బాక్టీరియా క్లాత్‌తో తుడిచివేయడం మంచిది. తద్వారా హాని కలిగించే క్రిముల బారిన పడకుండా ఉండవచ్చు.   3 . షూస్ ఎక్కువ సేపు ధరించడం ఒక రీసెర్చ్ ప్రకారం దాదాపు 40 % షూస్ డయేరియా కలిగించే బ్యాక్టీరియా కలిగి ఉంటాయి. కాబట్టి ఆఫీస్ కి గానీ ఎక్కడికయినా వెళ్ళినపుడు మీ బూట్లు బయటే వదిలేసి వెళ్లడం మంచిది. అదే ప్రయాణంలో అయితే, ఒక శుభ్రమయిన సంచిలో తీసుకెళ్లడం బెటర్.   4 . రిమోట్ ని శుభ్రపరచకపోవడం మనం టీవీ రిమోట్ ని ఎక్కడ పడితే అక్కడ పడవేస్తాం. అయితే, రిమోట్ ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం వల్ల హానికారక బ్యాక్టీరియా నుండి ఉపశమనం పొందవచ్చు.   5 . స్పాంజిని సరిగ్గా పిండకపోవడం స్పాంజీలని వాస్తవానికి మనం ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటాం. అయితే అదే స్పాంజీలు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. కాబట్టి, స్పాంజీలని నెలకి ఒకసారి మార్చడమో లేదా వేడి నీటిలో ఉంచి పిండటమో చేస్తే క్రిముల బారి నుండి మనల్ని మనం రక్షించుకున్నవాళ్లమవుతాం.

ప్రతి మనిషి వినాయకుడి నుండి నేర్చుకోవలసిన విషయాలు

ఏకార్యాన్నైనా ప్రారంభించే ముందు ప్రథమంగా వినాయకుణ్ణి పూజించడం మన సంప్రదాయం. విఘ్నాలను తొలగించమని మానవులే కాదు దేవతలు కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారని పురాణాలు పేర్కొన్నాయి. వినాయకుణ్ణి పూజించడం వల్ల 'మహా' విఘ్నాత్ ప్రముచ్యతే మహా దోషాత్ ప్రముచ్యతే...' 'మహా విఘ్నాలన్నీ తొలగిపోతాయి, మహా దోషాలన్నీ అంతమై పోతాయి' అని 'గణపతి అథర్వశీర్ణోపనిషత్తు' వివరిస్తోంది. మదిలో తలచిన వెంటనే విఘ్నాలను తొలగించే దేవుడు. వినాయకుడు. అందువల్ల 'తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా దలచితినే హేరంబుని, తలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్' అంటూ వినాయకుణ్ణి ప్రార్థిస్తాం. ఎవరు ఏది కావాలని కోరుకుంటారో వారికి దాన్ని ప్రసాదించే సులభ ప్రసన్నుడు వినాయకుడు. సకల ఐశ్వర్యాలను కోరుకునేవారికి 'లక్ష్మీగణపతి'గా, సిద్ధులను  కోరుకునేవారికి 'సిద్ధగణపతి'గా విద్యలను కోరుకునే వారికి 'అక్షర గణపతి'గా... ఇలా గణపతిని ఏయే రూపాల్లో ఉపాసిస్తే  ఆయా ఫలితాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. విద్యార్థులకు ప్రియతముడు వినాయకుడు.  అందుకే జ్ఞానప్రదాత అయిన వినాయకుడు విద్యార్థులకు అత్యంత ప్రియతముడయ్యాడు. విద్యార్థులు వినాయక చవితి రోజున వినాయకుని ప్రతిమ ముందు పుస్తకాలను ఉంచి, తమకు విద్యాబుద్ధులను ప్రసాదించమని  'కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి. గణాధిప నీకు మ్రొక్కెదన్' అంటూ భక్తి శ్రద్ధలతో గణనాథుణ్ణి ప్రార్థిస్తారు. అయితే మనకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించమని అక్షర గణపతిని ప్రార్థిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. కానీ ఆ జ్ఞాననిధిని వృద్ధి చేయడానికి మన వంతు కృషి చేయాలి. ఏకాగ్ర చిత్తం..  ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆ జ్ఞానాన్ని శీఘ్రంగా పొందాలంటే ఏకాగ్ర చిత్తంతో అధ్యయనం చేయాలి. ఏకాగ్రత లేని మనస్సుతో ఎన్ని గంటలు శ్రమించినా, ఎన్ని రోజులు కృషి చేసినా అది వేడి పెనం మీద పడిన నీటి చుక్కలా వెంటనే ఆవిరైపోతుందే కానీ ఎంతోకాలం నిలవదు.  మనస్సును ఒక విషయంపై ఒక్క క్షణమైనా ఏకాగ్రం చేయలేకపోతున్నవారు ఏకాగ్రత అంటే ఎలా ఉండాలో వినాయకుని జీవితంలోని ఓ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. మహాభారత కథను ప్రపంచానికి అందించాలన్న ఆలోచన వ్యాసుడికి కలిగింది. 'నేను చెబుతుంటే ఈ మహాగ్రంథాన్ని వ్రాయగల సమర్థులెవరైనా ఉన్నారా?' అని బ్రహ్మను అడిగాడు. 'నీ సంకల్పాన్ని నెరవేర్చగల సమర్థుడు వినాయకుడు ఒక్కడే' అని బ్రహ్మ సలహా ఇచ్చాడు. వెంటనే వ్యాసుడు వినాయకుణ్ణి ప్రత్యక్షం చేసుకొని తన విన్నపాన్ని తెలిపాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. కానీ వ్యాసుడు, 'గణనాథా! నేను భారత కథను చెబుతూ ఉంటాను. మీరు ఆగకుండా వ్రాస్తూ ఉండాలి' అని షరతు పెట్టాడు. అందుకు వినాయకుడు కూడా "నేను ఒకసారి వ్రాయడం మొదలు పెడితే నా ఘంటం ఆగదు. కాబట్టి అలా ఆగకుండా కథను చెప్పాలి" అని షరతు పెట్టాడు. అందుకు వ్యాసుడు, 'నేను చెప్పినదాన్ని అర్థం చేసుకుంటూ 'వ్రాయాలి' అని వినాయకునికి మరో షరతు పెట్టాడు. ఒకరి షరతులకు మరొకరు అంగీకరించిన తరువాత వ్యాసుడు మహాభారత కథను చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాశాడు. ఆ విధంగా 'పంచమ వేదం'గా ప్రఖ్యాతి గాంచిన మహాభారతం మనకు లభించింది. వ్యాసుడు నిర్విరామంగా చెప్పిన భారత కథను అర్థం చేసుకుంటూ, నిరాటంకంగా వ్రాసిన వినాయకుని ఏకాగ్రతాశక్తి అనితర సాధ్యమైనది. ప్రశాంత చిత్తం.. జ్ఞాన సముపార్జనకు ఏకాగ్రచిత్తం అవసరమే..  అయితే  మనస్సును ఏ విషయంపైన అయినా ఏకాగ్రం చేయాలంటే ప్రశాంతత అవసరం. అలజడితో అల్లకల్లోలమైన చిత్తాన్ని ఏ విషయం పైనా నిమగ్నం చేయలేం. చంచలమైన మనస్సుతో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేం. దేవగణాలకు అధిపతిని నియమించాలని పార్వతీ పరమేశ్వరులు సంకల్పించారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి.. వీరిద్దరిలో ఎవరు సమర్థులో తెలుసుకోవాలని 'ముల్లోకాలలోని పుణ్యతీర్థాలను సందర్శించి, ఎవరు ముందుగా వస్తారో వారిని గణాధిపతిగా నియమిస్తాను' అని శివుడు ఓ పోటీ పెట్టాడు. ఈ విషయాన్ని విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై పయనమయ్యాడు. కానీ మూషిక వాహనంపై ముల్లోకాలను సందర్శించి రావడం వినాయకునికి అసాధ్యం. వినాయకుడు తన అసహాయతకు అలజడి చెందకుండా, మనోనిశ్చలతను కోల్పోకుండా ప్రశాంతంగా పరిష్కారాన్ని ఆలోచించాడు. 'తల్లితండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాల్లోని పుణ్యతీర్థాలను సందర్శించిన ఫలితం లభిస్తుంది. అన్న ధర్మసూక్ష్మాన్ని గ్రహించిన వినాయకుడు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేశాడు. ఆదిదంపతులు వినాయకుని బుద్ధి కుశలతకు సంతసించి, గణాధిపతిగా నియమించారు. పరిశుద్ధ చిత్తం..  మనస్సు ఏకాగ్రతను సాధించాలంటే ప్రశాంతచిత్తంతో పాటు  పరిశుద్ధచిత్తం అవసరం. అందుకు మనస్సులో ఎలాంటి వికారభావాలూ కలగకుండా జాగ్రత్త వహించాలి. అది బ్రహ్మచర్యాన్ని అభ్యసించడం వల్లనే సాధ్యమవుతుంది. ఒకసారి వినాయకుడు చిన్నప్పుడు ఆడుకుంటూ పిల్లిని కొట్టాడు. పిల్లికి ముఖంపై గాయమైంది. ఆట ముగించుకొని వినాయకుడు తన తల్లి పార్వతి దగ్గరకి వెళ్ళాడు. ఆమె ముఖంపై గాయాన్ని చూసి ఆశ్చర్యంతో 'అమ్మా! నీ ముఖంపై ఈ గాయం ఎలా అయ్యింది?' అని అడిగాడు. అందుకు పార్వతీదేవి, 'నాయనా! సర్వజీవుల్లో ఉన్నది నేనే. నువ్వు పిల్లి ముఖాన్ని గాయపరచడం వల్ల నా ముఖానికి కూడా గాయమైంది' అని చెప్పింది. సర్వజీవుల్లోనూ తల్లి పరమేశ్వరి కొలువై ఉందని తెలుసుకొన్నాడు వినాయకుడు. అలా సర్వజీవుల్లోనూ తల్లినే దర్శించిన వినాయకుని మనస్సులో ఎలాంటి అపవిత్ర భావాలూ కలిగేందుకు తావే లేదు. జ్ఞానసముపార్జనకు ముఖ్య సాధనాలైన ఏకాగ్ర చిత్తం, ప్రశాంత చిత్తం, పరిశుద్ధ చిత్రాలను ఆ వినాయకుడే ప్రసాదించగలడు. కాబట్టి ఆయన్ను శరణు వేడాలి.                                          *నిశ్శబ్ద.

నిజమైన ప్రేమకు అర్థం చెప్పే కథ!!

ఒక రాజు తను ఎంతగానో ప్రేమించిన భార్య మరణించింది. ఆయన ఆది తట్టుకోలేకపోయాడు. ఆమె తన ప్రాణంగా జీవించేవాడు. ఆమె మరణంతో అతను విలవిలలాడిపోయాడు. ఎన్నో ఏళ్ళు ఆమెనే తల్చుకుంటూ నిరంతర దుఃఖ స్రవంతిలో మునిగిపోయాడు. ప్రజల పాలనను, రాజ్యం యొక్క బాగోగులను మర్చిపోయాడు. ఎందుకంటే తన భార్య కంటే ముఖ్యమైనది, ఈ సృష్టిలో ఏదీ లేదని అతను భావించాడు. తిండి తిప్పలు మానేసి పిచ్చివాడిలా రోధిస్తూ ఉండేవాడు. ప్రజల పరిస్థితి దీనావస్థకు చేరుకుంది. శత్రువులు ఇష్టారాజ్యంగా దోచుకెళ్ళడం ప్రారంభించారు. సరైన సౌకర్యాలు లేక ప్రజలు అస్తవ్యస్తమైపోయారు. ఆ సమయంలో ఓ సాధువు పరిస్థితి గమనించి ఆ రాజు గారిని కలిశాడు.  "రాజా..... సుభిక్షంగా పాలించాల్సిన నీవే ఇలా అయిపోతే ఎలా?" అని అడిగాడు.  దానికి రాజు "ఈ రాజ్యం, ఈ ప్రజలు, ఈ సంపదలూ...... ఇవేవీ నా దుఃఖాన్ని దూరం చేయలేవు. నా రాణిని నాకు తిరిగి తెచ్చిపెట్టలేవు. ఆమె లేని ఈ జీవితమే వ్యర్థం. ఆమె కంటే ముఖ్యమైనది నాకేదీ లేదు" అని జవాబిచ్చాడు.  అందుకు సాధువు నవ్వి ఇలా అన్నాడు "ఓ రాజా.... ఇదంతా చూస్తుంటే.. నీ రాణిని నీవు నిజంగా ప్రేమించడం లేదేమో అనిపిస్తోంది! నీ ప్రేమ స్వచ్ఛమైనది కాదేమోననిపిస్తోంది…"అన్నాడు.  దానికి రాజు చాలా ఆగ్రహించాడు. "ఏంటీ. నాది స్వచ్ఛమైన ప్రేమ కాదా... ఏమి లేకపోయినా ఆమె జ్ఞాపకాలతో బ్రతికేయగలను. అయినా నాది  అని స్వచ్ఛమైన ప్రేమ కాదని మీరెలా అనగలరు?" అని అడిగాడు. దానికి సాధువు. "ఓ రాజా మీరు ఓ అందమైన, గుణవతి అయిన స్త్రీని మళ్ళీ వివాహం చేసుకోండి. ఒక  సంవత్సరం తర్వాత కూడా.... మీరిలాగే ఆమె జ్ఞాపకాలతో, దుఃఖంలో జీవిస్తున్నట్లు కన్పిస్తే...  అప్పుడు ఖచ్చితంగా మీ ప్రేమ ప్రపంచంలో కెల్లా స్వచ్చమైనదని అర్థం" అన్నాడు. రాజు తనది స్వచ్చమైన ప్రేమేననీ, దానిని నిరూపించడం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేననీ, మళ్లీ ఓ యువతిని వివాహం చేసుకోవడానికైనా సిద్ధమని సాధువుతో చెప్పి, కొంత కాలంలోనే ఓ అప్సరసలాంటి అనుకూలవతియైన వనితను వివాహమాడాడు. సంత్సరకాలం గడించింది. ఆ సాధువు మళ్ళీ ఆ రాజ్యంలోకి వచ్చి చూశాడు. ప్రజలంతా సర్వ సుఖాలతో, సుభిక్షంగా ఉండటం గమనించాడు. రాజు గారి దగ్గరికెళ్ళి చూడాలనుకున్నాడు. ఆ సాధువును చూడగానే ఆ రాజు  ఆనాడు తాను చెప్పిన మాటలను తల్చుకొని ఎంతో చిన్నబోయుడు. ఆ రాజు తన క్రొత్త భార్యతో, ఆనందడోలికల్లో మునిగి ఎంతో ఉల్లాసంగా ఉండటం సాధువు గమనించాడు. సాధువును చూడగానే రాజు ఇలా అన్నాడు. "స్వామీ.. నేను ఓడిపోయాను, నాది స్వచ్ఛమైన ప్రేమకాదని తెల్సుకొన్నాను. నేను మరో స్త్రీని పెళ్ళాడిన తర్వాత క్రమ క్రమంగా నా రాణి జ్ఞాపకాలను మరిచిపోయి ఆనందంగా ఉండగలిగాను...... కనుక నా రాణి పట్ల నాకు అంత స్వచ్ఛమైన ప్రేమలేదని తెలిసింది. నన్ను క్షమించండి" అని వివరణ ఇచ్చాడు.  దానికి సాధువు నవ్వుతూ "రాజా స్వచ్ఛమైన ప్రేమంటే ఒక వ్యక్తి కోసం కుమిలి కుమిలి రోధించడం కాదు, చనిపోయిన నీ భార్యని తలచుకుంటూ దుఃఖం అనే బానిసత్వంలో బంధీగా ఉండటం కాదు. నీవు నీ ప్రేమని. మరో వ్యక్తికి కూడా నిష్కల్మషంగా పంచగలిగావు. ఈ రాజ్య ప్రజల ప్రేమకు పాత్రుడవగలిగావు. నీ విధిని గుర్తించి మేలుకొని కర్తవ్యపాలన చేశావు. ప్రేమ కంటే బాధ్యత గొప్పది, బాధ్యత లేని ప్రేమ ఓ ఎండమావి లాంటిది. అయినా నీది స్వచ్ఛమైన ప్రేమే.  ప్రేమ అంటే స్వేచ్ఛ, ప్రేమ అంటే స్వచ్ఛత. ఎప్పుడైతే నీవు దుఃఖం, జ్ఞాపకాలు అనే బానిసత్వంలో ఉండినావో..... సమస్తం నీకు చీకటిగానే కన్పించింది. నీవు మళ్లీ మరో స్త్రీని నీ జీవితంలోకి ఆహ్వానించడంతో  ఆనందంగా గడపగలిగే మరో అవకాశాన్ని పొందగలిగావు. అప్పుడు నీవు దుఃఖంలో ఉండి అందరినీ సంతోషాలకు దూరం చేశావు. మళ్ళీ మరో ఆనందాన్ని వెదికి పట్టుకొని ప్రజలందరి సంతోషాలనూ తిరిగి తెచ్చి పెట్టగలిగావు. నిజమైన ప్రేమంటే ఆనందమే, నిరంతరం దుఃఖంలో ఉండటం నిజమైన ప్రేమకు నిదర్శనం కాదు. ఇతరుల కోసం ఏ త్యాగానికైన సిద్దపడటం, వారి కోసం జీవించడమే ప్రేమ అన్పించుకొంటుంది" అని సాధువు హితబోధ చేశాడు.                                       ◆నిశ్శబ్ద.  

పంచమవేదం అయిన మహాభారతం నుండి విద్యార్థులు ఏం నేర్చుకోవచ్చు..?

మహాభారతాన్ని పంచమవేదం అని అంటారు. ఇందులో ఉన్న పాత్రలు అనేకం.  ప్రతి పాత్రా ఇందులో ప్రత్యేకమే.. ప్రతి పాత్ర నుండి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. చిన్ననాటి నుండే పిల్లలకు మహాభారతం, రామాయణం, భగవద్గీత వంటివి చదవడం అలవాటు చేయాలని వీటి వల్ల పిల్లలలో వ్యక్తిత్వ విలువలు మెరుగవుతాయని పెద్దలు చెబుతారు.  మహాభారతం నుండి పిల్లలు చాలా సులభంగా అర్థం చేసుకోగల కొన్ని విషయాలు తెలుసుకుంటే.. లక్ష్యం.. అర్జునుడు అంటే అందరికీ ఇష్టం. ఒక లక్ష్యాన్ని సాధించడంలో అర్జునుడిని మించిన యోధుడు లేడని అంటారు. లక్ష్యం పై దృష్టి పెడితే అసాధ్యాలను అయినా సుసాధ్యం చేయవచ్చని అర్జునుడిని చూసి నేర్చుకోవచ్చు. జ్ఞానం.. ఎప్పుడూ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటేనే జీవితంలో మెరుగ్గా ఉండగలం. జ్ఞాన సంపాదన ఉన్నవారే విజయం సాధించవచ్చని మహాభారతం చెబుతుంది. కర్ణుడు.. కర్ణుడు మహాభారతంలో గొప్ప యోధుడు.  బాగా కష్టపడితే ఎలాంటి కష్టమైన పరిస్థితుల నుంచి అయినా బయట పడవచ్చని కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు.  సాధారణ వ్యక్తి నుండి ఒక  రాజ్యానికి రాజుగా ఎదిగిన తీరు అమోఘం. ఆకర్షణలు.. విద్యార్థులు చాలా విషయాలకు తొందరగా ఆకర్షితులు అవుతారు. కానీ ఆకర్షించే విషయాల నుండి దూరంగా ఉండాలని,  అలా చేస్తేనే తమ బాధ్యత తాము సంపూర్ణంగా నెరవేర్చగలరని  మహాభారతం చెబుతుంది. దుర్యోధనుడు.. మహాభారతంలో దుర్యోధనుడు చాలా చెడ్డవాడు.  నిజానికి దుర్యోధనుడు చెడు సావాసం వల్లే చెడ్డవాడిగా మారాడు. చెడు స్నేహాలు చేస్తే దుర్యోధనుడిలా చెడిపోతారని,  చెడు సావాసాలు పతనానికి దారి తీస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి. పాండవులు.. ఐకమత్యమే మహా బలం అని పిల్లలు చదువుకుంటూనే ఉంటారు.  పాండవులు అందరూ కలసి కట్టుగా ఉండటం వల్లే ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి విజయం సాధించారని అర్థం చేసుకోవాలి. ధర్మరాజు.. ధర్మరాజు ఉన్నత వ్యక్తిత్వం గలవాడు. వ్యక్తిత్వం మంచిగా ఉంటే మనిషికి విలువ కూడా అదే వస్తుందని ధర్మరాజు వ్యక్తిత్వం నుండి తెలుసుకోవాలి. దృఢ చిత్తం.. దృఢచిత్తం మనిషి ఏదైనా సాధించేలా చేస్తుంది.  దృఢచిత్తం వల్లనే పాండవులు అజ్ఞాతవాసం చెయ్యాల్సి వచ్చినా అందులో విజయం సాధించారని విద్యార్థులు తెలుసుకోవాలి. సహనం.. సహనం ఎంతటి కష్టాన్ని, బాధను అయినా అధిగమించేలా చేస్తుంది. సహనం కోల్పోకుండా ఉంటే విద్యార్థులు తమ జీవితంలో విజయాలు తప్పకుండా అందుకుంటారు. భీష్ముడు.. మహాభారతంలో భీష్ముడు చాలా కీలకం. మనసును ఎప్పుడూ చెప్పుచేతల్లో ఉంచుకోవడం భీష్ముడికే చెల్లింది.  అంత గొప్ప యోధుడు కూడా తన కర్తవ్యాన్ని ఏ నాడు నిర్లక్ష్యం చేయలేదు.                                                 *రూపశ్రీ.

మీరు వాడే సెంటుకీ ఉంటుందో వ్యక్తిత్వం!

  మన వ్యక్తిత్వం ఎలాంటిదో... మనం ఎంచుకునే వస్తువులు కొంతమేరకు ప్రతిబింబిస్తాయి. పెర్‌ఫ్యూమ్‌కి (perfume) కూడా ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. మన మనసుకి దగ్గరగా ఉన్న పరిమళాలనే ఎన్నుకొంటామని వాదిస్తున్నారు. Paul Jellinek అనే ఆయన ప్రాచీన గ్రంథాలన్నీ తిరగతోడి పరిమళాలను నాలుగు రకాలుగా విభజించారు.   AIR:-  నిమ్మ, జామాయిల్ వంటి చెట్ల నుంచి తయారుచేసే పరిమళాలు ఈ విభాగానికి వస్తాయట. ఇలాంటి పరిమళాలు మనలోని సృజనకు పదునుపెడతాయంటున్నారు. మానసికంగా దృఢంగా ఉండేవారు, నలుగురిలో కలిసే చొరవ ఉన్నవారు ఇలాంటి పరిమళాలను ఎన్నుకొంటారట. ఇలాంటివారు కొత్తదారులను వెతుకుతారనీ, తమ మనసులో మాటని నిర్భయంగా పంచుకుంటారనీ చెబుతున్నారు. ఇతరులని మందుకు నడిపించడంలోనూ, జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడంలోనూ వీరు ముందుంటారట. FIRE:- ముక్కుపుటాలు అదిరిపోయేలా ఘాటైన పరిమళాలు ఈ విభాగం కిందకి వస్తాయి. ఈ తరహా పరిమళాలను ఎన్నుకొనేవారు కొత్త కొత్త ఆలోచనలతో ముందకెళ్తుంటారు. కానీ ఒకోసారి తమ సామర్థ్యాన్ని మించిన లక్ష్యాన్ని ఎన్నుకొని భంగపడుతూ ఉంటారు. వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ... ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అనే పట్టింపు కానీ, ఇతరుల దృష్టిని ఆకర్షించాలన్న తపన కానీ వీరిలో కనిపించవు.   WATER:- గులాబీలవంటి సున్నితమైన పరిమళాలను ఇష్టపడేవారు ఈ విభాగానికి చెందుతారు. మానసికంగా ఎప్పుడూ సందిగ్ధావస్థలో ఉండేవారు ఇలాంటి పరిమళాలను ఇష్టపడతారట. వీరి స్వభావం, నిర్ణయాలు ఎప్పుడెలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. ప్రవహించే నీటిలాగా వీరు దేనినీ పట్టించుకోనట్లు కనిపించినా... తమ కుటుంబాలు, పిల్లలకు మాత్రం చాలా ప్రాధాన్యతని ఇస్తారట.   EARTH:- తియ్యటి పదార్థాలను పోలిన పరిమళాలు ఈ కోవకి చెందుతాయి. ఇలాంటి పరిమళాలను ఇష్టపడేవారు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారట. గాలిలో మేడలు కట్టడం వీరి స్వభావానికి విరుద్ధం. లోకాన్నీ, తన వ్యక్తిత్వాన్నీ ఉన్నది ఉన్నట్లుగా గ్రహించే నైపుణ్యం వీరి సొంతం. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు వీరు సదా సిద్ధంగా ఉంటారు. ఇవీ Paul Jellinek చేసి తీర్మానాలు. ఆయన చెప్పినంత మాత్రాన మనం వాడే పర్‌ఫ్యూమ్‌ ఖచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబిస్తుందని అనుకోలేం. ముఖ్యంగా మనలాంటి మధ్యతరగతి ప్రజలు 1+1 ఆఫర్‌ ఉందనో, కొత్త పెర్‌ఫ్యూమ్‌ మార్కెట్లోకి వచ్చిందనో, పక్కవాళ్లు కొనుక్కున్నారనో... పెర్‌ఫ్యూమ్స్ వాడేస్తుంటారు. కాకపోతే సరదాగా కాసేపు బేరీజు వేసుకోవడం కోసం పైన పేర్కొన్న లక్షణాలని చదువుకోవచ్చు.           

నేర్చుకోవడం కష్టమేమీ కాదు!

కొత్త విషయాన్నో కొత్త పనులనో నేర్చుకోవాలంటే కొంతమంది చాలా కష్టమని, తమ వల్ల కాదని చేతులెత్తేస్తూ ఉంటారు. అయితే ఆ కష్టమంతా బుర్రలో నిండిపోయిన ఒకానొక నిరాశాభావమే అనేది అందరూ తెలుసుకోవలసిన విషయం. కొందరు కొన్ని నేర్చుకోవాలంటే బహుశా ఆ పని పట్ల సమాజం నుండి కాస్త హేళన ఎదురవ్వడం కూడా ఆ పని నేను నేర్చుకోలేను అని చెప్పే సాకు కూడా కావచ్చు. మొత్తానికి ఏదైనా నేర్చుకోవడం కష్టమేమీ కాదు అయితే కావాల్సిందల్లా కొన్ని రకాల లక్షణాలు.  నేర్చుకోవడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి? లెర్నింగ్ ఈజ్ ఏ లైటింగ్ స్పాట్! నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఒకానొక కొత్త వెలుగును జీవితంలోకి తెస్తుంది. అది ఏదైనా కావచ్చు. నేటి కాలంలో కంప్యూటర్, అందులో బోలెడు కోర్సులు. సైకిల్ దగ్గర నుండి బైక్, కార్ వంటి వాహనాల డ్రైవింగ్, కుట్లు, అల్లికలు. ఫోటోగ్రఫీ ఇవి మాత్రమే కాకుండా ఇప్పట్లో గోల్డ్ మెడల్స్ తెచ్చిపెట్టే ఎన్నో రకాల గేమ్స్, ఇంకా డాన్స్, సింగింగ్ ఇలాంటి బోలెడు విషయాలు అన్నీ జీవితంలో ఎంతో గొప్ప మార్పును తీసుకొస్తాయి. అవన్నీ కూడా జీవితాల్లో ఎంతో ఉపయోగపడేవే. ఆసక్తి! ఆసక్తి మనిషిలో నేర్చుకోవాలనే తపనను పెంచుతుంది. ఇది క్రమంగా మనిషిని ధైర్యవంతులుగా మార్చుతుంది. ఊహాగానాలు, అపోహలు అన్నీ వదిలిపెట్టి ఆసక్తి ఉన్న విషయం వైపు మనసు పెట్టి ఆ దారిలో వెళితే నేర్చుకోవడం ఎంతో సులువు అనిపిస్తుంది. అవసరం! అవసరం మనిషిని అడ్డమైన పనులు చేయిస్తుందని ఎంతోమంది జీవితాలను చూసి అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు సరదాగా, ఇష్టంతో నేర్చుకున్న విషయాలే అవసరానికి పనికొస్తాయి. అవసరం ఉన్నప్పుడు నూరు ఆరైనా, ఆరు నూరైనా దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి లేకపోతే ఎన్నో అవకాశాలు, మరెన్నో ఉంనత శిఖరాలు చేజారిపోతాయని అనిపించినప్పుడు డూ ఆర్ డై అనే రీతిలో అనుకున్నది సాధించేవరకు వెనకడుగు వెయ్యనివ్వకుండా చేస్తుంది అవసరం.  పట్టుదల! పట్టిన పట్టు విడవకపోవడం గొప్ప లక్షణం. మొదలుపెట్టిన పనిని మధ్యలో విడవకుండా ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా దాన్ని పూర్తి చేయడంలో ఎంతో గొప్ప ఓర్పు ఉంటుంది. అంతేకాకుండా ఆ పట్టుదల అనేది జీవితంలో ఎన్నో విషయాల్లో ప్రేరణగా ఉంటూ మరిన్ని నేర్చుకునేందుకు సహాయపడుతుంది. విజయం కాదు నేర్చుకోవడమే! చాలామంది ఏదైనా ఒక విషయం నేర్చుకోగానే దాన్ని తాము సాధించిన విజయంగా భావిస్తారు. కానీ నేర్చుకోవడం అనే విషయంలో గెలుపు, ఓటమి అనేవి ఎప్పుడూ ఉండవు. అవి నేర్చుకోవడం లేదా నేర్చుకోవడాన్ని ఆపేయడం అనే భావనలో చూడాలి. అలా చూసినప్పుడు ఆటోమాటిక్ గా నేర్చుకున్నాం అనే గర్వం కానీ నేర్చుకోలేకపోయాము అనే నిరాశ కానీ దరిచేరవు. ఇంకా ముఖ్యంగా నేర్చుకోవడం అనేది ఎప్పుడూ కొత్త అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి ఆ విషయంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండచ్చు. సాధన సాధ్యతే సర్వం! నేర్చుకోవడం అనేది ఒక అనుభవపూర్వక ప్రక్రియ కాబట్టి ఆ వైపు సాధన అనేది  ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుంది. నేర్చుకోవడంలో ఆసక్తి, పట్టుదల, అవసరం, అన్నిటికీ మించి దాన్ని ఒక అనుభవాత్మక పనిగా భావించడం వంటివి బుర్రలో పెట్టుకుని ఫాలో అయితే  కష్టమంటూ ఏదీ ఉండదు.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

భక్తి అంటే ఏంటి?? భక్తి మంచిదేనా?? 

ఈ ప్రపంచమొక భక్తి సముద్రం.  ఆధ్యాత్మికత, ఆరాధన నిండి ఉన్న ప్రపంచంలో చాలా గొప్ప ప్రశాంత అనుభూతి పొందుతారు అందరూ. అయితే ఇదంతా కాయిన్ కు వన్ సైడ్ అన్నట్టుగా ఉంటుంది. ఇంకొక సైడ్ చూస్తే దేవుడు, ఆరాధన, భక్తి ఇవన్నీ చాలా కమర్షియల్ గా ఉంటాయి, ఇవి కాకుండా మరొక విభిన్నమైన కోణం కూడా ఉంది. అదే మూఢంగా అన్ని నమ్మేయడం.  భక్తి గొప్పది, ఆ భక్తిని కమర్షియల్ గా చేసి దాన్ని కృత్రిమం చేయడం ఒక పనికిమాలిన చర్య ఆయితే ఆ భక్తిని పిచ్చిగా అనుసరించడం కూడా అలాంటిదే. భక్తిలో మూఢం ఉంటుందా?? అది పనికిమాలిన చర్య అవుతుందా?? అనేది ఎంతోమందికి కలిగే సందేహం.  భక్తి!! భక్తి అనేది మనిషిని ఉన్నతుడిగా, ఆ దేవుడికి దగ్గరగా తీసుకెళ్లే సాధనం. దేవుడెక్కడున్నాడు ఆయన దగ్గరకు వెళ్ళడానికి భక్తి ఎలా సహకరిస్తుంది అనే అనుమానం వస్తే, దేవుడు మనం చూసే ప్రతి ఒక్క వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ(మనుషులు, జంతువులు, పక్షులు ఇలా అన్ని రకాల ప్రాణులు) ఉంటాడు. అన్నిటినీ సమానంగా చూసిననాడు అన్నింటిలో ఆ దేవుడు ఉన్నాడని తెలుసుకున్ననాడు అన్ని విషయాల పట్లా భక్తిగా ఉంటారు. నిజానికి భక్తిలో క్రమశిక్షణ, బాధ్యత ఉంటాయి. అవి జీవితాన్ని ఒక సమాంతర రేఖ మీద ప్రయాణించేలా చేస్తాయి.  నేటి భక్తి!! ఇప్పటి కాలంలో భక్తి ఎలా ఉంటుంది??  కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దేవుడి దగ్గరకు వెళ్లి దేవుడిని కూడా సరిగ్గా చూడకుండా నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇస్తాను అని కొన్ని అగ్రిమెంట్లు మొక్కుల రూపంలో డిసైడ్ చేసి అక్కడ ప్రసాదాలు మెక్కి, షాపింగ్ లు చేసి తిరుగుప్రయాణం చేయడం.  ఇంకా కొన్ని వేరే దారుల్లో దేవుడి పేరు చెప్పి అన్నదానాలు అంటారు, వస్త్రదానాలు అంటారు, ఎన్నెన్నో హడావిడి పనులు చేస్తారు కానీ అక్కడ దేవుడి కంటే కొందరు మాహానుభావులను పొగడటానికి లేదా కొందరి చేత పొగిడించుకోవడానికి చేసే పనులు ఎక్కువ. దేవుడి కార్యంలో దేవుడు తప్ప మిగతా అంతా హైలైట్ అవుతుంది. మరి అక్కడ భక్తి ఎక్కడుంది??  మరొక వర్గం వారు ఉంటారు. వాళ్ళు మరీ మూఢంగా ఉంటారు. భక్తి అంటే అన్నింటిలో దేవుడిని చూడటం అనే విషయం మరచిపోయి భక్తి పేరుతో అందరినీ హింసిస్తూ ఉంటారు. కులం, మతం, వర్గం, భక్తిలో హెచ్చు తగ్గులు అబ్బో చాలా ఉంటాయి. వీటి కోణంలో మనుషులు ఒకరిని ఒకరు తక్కువ, ఎక్కువ చేసి చూసుకుంటూ దేవుడి పట్ల విశ్వాసంతో ఉన్నామని అనుకుంటారు  కానీ అందులో భక్తి తప్ప మనిషిలో అహంకారం, కోపం, ద్వేషం, అసూయ వంటివి అన్నీ ఉంటాయి. అదే భక్తి అనుకునేవాళ్ళు మూఢులు. ఇంకా అనవసరంగా ఉపవాసాలు చేస్తూ తమని తాము హింసించుకునేవారు మరొక మూఢ వర్గానికి చెందినవాళ్ళు. అందుకే నిజమైన భక్తి అంటే అన్నింటిలో దేవుడిని చూడటం, గౌరవం, ప్రేమ, మర్యాద కలిగి ఉండటం అని అంటారు. మనిషి ఎలా ఉండాలి?? నేటి కాలంలో ఉండే ఒత్తిడిని జయించడానికి మనిషికి ఆధ్యాత్మికత, యోగ, ధ్యానం ఎంతో ముఖ్యమైనవి. అవన్నీ స్వచ్ఛమైన భక్తిలో ఉంటాయి. ఏమీ ఆశించకుండా దేవుడి మీద భక్తితో పూజ, దేవుడి పేరుతో దానం, దేవుడిని తలచుకుని ఎలాంటి తప్పులు చేయకుండా గడిపే జీవితంలో ఎంతో ప్రశాంతత దాగి ఉంటుంది. తప్పులు చేసి దేవుడా నా పాపాలు పోగొట్టు అని ముడుపులు చెల్లిస్తే ఒరిగేది ఏమీ ఉండదు. దేవుడికి కావాల్సింది ముడుపులు కాదు సాటి భూతదయ కలిగి ఉండటం, నిస్వార్థంగా ఇతరులకు సహాయపడటం. కాబట్టి నిజమైన భక్తి అంటే ఏమీ ఆశించకుండా ఉండటమే. ఇతరులను గౌరవిస్తూ ప్రేమించడమే.                             ◆వెంకటేష్ పువ్వాడ.  

గతాన్ని మార్చివేసే కథ!

అనగనగా ఓ కుర్రవాడు. అతనికి ఏ విషయమూ నచ్చేది కాదు. ఎవరూ సరైనవారిగా తోచేవారు కాదు. కాలేజి నుంచి ఇంటికి వచ్చేసరికి అతని మనసులో ఎంతో అసంతృప్తి. మదిలో ఎన్నో ఆరోపణలు. ఆ కుర్రవాడి తండ్రి, పాపం రోజంతా కష్టపడి ఇంటికి చేరుకునేవాడు. కాసేపు తన కుటుంబంతో కాలక్షేపం చేద్దామనుకునేవాడు. ఈలోగా కుర్రవాడు తన మనసులో ఉన్న అసంతృప్తినంతా వెళ్లగక్కేవాడు. పదే పదే ఆ పగలు జరిగిన విషయాలన్నింటినీ తండ్రితో పూస గుచ్చినట్లు చెప్పేవాడు. కుర్రవాడికి ఎంతగా సర్దిచెప్పినా ఊరుకునేవాడు కాదు.   కుర్రవాడి మనస్తత్వంతో తండ్రి విసిగిపోయాడు. కానీ ఏం చేసేది. ఎంతగా అనునయించినా కుర్రవాడు తన మాట వినడం లేదు సరికదా... జీవితం మీద అతని ఆరోపణలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తన బతుకు బతకడం మానేసి ఎదటివారి లోపాలనే అతను లెక్కపెడుతూ కూర్చుంటున్నాడు. ఆ కుర్రవాడని కనుక ఇలాగే వదిలేస్తే అతను ఎందుకూ పనికిరాకుండా పోతాడని తండ్రికి అర్థమైంది. దాంతో ఓ రోజు తన గురువుగారి దగ్గరకు వెళ్లి తన గోడునంతా చెప్పుకొన్నాడు.   కుర్రవాడి తండ్రి చెప్పిన మాటలను గురువుగారు చిరునవ్వుతో ఆలకించాడు. తర్వాత ‘నువ్వు రేపు ఉదయం నీ కొడుకుని నా దగ్గర విడిచిపెట్టి వెళ్లు. మళ్లీ సాయంత్రానికి వచ్చి అతన్ని తీసుకుపో!’ అని చెప్పాడు.   గురువుగారు చెప్పినట్లే తండ్రి తన కొడుకుని మర్నాడు ఉదయమే ఆయన ఆశ్రమంలో విడిచిపెట్టాడు. ‘బాబూ ఇవాళ మధ్యాహ్నం వరకూ నేను జపతపాలతో హడావుడిగా ఉంటాను. నువ్వు కాస్త ఆశ్రమంలో తిరుగుతూ కాలక్షేపం చేయి. మధ్యాహ్నం నీతో మాట్లాడతాను,’ అని తన గదిలోకి వెళ్లిపోయారు గురువుగారు.   గురువుగారి సూచన ప్రకారం కుర్రవాడు ఆశ్రమం అంతా కలియతిరగసాగాడు. యథాప్రకారం అతనికి అందులో చాలాలోటుపాట్లు కనిపించాయి. చాలామంది ప్రవర్తన కూడా అతనికి నచ్చలేదు. ఆ లోపాలన్నింటినీ గమనిస్తూ అతను మధ్యాహ్నం వరకూ గడిపేశాడు.   మధ్యాహ్నం గురువుగారు కుర్రవాడిని కలిశారు. ‘ఏం బాబూ నీకు ఇక్కడ ఎలా తోచింది!’ అని అడగడమే ఆలస్యం. తను చూసిన తప్పులన్నీ గురువుగారికి ఏకరవు పెట్టాడు కుర్రవాడు.   ‘మంచిది! నీకు ఇంత సునిశితమైన దృష్టి ఉందని నాకు తెలియదు. ఈ లోకం తీరుతో నువ్వు చాలా బాధపడినట్లు కనిపిస్తున్నావు. నీ బాధ తగ్గేందుకు నేను ఓ సరదా కథ చెబుతాను విను. పూర్వం అక్బర్ అనే రాజు ఉండేవాడు, అతని ఆస్థానంలో బీర్బల్‌ అనే మంత్రి ఉన్నాడు....’ అంటూ నవ్వు పుట్టించే ఓ అక్బర్‌ బీర్బల్‌ కథ చెప్పాడు. కుర్రవాడు ఆ కథని ఆస్వాదించినట్లే కనిపించాడు. కానీ ఓ పదినిమిషాల్లో మళ్లీ అతని మనసుకి ఏదో గతం గుర్తుకువచ్చిన మళ్లీ దిగాలుపడిపోయాడు. ‘అరెరే నువ్వు మళ్లీ దిగాలుగా కనిపిస్తున్నావు. ఉండుందు నీ మనసుని మళ్లీ గాడిలో పెడతాను. అందుకోసం ఓ సరదా కథ చెబుతాను విను. పూర్వం అక్బర్ అనే రాజు ఉండేవాడు, అతని ఆస్థానంలో బీర్బల్‌ అనే మంత్రి ఉన్నాడు....’ అంటూ ఇందాక చెప్పిన కథనే మళ్లీ చెప్పాడు గురువుగారు. రెండోసారి కూడా కుర్రవాడు ఆ కథని కాస్త ఆస్వాదించాడు. కానీ ఇంతకుముందే ఆ కథని వినేశాడు కదా! దాంతో కథ విన్న రెండు నిమిషాలకే అతని మనసు యథాస్థితికి చేరుకుంది. ‘అరెరే నువ్వు మళ్లీ దిగాలుగా కనిపిస్తున్నావు. ఉండుండు, నీకు కాస్త సంతోషాన్ని కలిగిస్తాను. పూర్వం అక్బర్ అనే రాజు ఉండేవాడు, అతని ఆస్థానంలో బీర్బల్‌ అనే మంత్రి ఉన్నాడు....’ అంటూ చెప్పిన కథనే మళ్లీ చెప్పాడు గురువుగారు. ఈసారి కుర్రవాడికి చిరాకెత్తిపోయింది. ‘మీకేమన్నా పిచ్చా! చెప్పిన కథనే మళ్లీ చెబుతారేంటి. ఒకసారి విన్న కథని వెనువెంటనే మళ్లీ ఎలా ఆస్వాదించగలను,’ అంటూ చిరాకుపడ్డాడు. కుర్రవాడి మాటలకు గురువుగారు చిరునవ్వుతో- ‘నాయనా ఒక చిన్న కథని మళ్లీ మూడోసారి వినడానికే ఇంత బాధపడుతున్నావే! నీ గతాన్ని అవతలివారు వందలసార్లు ఎందుకు వినాలి. నీ ఆరోపణలని పదే పదే ఎందుకు ఆలకించాలి. నీకు ఏదన్నా తప్పని తోస్తే ఖండించు, లేదా దాన్ని సరిదిద్దేందుకు నీకు తోచనిది చేయి. అంతేకానీ నిరంతరం నీకు కనిపించే ప్రతి చిన్న లోపాన్ని నీ భుజానికి ఎత్తుకొని ఎందుకు తిరుగుతున్నావు. నీ తోటివారికి కూడా ఆ బాధని రుద్దేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నావు. ఆ ప్రయత్నంలో నీ వ్యక్తిత్వాన్నే కోల్పోతున్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు,’ అని అడిగారు గురువుగారు. గురువుగారి మాటలకు కుర్రవాడి దగ్గర జవాబు లేకపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

సెక్స్ గురించి మీకు తెలిసిందేంటి.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది ఇదే!

భారతదేశంలో సెక్స్ అనే పదం ఎక్కడైనా పబ్లిక్ గా వినిపిస్తే చాలా పెద్ద చర్చలు, మరెంతో పెద్ద వార్తలుగా మారతాయి. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ఈ శారీరక సంబంధం గురించి అందరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పబ్లిగ్గా చర్చలు పెట్టడం వల్ల మార్పులు సాధ్యమవుతాయంటే ఇప్పటికి భారతదేశంలో ఎన్నో విషయాలు మార్పు చెంది ఉండాలి. వీటిలో లింగ సమానత్వం, అక్షరాస్యత, కనీస మానవహక్కులు మొదలైనవి తప్పనిసరిగా ఉండాల్సినవే. కాబట్టి మార్పు అనేది ఎప్పుడూ పబ్లిగ్గా మాట్లాడటం వల్లే రాదు.. చరిత్ర ఏమి చెప్పింది?? వాస్తవంలో ఏమి జరుగుతోంది?? వీటిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే కాలానికి తగ్గట్టుగా జరగాల్సిన మార్పులు ఏమిటి అనేది తెలుస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 9 వ తేదీని జాతీయ సెక్స్ డే లేదా లైంగిక సంబంధాల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి మనిషికి జీవితంలో తిండి, నిద్ర, నీరు వంటి కనీస అవసరాలు ఎలాగో అలాగే.. సెక్స్ కూడా ఒక కనీస అవసరం. వయసు వల్ల ఏర్పడే శారీరక స్పందనల నుండి శరీరాన్ని సహజస్థితిలోకి తీసుకురావడానికి సెక్స్ ఉపయోగపడుతుంది.  నిజానికి సెక్స్ అనే పదం విదేశీయులది అయినా దీన్ని కూడా కళాత్మకంగా చూపెట్టిన ఘనత భారతీయులకే దక్కింది. శృంగారం, సంభోగం పేర్లతో ఈ శారీరక అవసరం ఎన్నో వేల ఏళ్ల నుండి వ్యక్తుల మధ్య ఒక జీవనదిలా సాగుతోంది. పండితులు తృతీయ పురుషార్థంగా కామంను వర్ణించారు. ముఖ్యంగా వాత్సాయనుడు రచించిన కామసూత్రం, కొక్కోకుడు రచించిన కొక్కోక శాస్త్రం  మొదలైనవి వేల ఏళ్ల క్రితం నుండే ఉన్నాయి. కామసూత్రలో 64 విధాలుగా శృంగారాన్ని ఆ కాలానికే వర్ణించారంటే ఈ విషయం గురించి దేశ దేశాలు భారతదేశం నుండే ఎన్నో నేర్చుకున్నాయని చెప్పవచ్చు.  ఇవి అప్పట్లో రాజకుటుంబీకులు, పండితులకు మాత్రమే లభ్యమైనా క్రమంగా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి.  ఇకపోతే సెక్స్ అనేది ఆరోగ్యకరమైన సంబంధంగా కొనసాగితే అది ఎంతో గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ఒత్తిడి, శరీరం ఫిట్ గా ఉండటం దీని ద్వారా సాధ్యమవుతుంది. కేవలం పునరుత్పత్తికి ఇదొక మార్గమనే కోణంలో దీన్ని ఎప్పుడూ భావించకూడదు. ఇవి అర్థం చేసుకుంటే సెక్స్ అనేది ఎప్పుడూ బూతుగా కనిపించదు, అనిపించదు.                                      ◆నిశ్శబ్ద  

కృష్ణం వందే జగద్గురుమ్!

దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణ కొరకు యుగయుగాన తాను జన్మిస్తానని, ధర్మ సంస్థాపన కొరకు తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు చెబుతాడు. ప్రస్తుత మానవ సమాజానికి శ్రీకృష్ణుడు చెప్పిన ఎన్నో మాటలు వేదవాక్కులుగానూ, జీవితానికి గొప్ప మార్గాన్ని చూపే సూత్రాలుగానూ ఉంటాయి. ఒక్కసారి భగవద్గీత చదివిన వాడిలో ఎంతో పరివర్తన కలుగుతుంది. కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఎందుకంత గొప్ప గ్రంధమైంది?? అసలు కృష్ణుడు ఈ లోకాన్ని ఉద్ధరించడం ఎందుకు?? అసలు కృష్ణుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి??  చాలామంది కృష్ణుడి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఎక్కడైనా చూశారంటే మిగిలిన దేవుళ్ళకు మ్రొక్కినట్టు మ్రొక్కరు. ఏదో షోకేస్ లో బొమ్మను చూసినట్టు చూస్తూ పోతారు. ప్రజానీకానికి అందుబాటులో ఉండే తొందరగా అందరికీ చేరవేయబడే సినిమాలలో కృష్ణుడిని కేవలం స్ట్రీలోలుడిగానూ, మాయలోడిగానూ చూపించడం వల్ల ఏర్పడిపోయిన భావమేమో!! కానీ సమాజం మాత్రం దాన్నే నమ్ముతుంది. కానీ కృష్ణుడు ఈ ప్రపంచానికి, ఈ మానవలోకానికి చెప్పిన మాటలు ఏంటి?? తను చెప్పిన తత్వమేంటి?? జైలు గోడలు మధ్య పుట్టినవాడు, చిన్నతనంలోనే తల్లి చనుబాల రుచి చూడకుండానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైనవాడు, రాజ్యానికి రాజుగా రాజకుమారుడిగా పెరగాల్సినవాడు, గోకులంలో గోవుల మధ్య తిరగాడుతూ బ్రతికాడు. కృష్ణుడు సమస్తము తెలిసినవాడు అయినపుడు తన జీవితాన్ని గోకులానికి తరలించుకోవలసిన అవసరం ఏమైనా ఉందా?? కానీ కారణజన్ముడు కాబట్టి కర్తవ్యం నెరవేర్చాలి కాబట్టి వెళ్ళాడు. ఎంతో సాధారణ జీవితాన్ని గడిపాడు. మరి ఆయనను భోగవిలాసుడు అనడం తగునా?? ఉన్ననాడు, లేనినాడు ఒకటిగానే బ్రతికేవాడు ఉత్తముడు. 16,000 మందిని భార్యలుగా స్వీకరించి వారికి ముక్తి కలిగించాడే కానీ ఎవరితోనూ శారీరక సంబంధం అనేది లేదు కృష్ణుడికి. చేసిందంతా కృష్ణుడే, మహాభారత మహాయుద్ధమైన కురుక్షేత్రానికి కారణం ఆయనే అంటారు కానీ పేరుకుపోయిన చెడును నిర్మూలించే దృష్ట్యా చేపట్టిన లోకసంరక్షణ కార్యమది అనే విషయాన్ని అంగీకరించరు ఎందుకో!! గోవర్ధన పర్వతాన్ని ఎత్తినా, కాళీయుని పడగలపై నాట్యం చేసినా, మన్ను తిన్నా, వెన్న దొంగిలించినా, గోకులాన్ని పావనం చేసిన గోకుల కృష్ణుడు మధురను పునీతం చేయడానికి తరలిన తరువాత జరిగిన విషయాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.  కృష్ణుడు ఎప్పుడూ ధర్మం పక్కనే ఉంటాడు. ధర్మాన్ని గెలిపించడానికే కృష్ణుడు ఆవిర్భవించాడు. అందుకే పాండవులకు మద్దతు ఇచ్చాడు. కానీ అందరూ అంటారు, మాయవి పాండవుల వైపే ఉంటాడు అని. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి ఉద్దండులు కౌరవుల వైపు ఉంటే కృష్ణుడు పాండవులవైపున్నాడు అంటారు. కానీ భీష్ముడు అయినా, ద్రోణుడు అయినా కట్టుబడిన నియమాలచేత కౌరవసేన వైపు నిలబడి పోరాడారు కానీ వారెప్పుడూ పాండవులకె వత్తాసు పలికారు. ఇకపోతే శ్రీకృష్ణుని జీవితమంతా ఒక ఎత్తు అయితే భగవద్గీత బోధ మరొక ఎత్తు. అందులో ఏముంది అంటే జీవిత సారముంది. సగటు మనిషి తన జీవిత కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాలి?? ఎందుకు నెరవేర్చాలి?? అసలు మనిషి ఎలా బ్రతకాలి, యోగమంటే ఏంటి?? ధ్యానం అంటే ఏంటి?? కర్మలు అంటే ఏంటి?? కర్మలు మనిషిని ఎలా వెంటాడుతాయి?? మోక్షం ఎలా సాధ్యం?? దానికి ఆచరించవలసినదేమిటి?? ఇలా ప్రపంచంలో మనుషులందరూ తెలుసుకోవలసినదాన్ని  అర్జునుడికి చెబుతున్నట్టు చెబుతూ అందరికోసం చెప్పాడు. అది సమర్థవంతమైన గురువు లక్షణం కదా మరి!!  గురువెప్పుడూ తన శిష్యులను నిందించడు ఉదాహరణలు చూపిస్తూ పరోక్షంగా శిష్యుల మనసులోకి విషయాన్ని చొచ్చుకుపోయేలా చేస్తాడు. అందుకే కృష్ణుడిని బెస్ట్ మొటివషనల్ పర్సన్ అంటారు, ఇక భగవద్గీతను గొప్ప మానసిక విశ్లేషణా గ్రంధం అని అంటారు.  ఒకసారి గమనిస్తే కృష్ణుడు బాధపడుతున్న సందర్భం ఎక్కడా కనిపించదు. అలాగని విరగబడి నవ్వుతున్నట్టు ఎక్కడా ఉండదు. కేవలం పెదాల మీద సన్నని చిరునవ్వు పూయిస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితులలోనూ ఆ నవ్వు చెదిరిపోకుండా ఉంటుంది. అదే స్థిరత్వం అంటే!! కృష్ణుడు చెప్పేది అదే!! ఎలాంటి పరిస్థితిలో అయిన స్థిరత్వంగా ఉండాలని.                                           ◆నిశ్శబ్ద.

సంతోషం కావాలంటే స్విచ్ ఆన్ చేయాల్సిందే!

ప్రస్తుత జీవితం ఎట్లా ఉంది?? ప్రతిఒక్కరూ జీవితంలో సంతోషాన్నే కోరుకుంటారు. ఆత్మీయులు, స్నేహితులు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండు అని చెబుతూ ఉంటారు. కానీ సంతోషం ఏమి అంగట్లో దొరికేది కాదు. కాసింత డబ్బులిచ్చి తెచ్చుకోవడానికి. అయితే జీవితంలో సంతోషం ఉంటే ఆ మజా వేరు. చాలామంది అనుకుంటూ వుంటారు ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఎలానో?? అని. మరికొంత మంది ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఏదో ఒకటి చేస్తుంటారు. మరికొందరు స్నేహితులను కలుస్తూనో, కుటుంబసభ్యులతో గడుపుతూనో, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ విషయాల్లో లీనమవుతూనో ఉంటారు. కానీ ఎన్ని చేసినా సంతోషంగా మాత్రం ఉండరు. అవును మరి సంతోషం కోసం చేసే ప్రతి పనీ కేవలం తాత్కాలికం మాత్రమే. వర్షం కురిసినంత సేపే కురిసి మాయమవడం లాంటిదే ఈ సంతోషం కూడా. వర్షం తాలూకూ మట్టివాసనలా సంతోషం తాలూకూ జ్ఞాపకాలు కూడా కొన్ని మిగులుతుంటాయి అంతే.  సంతోషం కోసం వెతుకుతున్నారా?? కానీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే మీలో ఉన్న స్విచ్ ను ఆన్ చేయాలి మరి. ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో కానీ ఇదే నిజం. ప్రతి మనిషి తాను సంతోషంగా ఉండాలంటే మొదట తన ఆలోచన, తనకు తాను ప్రాధాన్యం ఇచ్చుకోవడం, తనకు సంబంధం లేని విషయాలను పట్టించుకోకుండా ఉండటం, తాను చేయవలసిన పనిని మనస్ఫూర్తిగా చేయడం వంటివి చేయాలి. పలితాన్ని గూర్చి, పరిధిని గూర్చి ఆలోచిస్తే మాత్రం మానసులో ఒకానొక కల్లోలం తెలియకుండానే మొదలైపోతుంది. వేగవంతమైన ప్రపంచంలో మనిషి చేస్తున్న తప్పేంటో తెలుసా?? చేసే ప్రతి పనిని ఆస్వాదించకపోవడం. కృత్రిమంగా ముందుకెళ్లిపోవడం. సరిగ్గా గమనించుకుంటే ప్రస్తుతం అందరూ రోజు చేస్తున్న పనులు కానీ, వృత్తి రీత్యా చేస్తున్న పనులు కానీ, తప్పక చేయాలనే ఉద్దేశంతోనో లేక, అవసరం కాబట్టి చేయాలనో లేక సంపాదన కావాలంటే చేయాలి కాబట్టి అనుకుని చేస్తూ ఉంటారు. 90% మంది ఇలా చేస్తున్నవాళ్లే. కాబట్టే చేస్తున్న పనిని ఆస్వాదించలేకపోతున్నారనేది వాస్తవం.  మరిప్పుడెం చేయాలి?? సంతోషానికి కావలసిందల్లా మనసు పాజిటివ్ గా ఉండటం మొదటి విషయమైతే, చేసే పనిని ఏదో మరయంత్రంలా కాకుండా ఆస్వాదిస్తూ, ప్రతిపనిలో ఉత్తమ పలితాన్ని ఇవ్వడానికి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ చేయడం.  చాలామంది ఏదో పెద్ద లాభం ఉన్న పనుల విషయంలో తప్ప మిగిలిన విషయాలను పెద్దగా పట్టించుకోకుండా అలా చేసేస్తుంటారు. కానీ ఒక్కసారి అలాంటి ధోరణి వదిలి ప్రతి పనిని అంటే కనీసం తినడం కావచ్చు, తాగడం కావచ్చు, వంట చేయడం కావచ్చు, ఆఫీస్ పనులు, ఇతరులను పలకరించడం, కనీసం నవ్వడం ఇలా బోలెడు విషయాలు ఉంటాయి. ప్రతి ఒక పనిని మనపూర్వకంగా చేయగలిగితే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. 90% అపజయం అనే మాట దరిచేరదు. ఒకవేళ అలాంటి పరాజయాలు ఎదురైనా చిరునవ్వుతో వాటిని స్పోర్టివ్ గా తీసుకోవడం అలవాటు అవుతుంది.  ప్రపంచం చిన్నదని కొందరు అంటారు.  కాదు పెద్దదని మరికొందరు అంటారు. అంటే చూసే విధానంలోనే ఏదైనా ఉంటుందనేది నిజమని ఒప్పుకోవచ్చు కదా!! అలాగే సంతోషాన్ని ఎక్కడినుండో తెచ్చుకొనక్కర్లేదు. ఒకరి నుండి దాన్ని పొందడానికి అస్సలు ప్రయత్నించకూడదు. సంతోషం ఎప్పుడూ మనతోనే, మనలోనే, మనం ఆస్వాదించడంలోనే ఉంటుంది. దాన్ని రుచి చూడాలంటే కావలసిందల్లా కేవలం మనసును స్విచ్ ఆన్ చేయడమే. అన్నిటినీ మనసుతో ఆస్వాదిస్తూ చేసుకుపోవడమే. అలా చేసినపుడు సంతోషం కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అదే మీ వెంట ఉంటుంది. ◆ వెంకటేష్ పువ్వాడ

అలోపతిని ఎక్కువగా వాడకండి!

దగ్గు, జలుబు, జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ మారే ఋతువులను బట్టి మనిషికి అంతో ఇంతో టచ్ ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటికి చాలా మంది కామన్ మెడిసిన్ గా కొన్ని టాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు. కొందరు ఇళ్లలో మెడికల్ కిట్ పేరుతో స్ట్రిప్స్ కొద్ది టాబ్లెట్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. కాస్త నలత అనిపించగానే చటుక్కున టాబ్లెట్ తీసి వేసుకోవడం, రిలాక్స్ అయిపోవడం కామన్ అయిపోతోంది ప్రతి ఇంట్లో. అయితే ఇలా మెడిసిన్ వాడటం ఎంతవరకు సరైన పని?? సీజనల్ స్టేటస్! మారే సీజన్ కు తగ్గట్టు వాతావరణానికి అలవాటు పడటానికి శరీరానికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయంలో శరీరంలో చోటు చేసుకునే ఇబ్బందికి తగ్గట్టు ఆహారాన్ని, అలవాట్లను కాస్త అటు ఇటు చేసుకోవడం వల్ల ఆరోగ్యం చక్కబడి శరీరం సెట్ అయిపోతుంది. అయితే అందరూ సీజనల్ ప్రోబ్లేమ్స్ అనగానే అడ్డమైన సిరప్ లు, టాబ్లెట్స్, ఇంకా ఎన్నోరకాల ఇమ్మ్యూనిటి బూస్టర్స్ తో ఏదేదో చెయ్యాలని అనుకుంటారు. అయితే అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే అనే విషయం చాలామందికి అర్థం కాదు. ఇమ్యూనిటీ వార్నర్! ఏదైనా జబ్బు శరీరాన్ని అటాక్ చేసిందంటే దాని అర్థం శరీరంలో చొచ్చుకుపోయిన ఏ బాక్టీరియా,  వైరస్  మీదనో శరీరం యుద్ధం మొదలుపెట్టిందని అర్థం. అలాంటి సమయంలో శరీరంలో జరిగే ఆ వార్ కి కాస్త కోపరేట్ చేస్తే అంతా సర్దుకుంటుంది. కానీ మందులు వేస్తే సహజమైన శరీర రోగనిరోధకశక్తి నశించిపోతుంది.  డోంట్ అట్టేన్షన్! ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేకున్నప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ తీసుకోమని చెబితే అసలు ఒప్పుకోకండి. కండిషన్ ఎంతో సీరియస్ ఉంటే తప్ప అలాంటి ఆలోపతి మందులను అల్లో చేయకూడదు. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మందులతో జబ్బును తగ్గిస్తూ పోతే శరీరం కూడా మందులకే రెస్పాండ్ అవుతూ చివరికి ఒక డ్రగ్ కు ఆడిక్ట్ అయిన పేషెంట్ లాగా మార్చేస్తుంది శరీరాన్ని.  ఫాక్ట్! ఇక్కడ అందరూ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే కృత్రిమ మందులతో శరీరాన్ని బలంగా మార్చాలని చూడటం ముమ్మాటికీ మూర్ఖత్వపు పని. అమెరికా వంటి దేశాలలో జ్వరం, జలుబు వంటి సమస్యలకు కూడా రెగులర్ గా వ్యాక్సిన్ తీసుకుంటూనే ఉండాలి. అక్కడ అది చట్టబద్ధం చేశారు కూడా. ఫలితంగా అక్కడి ప్రజలలో భారతీయుల కంటే ఇమ్యూనిటీ చాలా తక్కువ. కామన్ ప్రోబ్లేమ్స్! పైన చెప్పుకున్నట్టు సీజనల్ ప్రోబ్లేమ్స్ కానీ శరీరంలో మనం తీసుకునే ఆహారం వల్ల సత్వ, రజో, తమో గుణాలు అనబడే త్రిగుణాలు కానీ అస్తవ్యస్తం అయితే అది జబ్బులకు దారితీస్తుంది. అయితే వాటికి టాబ్లెట్స్ వాడటం వల్ల కొన్నిసార్లు అవి వ్యతిరేక ప్రభావం చూపించి చాలా సెరియర్ పరిస్థితులకు దారి తీస్తాయి కూడా. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అన్నిటికీ ఆలోపతి మందులను వాడటం ఆపెయ్యాలి.  ప్రకృతికి దగ్గరగా వుండే శరీరానికి అదే ప్రకృతిలో భాగం అయిన మొక్కల నుండి తయారు చేసే ఔషధాలు ఎంతో గొప్పవి. ఆయుర్వేదం అదే చెబుతుంది. పెద్ద పెద్ద సమస్యలకు ఆయుర్వేదం చాలా ఆలస్యంగా పలితాన్ని ఇచ్చినా అది పూర్తిగా జబ్బును నయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదమే బెస్ట్. ఆలోపతి మందులతో గేమ్స్ ఆడద్దు.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

మీ మనసును మర్చివేసే కథ

కొన్ని కథలు మనుషుల జీవితాలను, ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి. ప్రాంతాలు ఏవైనా సరే మనుషుల ప్రవర్తనలో అసూయ, ద్వేషం, కోపం వీటితోపాటు.. ప్రేమ, ఆప్యాయత కూడా ఉంటాయి. మనం ఏ కోణాన్ని చూస్తామో అదే మనలో నుండి వ్యక్తమవుతుంది కూడా..  మనిషి మనసుకు సంబంధించి ఓ కథ ఉంది.. ఇది ఒక చైనా దేశం కథ. వివాహానంతరం ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది. మొదటి ఆరు నెలలు అత్తాకోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. గోరంతలు కొండంతలై చివరకు కోడలు పుట్టింటికి పరుగెడుతుంది. అక్కడ ఆమె తండ్రిగారి స్నేహితుడైన ఒక డాక్టర్తో తన బాధల్ని వెళ్ళబోసుకుంటూ 'ఎలాగైనా మా అత్త మరణిస్తే గాని నాకు సుఖశాంతులుండవు అని చెప్పింది. ఒకప్పుడు తన దగ్గర కూర్చొని ముద్దుమాటలతో చిలిపి చేష్టలతో ఆనందింపజేసిన ఆ చిన్నారిలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ రాక్షసత్వాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ డాక్టర్. తర్వాత ఇలా అన్నాడు. ' అమ్మా! నీ మీద ప్రేమతో ఈ పనిచేస్తున్నాను. ఒక మందు నీకిస్తాను. దానిని మీ అత్తగారికివ్వాలి. అది తీసుకున్న సంవత్సరం తరువాత ఆమె మరణిస్తుంది. వెంటనే చనిపోతే, అందరికీ అనుమానం రావొచ్చు. అప్పుడు మన పన్నాగం బయట పడుతుంది.  అందుకే ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా చంపే మందు ఇస్తున్నాను. ఒక సంవత్సరం నీవు ఓపిక పట్టాలి. అత్త ఎలాగూ చనిపోతుంది. కాబట్టి నీవు ఆమెను ఈ సంవత్సర కాలం పాటు ప్రేమగా చూసుకుంటూ సేవ చేస్తానని నాకు హామీ ఇవ్వు. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు” అన్నాడు.  అమ్మాయి సరేనని అంగీకరించింది. మందు తీసుకుని అత్తగారింటికి వెళ్లింది.  అత్తకు తినిపించి ప్రేమతో సపర్యలు చేయడం ప్రారంభించింది. అత్తకు అమితానందం. తన కోడలు చేసే సేవకు స్పందించింది. ఆమె చూపిన ప్రేమకు దాసోహం అయ్యింది. తనకు ఓపికలేక పోయినప్పటికీ కోడలికి చిన్నచిన్న పనుల్లో సహాయం చేయడం మొదలు పెట్టింది. కోడలిని తన సొంత కూతురిలా భావించింది. అప్పుడు కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంది. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ఆరు నెలలు గడిచాయి. కోడలు పుట్టింటికి వెళ్ళి మళ్ళీ ఆ డాక్టర్ని కలిసింది. ఆమె ముఖంలో విషాదం. గద్గద స్వరంతో ఇలా అంది. 'డాక్టర్! నేను ఓ పెద్ద తప్పు చేశాను. దేవతలాంటి మా అత్తను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాను. నా చేతులతో ఆమెకు విషం తినిపించాను. ఆరు నెలల్లో నన్ను ప్రేమించే నాదేవత నాకుండదు. ఆమెను ఎలాగైనా నేను రక్షించుకోవాలి'. ఈ మాటలు విన్న డాక్టర్ నవ్వి 'అమ్మా నేనిచ్చిన మందు, విషం కాదు. మీ అత్తగారికి ఏ అపాయంలేదు. అప్పుడు నీ మనసులో ఉన్నది విషం. ఇప్పుడది లేదు. మీ అత్తాకోడళ్ళ మధ్య ఈ ఆరు నెలల్లో నెలకొన్న ప్రేమానురాగాల ప్రవాహంలో ఆ ''విషం' కొట్టుకు పోయింది. మనసులో ఏ కల్మషం లేకుండా జీవించు' అన్నాడు. ఇది మనసు కథ, ప్రతి మనిషి కథ.                                       ◆నిశ్శబ్ద.

గురక పెట్టడానికి కారణాలు ఇవే!

మనిషికి అయిదుగంటల నిద్ర పెర్ఫెక్ట్! ఆరుగంటల నిద్ర ఆరోగ్యానికి చాలామంచిది. ఏడుగంటల నిద్ర కొంతమందిలో సమంజసమే! ఎనిమిది గంటల నిద్ర ఫరవాలేదు. పది గంటల నిద్ర మనిషిలో బద్దకాన్ని... నిస్సత్తువనూ... నిరాసక్తతనూ సూచిస్తుంది. పన్నెండు గంటల నిద్ర మనిషిలో తెలియని వ్యాధికి సంకేతం. అంతకుమించిన నిద్ర ఖచ్చితంగా అనారోగ్యమే!  మానసికంగా శారీరకంగా అలసిపోయిన మనిషి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటాడు. అలాంటప్పుడు మరోగంటో గంటన్నరో ఎక్కువ నిద్రపోవడం కూడా జరుగుతుంది. ఇది అతని శరీర అలసటను తెలియజేస్తుంది. ఇటువంటప్పుడు ఎంతసేపు లేపినా నిద్రలేవరు. శారీరకంగా ఉండే అలవాటు బాగా తగ్గిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే నిద్రలేచి తమ రోజువారీ కార్యక్రమాలను చూసుకుంటుంటారు. వీరు ఈవిధంగా రోజూ నిద్రపోరు. ఎప్పుడో.. ఏవారం పదిరోజులకో ఓసారి ఇలా నిద్రపోతుంటారు. ఇలా రోజూ నిద్రపోతుంటే మాత్రం అది క్రమేపీ బద్దకంగా మారిపోతుంది. ఆఫీసులో గుమాస్తాలుగానూ, ఆఫీసర్లగానూ, ఎగ్జిక్యూటివ్ గానూ పనిచేసి వారు మానసికంగా అలసిపోతుంటారు. ఇటువంటివారు అయిదారు గంటలపాటు నిద్రపోయేసరికి మైండ్ ఫ్రెషయ్యి ఉత్సాహంగా తయారైపోతారు. కాయకష్టం చేసేవారు అంటే  ముఠా కార్మికులు, రిక్షా కార్మికులు, చిల్లరవర్తకులు, వ్యవసాయ కార్మికులు వంటివారు శారీరకంగా అలసిపోతారు. ఇటువంటి వారు అదనంగా మరో అరగంటో గంటో నిద్ర పోతారు. ఇది సహజమే! బాగా అలసిపోయి. ఒళ్లు తెలియకుండా నిద్రపోయేవారు నిద్దట్లో తమకు తెలియకుండానే గురక పెడుతుంటారు. అయితే అలసటకు గురైనా గురికాకున్నా నిద్రపోయిన వెంటనే గురక గురక పెడుతుండటం సర్వసాధారణమే...! ఇది వారి అలసటను తెలియజేస్తుంది...! ఈ విధంగా గురక పెట్టడానికి కారణాలు అనేకంగా ఉంటాయి. మనం ముక్కుద్వారా, నోటిద్వారా గాలి పీలుస్తూంటాం. ఈవిధంగా గాలి పీల్చడానికీ, వదలడానికీ ఏదైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు మరింత బలంగా గాలిపీల్చి వదులుతుంటారు. ఈ క్రమంలో కొండనాలిక కింద భాగానికి ప్రెస్ అవ్వడం ద్వారా శబ్దతరంగాలు వెలువడుతుంటాయి. గురకపెట్టేవారు మామూలు మనిషికన్నా ఏడురెట్లు అధికంగా గాలిపీలుస్తారని వివిధ పరిశోధనల్లో తేలింది. గురక రావడానికి కారణాలు! గొంతు మరియు శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యేవారు ఎక్కువగా గురకపెడుతుంటారు. మనగొంతులోని "యువులా" అనేభాగం ఈ శబ్దతరంగాలను సృష్టిస్తుంది. ముక్కుకు సంబంధించిన క్రానిక్ కోల్ట్, సైనసైటిస్, డీవియేటెడ్ సెప్టెమ్ వంటి వ్యాధులకు గురైనవారు ముక్కుద్వారా గాలిపీల్చడం కష్టమై నోటిద్వారా గాలి పీల్చడం జరుగుతుంది. ఎక్కువ భాగం గురకలు నోటిద్వారా గాలిపీల్చడం వల్లే సంభవిస్తుంటాయి.  నోటిద్వారా గాలిపీల్చడం వల్ల 'గురక' ప్రారంభమౌతుంటుంది. గురకలు ముక్కు ద్వారానూ, గొంతుద్వారానూ కూడా వస్తుంటాయి. అయితే ముక్కుద్వారా వచ్చేగురక చిన్నశబ్దం చేస్తే గొంతుద్వారా చేసే గురక పెద్దశబ్దంతో వస్తుంది.  ముక్కు దిబ్బడ వేయడం, పొక్కులు ఉండటం, అతిగా జలుబు చేసి ముక్కువెంటనీరు కారుతుండటం, ముక్కు అట్టకట్టిపోవడం, లేదా ముక్కు దూలం వంకరకావడం వంటి కారణాలతో మనిషి నోటిద్వారా గాలి పీల్చడానికి ప్రయత్నిస్తాడు. నోటిద్వారా గాలి పీల్చడం  వల్ల సాధారణంగా ముక్కుద్వారా పీల్చే గాలికంటే ఎక్కువగాలిని పీల్చవల్సివస్తుంది. కావాల్సిన గాలికంటే ఎక్కువగాలి పీల్చి వదులుతున్నప్పుడు ఆ గాలి వేగానికి కొండనాలుక అడ్డుబడి గురకవస్తుందని చెబుతారు.  గురక పెట్టే  వ్యక్తికి తాను గురకపెడుతున్నట్లు తెలియదు. అయితే గురక పెట్టేవ్యక్తి చేసే శబ్దాలు వినేవారికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి!                                       ◆నిశ్శబ్ద.

చాణక్యుడి ఈ నాలుగు సూత్రాలు అన్ని సమస్యలకు సహాయపడతాయి..!!

చాణక్యుడి నీతి సూత్రాలు మన జీవితాలను సులభతరం చేయడంలో సహాయపడతాయి. ఎలాంటి సమస్యలు ఎదురైనా చాణక్యుడి నీతితో వాటి నుంచి బయటపడే మార్గాన్ని కనుగొనవచ్చు. విజయవంతమైన వ్యక్తిగా మారడానికి చాణక్యుడి సూత్రాలు సహాయపడతాయి. విజయవంతమైన వ్యక్తిగా మారడానికి ఏమి చేయాలో మీకు తెలుసా? ఆచార్య చాణక్యుడు తన నైతికతకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందాడు. అతను అర్థశాస్త్రంతో సహా అనేక ముఖ్యమైన రచనలను రచించాడు. అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా అతను సి. క్రీస్తు పూర్వం 376లో జన్మించినట్లు చెప్పారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త, గొప్ప పండితుడు. నైపుణ్యం కలిగిన రాజకీయ చతురత ద్వారా, అతను చంద్రగుప్త మౌర్య సామ్రాజ్య స్థాపన, విస్తరణలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయన ఆలోచనలు నేటికీ సంబంధితంగా ఉన్నాయి. చాణక్యుడి నీతిని అనుసరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయం సాధించగలడు. మీరు కూడా మీ జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలంటే, ఈ 4 విషయాలను ఖచ్చితంగా పాటించండి. 1. దానం: ఆచార్య చాణక్యుడు ప్రకారం దానధర్మాలు చేసేవాడు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ధార్మిక గ్రంధాలలో కూడా దానానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మనకు చేతనైనంతలో దానధర్మాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తే పేదరికం కూడా తొలగిపోతుంది. కాబట్టి, ఒక వ్యక్తి తన ఆర్థిక స్థితిని బట్టి దానం చేయాలి. దానం చేయడం వల్ల సంపద తగ్గదని ధార్మిక పండితులు కూడా చెబుతున్నారు. 2. ప్రవర్తన: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి అనుభవించే అన్ని రకాల సమస్యలు, బాధలు అతని ప్రవర్తన ద్వారా మాత్రమే తొలగిస్తాయని చెప్పాడు. ఒక వ్యక్తి మంచి నడవడికతో తనను తాను ఉన్నతీకరించుకోగలడు. ఇది వృత్తి, వ్యాపారంలో ఒక వ్యక్తికి కూడా సహాయపడుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలోని అన్ని రకాల కష్టాలు,  దుఃఖాలను తొలగిస్తుంది. 3. భక్తి: ఒక వ్యక్తి జన్మించిన క్షణం అతని విధి నిర్ణయించబడుతుంది. ఈ భవిష్యత్తు బాగుండాలంటే భగవంతుని ధ్యానించాలి. మతపరమైన కార్యక్రమాలలో మనం నిమగ్నమై ఉండాలి. ఇది ఒక వ్యక్తి యొక్క తార్కిక శక్తిని అంటే ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో, దేవుని ఆశీర్వాదం వ్యక్తిపై ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్న ప్రకారం, ఒక వ్యక్తి పై విషయాలను అనుసరిస్తే అతను మంచి జీవితాన్ని పొందుతాడు. అతను తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా, దాని నుండి బయటపడే మార్గాన్ని కనుగొంటాడు.  

మరణాన్ని తెలుసుకోవడం సాధ్యమేనా?

ఈ జీవితంలో మనిషిని వేధించే ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వాటిలో చాలా ప్రశ్నలకు మనిషి సమాధానాన్ని కనుక్కుంటాడు. కనుక్కోవడం అంటే కొత్తగా కనిపెట్టడం కాదు, ఎన్నో చూసి, చదివి, చర్చించి తెలుసుకుంటాడు. ఒక మనిషి పుట్టుకకు గర్భంలో నెలల కాలాన్ని నిర్ణయిస్తూ పుట్టుకను లెక్కిస్తారు. అయితే అందరికీ అంతు చిక్కని ప్రశ్నగా నిలబడేది ఒకటి ఉంటుంది. అదే మరణం. ఈ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా మరణాన్ని జయించడం కుదరదు. కనీసం మరణం ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయాలను కూడా ఎవరూ చెప్పలేరు. సైన్స్ పరంగా మనిషి జీవిత కాలాన్ని నిర్ణయిస్తున్నారు కానీ మరణాన్ని మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. అయితే అదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరొకవైపు మన భారతీయ యోగుల జీవితంలోకి వెళితే, వారి జీవనవిధానం, వారి యోగా శక్తి గురించి తెలుసుకుంటే మాత్రం మరణాన్ని కూడా నిర్ణయించగల అద్భుతాలు మన భారతీయ యోగులు అని అర్థమవుతుంది.  మునులు, సన్యాసుల గురించి వదిలేస్తే మన యువతకు ఎంతో ప్రేరణ అయిన స్వామి వివేకానంద కాలినడకన మన దేశం మొత్తం ప్రయాణం చేసారు. మన దేశం మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా పర్యటించి చాలా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా మనకు తెలిసిందే. హిందూ ధర్మాన్ని, భారతీయ తత్వాన్ని ప్రపంచదేశాలకు వ్యాప్తం చేసినవారు స్వామి వివేకానంద. ఈయన భారతీయ సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక, తాత్విక శాస్త్రాలను తన ఉపన్యాసాలలో ఎంతో గొప్పగా నేటి కాలానికి  చాటి చెప్పారు. విదేశాలలో మన భారతీయ ధర్మాన్ని నిస్సంకోచంగా, నిర్భీతిగా చెప్పినవారు ఈయనే. ఈయన తన  చివరి రోజుల్లో ఆశ్రమంలో గడిపేవారు.  అయితే స్వామీజీ ఒక రోజు పేపర్ మీద ఒక తేదీని రాసి తనతోపాటు ఆశ్రమంలో ఉన్న ఒక యోగికి ఇచ్చారు. ఆ యోగికి ఆ తేదీ గురించి ఏమి అర్థం కాలేదు కానీ ఆ రోజు రానే వచ్చింది, ఆ రోజున స్వామిజీ ధ్యానంలో కూర్చున్నారు. ఆయన్ను అందరూ ఎంత పిలిచినా పలకకపోవడంతో ఆశ్రమ వాసులు వచ్చి పరిశీలించారు.  అంతా పరిశీలించిన తరువాత చివరకు  స్వామీజీ పరమపదించారు అని తెలుసుకున్నారు. ఇలా స్వామి వివేకానంద తన మరణ తేదీని ముందుగానే తెలుసుకున్నారని అర్థం చేసుకోవచ్చు.  ఇక స్వామి వివేకానంద ధ్యానం చేస్తూ మరణించడం అనే విషయం వెనుక కారణం చూస్తే యోగులు ఎప్పుడూ తమ ప్రాణాన్ని ధ్యానంలో ఉండి వెన్నుపూస నిటారుగా ఉంచి, సహస్రారం ద్వారా ప్రాణాన్ని విడవాలని అనుకుంటారు.  నిజానికి ఇక్కడ ఒక విషయం అర్ధం చేసుకోవచ్చు. మనిషి ఎప్పుడూ శరీరాన్ని నాది అనే భావనతో ఉంటాడు. కానీ  ధ్యానంలో ఒక లెవెల్ దాటిన తర్వాత  ఈ శరీరం, నేను ఒకటి కాదని తెలుసుకుంటారు. అలా శరీరం ఆత్మ వేరు వేరు అనే విషయం తెలిసిన తరువాత చనిపోవడం అనే విషయం గురించి పెద్దగా బాధ ఉండదు. అలాగే గొప్ప తత్వవేత్త అయిన జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా తాను చనిపోయేమదు నేను ఇవ్వబోయే చివరి ఉపన్యాసం ఇదే అని ముందే చెప్పారు. అంటే ఆయనకు కూడా అధ్యాత్మికపరంగా తన శరీరాన్ని, తన ఆత్మను వేరు చేసి చూసే భావన స్పష్టంగా తెలిసింది కాబట్టి ముందుగా తన చివరి ప్రసంగాన్ని గురించి చెప్పారు. ఎలా తెలుస్తుంది? మరణం గురించి తెలుసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది.  అయితే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే దీన్ని తెలుసుకోగలం ఎందుకంటే ఇక్కడ ధ్యానం ద్వారా జరిగేది అంతర్గత ప్రయాణం.  బాహ్య ప్రపంచంలో మనిషి కోతిలాగా ఆలోచించినవాడు అంతర్గత ప్రపంచంలో తనని తాను స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు. తనని తాను తెలుసుకున్నప్పుడు తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఎలాంటి ఆలోచన లేకుండా చెప్పగలిగే యోగ శక్తి మనిషికి లభిస్తుంది.  అపనమ్మకం కాదు! మనిషి మరణాన్ని కూడా చెప్పవలగడం సాధ్యమేనా?? ఇదంతా ఒట్టి పిచ్చితనం అని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను నేను అని మెలుకువతో ఉన్నప్పుడు మనం అనుకుంటాం కానీ మనం గాఢ నిద్రలో నేను అనేది ఉండదు. నిద్రిస్తున్నామా చనిపోయామా అసలు ఎక్కడున్నామో కూడా మనకు తెలియదు కానీ ప్రపంచం అనేది అక్కడే ఉంటుంది. అక్కడే అంటే స్థిరంగా ఉంటడం. ఇక్కడ ప్రపంచం ఏమి మారదు కేవలం మనుషులు,మనుషులు చేస్తున్న పనుల వల్ల పరిసరాలు మార్పుకు లోనవుతాయి. ఎప్పుడైతే మెలుకువతో ఉన్నపుడు కూడా నేను అనేది ఉండదో అప్పుడు మనకు ఒక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. ఆ ప్రపంచంలో పుస్తకాలలో చదవని ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది పూర్తిగా చదివి, లేదా సినిమాల ద్వారా చూసి తెలుసుకునేది కాదు. ఇది పూర్తిగా అనుభవపూర్వక ప్రపంచం. అనుభవం ద్వారా ఎవరిది వారికి అర్థమయ్యేది.  పంచభూతాల కలయిక అయిన ఈ ప్రకృతి మనిషిని మాయలో ఉంచినప్పుడు మాత్రమే మనిషి ముందుకు వెళ్తాడు. ఈ ప్రకృతి, బాహ్య జీవితంలో జరిగే విషయలు అన్నీ ఒక నాటకం వంటిది అని తెలిసినప్పుడు మనిషి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడడు, అందుకోసమే యోగులు విరక్తి లో ఉంటారు.  అయితే ధ్యానం ద్వారా మనిషి తన జీవిత పరమార్థం తెలుసుకున్నప్పుడు తన జీవితాన్ని తన చేతుల్లోనే ఎంతో నిరాడంబరంగా ఆధ్యాత్మిక సాధనలో గడిపేసి చివరికి తన మరణాన్ని తాను తెలుసుకుని దాన్ని ప్రశాంతంగా ఆహ్వానిస్తాడు. ఇదీ మరణాన్ని తెలుసుకునే విధానం. అయితే ఇది కేవలం ధ్యానంలో ఎంతో లోతుకు, మెరుగైన స్థాయికి చేరి, ఈ బాహ్య ప్రపంచ వ్యామోహనికి అసలు లోనుకాకుండా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం!!                                 ◆వెంకటేష్ పువ్వాడ.