ఈ ఒకే ఒక్క గుణం మనిషి పతనానికి కారణం అవుతుంది!!
posted on Jan 21, 2025 @ 9:30AM
మనిషిని అధమ స్థితిలోకి నెట్టేసే దారుణమైన గుణం అహంకారం. అహంకారం గురించి కలిగిన నష్టాలను చరిత్రలో ఒకసారి పరికిస్తే.. మహాభారతంలో దుర్యోధనుడు స్వయంగా ఏమీ రాజ్యాన్ని సంపాదించుకోలేదు. కానీ కాలానుగుణంగా, వారసత్వంగా అధికారం సంప్రాప్తించింది. ఆ ఆధిపత్యం ఆయనలో అంతకు పదింతల అహంకారాన్ని తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ శకునుతో పాటు దుష్టులందరూ వచ్చి చేరారు. యువరాజుగా యౌవనంలో ఉన్న ఆయనకు గర్వం కళ్ళను నెత్తికెక్కించింది. ఇక నన్ను ఎదిరించేవారు ఎవరుంటారన్న అహంభావానికి మనస్సులో బీజం పడింది. అప్పటి వరకూ సోదరసమానులైన పాండవులతో అతను సఖ్యంగానే ఉన్నప్పటికీ ఆయనలోని అధికారమదం వారిపై విషభావనలను ఎగజిమ్మింది. ఫలితంగా పెద్దల మాటలను పెడచెవిని పెట్టాడు. సాక్షాత్తూ కాలస్వరూపుడైన భగవంతుడు ప్రత్యర్థిగా ఉన్నాడని తెలుసుకోలేనంత గర్వాంధకారుడయ్యాడు. తన బలగం, బలం అతి స్వల్పమైనా, దానినే దుర్యోధనుడు అత్యధికమైందిగా భావించాడు. పాండవులను హేళన చేశాడు.
ఒక్క యాదవుడిని, అదీ యుద్ధం చేయకుండా సారథిగా రథం తోలుతానన్న వాడిని నమ్ముకొని కురుక్షేత్ర రణరంగంలోకి కాలుమోపుతున్నారని అవమానపరిచాడు. 'తాత్కాలిక సంపదలను, వైభవాలను చూసుకొని పొగరుతో ఎదుటివారిని చులకన చేసే వారి సంపదలు చెదిరిపోవటమే కాకుండా, వారికి పూర్వుల నుంచి సంక్రమించిన వారసత్వ వైభవాలు కూడా సమూలంగా నాశనమవుతాయి' అని విదురుడు లాంటివారు హితవు పలుకుతారు. అయినా దుర్యోధనుడు తలబిరుసుతో దాయాదులతో సమరానికే సిద్ధ పడ్డాడు. ఫలితంగా రణభూమిలో అసువులుబాసాడు. తాత్కాలికమైన పేరు ప్రతిష్ఠలనూ, ధన, పరివారాలనూ చూసుకొని విర్రవీగే అవివేకులను హెచ్చరిస్తూ కాలమహిమను అభివర్ణిస్తూ శంకర భగవత్పాదులు ఇలా అన్నారు.....
మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల స్సర్వమ్ ।
మాయామయ మిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ॥
ధనం, పరివారం, యౌవనం ఉన్నాయని గర్వించకు. క్షణంలో కాలం వాటన్నింటినీ హరించివేస్తుంది. ఇదంతా మాయామయ మనీ, మిథ్య అనీ, అశాశ్వతమని గ్రహించి, జ్ఞానివై పరబ్రహ్మాన్ని పొందడమంటున్నారు. కాలవశాన సంప్రాప్తించినవి కాలంతోనే సమసిపోతాయని తెలుసుకోలేక, మనలో చాలామంది. అహంకారంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.
నిజానికి ఈ ప్రపంచంలో మనం సాధించామనుకుంటున్నవన్నీ మధ్యలో వచ్చి, మధ్యలోనే వెళ్ళిపోతాయి. అందం కావచ్చు, అందలం కావచ్చు ఏదైనా శాశ్వతంగా మనతోనే ఉండిపోదు. అలాంటి తాత్కాలికమైన తళుకుబెళుకులను చూసుకొని అహంకరిస్తే, అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు. మహా మహా సామ్రాజ్యాలే కాలగర్భంలో కలిసిపోయాయి. మగధీరులనిపించుకున్న మహారాజులే నేడు మౌనంగా సమాధుల్లో సేద తీరుతున్నారు. కాలమే మనందరితో భిన్నమైన పాత్రల్ని పోషింపజేస్తుందని తెలుసుకోలేక ఆయా స్థానాలతో విపరీతంగా తాదాత్మ్యం చెందుతున్నాం. వాటినే మన నిజ స్వరూపాలుగా నిర్వచించుకుంటున్నాం. తీరా అవి చేజారిపోయాక, విలపిస్తూ ఉన్నాం.
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే?... అంటాడు బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడితో!
పూర్వం ఎందరో రాజులు ఉన్నారు! వారికి ఎన్నో రాజ్యాలూ ఉన్నాయి! వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదను మూటకట్టుకొని పోలేదు కదా! ప్రపంచంలో వారి పేరు కూడా మిగల్లేదు కదా!
ఈ విషయం అర్థం చేసుకుంటే మనిషి జీవితం ఎంతో బాగుంటుంది.
*నిశ్శబ్ద.