డబ్బున్నవారు చేసే పెద్ద తప్పులివే.. చాణక్యుడు ఏం చెప్పాడంటే..

చాణక్యుడి గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఈయన చెప్పిన ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలి గానీ జీవితంలో వైఫల్యం అనేదే ఎదురుకాదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితాలు, వ్యక్తుల మద్య సంబంధాలు.. ఇలా ఒక్కటనేమిటి? ఎన్నో విషయాల గురించి చాణక్యుడు కుండ బద్దలు కొట్టినట్టు విషయాలను స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా డబ్బు చేతికి వచ్చినప్పుడు చాలామంది తమకు తెలియకుండానే కొన్ని, తెలిసి కొన్ని తప్పులు చేస్తారు. వీటి వల్ల  వ్యక్తుల దగ్గర డబ్బున్నా  ప్రశాంతత, సంతోషం అనేది మాత్రం అస్సలుండవట. మరికొందరు పతనానికి చేరుకుంటారట. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకుంటే..


డబ్బు చేతిలో ఉన్నప్పుడు చాలామంది తాము ఇబ్బంది పడిన రోజులను, బాధతో గడిపిన రోజులను మరచిపోతాడు. పూర్తీగా చేతిలో డబ్బుందనే మాయలో పడిపోతారు. ఇలా మరచిపోవడం,  కష్ట సమయాలను, బాధల్ని మరచిపోవడం, డబ్బు విషయంలో తప్పు పనులు చేయడానికి దారితీస్తుంది. దీనివల్ల మళ్లీ డబ్బు లేని స్థితికే చేరుకుంటాడు. సహజంగా ప్రతి ఒక్కరూ డబ్బులేనప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తారు. డబ్బున్నప్పుడు. డబ్బులోనే సంతోషాన్ని చూస్తున్నప్పుడు దేవుడిని పక్కన పెడతాడు.  ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొన్నిసార్లు తప్పు మార్గంలో కూడా వెళతాడు. ఇలాంటి వారు డబ్బును మధ్యలోనే పోగొట్టుకుంటారు. తిరిగి అశాంతికి, కష్టానికి, బాధలకు దగ్గరవుతారు.

కొంతమందికి డబ్బు చేతికి రాగానే అహంకారం వస్తుంది. కుటుంబ సభ్యులతోనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు.  అయితే పొరపాటున కూడా కుటుంబ సభ్యుల ముందు డబ్బు గర్వాన్ని చూపించకూడదు. డబ్బు ఈరోజు ఉండి రేపు పోవచ్చు. కానీ మరణం వరకు తోడుండే ఆత్మీయులు మాత్రం డబ్బు వల్ల దూరం అయితే మళ్లీ దగ్గరకు రావడం కష్టం.

డబ్బు సంపాదించడం మంచిదే కానీ డబ్బు సంపాదించడమే పరమావధి కాకూడదు. మరీ ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మరీ డబ్బు సంపాదించే పనులు ఎప్పుడూ చేయకూడదు.  అలాంటివారితో ఎక్కడా ఎవరూ బ్రతకలేరు. ముఖం మీదనే చెప్పి దూరం వెళ్లిపోతారు. అందుకే డబ్బుకోసం ఆత్మగౌరవం విషయంలో అస్సలు రాజీ పడవద్దు.

డబ్బు దండిగా ఉన్నప్పుడు అయినా, డబ్బు లేనప్పుడు అయినా ఒకే విధంగా ఉండే వాడే ఎప్పటికైనా జీవితంలో సఫలం అవుతాడు. డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చు చేస్తే అది చాలా తప్పు. కానీ డబ్బు ఉన్నప్పుడు అందులో కొంత భాగాన్ని మతపరమైన కార్యక్రమాలలో  వినియోగించడం ఉత్తమమని చాణక్యుడు చెప్పాడు. డబ్బు వృధా కంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతరులకు సహాయం చెయ్యడం చాలా మంచిది. దీని వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత చేకూరతాయి.

డబ్బు సంపాదించడం ధనవంతుడు కావడం  గొప్పే.. కానీ  ఆ డబ్బును ఇతరులకు హాని తలపెట్టడానికి ఉపయోగిస్తే మాత్రం పతనానికి చేరుకుంటారు. ఇలాంటి పనులవల్ల ఎంత గొప్ప ధనవంతుడు అయినా పేదవాడిగా మారిపోవడం ఖాయమని చాణక్యుడు చెప్పాడు.

                                          *నిశ్శబ్ద.