Read more!

మనిషికి, డబ్బుకు మధ్య సంబంధం!

“మనం డబ్బును సంపాదిస్తాం కానీ, డబ్బు మనల్ని సంపాదించడం లేదు కదా?” అని డాంబికంగా పలికేవారున్నారు. అనడానికైతే ఇలా అన్నప్పటికీ వారి జీవితమంతా డబ్బుకు దాస్యం చేస్తూనే వుంటారు. ఆ డబ్బుకై ఎవరినైనా ఆశ్రయిస్తారు. ఎంతైనా వేడుకుంటారు. లేనితనం వల్ల వీరిలా తయారైనారా అంటే అది నిజం కాదు, కేవలం ధనం మీద ఆపేక్షే వీరినిస్థితికి తెచ్చింది. అసలీ జీవితాన్ని ధనార్జనకు కాక మరొకందుకు వినియోగించే వీలుందనే ఆలోచన కలగదు.

మతాన్ని ఆశ్రయించామని, దైవారాధనకు అంకితమయామని ప్రకటించే వారిలో కూడా చాలా మందికి ధనమే దైవం వారు తలపెట్టే “మహత్కార్యా” లన్నిటికీ ధనం పోగుచేస్తుంటారు. ఎక్కడో వందలాది ఎకరాల స్థలం కొంటామంటారు. అక్కడ అనేకమందిని చేర్చి ఏదో విశ్వమానవ కల్యాణం సాధిస్తామంటారు.

మిగతా రంగాల్లో పనిచేసేవారు కూడా ఇలాంటి "లోక కళ్యాణ” పథకాలే రూపొందిస్తుంటారు. సినిమాలు తీసేవారు, సినిమాహాళ్ళు కట్టించేవారు. హోటళ్ళు నెలకొల్పేవారూ, మార్కెట్లోకి కొత్తపత్రికలు వెలువరించేవారూ, మార్కెట్లోకి కొత్త సబ్బు, విశిష్టమైన సూటింగ్ క్లాత్, చల్లటి కూల్డ్రింకు ప్రవేశ పెట్టేవారూ, అందరూ కూడా ప్రజాక్షేమం కాంక్షించే ఈ పనులు చేస్తున్నామంటారు. కానీ అందరికీ కావలసింది డబ్బే.

కానీ డబ్బు అక్కరలేనివారు అరుదుగా ఎక్కడైనా కనిపించవచ్చు. అలాంటివారు కోర్కెల్నీ, సంకల్పాలనూ దాటి వుంటారు. నీమ్ కరోలి బాబా అలాంటి యోగి. ఆయన ఇటు ఇహంలోను, అటు పరంలోనూ ఏక కాలమందు నివసించినట్లు ఉండేవాడని అంటారు స్వామీ రామా. బాబా ఎవరి పరిచయమూ కోరేవాడు కాదు. ఎవరైనా తన దర్శనార్థమై వస్తే, “నేను మిమ్మల్ని చూడడమైనది. మీరు నన్ను చూడడమైనది. ఇక వెళ్ళిరండి" అనేయడం ఆయనకు అలవాటు.

నైనిటాల్లో ఒకసారి బాబాతో కూచోనుండగా, భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన ఒక వ్యక్తి కరెన్సీ కట్టలతో బాబా వద్దకు వచ్చారని అంటాడు స్వామీ రామా.

" ఈ ధనమంతా మీకు సమర్పించడానికి తెచ్చానండీ" అన్నాడు ఆ ధనికుడు. 

బాబా ఆ నోట్లకట్టలను కిందపరిచి చక్కగా వాటి మీద ఆసీనుడయ్యాడు.

"కూర్చుకునేందుకు అంత మెత్తగా లేవు. వీటికన్నా దిండు నయం. నాకు చలిమంట వేసుకునే అలవాటు లేదు, పోనీ అందుకైనా ఉపయోగిద్దామంటే వీటినేమి చేయను?" అని అడిగాడు బాబా.

"అయ్యా ఇది ధనమండీ" అన్నాడు అతడు. 

బాబా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తూ "దీనితో కాసిని పళ్ళు కొనుక్కురండి. అందరం తినచ్చు" అన్నాడు.

"ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు గదండీ?” అన్నాడు అతడు.

"ఐతే మరి ఇది డబ్బెలా అవుతుందయ్యా. పండ్లు కూడా కొనలేని దీనిని నేనేమి చేసుకోను" అని, కాసేపు ఆగి "ఏమి కావాలని నావద్దకొచ్చావు" అన్నారు. 

"నాకు విపరీతమైన తలనొప్పి, భరించలేని బాధ" అని చెప్పాడు అతడు

"అది నువ్వు సృష్టించుకున్నదే, నేనేమి చేయగలను." అన్నారు బాబా. 

"అలా అంటే ఎలా మహాత్మా? మీరు నాకు సాయపడాలి.” అని వేడుకున్నాడు అతను.

అప్పుడు బాబా, “పోనీ పాపం” అనుకున్నట్లున్నారు..

“సరే ఇకనుండి నీకు తలనొప్పి ఉండదు పో, కానీ ఇవాళ నుండి నీవు ఇతరులకు పెద్ద తలనొప్పిగా రూపొందుతావు. నీ దగ్గర వెర్రి డబ్బు పోగవుతుంది. తద్వారా నీవు సమాజానికి గొప్ప శిరోవేదన కలిగిస్తావు, ఇక వెళ్ళు" అని పంపించేశాడు నీమ్ కరోలి బాబా.

ఆయన చెప్పినట్లే, ఆ ధనికుడు ఆరోగ్యవంతుడై, తన జీవన విధానంతో సంఘానికి గొప్ప “శిరోభారం" గా పరిణమించాడు. 

                                         ◆నిశ్శబ్ద.