వేమన జయంతి.. వేమన వాక్కులు.. జగతికి చుక్కానీ లు..!
posted on Jan 18, 2025 @ 9:30AM
విశ్వదాభిరామ వినురవేమ.. ఈ వాక్యం దాటి ఏ విద్యార్థి ముందుకు వెళ్లడు. పిల్లల నాల్కల మీద నాట్యం అడే తొలి పద్యాలు వేమన పద్యాలే.. ఎంతో సులువుగా ఉంటూ ఎంతో లోతైన విషయ సమాచారాన్ని తెలపడం వేమన పద్యాల విశిష్టత. వేమన 1367-1478 కాలాల మధ్య జీవించాడు. సి.పి బ్రౌన్ వేమన పద్యాలను పుస్తక రూపంలో అచ్చు వేయించడం ద్వారా వేమన పద్యాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అంతేనా.. సి.పి బ్రౌన్ వేమన పద్యాలను ఇంగ్లీషులోకి కూడా అనువదించాడు. పామరులకు అర్థమయ్యే భాషలు పద్యాలు చెప్పిన ప్రజాకవి వేమన. ఆటవెలది పద్యాలతో అందరిని మెప్పించిన వేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా యోగి వేమన గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే..
యోగి వేమన ఎంత ప్రాచీన కవినో అందరికీ తెలిసిందే.. అయితే ఈయన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈయన కులం నుండి ఈయన జన్మ వృత్తాంతం, కవిగా మారిన వైనం అన్నీ ఇప్పటికీ స్పష్టత లేకుండానే ఉన్నాయి. వేమన గురించి పరిశోధన చేసిన వారు ఒక్కొక్కరు ఒకో విధమైన విశ్లేషణ, ఒకో విధమైన కథనం అందించారు. అయితే వీటిలో వేమన వేశ్యాలోలుడి నుండి కవిగా మారిన కథనే చాలా ఆదరణ పొందింది. పైగా వేమన కవిగా మారిన విధానం, వేమన పద్యాల మకుటం గురించి కూడా స్పష్టత ఇస్తుంది.
వేమన కథ..
కొండవీటిని పరిపాలించిన కోమటి వేమారెడ్డి అసలు పేరు అనువేమారెడ్డి. ఈయన చిన్నతమ్ముడే వేమన్న. వేమన వదిన నరసాంబారాణి. వేమన ఒక వేశ్య వలలో చిక్కుకుంటాడు. వేశ్య ఏది అది కాదనకుండా ఆమె ముందు ఉంచేవాడు. ఒకరోజు వేశ్య తనకు రాణి అయిన నరసాంబారాణి ఆభరణాలు వేసుకుని సంతోషపడాలని ఉందని వేమనకు చెబుతుంది. వేమన వేశ్య మాటను కాదనలేక తన వదినతో ఆభరణాలు అడుగుతాడు. నరసాంబారాణి తన ముక్కుకు ఉన్న బులాకీ తప్ప మిగిలిన ఆభరణాలు అన్నీ వేమనకు ఇచ్చి పంపుతుంది. కానీ వేశ్య మాత్రం తనకు బులాకీ కూడా కావాల్సిందే అని పట్టుబడుతుంది. దీంతో వేమన బులాకీ కూడా అడుగుతాడు. అయితే నరసాంబారాణి తన బులాకీని ఇస్తూ నేను ఇచ్చిన ఆభరణాలు అన్నీ వేసుకుని నగ్నం ఉన్నప్పుడే నువ్వు ఆమెను చూడు అని చెప్పి పంపుతుంది. వేమన వేశ్యను అలాగే చూడగా అతనికి స్త్రీలు అంటే విరక్తి పుట్టింది. వెంటనే కోటకు వెళ్లిపోయాడు.
నరసాంబారాణి నగలను తయారుచేసే అభిరాముడు ఎప్పుడూ కోటకు ఆలస్యంగా వచ్చేవాడు. ఇది గమనించిన వేమన అతను ఎందుకు కోటకు వస్తున్నాడో తెలుసుకోవాలని అభిరాముడిని కంట కనిపెట్టాడు. అభిరాముడు దగ్గరలో ఒక కొండ గుహలో ఉన్న అంబికాశివయోగిని సేవించడం వేమన్న చూశాడు. అంబికాశివయోగి అబిరాముడితో రేపు రా నీకు మంత్రోపదేశం చేస్తాను అంటాడు. అయితే వేమన్న అంబికాశివయోగిని బంధించి అబిరాముడిలాగా కొండ గుహకు వెళతారు. యోగి వేమన్న చెవిలో మంత్రోపదేశం చేసి నాలుక మీద బీజాక్షరాలు రాస్తాడు. దీంతో వేమన్నకు పాండిత్యం లభిస్తుంది. అబిరాముడికి దక్కాల్సినది తనకు దక్కినందుకు వేమన పశ్చాత్తాప పడి అబిరాముడి కాళ్ల మీద పడి.. తను రాసే పద్యాల మకుటంలో అభిరాముడి పేరు చేర్చి అభిరాముడి పేరును చిరస్థాయిగా నిలిచేలా చేశాడు. ఇదీ వేమన వెనుక ఉన్న కథ.
యోగి వేమన గురించి తెలుగు సాహిత్యం చాలా గొప్పగా చెప్తుంది. తెలుగు కవులు, రచయితలు వేమన పద్యాల లోతును, పద్యాల విశిష్టతను తమ పరిశోధనలు, విశ్లేషణల ద్వారా తెలిపారు. వేమన గురించి, వేమన పద్యాల గురించి ఎన్నో పరిశోధనా వ్యాసాలు కూడా వెలువడ్డాయి. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నార్ల వెంకటేశ్వరరావు వేమన జీవిత చరిత్రను రాయగా అది 14 భాషలలోకి అనువాదం అయ్యింది. ఐక్యరాజ్యసమితి -యునెస్కో విభాగం వారు ప్రపంచ భాష కవులలో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను కూడా ఎన్నుకుని ఆయన పద్యాలను వివిధ భాషలలోకి అనువదించారు.
*రూపశ్రీ.