క్షమించేద్దామా!!

తప్పు చేసిన వారిని, నొప్పించిన వారిని పెద్ద మనసుతో క్షమించడం ఎంతో గొప్ప విషయం. ఇది ఇప్పుడు చెబుతున్న మాట కూడా కాదు. ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుండి పెద్దలు చెబుతున్న మాట. ఇంకా చెప్పాలంటే మన పురాణాల నుండే ఈ క్షమాగుణాన్ని నలుగురికి తెలిసేలా చేయడం మొదలయ్యింది. 

ప్రతి మనిషి తన జీవితంలో ఎవరో ఒకరి వల్ల బాధపడుతూ ఉంటాడు. ఆ బాధలో నుండి కోపం పుట్టుకొస్తుంది. కోపంలో నుండి ఆ మనిషి మీద వ్యతిరేక భావం పుడుతుంది. ఆ వ్యతిరేక భావం కాస్తా శత్రుత్వంగా మారిపోతుంది. ఇలా ఒక నిర్దిష్ట దశలలో మనుషుల మధ్య ఏర్పడే గొడవలు, లేదా చిన్న చిన్న తగాదాలు క్రమంగా శత్రుత్వం వరకు దారి తీయడం అంటే మనుషుల మధ్య అర్థం చేసుకునే గుణం తక్కువ ఉందనే చెప్పాలి.

మాటా మాటా కారాదు తూటా!!

ఇంట్లో సాధారణంగా భార్యాభర్తలు, ఇంకా పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయితే ఏదో ఒక విషయంలో కచ్చితంగా గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవ ఎలాంటిదంటే ఒకరు ఎడ్డేమంటే ఇంకొకరు తెడ్డెమంటూ ఉంటారు. ఎవరో ఒకరు మాత్రమే కాస్తో కూస్తో ఆలోచించే మైండ్ సెట్ కలిగి ఉంటారు. అవతలి వాళ్ళ మొండితనం తెలిసి వాళ్ళతో ఇక వాదులాట ఎందుకు అని వదిలేయాలి. నిజానికి ఇలా వాధించే వాళ్ళతో, మనల్ని నొప్పించిన వాళ్ళను క్షమించేసేయ్యడం అంటే మనం తగ్గిపోవడం కాదు, అవతలి వాళ్లకి భయపడటం అసలే కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 

కాబట్టే ఏదైనా తప్పు జరిగినప్పుడో, గొడవ జరిగినప్పుడో మాటకు మాట పెంచుకుంటూ పోవడం కంటే దాన్ని మొదలులో తుంచేయడం మంచిది.

తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు!!

తప్పులు చేయడం అందరూ చేస్తారు. ఆ తప్పులను అందరూ గమనిస్తారు. అయితే ఆ తప్పులను అదేపనిగా ఎత్తిచూపేవారు కొందరు ఉంటారు. మూర్ఖుల లిస్ట్ లో ధీమాగా నిలబడదగిన వాళ్ళు వీళ్ళు. ఎప్పుడూ ఇతరులను చూస్తూ వాళ్ళ తప్పులు గురించి మాట్లాడటమే కానీ తాము చేస్తున్న తప్పులను విశ్లేషించుకునే తీరికా ఓపిక అసలు ఉండవు వీళ్ళకు.  ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటే బుర్ర పాడు అవ్వడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు.

క్షమించడానికి కావాలి కాసింత ఓర్పు, నేర్పు!!

నిజంగా నిజమే. ఎదుటి వారు నొప్పిస్తే దాన్ని మనసులో ఎంతో లోతుకు తీసుకుని వాళ్ళను తిరిగి ఏమి అనకుండా క్షమించడం గొప్ప విషయం. ఎదుటి వారి ప్రవర్తనను భరించడానికి, ఆ తప్పు తాలూకూ నష్టం మానసికం అయినా, ఆర్థికపరం అయినా దాన్ని భరించడానికి ఎంతో ఓర్పు కావాలి. తరువాత ఆ తప్పు తాలూకూ విషయాలు మళ్లీ మళ్లీ ప్రస్తావనకు తీసుకురాకుండా, అదే వ్యక్తులతో ఆ విషయం గురించి ఎలాంటి చర్చా లేకుండా గడపడమనే నేర్పు కూడా కలిగి ఉండాలి.

విలువ కోల్పోకూడదు!!

కొందరుంటారు. తప్పు చేసిన వాళ్ళను క్షమిస్తారు. అయితే ఆ ఎదుటి వారికి ఆ క్షమాగుణం గొప్పదనం అర్ధం కాదు. వాళ్ళేదో తోపు అయినట్టు. వాళ్లను ఏమీ అనలేమనే కారణంతో క్షమించిన వాళ్ళను తక్కువ చేసి చూస్తుంటారు. దీని పలితం ఎలా ఉంటుంది అంటే మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తూ, ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం అనుభవిస్తారు వాళ్ళు. కేవలం క్షమాగుణం వల్ల ఇలా సఫర్ అవ్వడం చాలా మంది జీవితాలలో గమనించవచ్చు కూడా. అందుకే ఆ క్షమాగుణానికి కూడా ఒక పరిధి అంటూ ఉండాలి. మాటి మాటికి తప్పులు చేస్తూ వాళ్ళు, వాళ్ళను క్షమిస్తూ ఎదుటివాళ్ళు ఇలా అయితే ఆ తప్పులు చేసేవాళ్ళు ఎప్పటికీ ఒక మంచి మార్గాన్ని తెలుసుకోలేరు మరియు దాన్ని ఫాలో అవ్వలేరు.

అందుకే క్షమించడం గొప్ప విషయం.  క్షమించేవారిని గౌరవించకపోతే ఎంతో పెద్ద తప్పు చేసినట్టే. 

◆ వెంకటేష్ పువ్వాడ

 

Advertising
Advertising