అజ్ఞాతంలో ఉన్న అజ్ఞాతవాసి...
posted on Oct 4, 2019 @ 11:30AM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు,మాట్లాడితే చాలు అని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అలాంటిది సడన్ గా పది రోజుల నుంచి ఆయన ఉనికే లేకుండా పోయింది.పవన్ కళ్యాణ్ వెన్నెనొప్పితో బాధపడుతున్నారనే విషయం ఆయన మాటల ద్వారా అందరికీ తెలిసిన విషయమే. ఓ సమావేశానికి తాను రాలేను అంటూ బహిరంగ లేఖ రాస్తూ తన వెన్నునొప్పి విషయాన్ని బయటపెట్టారు జనసేనా అధిపతి. సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నా తాను ప్రకృతి సిద్ధమైన వైద్యానికే మొగ్గు చూపుతున్నట్లు తెలియజేశారు. ఈ కారణం చేతనే పవన్ కల్యాణ్ ఒక్క సారిగా మాయమైపోయారు. ట్విట్టర్ లో మినహా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూడా పవన్ ఎక్కడా కనిపించలేదు. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ కల్యాణ్ పెద్దగా కెమెరాలను ఫేస్ చేయలేదు. ఆ మధ్య వాటర్మాన్, రాజెంద్ర సింగ్ పవన్ ను కలిసారు అంటూ రెండు ఫోటోలు రిలీజ్ చేయటం మినహా పవన్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారనే విషయం బయట ప్రపంచానికి తెలియటం లేదు.
రోజు పవన్ పర్సనల్ అకౌంట్ నుంచి ట్విట్టర్ పోస్టింగ్ లు వస్తున్నా ట్విటర్ లో పవన్ ఉన్న ఫొటో కనపడి పదిరోజులవుతుంది. పవన్ ఇలా హఠాత్తుగా మాయం కావడం సహజమే అనుకున్న, ఈ సారి ఆయన ఆరోగ్య పరిస్థితి జనసైనికులలో కాస్త ఆందోళన కలిగిస్తోంది. వెన్ను నొప్పి చికిత్స కోసమే పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం. ఆపరేషన్ పై ఆసక్తి చూపించని పవన్, కేరళ వైద్యం పై నమ్మకం పెట్టుకున్నట్లు వెల్లడవుతోంది. పది రోజులుగా పవన్ కళ్యాణ్ కేరళ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారని అందుకే మీడియా ముందుకు రాలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరు నిపుణుల పర్యవేక్షణలో పవన్ కి ప్రత్యేక చికిత్స చేస్తున్నారు. వెన్నునొప్పికి తాత్కాలిక ఉపశమనం కంటే పూర్తిగా నయం కావాలంటే చికిత్స తర్వాత పవన్ కనీసం నెల రోజుల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. వెన్ను నొప్పి తీవ్రంగా ఉండటంతో ఇన్నాళ్లూ పట్టించుకోని పవన్ కూడా ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవటానికి మొగ్గుచూపుతున్నారు. అయితే అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించి ఉంటే బాగుండేది ఎలాంటి ప్రకటన చేయకుండా కనిపించకపోవడంతో అటు జనసైనికులల్లోనూ ఇటు అభిమానులు కలవర చెందుతున్నారు.