అజ్ఞాతంలో ఉన్న అజ్ఞాతవాసి...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు,మాట్లాడితే చాలు అని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అలాంటిది సడన్ గా పది రోజుల నుంచి ఆయన ఉనికే లేకుండా పోయింది.పవన్ కళ్యాణ్ వెన్నెనొప్పితో బాధపడుతున్నారనే విషయం ఆయన మాటల ద్వారా అందరికీ తెలిసిన విషయమే. ఓ సమావేశానికి తాను రాలేను అంటూ బహిరంగ లేఖ రాస్తూ తన వెన్నునొప్పి విషయాన్ని బయటపెట్టారు జనసేనా అధిపతి. సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నా తాను ప్రకృతి సిద్ధమైన వైద్యానికే మొగ్గు చూపుతున్నట్లు తెలియజేశారు. ఈ కారణం చేతనే పవన్ కల్యాణ్ ఒక్క సారిగా మాయమైపోయారు. ట్విట్టర్ లో మినహా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూడా పవన్ ఎక్కడా కనిపించలేదు. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ కల్యాణ్ పెద్దగా కెమెరాలను ఫేస్ చేయలేదు. ఆ మధ్య వాటర్మాన్, రాజెంద్ర సింగ్ పవన్ ను కలిసారు అంటూ రెండు ఫోటోలు రిలీజ్ చేయటం మినహా పవన్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారనే విషయం బయట ప్రపంచానికి తెలియటం లేదు. రోజు పవన్ పర్సనల్ అకౌంట్ నుంచి ట్విట్టర్ పోస్టింగ్ లు వస్తున్నా ట్విటర్ లో పవన్ ఉన్న ఫొటో కనపడి పదిరోజులవుతుంది. పవన్ ఇలా హఠాత్తుగా మాయం కావడం సహజమే అనుకున్న, ఈ సారి ఆయన ఆరోగ్య పరిస్థితి జనసైనికులలో కాస్త ఆందోళన కలిగిస్తోంది. వెన్ను నొప్పి చికిత్స కోసమే పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం. ఆపరేషన్ పై ఆసక్తి చూపించని పవన్, కేరళ వైద్యం పై నమ్మకం పెట్టుకున్నట్లు వెల్లడవుతోంది. పది రోజులుగా పవన్ కళ్యాణ్ కేరళ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారని అందుకే మీడియా ముందుకు రాలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరు నిపుణుల పర్యవేక్షణలో పవన్ కి ప్రత్యేక చికిత్స చేస్తున్నారు. వెన్నునొప్పికి తాత్కాలిక ఉపశమనం కంటే పూర్తిగా నయం కావాలంటే చికిత్స తర్వాత పవన్ కనీసం నెల రోజుల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. వెన్ను నొప్పి తీవ్రంగా ఉండటంతో ఇన్నాళ్లూ పట్టించుకోని పవన్ కూడా ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవటానికి మొగ్గుచూపుతున్నారు. అయితే అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించి ఉంటే బాగుండేది ఎలాంటి ప్రకటన చేయకుండా కనిపించకపోవడంతో అటు జనసైనికులల్లోనూ ఇటు అభిమానులు కలవర చెందుతున్నారు.

సీబీఐ కోర్టులో చిదంబరానికి చుక్కెదురు...

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి కోర్టులో కష్టాలు కొనసాగుతున్నాయి. చిదంబరం బెయిల్ పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ పదిహేడు వరకు పొడిగించింది, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. చిదంబరం బెయిల్ పిటిషన్ మళ్లీ నిరాకరించడంతో ఆయన తీవ్ర షాక్ లో ఉన్నారు. ఢిల్లీ హై కోర్టు కూడా ఇప్పటికే చిదంబరం బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు లో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలైంది, జస్టిస్ రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. చిదంబరం బెయిల్ పిటిషన్ ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ఆయన విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు అనుమతిచ్చారు. ఆ కంపెనీ పెట్టుబడులను సేకరించింది చిదంబరం తనయుడు కార్తీ కంపెనీల నుంచే, ఈ కంపెనీల మధ్య మూడు వందల ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయని కేసు నమోదైంది. గతంలో ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టు తిరస్కరించింది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ హోదాలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం సమావేశాలను ఆయనే నిర్వహించేవారు, ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థకు విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు అనుమతి ఇవ్వడం ఈ కేసుకు మూలాధారం. ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థ పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలది. అడ్వాంటేజ్ ఇండియా సింగపూర్ లోని దాని అనుబంధ సంస్థ అడ్వాంటేజ్ సింగపూర్ నుంచి ఐఎన్ఎక్స్ మీడియా పెట్టుబడులు స్వీకరించినట్లు రికార్డుల్లో చూపారు. ఈ రెండు కంపెనీలు చిదంబరం కుమారుడు ప్రస్తుత ఎంపీ కార్తీ చిదంబరానివి. తండ్రి పదవి అండతో విదేశీ పెట్టుబడులకు అనుమతులను సులభంగానే సాధించారు, ఎఫ్ఐపీబీ అనుమతులు తీసుకో కుండా ఐఎన్ఎక్స్ న్యూస్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి అందులో ఇరవై ఆరు శాతం పెట్టుబడులు పెట్టారు. తండ్రి ఆర్ధిక మంత్రి కావడంతో దీన్ని అడిగేవారు లేకపోయారు. ఈ కేసులో కీలక నిందితులైన పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీ దంపతులు అప్రూవర్ లుగా మారారు. తమ మీదకు కేసు రాకుండా చూసుకునేందుకు కార్తీకి వారు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.

విశాఖ జిల్లా వైసీపీలో కోల్డ్ వార్... మంత్రి అవంతిపై జగన్‌కు ఫిర్యాదులు..!

విశాఖ జిల్లా వైసీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా మండుతోన్న మంటలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్రంగా గొడవలు రాజుకుంటున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవినే దక్కించుకున్న అవంతి... విశాఖ జిల్లాలో ఎవర్నీ లెక్కచేయడం లేదనే మాట వినిపిస్తోంది. జిల్లాలో తానే కింగ్ అన్నట్లుగా వ్యహరిస్తున్నారని, దాంతో అందరితోనూ గొడవలు అవుతున్నాయని అంటున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌తో అవంతి గొడవపడ్డారన్న వార్త... వైసీపీలో కలకలం రేపగా, తాజాగా మరో కీలక నేత, వీఎంఆర్‌డీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్ తో ఏకంగా అందరి ముందే మాటల యుద్ధానికి దిగడం సంచలనం సృష్టిస్తోంది. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో మంత్రి అవంతి... వీఎంఆర్డీ చైర్మన్ ద్రోణంరాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. అవంతి ప్రసంగిస్తుండగా, అదే స్టేజ్ పై ద్రోణంరాజు శ్రీనివాస్...కలెక్టర్ తో సంభాషిస్తున్నారు. అయితే, ఇబ్బందిగా ఫీలైన అవంతి... అన్నా శీనన్నా... నగరంలో పెరిగిన మీకు గ్రామీణ కష్టాలు తెలియవు... కొద్దిగా వినండన్నా అంటూ కామెంట్ చేయడంతో, ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. అవంతి మాటలతో నొచ్చుకున్న ద్రోణంరాజు... తాను మాట్లాడుతున్న టైమ్ లో ఘాటుగా బదులిచ్చారు. కుగ్రామంలో పుట్టి, పట్టణంలో పెరిగిన తనకు రెండు ప్రాంతాల గురించి అవగాహన ఉందని, కానీ ఎక్కడ్నుంచో వలసొచ్చి, ఇక్కడకొచ్చి వ్యాపారాలు చేసుకునేవాళ్లకు పల్లెటూళ్ల బాధలు ఏం తెలుస్తాయంటూ అవంతికి గట్టిగా కౌంటరిచ్చారు. అంతేకాదు చిన్నాపెద్దా చూసి మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో కంగుతిన్న అవంతి.... ద్రోణంరాజును బుజ్జగించే ప్రయత్నం చేశారు. తన మాటలను అపార్థం చేసుకున్నారంటూ సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే, ఇదంతా వందల మంది ముందు జరగడంతో వైసీపీ నేతలు షాకయ్యారు. అయితే, అవంతి వ్యవహార శైలి, విశాఖ జిల్లా వైసీపీలో గొడవలు, నేతల మధ్య కోల్డ్ వార్... జగన్ దృష్టికి వెళ్లడంతో క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సమయంలో నేతలు ఇలా బహిరంగంగా తిట్టుకుంటే ఎలా అంటూ మందలించారట. ప్రతి ఒక్కరూ విభేదాలను పక్కనబెట్టి, పార్టీ పటిష్టతకు కలిసి పనిచేయాలని, విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ జెండా ఎగిరేలా కృషి చేయాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.

మరో కొత్త పథకానికి జగన్ రూపకల్పన... ఈసారి 25లక్షల మందికి లబ్ది...

ఉద్యోగ ఉపాధి కల్పన, సంక్షేమమే ప్రధాన అజెండాగా విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... మరో వెల్ఫేర్‌ స్కీమ్‌కు రూపకల్పన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చి రికార్డు సృష్టించిన జగన్‌... అదే బాటలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇళ్లు లేనివారికి ముందుగా ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల హామీ మేరకు పేదలందరికీ ఇంటి స్థలాలు, ఆ తర్వాత ఇల్లు కట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఉగాది రోజున 25లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 24లక్షల 80వేల మంది లబ్దిదారులను గుర్తించిన జగన్ ప్రభుత్వం... వీళ్ల కోసం ఎంత భూమి కొనుగోలు చేయాలనేదానిపై సమగ్ర నివేదిక కోరింది. దాంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు సిద్ధంచేస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే వార్డుల వారీగా వివరాలు సేకరించిన గ్రామ వాలంటీర్లు... అర్హుల జాబితాను రెడీ చేశారు. అయితే, లబ్దిదారులకు సొంత గ్రామం, మండలం పరిధిలోనే ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భూములు లేకపోతే, ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. మొత్తం ప్రక్రియను నాలుగైదు నెలల్లో పూర్తిచేసి, రానున్న ఉగాదికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ప్రధానితో భేటీకానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు...

కేసీఆర్ ప్రధానిని కలిసిన మర్నాడే ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఢిల్లీలో మోదీతో సమావేశమౌతారు. ప్రధానంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్రం నుంచి సహకారం కోరనున్నారని సమాచారం. దీంతో పాటు ఈ నెల పదిహేను నుంచి అమలు చేసే రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని స్వయంగా ఆహ్వానించేందుకే ఢిల్లీ వెళుతున్నారని సమాచారం. విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపైనా జగన్ మోదీకి వినతి పత్రం ఇవ్వనున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం వల్ల రాష్ట్రాలకు కేంద్రం వాటా నిధులు తగ్గడం, రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతున్న నేపధ్యంలో తెలంగాణాకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. తెలంగాణాలోని ఒక నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ములుగు నారాయణపేట కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జోనల్ వ్యవస్థలో మార్పులు విభజన హామీల అమలు, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ లు కర్మాగారంతో పాటు వెనకబడిన జిల్లాలకు కేంద్రం అమలు చేస్తున్న పథకాల కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని కోరనున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా పంటలకు మద్దతు ధరలు వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం ఆహార శుద్ధి పరిశ్రమలకు కేంద్ర సహాయం వంటి వాటిని ప్రస్తావించే అవకాశం ఉంది. మోదీని కలిసిన తర్వాత కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై ప్రధానితో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఇటీవల తెలంగాణ, ఎపీ ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా రెండు నదుల అనుసంధానం అంశంపై మాట్లాడుతున్నారు. అనుసంధానం తరవాత రెండు రాష్ట్రాల్లోని ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలకు నీటి వనరుల సౌకర్యం కల్పించే ప్రాజెక్టుపై చర్చించనున్నారు. దీనికి అరవై వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అవుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ప్రధానిని కలుస్తున్నారని తెలుస్తోంది.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుపై మండిపడ్డ లక్ష్మణ్...

గోదావరి, కృష్ణా అనుసంధానం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విడివిడిగా రెండ్రోజుల వ్యవధిలో కలుస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో బిజెపి నేతలు కీలక ప్రకటనలు చేస్తున్నారు. కొంత మంది నేతలని బిజెపిలో చేర్పించేందుకు ఢిల్లీ తీసుకువెళ్లినా ఆ పార్టీ అధ్యక్షులైన కేసీఆర్, జగన్ తీరు పై లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ, తెలంగాణ కలసి ఉమ్మడి ప్రాజెక్టులు ఎలా కడతాయని ప్రశ్నించారు. లక్ష కోట్ల ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టులు కమీషన్ లు దండుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ నీటిని ఏపీ దోపిడీ చేసిందని ఆరోపించిన కెసిఆర్ ఇప్పుడు జగన్ తో కలిసి ప్రాజెక్టు ఎలా కడతారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటిని దోపిడీ చేసిందని కెసిఆర్ ఉద్యమాల్లో చెప్పారని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ భూభాగం మీద నుంచి ఏపీకి నీటిని ఎలా తరలిస్తారని లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు. రేపు మోదీతో భేటీలో ఏపీ తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు అంశాన్ని కెసిఆర్ ప్రస్తావిస్తూ, ఆర్ధిక సాయాన్ని కోరనున్నారు. ఐదొవ తేదీ న జగన్ మోహన్ రెడ్డి కూడా మోదీతో భేటీ అయి ఇదే అంశంపై సాయం చేయాలనే కోనలో విజ్ఞప్తి చేయనున్నారు. అయితే అనూహ్యంగా బీజేపీ నేతల నుంచి ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకత వస్తోంది. ఇది తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలో చర్చనీయాంశమవుతోంది.తెలంగాణ ద్రోహులను ఈ రోజు వారికి మంత్రి పదవులు ఇచ్చి బంగారు తెలంగాణ నిర్మాణమని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు. మన నీళ్ళు దోచుకున్నారని ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి సీమాంధ్ర ప్రజలను అక్కడి నేతలను దూషించి విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకొని ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాజెక్టులు కట్టుకొని తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తెలంగాణ నుంచి సీమాంధ్రకు నీళ్ళను తరలించాలని, ఆంధ్ర ప్రదేశ్ తో కలిసి నీటిని పంచుకొవాలని, దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా ఇద్దరు ముఖ్యమంత్రులూ రెండు రాష్ట్రాల ప్రజలతో దోబూచులాడుతూ ఏ రకంగా ఇవాళ్ల కేసీఆర్ గారు, జగన్ గారు మంతనాలు జరుపుకుంటు గోదావరి నీటిని శ్రీశైలంకి తరలిస్తామనేటువంటి అవసరం ఎందుకొచ్చిందని లక్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త...

  మార్కెట్ కమిటీ చైర్మన్ లలో సగం మహిళలకే ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కమిటీలో కూడా సగం మహిళలకే కేటాయించేటట్టుగా అనుమతి తీసుకుంటున్నారు, అక్టోబర్ చివరి నాటికి భర్తీ చేసేలా చొరవ తీసుకుంటారు. ఇప్పటికే జారీ అయిన జీవో ప్రకారం ఎస్సీ , ఎస్టీ, బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ లకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు. పంటలు వేసినప్పుడే వాటికి ధరలు ప్రకటించాలని కూడా సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే ఆరు నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలని, కనీస మద్దతు ధరలు లేని పంటలకు ధరలు ప్రకటించాలని సూచించారు. మార్కెటింగ్ సహకార శాఖల పై ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సమీక్ష చేశారు.  ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అలాగే రైతాంగానికి సంబంధించి ఉపయోగపడేటువంటి అంశాల మీద ఆయా ప్రాంతాల్లో రైతులు వేస్తున్న పంటలకు సంబంధించి గిట్టుబాటు ధరలను కల్పించే విషయంలో రైతును ఆదుకునే విషయంలో రైతన్నకు ప్రభుత్వానికి మధ్యలో మరీ ప్రజాప్రతినిధుల జోక్యంతో నిరంతరం మానిటరింగ్ జరగాలన్న ఆలోచనతోటి, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ మార్కెటింగ్ యాడ్స్ అన్నిటికి కూడాను ముఖ్యమంత్రి గారు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో, ప్రభుత్వ నిర్ణయం మేరకు నామినేట్ చేపడుతున్నటువంటి ప్రతి పోస్టులో కూడాను రిజర్వేషన్ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగిందని వైసిపి నాయకుడు తెలిపాడు. ఇచ్చిన హామీ మేరకే రేపటి రోజు నుంచి నియమాకం సిద్ధం కాబోతున్నటటువంటి మార్కెటింగ్ అన్ని యార్డుల్లో కూడాను యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల రిజర్వేషన్ ప్రక్రియ అమలు చేయటానికి అవసరమైన వివిధ అన్ని నిర్ణయాలు కూడా తీసుకోవటం జరిగిందని ఆయన తెలిపారు. మొత్తం మీద ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రధానంగా రైతు, వ్యవసాయ కూలీ సుఖసంతోషాలతో ఉండాలంటే అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి సందేశాన్ని తెలియజేశారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో‌ కమలం వికసిస్తోందా??

  తెలంగాణలో పాత జిల్లాల ప్రకారం చూసుకుంటే మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే బిజెపికి అంతో ఇంతో పట్టుంది. హైదరాబాదులో నేతలున్నారు, నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లో అప్పుడప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే మొన్నటి ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచారు. వాటిలో ఉత్తర తెలంగాణలోనే మూడు స్థానాల్లో విజయం సాధించారు. హైదరాబాద్ తరవాత ఇప్పుడు బీజేపీ ఫోకస్ ఉత్తర తెలంగాణ పై పడినట్టు సమాచారం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఏంపీగా ఇక్కడ అరవింద్ గెలిచారు, కానీ జిల్లాలో మాత్రం ఇంకా కమలంకు పట్టు దొరకలేదు. నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజక వర్గాల్లో ఇప్పటి వరకూ బలమైన నేతలు లేరు. దీంతో నేతల ఆకర్షణకు బీజేపీ నేతలు ప్లాన్ వేశారని తెలుస్తోంది.  ఇటీవల బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఎంపీ అరవింద్ ఇంటికి వెళ్లి చర్చలు జరపడం చర్చ నీయాంశంగా మారింది. అయితే ఆ తర్వాత పార్టీ మారే ఉద్దేశం లేదని షకీల్ చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కూడా బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లారని దీనిని బట్టి తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఏలేటి అన్నపూర్ణ ఆమె కుమారుడు మల్లిఖార్జునరెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. త్వరలో అన్నపూర్ణ తన కుమారుడితో కలిసి పార్టీలో చేరే అవకాశముందని ప్రచారముంది. డి శ్రీనివాస్ సైతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఆయన అనుచరులు అరవింద్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో ఆయన కూడా కమలం కండువా కప్పుకుంటారనే టాక్ నడుస్తోంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ లాంటి బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కాంగ్రెస్ లో బలమైన నేతలుగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వీరితో పాటు ఒకరిద్దరు కూడా ఎన్నికల సమయం నాటికి బీజేపీ కండువా కప్పుకొంటారనేది నేతల అంచనా. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కమలం పార్టీకి అగ్నిపరీక్షలా మారాయి. ఈలోపే బలమైన నేతలను చేర్చుకొని అధికార పార్టీకి సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్న గులాబీపార్టీ ఎత్తులకు బిజెపి నేతలు పైఎత్తులు ఎలా వేస్తారో వేచిచూడాలి. ఆపరేషన్ ఆకర్ష్ ను వికర్ష చేసేందుకు టీఆర్ఎస్ నేతలు సైతం పావులు కదుపుతుండడంతో ఇందూరు రాజకీయం రంజుగా మారింది.

టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు వెనుక మ్యాటరేంటి?

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం సీపీఐ, టీఆర్ఎస్ ల మధ్య కుదిరిన బంధం వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది. తెలంగాణలో రోజురోజుకు కమ్యూనిస్టు పార్టీల ప్రభావం తగ్గుతున్న వేళ హుజూర్ నగర్ లో మద్దతు కోరి గులాబీ బాస్ సీపీఐకి ఊపు తెచ్చారు. సాధారణ ఎన్నికల్లో మహాకూటమితో కలిసి సీపీఐ పోటీ చేసింది. టీఆర్ ఎస్ టార్గెట్ గా సీపీఐ నేతలు మాటల తూటాలు పేల్చారు. ఎన్నికలైనా ఏడాది కూడా కాక ముందే సీపీఐ నేతలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. మహా కూటమి ఫ్రెండ్స్ కాదని టీఆర్ఎస్ కు మద్దతి ఇచ్చారు. ఈ సడన్ యూటర్న్ వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయింది. రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే సీటు గెలిచిన సీపీఐ మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, ఓట్ల శాతం కూడా తగ్గింది. ప్రస్తుతం ఏ సభలోనూ సిపిఐకి ప్రాతి నిధ్యం లేదు. ప్రస్తుతం కుదిరిన ఒప్పందంలో భాగంగా ఓ ఎమ్మెల్సీ చాన్స్ ఇస్తామని టీఆర్ఎస్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ పొత్తును కొనసాగించాలి అనేది ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు చెబుతున్నారు. పొత్తుతో కొన్ని చోట్ల పోటీ చేసి మున్సిపాలిటీలో పాగా వేయాలని సీపీఐ నేతల ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్ కి సీపీఐ మద్దతు ఇవ్వటం వెనక రాజకీయ, ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

పర్చూరు నియోజక వర్గంలో అసలు ఏం జరుగుతోంది?

  డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పర్చూరు నియోజక వర్గంలో తిరుగులేని నేత నిన్నటి వరకు ఓటమెరుగని నేతగా ఉన్న దగ్గుబాటి మొన్నటి ఎన్నికల్లో తొలి సారి ఓడిపోయారు. వైసిపి అధికారంలోకి రావడంతో పర్చూరు నియోజక వర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. అవినీతి మరక అంటని నేత దగ్గుబాటి, ఇదే ఇప్పుడు ఆయన కొంప ముంచేలా చేసింది, గతంలో టిడిపిలో ఉంటూ గ్రానైట్, ఇసుక మాఫియాను పెంచి పోషించిన నేతలే ఇప్పుడు వైసీపీలో చేరి ఆయనకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారట.  సీఎం జగన్ కు దగ్గుబాటి పై ఉన్నవీ లేనివీ నూరిపోసి తమ పబ్బం గడుపుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ ఇన్ చార్జిగా ఉంటూ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి టిడిపి పంచన చేరిన రావి రామనాథం బాబుని తిరిగి వైసీపీకి చేర్చే విషయంలో దగ్గుబాటి వ్యతిరేక వర్గం సక్సెస్ సాధించింది. ఈ విషయంలో దగ్గుబాటిని సంప్రదించలేదన్న ప్రచారం ఉంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దగ్గుపాటి వెంకటేశ్వరావు తాడోపేడో తేల్చుకునేందుకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరారు. సీఎంతో దగ్గుబాటి భేటీ తర్వాత ఎలాంటి పరిణామాలు నెలకొంటాయని దగ్గుబాటి అభిమానులు ఆందోళనలో ఉన్నారు.  మరోవైపు జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి మధ్య గ్యాప్ ఉందని ప్రచారం నడుస్తోంది. అధికారుల బదిలీల విషయంలో వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి అనేది టాక్. ఈ గ్యాప్ ను ఇసుక, గ్రానైట్ మాఫియా క్రియేట్ చేసిందని దగ్గుబాటి వర్గం అంటోంది. అయితే రాజకీయాలలో తలపండిపోయిన దగ్గుబాటి తన ప్రత్యర్థుల ఎత్తులు చిత్తు చేసే వ్యూహం రచించారని తెలుస్తోంది. డైరెక్టుగా సీఎం జగన్ తో భేటీ సందర్భంగా పర్చూరు రాజకీయాన్ని వివరిస్తారని తెలుస్తోంది. అక్రమార్కులకు చెక్ పెట్టేలా ఆయన సీఎం దగ్గరకు పకడ్బందీ ప్లాన్ తో వెళతారని సమాచారం. మరి దగ్గుపాటి నెగ్గుతారా ఆయన వ్యతిరేక వర్గానికి చెక్ పెడుతుందా అనేది రెండుమూడ్రోజుల్లో తేలిపోతుంది.

దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు

  ఢిల్లీ లోకి నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్లు పోలీసులకు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పండుగ సమయాల్లో దాడులు చేసే అవకాశముందని తెలిపాయి. దీంతో ఢిల్లీతో పాటు సరిహద్దు నగరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అటు సాయుధ బలగాలను సైతం భారీగా మోహరించారు. దీని పై ప్రధాని మోదీ అధికారులు సంబంధిత మంత్రులతో చర్చించారు. ఆర్టికల్ 370 రద్దు తరవాత ఉగ్రవాదులు చెలరేగిపోయే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అప్పటి నుంచి పాకిస్థాన్ సరిహద్దుతో పాటు దేశం లోని స్లీపర్ సెల్స్ కదలికలపై నిఘా పెట్టాయి. అయితే ఇప్పుడు దేశ రాజధానిని టార్గెట్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఉగ్రవాదులు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను టార్గెట్ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ అనుమానిస్తుంది. అంతేకాదు హోంమంత్రిత్వశాఖ దాదాపు ముప్పై నగరాలకు ఉగ్రదాడుల హెచ్చరికలు జారీ చేసింది. ఇక నిఘా వర్గాల హెచ్చరికలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అలర్టైంది. ఎయిర్ ఫోర్స్ బేస్ ల పై దాడులు జరిగే అవకాశముందన్న హెచ్చరికలతో అప్రమత్తమైంది. దీంతో శ్రీనగర్, అవంతిపుర, పఠాన్ కోట్, హైనాన్ ఎయిర్ బేస్ లు దగ్గర గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. వైమానికదళం శిబిరాల దగ్గర జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి గత నెల పదవ తేదీ న సివిల్ ఏవియేషన్ బ్యూరోకి వార్నింగ్ లేక కూడా వచ్చింది. దీంతో ఏ చిన్న అవకాశాన్నీ విడవదల్చుకోలేదు అధికారులు.  

విశాఖ ఆర్కే బీచ్ లో యువకుల గల్లంతు

  విశాఖ ఆర్కే బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. నిన్నరాత్రి సమయంలో సుమారు ఐదుగురు విద్యార్ధులు కలిసి విశాఖ ఆర్కే బీచ్ సముద్ర స్నానానికి వెళ్ళారు. అయితే కాసేపటికే విషాదం ముంచుకు వచ్చింది. ఐదుగురు విద్యార్ధులలో ముగ్గురు విద్యార్థులు ఒడ్డుకు వచ్చారు. మరో ఇద్దరు విద్యార్ధులు గల్లంతైయ్యారు. అప్పటికప్పుడే బీచ్ దగ్గరలో ఉన్న పోలీసులు అప్రమత్తమై వెంటనే వారిని రక్షించేందుకు వెళ్ళారు. అయినప్పటికీ కూడా వారి ఆచూకీ తెలియలేదు. చీకటి పడటంతో వారి గాలింపు చర్యలు అక్కడితో ముగించడం జరిగింది. అయితే ఉదయం సుమారు ఆరు ఏడు గంటల ప్రాంతంలో విశాఖలో ఐటీఐ ప్రాంతానికి చెందిన భరత్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని పోస్టు మార్టంకి తరలించారు. మరొక విద్యార్ధి మోహిత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే సముద్ర స్నానానికి సరదగా వెళ్ళిన ఈ విద్యార్థులకి ఈ విషాదం అలుముకుంది. వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అక్కడ ఉన్న పర్యాటకులు మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపడుతున్నప్పటికి కూడా విని తగు జాగ్రత్తలు ఎవరూ‌ తీసుకోవట్లేదు. ఈ మధ్య కాలంలో సముద్ర స్నానానికి వెళ్ళి గల్లంతైన విషయం కొంచం తగ్గినట్టు అనిపించినా ఈ రెండు నెలలలోనే సూమారు మూడు నాలుగు ఘటనలు చోటుచేసుకున్నాయి. మోహిత్ అనే విద్యర్ధి కోసం ఒక పక్క కోస్ట్ గార్డ్ మరోపక్క జాలర్లు ఇద్దరు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

కర్నూల్ జిల్లా వైసిపిలో ఏం జరుగుతుంది?

  కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో ముసలం మరింత ముదురుతోంది. ఆ నియోజక వర్గ ఇన్ చార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పై కేసు నమోదవడం పై స్థానికంగా చర్చ జరగుతోంది. ఇటీవల జరిగిన విద్యాకమిటీల ఎన్నికలు ఎమ్మెల్యే ఆర్ధర్ నియోజక వర్గ ఇన్ చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాల మధ్య మరింత చిచ్చు రేపాయి. ఈ ఘటన పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెరుకుచర్ల రఘురామయ్య సీరియస్ గా స్పందించారు. అధికార పార్టీ నేతల వర్గీయుల మధ్య ఇలాంటి గొడవలు జరగడం ఏమిటనే చర్చకు దారి తీసింది. తన సన్నిహితుడు వెంకట్ రెడ్డి పై జరిగిన దాడిని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ ఖండించారు. జరిగిన ఘటనను వర్గాలకు పార్టీలకు ముడిపెట్టొద్దని ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాలని అభివృద్ధినే తమ పార్టీ ధ్యేయమని ఆయన అన్నారు. పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని అందరూ కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. నందికొట్కూరు నియోజక వర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని ఆర్ధర్ చెప్పుకొచ్చారు.  మరోవైపు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పందన ఎలా ఉంటుందోనని అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో ఆయన అనుచరులు పన్నెండు మంది పై నందికొట్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఏడుగురిని గుట్టుగా రిమాండ్ కి పంపడం ఆర్ధర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గీయుల మధ్య ఉన్న చిచ్చుని మరింత రాజేసిందని అంత అనుకుంటున్నారు. వెంకట్ రెడ్డి పై దాడి కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్న తరుణంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పైన కేసు నమోదు కావడం సంచలనం రేపింది. కేసులో ఏ 13 నిందితుడిగా ఆయన పేరు చేర్చారని అయితే దాన్ని ఏ 8 గా మార్చేందుకు కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారనే చర్చ సిద్ధార్థరెడ్డి వర్గంలో సెగలు రేపింది. నందికొట్కూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి పై కేసు నమోదు అయ్యేసరికి నియోజకవర్గంలోని ముఖ్య నేతల మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదిరిన టాక్ బాగా వినిపిస్తోంది. నందికొట్కూరులో త్వరలో భారీ జన సమీకరణతో బహిరంగ సభ పెట్టి పార్టీ పవర్ ఏంటో చూపిస్తానని కొద్ది రోజుల క్రితం కర్నూలులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్పారు. ఆయన ప్రకటన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఆనందం కలిగించింది. త్వరలో ఎమ్మెల్యే ఆర్ధర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒకే వేదిక పై రానున్నారని భావిస్తున్న క్రమంలో విద్యా కమిటీ ఎన్నికలు గొడవలకు దారి తీశాయి. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి అన్న ప్రచారం జరుగుతోంది.  నందికొట్కూరు నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడం మంచిదని వారు కోరారు. దీనితో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు త్వరలోనే ఎమ్మెల్యే ఆర్ధర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లి రాజీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పార్టీ అధినేత జగన్ వీరిద్దరి మధ్య మరింతగా ముదిరిన విభేదాలకు ఎలా చెక్ పెడతారో చూడాలి.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ..

  తెలంగాణ ప్రభుత్వం నూతన మద్యం షాపులకు నోటిఫికేషన్ జారి చేసింది. ఈ నోటిఫికేషన్ 1 నవంబర్ 2019 నుంచి 31 అక్టోబర్ 2021 వరకు ఈ నూతన మద్యం పాలసీ అమలలో ఉండనుంది. రాష్ట్రం లో అనేక చోట్ల ఇప్పటికే ఉన్న మద్యం షాపుల రెన్యూవల్ కోసం అలానే మరికొన్ని కొత్త  మద్యం షాపుల కోసం దరఖాస్తు కోసం ఫీజును కూడా నియమించారు. మద్యం షాపుల దరఖాస్తు ఫీజు రెండు లక్షల రూపాయలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు శ్లాబుల కింద రెండు వేల రెండు వందల పదహారు వైన్ షాపులను ఏర్పాటు చేయనున్నారు. ఎంత జనాభా ఉన్న చోట ఎంత  లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండాలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు వేల వరకు జనాభా ఉన్న చోట యాభై లక్షల రూపాయలు, యాభై వేల వరకు జనాభా ఉన్న చోట యాభై ఐదు లక్షల రూపాయలు, లక్ష వరకు జనాభా ఉన్న చోట అరవై ఐదు లక్షలు, ఇరవై లక్షల జనాభా ఉన్న చోట ఎనభై ఐదు లక్షల రూపాయలను ఫీజుగా నిర్ణయించారు. ఇరవై లక్షల జనాభా పైన ఉంటే లైసెన్స్ ఫీజు ఏడాదికి కోటి పది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణలో పోలీసులను ఇష్టానుసారంగా వాడుకుంటున్నారా ?

  ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు వారానికొక సెలవు ఇస్తామనీ వత్తిడి తగ్గించటానికి ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నారు. మరోవైపు అధికార పక్ష నేతలు అదే పోలీసు యంత్రాంగాన్ని తమ ఇష్టానుసారం వాడుకుంటూ వత్తిడికి గురి చేస్తున్నారు. రాజకీయ ప్రమేయాలతో పాటు శాఖా పరమైన ఒత్తిళ్లతో అనేక మంది పోలీసులు బిపి, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఇంకొందరు పనివత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది.  అరవ చాకిరి అంటారే అచ్చం అలాగే ఉంది ప్రస్తుతం పోలీసుల విధి నిర్వహణ, ఇపుడున్న పరిస్థితుల్లో ఏ పోలీసు ఉద్యోగి కూడా స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారు. హోంగార్డు మొదలు, డీఎస్పీ స్థాయి అధికారుల వరకు అందరు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. పైగా సమయ పాలన కూడా ఉండడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ మంది పోలీస్ అధికారులు రాజకీయ నాయకుల పైరవేళుతోనే పోస్టింగ్లు పొందుతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఇతర ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు ఎవరి పేరు చెబితే వారికి ఇక్కడ పోస్టింగ్ లభిస్తోంది. ఈ సందర్భంగా మధ్యవర్తులుగా ఉండే నాయకులూ, పైరవీకార్లు లక్షలాది రూపాయలు మింగేస్తున్నారు. మంచి ఆదాయం లభించే పోలీస్ స్టేషన్ లలో పోస్టింగ్ కావాలంటే ఐదు లక్షల వరకు చెల్లించుకోవాలి, రవాణా సౌకర్యాలు ఉండి హైదరాబాద్ కి రాకపోకలకు అనువుగా ఉండే స్టేషన్ లైతే మూడు లక్షల వరకు ధర పలుకుతున్నాయి. ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని నాలుగు స్టేషన్ లు, బోధన్ నియోజకవర్గంలో మూడు, ఆర్మూర్ బాల్కొండ ప్రాంతాల్లో రెండేసి పోలీసు స్టేషన్ లకు బాగా డిమాండ్ ఉంది. అలాగే కామారెడ్డి పట్టణం, కామారెడ్డి రూరల్ తో పాటు బాన్స్ వాడలో మూడు ఠాణాలో పోస్టింగ్ లకు అధికారులు పోటీపడుతుంటారు. హైదరాబాద్ లో ఉండే కొందరు అధికారులు జాతీయ రహదారి పై ఉండే స్టేషన్ లను కోరుకుంటున్నారు. ఆయా చోట్ల పోస్టింగ్ లు ఆశించేవారు పోటీ పడి మరీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కామారెడ్డి జిల్లా లోని నాలుగు నియోజక వర్గాల్లో ప్రధాన పోస్టింగులన్నీ రాజకీయ నాయకుల చేతుల్లోనే వున్నాయి. అక్కడెవరూ పనిచేయాలో, ఎవరు చెయ్యొద్దు అని నిర్ణయించేది కూడా వారే.  ఈనేపధ్యంలో నాయకుల పైరవీ ద్వారా పోస్టింగులు పొందిన ఎస్సైలు, సీఐలు నిబంధనలు అతిక్రమించి మరీ వారికి తమ సేవలందిస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే ఎమ్మెల్యేలకు ఎస్ క్వార్ట్ ఇచ్చే అవకాశం లేదు. ప్రత్యేకంగా కోరితే తప్ప పోలీస్ భద్రత కూడా కల్పించాల్సిన అవసరం లేదు. కానీ కొందరు ఎస్సైలు, సీఐలు ఎమ్మెల్యే తమ పరిధిలోకి వచ్చిన మొదలు తిరిగి వెళ్లే వరకు ఎస్కార్టుగా ఉంటున్నారు. సదరు నేత కంట్లో పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. తమ సిబ్బందిని వెంటేసుకుని మరి సైరన్ మోతలతో ఎమ్మెల్యే వెంట తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల ఇంటి వద్ద ఇరవై నాలుగు గంటల పాటు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే గానీ, ఎంపీగానీ, ఇతర ముఖ్య నేతలు గానీ ఏదైనా ప్రాంతానికి వెళ్ళారంటే అక్కడి పోలీసు యంత్రాంగమంతా వారి చుట్టూనే ప్రదక్షిణలు చేస్తోంది. ఇలాంటి సందర్భాల్లో సాధారణ పౌరులకు ఏదైనా అవసరం పడితే పోలీసులు అందుబాటులో ఉండటం లేదు. కేసుల విచారణ, ఫిర్యాదుల స్వీకరణ వంటివి వారు ఎప్పుడో మర్చిపోయారు. గతంలో మంచి పని తీరు, ఇన్వెస్టిగేషన్, సిన్సియారిటీ వంటి ప్రమాణాలతో ఉన్నతాధికారుల మెప్పు పొంది పోస్టింగ్లు లేదా ప్రమోషన్లు పొందేవారు. కానీ ఇప్పుడు ఉన్నతాధికారులను ఓవర్ టేక్ చేసి నాయకుల మెప్పు పొందడానికి ప్రాధాన్యమిస్తున్నారు. పైరవీలతో ఉద్యోగం చేయడం ఇష్టం లేని అనేక మంది చురుకైన అధికారులూ లూప్ లైన్ లోకి వెళ్ళిపోయారు.  నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు 4,500 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. కామరెడ్డి జిల్లాలో 3000 పై చిలుకు ఉద్యోగులున్నారు. ఇప్పుడున్న జనాభా వస్తున్న కేసుల ప్రాతిపదికన చూస్తే అవసరమైన సిబ్బందిలో ఇప్పుడు 50 శాతం కూడా లేరని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పడ్డ స్టేషన్లలో నలుగురు హెడ్ కానిస్టేబుళ్లుగా ఇద్దరే ఉంటున్నారు. 18 నుంచి 20 మంది కానిస్టేబుళ్లు అవసరమైతే 10 మందితోనే నడుపుతున్నారు. దీంతో నాయకుల ప్రమేయాలు ఒకవైపు, పనిభారం మరోవైపు పోలీసులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి.గతంతో పోలిస్తే ఇప్పటి పోలీసులకు శారీరక శ్రమ చాలా తగ్గింది. మానసిక ఒత్తిడి మాత్రం అనేక రెట్లు పెరిగింది. ఆందోళన ఎక్కువైంది. దీంతో ఎక్కువ మంది తక్కువ వయసులోనే బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. సమయానికి నిద్ర, భోజనం వుండడంలేదు. కామరెడ్డి కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాక చాలా మంది పోలీసులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మరి కొందరు పిల్లల చదువుల కోసం కుటుంబాలను హైదరాబాద్ లో పెట్టి ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రాజకీయ ప్రమేయం లేకుండా చేయాలని పనిభారం తగ్గించాలని పోలీసులు కోరుతున్నారు. పోలీసు పక్షపాతిగా చెప్పుకునే సీఎం కేసీఆర్ ఇప్పటికైనా పోలీసులకు రాజకీయ బంధాల నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంటున్నారు. దీనిమీద అధికార పెద్దల ఎలా స్పందిస్తారు చూద్దాం.

ఇస్రో సైంటిస్ట్ సురృష్ హత్యకేసులో పురోగతి..

  హైదరాబాద్ లో ఇస్రో సైంటిస్ట్ సురేష్ హత్య కేసు దర్యాప్తులో పురోగతి కన్పిస్తుంది. ఎస్సార్ నగర్ లోని అన్నపూర్ణ అపార్ట్ మెంట్ రెండో ఫ్లోర్ లో నివాసముంటున్న శాస్త్రవేత సురేష్ రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. క్లూస్ టీమ్ తో హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అపార్ట్ మెంట్ వాచ్ మెన్ తో సహా స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. హత్య జరిగిన రోజు శ్రీనివాస్ అనే వ్యక్తి సురేష్ ఇంటికి వచ్చాడు. హత్య తర్వాత అతను కనిపించడం లేదు, దీంతో ప్రధానంగా పోలీసులు శ్రీనివాస్ పై దృష్టి పెట్టారు, ప్రత్యేక బృందాలతో అతని కోసం వెతుకుతున్నారు. హత్యకు గురైన సురేష్ తలపై తీవ్ర గాయాలున్నట్లు గుర్తించారు, అక్కడి ఆనవాళ్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. శాస్త్రవేత సురేష్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండర్ ఇస్రోలో పని చేస్తున్నాడు. మృతుడు కేరళవాసి, వృతిరీత్యా గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. సురేష్ భార్య బ్యాంకు ఉద్యోగిని చెన్నైలో నివాసముంటోంది. ఉద్యోగ రిత్యా కుమారుడు అమెరికాలో, కుమార్తె ఢిల్లీలో స్థిర నివాసం ఉంటున్నారు. ఇక హత్య చేసినట్లుగా భావిస్తున్న శ్రీనివాస్ స్వస్థలం గోదావరిఖనిగా చెబుతున్నా పోలీసులు ఇతని కోసం వెతుకుతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో హైకోర్ట్ పై ఆందోళన...

  అమరావతిలో హైకోర్టు ఏర్పాటై నిండా తొమ్మిది నెలలైనా కాలేదు. దానిని తమ ప్రాంతానికి తరలించాలంటే తమ ప్రాంతానికి తరలించాలని అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం హైకోర్టును కర్నూలుకు తరలించాల్సిదేనని డిమాండ్ చేస్తోంది. హై కోర్టు తరలింపు పై పలుచోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి మద్దతుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు, తమ అభిప్రాయమేంటో చెప్పడం లేదు. దీనిపై హైకోర్టు అధికార వర్గాలు సైతం ప్రభుత్వమే స్పష్టం చేయాలని చెప్తున్నాయి.  ఏపిలో ప్రభుత్వం మారాక హైకోర్ట్ అమరావతి నుంచి తరలిపోతుందన్న ప్రచారం పెరిగిపోయింది. రాయలసీమకు హైకోర్టు తరలిపోనుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హైకోర్టును కర్నూలు లోనే పెట్టాలని రాయలసీమ వారు డిమాండ్ చేస్తున్నారు. కోస్తా ప్రజలు మాత్రం అమరావతిలోనే హైకోర్టు ఉండాలంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైకోర్టును కర్నూలులో పెడతామని బీజేపీ హామీ ఇచ్చింది. రాయలసీమలో హై కోర్టు బెంచి ఏర్పాటు చేస్తామని టిడిపి ప్రకటించింది. వైసిపి నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఇపుడు బిజెపి క్లారిటీగా చెబుతోంది కర్నూలులోనే హైకోర్టును ఏర్పాటు చేయాలంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ చెబుతోంది.  హైకోర్టును రాయలసీమకు తరలించే అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలంటున్నారు కర్నూల్ బిజెపి నేతలు. హైకోర్టు ఇవ్వక పోతే సీమలు ఒక్క సీటు కూడా గెలవదు అంటున్నారు. సీమకు హైకోర్టు ను కేటాయించాలని అలా కాకపోతే రెండో రాజధానిగా కర్నూలును చెయ్యాలనే డిమాండ్స్ వినిపిస్తున్నారు బిజెపి నేతలు. లేదంటే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని హెచ్చరిస్తున్నారు. అమరావతి రాజధాని అయినందున కర్నూలులోనే హైకోర్టును పెట్టాలంటున్నారు. మొత్తానికి హై కోర్టు తరలింపు ప్రచారం దుమారం రేపుతోంది. ఎవరికి వారు తమ ప్రాంతం లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. బిజెపి నేతలు మాత్రం అన్ని ప్రాంతాలూ అభివృద్ధి జరిగేలా హైకోర్టును కర్నూలు లోనే ఏర్పాటు చేయాలంటున్నారు. గట్టి గానే తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో అన్ని వర్గాల్లోనూ ఆందోళన పెరిగిపోతోంది.

లలిత జ్యువెలరిలో భారి చోరి...

  తమిళనాడు తిరుచ్చి లలిత జూలరీలో భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కిలో షోరూమ్ కి కన్నం వేసిన దొంగలు పదమూడు కోట్ల రూపాల విలువైన నగలు ఎత్తుకపోయారు. జంతువుల మాస్కులు పెట్టుకుని రెండు గంటల్లోనే ఈ దొంగతనం చేశారు. షోరూం వెనుక వైపు ఉన్న గోడకు కన్నం వేసి, పిల్లలు ఆడుకునే జంతువుల మాస్క్ లు పెట్టుకొని సిసి కెమెరాల కన్ను కప్పారు, అమ్మకాల కోసం బాక్సుల్లో ఉంచిన బంగారం, వజ్రాలు మూటగట్టుకున్నారు. ఇద్దరు అగంతకులు మొత్తం రెండు గంటల లోపే పదమూడు కోట్ల రూపాయలు విలువైన ఆభరణాలతో ఉడాయించారు.  తమిళనాడులోని తిరుచ్చి లోని లలితా జ్యువెలరి షోరూంలో అత్యంత సినీ ఫక్కీలో బుధవారం తెల్లవారుజామున ఈ భారీ దోపిడి జరిగింది. గత కొన్నేళ్లలో తమిళనాడులో జరిగిన అతిపెద్ద చోరీ ఇదే. విషయం తెలిసిన వెంటనే లలితా జ్యూయలరీ అధినేత కిరణ్ కుమార్ తిరుచ్చికి వెళ్లి షోరూంను పరిశీలించారు. బంగారు నగలతో పాటు వజ్రాలు, ప్లాటినంతో తయారు చేసిన ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక పోలీసు బృందాలు నిర్మితమయ్యాయి.  కిరణ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం తిరుచ్చి సత్రం బస్టాండ్ సమీపంలో ఉన్న లలితా జ్యువెలరి షోరూంని రోజులాగానే బుధవారం ఉదయం తెరిచారు. షోరూం లోపల ఖాళీగా ఆభరణాల బాక్సులు కనిపించే సరికి నిర్వాహకులు సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే తిరుచ్చి నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాల కోసం ఫోరెన్సిక్ నిపుణులు చోరీ జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. పరిసర ప్రాంతాల్లో జాగిలాలతో తనిఖీ చేశారు. షోరూం లోని సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా వేకువ జామున రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య షోరూంలో రెండు అగంతకులు ఉన్నట్లు గుర్తించారు. అయితే వారు తమ చేతి వేలి ముద్రలు కూడా దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. దోచుకున్న నగలను ఏ మార్గంలో ఏ వాహనంలో తరలించారన్న విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే షోరూంలో పని చేస్తున్న నూట అరవై మందికి పైగా సిబ్బంది వద్ద విచారణ జరుపుతున్నారు.  గతేడాది తిరుచ్చి ఒకటవ నెంబర్ టోల్ గేట్ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుని ఇదే రీతిన కన్నం వేశారు. అప్పుడు బ్యాంక్ గోడకు కన్నం వేసి అగంతకులు లోపలకు ప్రవేశించి ఐదు కోట్ల విలువైన నగలను అపహరించారు. ఆ ఘటన లలితా జువెలర్స్ లో దోపిడీ జరిగిన విధానం ఒకేలా ఉన్నాయని ఆ అగంతకులే ఈ దోపిడీ కి పాల్పడి ఉంటారనే కోణం లోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మూడవ ప్లాన్ అమలు చేస్తుండగా ఆగిపోయిన బోటు వెలికితీత పనులు...

  ఆపరేషన్ రాయల్ వశిష్ట కొనసాగుతుంది, ప్లాన్ ఒకటి, రెండు విఫలం కావడంతో మూడవ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. నదిలో ఇసుకలో కూరుకుపోయిన బోటును వెలికి తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరిలో దాదాపు రెండు వందల అడుగుల లోతులో మునిగి పోయిన బోటును బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే తాజాగా కచ్చులూరు ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండటంతో మూడో రోజు కూడా ఆపరేషన్ వశిష్ట కు ఆటంకం ఏర్పడింది. ఉదయం నుంచి సత్యం బృందం బోటు వెలికితీత పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు చిన్న బోట్లతో ప్రమాదం జరిగిన స్థలంలో లంగర్లతో బోటు ఎక్కడుందనే గాలింపు చర్యలు చేపట్టారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవటంతో గాలింపు చర్యలు వాయిదా పడ్డాయి. మూడవ ప్లాన్ అమలు చేస్తుండగా భారీగా వర్షం రావడంతో నదిలో సుడులు ఎక్కువై కరెంటు రావడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతసేపటికీ బోటు దొరకకపోగా మధ్యలో వర్షం రావడంతో మూడవ ప్లాన్ అమలు చేయకముందే ఆగిపోయింది. రేపు వాతవరణ పరిస్థితులను బట్టి మరియు కలెక్టర్ అనుమతితో బోటుని వెలికి తీయడం ఆధారపడి ఉంది.  నిన్న జరిపిన బోటు వెలికితీత పనుల్లో లంగర్ బోటుకి పట్టి విరిగిపోయిందనీ, మరల రోప్ వేసినా లాభం లేదని చిన్న చిన్న  లంగర్లతో బోటు ఎక్కడుందో కనిపెట్టి ఆ తరువాత పెద్దది వేస్తే బోటు భయటకి తీసే మార్గం ఏదైనా ఉంటుందని సత్యం బృందం తెలిపారు.