డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనార్
posted on Dec 25, 2025 @ 10:10AM
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద బుధవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్వయంగా పర్యవేక్షించారు.
క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించిన సీపీ సజ్జనార్ సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూనే.. పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తో నేరుగా మాట్లాడిన ఆయన, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే ప్రభావం గురించి స్పష్టంగా వివరించారు. చదువుకున్న వారు కూడా బాధ్యత లేకుండా ఇలా వ్యవహ రించడం దురదృష్టకరమన్నారు.
న్యూ ఇయర్ మరియు క్రిస్మస్ సెలబ్రేషన్స్ నేపథ్యం లో గత వారం రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా ప్రత్యేక నిఘా, తనిఖీలు ముమ్మరం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 31 రాత్రి వరకు హైదరాబాద్ నగరమంతటా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ కొనసాగుతుందని సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఇందు కోసం అదనంగా ఏడు ప్లాటూన్ల బలగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పబ్‌లకు వెళ్లే వారు తప్పనిసరిగా డ్రైవర్ల ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్నారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని సిపి తెలిపారు.