టీ తాగే సరైన విధానం మీకు తెలుసా?

 

టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే..

కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు.

టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది.

టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి.

టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి.

పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి.

టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.

                                               *రూపశ్రీ.

Teluguone gnews banner