ఫ్యూచర్ ఫేకింగ్.. చాలామంది జీవితాలు నాశనం అయ్యేది దీనివల్లే..!
posted on Jan 22, 2025 @ 9:30AM
ఫ్యూచర్ అంటే భవిష్యత్తు.. రేపు అనేది కూడా భవిష్యత్తు కిందకే వస్తుంది. రేపు అనేది ఎప్పుడూ బావుంటుంది. చాలా వరకు రేపటి గురించి పాజిటివ్ గానే ఆలోచిస్తారు. కానీ రేపు అనేది చాలా అందంగా ఉంటుందని నమ్మించి ఆ తర్వాత మోసం చేయడమే ఫ్యూషర్ పేకింగ్ అని పిలవబడుతోంది. చాలా వరకు ఈ ఫ్యూచర్ ఫేకింగ్ లో ప్రేమ, వివాహం బంధాలలో చిక్కుకున్న వాళ్లే బలి అవుతూ ఉంటారు. అసలు ఈ ఫ్యూచర్ పేకింగ్ కారణంగా ఎందుకు నష్టం జరుగుతుంది? దీని కారణంగా ఎవరు ఎలా బలి అయిపోతున్నారు తెలుసుకుంటే..
నువ్వు బాగా చదువుకుంటే నీ భవిష్యత్తు అందంగా ఉంటుంది. మంచి ఉద్యోగం వస్తుంది అని పెద్దలు పిల్లలకు చెబుతారు. ఇది పిలల్ల భవిష్యత్తును మంచిదిశగా తీసుకెళ్తుంది. కానీ ప్రేమించిన అమ్మాయితో అబ్బాయి భవిష్యత్తు గురించి ఆశ కల్పించి, భవిష్యత్తులో తనను చూసుకునే విధానం గురించి అందంగా, గొప్పగా చెప్పి వాస్తవ జీవితంలో ఆ అమ్మాయిని శారీరకంగా లేదా ఆర్థికంగా ఉపయోగించుకోవడం అనేది ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే అమ్మాయికి తన ప్రేమికుడు చెప్పిన మాటలన్నీ కేవలం ఆశ పెట్టడం కోసం చెప్పిన మాటలే తప్ప అవన్నీ వాస్తవంగా అతను చేయడు.
పైన చెప్పుకున్నట్టే.. వివాహం అయిన తరువాత భార్యను మభ్యపుచ్చి భార్యను ఇబ్బందుల పాలు చేసి, ఆర్థికంగా అయినా వేరే ఇతర విషయాలలో అయినా లాభపడే భర్తలు చాలామంది ఉన్నారు. భార్యకు భవిష్యత్తు గురించి ఆశను, సంతోషాన్ని ఎర వేసి భార్యను మోసం చేసేవారు ఉంటారు. ఇందులో భార్య నష్టపోవడమే కాకుండా భవిష్యత్తులో తనకంటూ ఎలాంటి సంతోషం లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది.
మనుషులకు రేపటి మీద ఆశ చూపడం, భవిష్యత్తులో అది చేస్తా, ఇది చేస్తా అని అబద్దపు వాగ్దానాలు చేసి వారు లాభపడిన తరువాత అవన్నీ వట్టి మాటలుగానే మిగిలిపోతాయి. ఇది కేవలం భార్యాభర్తలు, ప్రేమ వంటి స్థితులలోనే కాకుండా వృద్దులు, పిల్లలు కూడా ఈ ఫ్యూచర్ పేకింగ్ లో బలైపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే భవిష్యత్తు గురించి ఎవరైనా చేసే వాగ్థానాల కోసం వర్తమానంలో నష్టపోవడానికి ఎప్పుడూ సిద్దపడకూడదు.
*రూపశ్రీ.