మూఢనమ్మకాలు వాటి ప్రభావం!
posted on Aug 10, 2024 @ 9:30AM
నమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు పునాది లాంటిది. మూఢనమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డగోడ లాంటిది. ప్రస్తుత సమాజంలో నమ్మకమనే పేరులోనే మూఢనమ్మకాలు పాటించేవారు చాలా మంది ఉన్నారు. దీనివల్ల వారికి మాత్రమే కాదు వారి చుట్టూ ఉన్నవారికి, చుట్టూ ఉన్న వారి జీవితాలకు కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది.
నమ్మకాన్ని నమ్మచ్చుకాని, మూఢనమ్మకాలను నమ్మకూడదు. మూఢత్వం అనేది అంత మంచిది కాదు. అసలు మూఢ నమ్మకాలు నమ్మడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అనే ప్రశ్న వేసుకుంటే అది ఎందుకూ పనికిరాదనే విషయం అర్థమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని వాటిని గుడ్డిగా నమ్మటం, ఎప్పుడో ఎవరికో ఏదో జరిగిందని ఆ పని చేస్తే ఇప్పుడు మనకు కూడా అదే జరుగుతుందని నమ్మడం, శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా ఉన్న విషయాలను విశ్లేషించకుండా, ఆలోచించకుండా పిచ్చితనంతో ఫాలో అయిపోవడం మొదలైనవాటిని మూఢనమ్మకాలు అంటారు.
మూఢనమ్మకాలను మన దగ్గరకి రానియ్యకూడదు. ఒకసారి మనం వాటిని నమ్మినట్లయితే అవి మనల్ని వదిలిపెట్టవు. ఏ పని మొదలు పెట్టాలన్నా భయమే. పిల్లి ఎదురొస్తే భయం, విధవరాలు ఎదురొస్తే ఏదో చెడు జరుగుతుందని భయం, ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు తుమ్మితే భయం, ఈ రకంగా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతున్నారు చాలా మంది. వాటి వల్ల మనకు ప్రయోజనం ఏమీ వుండదు. కొన్ని కొన్నిసార్లు మనకు పిల్లి ఎదురొచ్చినా మంచి జరుగుతుంది. అలాగే విధవరాలు ఎదురొచ్చినా మంచి జరుగుతుంది. తుమ్ము వచ్చినా అదేదో జలుబు వల్ల వచ్చి ఉంటుంది. కానీ అందరూ మాత్రం వాటిని కాదు, జరిగే నష్టాన్ని మాత్రమే కొండంత చేసి చూపిస్తారు. దాన్నే ఇంకొకరికి చెబుతారు కూడా.
కొన్నిసార్లు దేవుణ్ణి తలచుకుని వెళ్ళినా అనుకోకుండా చెడు జరుగుతుంది. ఇవన్నీ కామన్ ఇలా జరుగుతుంటాయి. వాటన్నింటిని పట్టించుకుంటే మనం మనశ్శాంతిగా వుండలేము అని ఎవరూ అనుకోరు. అట్లాగే ఏ పని చెయ్యాలన్నా ముందుకు రాకుండా భయపడుతూ వుంటారు.
ఈ మూఢనమ్మకాల వల్ల కొన్ని సార్లు అర్జంటుగా వెళ్ళవలసి వచ్చిన ప్రయాణాలను కూడా వాయిదా వేస్తుంటాము. తద్వారా మనం ఎంతో కొంత నష్టపోవలసి వస్తుంది. కాని మనం నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని మనం గుర్తించము. ఆ నష్టాన్ని గురించి కూడా ఆలోచించము. మనకు మూఢనమ్మకాల పైన వున్న అభిమానాన్ని, నమ్మకాన్ని మరింత పెంచుకుంటాము. వాటి ప్రకారం చేశామా?? లేదా అన్న విషయాన్నే మనం పరిగణనలోకి తీసుకుంటాం...! మనం ఒక పనిచేయాలంటే ఆ పని చేయడం వల్ల జరిగే మంచేమిటి చెడేమిటి అనే విషయం ఆలోచించాలి.
మంచి, చెడులు ఆలోచించుకొని ఆ పని చేయాలో, వద్దో నిర్ణయించుకుంటే సరిపోతుంది. అంతేకాని ఎవరో ఎప్పుడో ఆ పని చేస్తే వారికి నష్టం కలిగిందని ఇప్పుడు మనం చేస్తే కూడా నష్టం జరుగుతుందని చేయవలసిన పనిని చెయ్యకుండా మానేయటం మంచిది కాదు. దానిలో పిరికితనం కూడా పెంపొందుతుంది.
అన్ని వేళలా మనం మూఢనమ్మకాలను నమ్ముకుంటూ కూర్చుంటే అది మనకు అడ్డుగోడలుగా వుండి మన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. చాలా సందర్భాలలో జరుగుతున్నది ఇదే… అందుకే నమ్మకాలు ఎప్పుడూ మనుషుల్ని బలవంతులుగా మార్చాలి కానీ బలహీనులుగా చేసి అభివృద్ధికి అడ్డు పడకూడదు.
◆నిశ్శబ్ద.