ఆంధ్ర కురియన్, ఉక్కు కాకాని... మన మహనీయుడు వెంకటరత్నం
ప్రజాసేవే తన వృత్తి అని నమ్మి, జీవితమంతా ప్రజలతోనే, వారి సేవలోనే గడిపిన ఆదర్శ నాయకుడు స్వర్గీయ కాకాని వెంకటరత్నం. ఆయన మరణించి గురువారం (డిసెంబర్ 25) నాటికి సరిగ్గా 53 ఏళ్లు. అయినా ఆయన సేవలు నేటికీ ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ జనంస్మరించుకుంటూనే ఉన్నారు. దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలైన గ్రామీణ రైతు, కూలీ బంధువుగా వారికి చేయూతనందించిన ప్రజల మనిషి కాకాని వెంకటరత్నం. ప్రజానాయకునిగా అంచెలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి కాకాని వెంకటరత్నం. ప్రజా పోరాటాలలో నిమగ్నుడైన ఆయనను ‘ఉక్కు కాకాని’ అని ప్రజలు ప్రేమగా పిలుచుకున్నారు.
అసలు సిసలు ప్రజా నాయకుడైన కాకాని వెంకటరత్నం చనిపోయి ఐదు దశాబ్దాలకు పైగా అయినా ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకోవడమే కాక, ఆయన జ్ఞాపకార్థం కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయమంత్రిగా చేసిన కాలంలో ఆయన స్థాపించిన పాల సేకరణ కేంద్రాలు, శీతలీకరణ కేంద్రాలు, జిల్లా పాడి పరిశ్రమ కేంద్రాలు గ్రామీణ రైతాంగ ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడ్డాయి. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయి. అందుకే కాకానిని చాలా మంది ‘ఆంధ్రా కురియన్’గా పిలుచుకుంటారు. కుల మతాలకి అతీతంగా ఆలోచించటం, కార్యక్రమాలు చేపట్టటం ఆయన నైజం. ముఖ్యంగా బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లంటే కాకానికి ప్రత్యేక అభిమానం. స్థానిక పనుల కోసం ప్రభుత్వం మీద ప్రజలు ఆధారపడకూడదనీ, స్థానికంగా ప్రజలు సహకరించుకుంటే ప్రజాస్వామ్యం బలపడుతుందని కాకాని ప్రచారం చేసేవారు. ఆయనది ఎలిమెంటరీ స్కూల్ చదువే, అయినా ఎన్నో వేల మంది పెద్ద చదువులకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకుడయ్యారు.
ప్రతి గ్రామంలోనూ గ్రామస్తులే కొద్దో గొప్పో విద్యాలయాల అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేశారు. వ్యవసాయ శాఖ, పాడి పరిశ్రమ మంత్రిగా కాకాని ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు అమోఘం. గ్రామాల్లో పేదరికాన్ని, ముఖ్యంగా ఒంటరి మహిళ ఆర్థిక స్థితిగతులు మారాలంటే, వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాల కోసం పాడి, గుడ్డు ముఖ్యమని గమనించి, ఎన్నో చర్యలు తీసుకున్నారు. పాడి పరిశ్రమలో మధ్యవర్తుల బెడద పోతేగాని బీదరికాన్ని నిర్మూలించలేమని నిర్ణయించుకున్నారు.
గ్రామాల్లో ఆయన సాధించిన విజయాలు చూసి జమీందార్లు, ఎంతోమంది భూ కామందులు కలిసి కాకానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారు, ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక కాకుండా ప్రయత్నించారు. అయినా కాకాని ప్రజానాయకుడుగా పేరొందారు. తమ సిద్ధాంతాలని వ్యతిరేకించే కాకాని వెంకటరత్నం, రైతు కూలీలకు నాయకుడు అవ్వడం కమ్యూనిస్టులకి నచ్చలేదు. వాళ్ళ పార్టీ భవిష్యత్తు, మనుగడకే ఆయన ముప్పు అని భావించారు. కమ్యూనిస్టు పార్టీ కాకాని మీద కత్తి కట్టి, ఆయన్ని చంపే ప్రయత్నాలు కూడా చేసింది. అయితే వాళ్లెవరూ కాకాని లంచగొండి అని శంకించకపోగా, ఆయన కార్యదీక్ష, క్రమశిక్షణను మెచ్చుకున్న వాళ్లే.
కాకాని వెంకటరత్నం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కూడా 1972లో ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, యువకులకు ఏ విధంగా అవకాశాలు వస్తాయో చెప్పి, ఉద్యమాన్ని ఉధృత స్థితికి తీసుకువెళ్లారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాల్ని, వ్యతిరేకిస్తూ గన్నవరం విమానాశ్రమంలో ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు విమానం ఆగకుండా చేసినప్పుడు యువకుల మీద పోలీసులు జరిపిన కాల్పులను తట్టుకోలేక కాకాని చివరకు ప్రాణాలే విడిచారు.
కాకాని ఆశించిన ప్రత్యేక రాష్ట్రం 40 సంవత్సరాల తర్వాత వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలయినా ఇంతవరకు ఆయన జ్ఞాపకార్థం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ఆయన స్ఫూర్తి, స్మారణ చిహ్నం ఏర్పాటు చేయలేదు. అంతకు ముందెప్పుడో పెట్టిన కాకాని విగ్రహాన్ని కూడా తొలగించారు. విజయవాడలో ఆ సర్కిల్‌ని కాకాని పేరుతో కాకుండా బెంజ్ సర్కిల్ అనే పిలుస్తున్నారు. ఎట్టకేలకు కాకాని విగ్రహాన్ని బ్రిడ్జి కింద అతి కష్టం మీద మళ్లీ పెట్టారు, అదీ జిల్లా ప్రముఖుల పట్టుదల వల్ల. కనీసం ఈ 54వ వర్ధంతికైనా కాకాని వెంకటరత్నం పేరును అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కు పెట్టి ఆ మహనీయుడ్ని గౌరవించాలని అందరూ కోరుకుంటున్నారు.