జగన్ సర్కారుకు మరో షాక్... ఏపీ ఫైబర్ నెట్ కు భారీ జరిమానా

  ఆంధ్రప్రదేశ్ లో రెండు తెలుగు న్యూస్ ఛానెళ్ల అనధికార నిషేధంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ మండిపడింది. పదేపదే ఆదేశాలిచ్చినా ఆ ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతకు కారణాలు చూపకపోవడం, అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై ఏపీ ఫైబర్ నెట్ పై ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఛానెల్ ప్రసారాల నిలిపివేతపై టీవీ5 యాజమాన్యం... టీడీశాట్ ను ఆశ్రయిండంతో అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. అయితే, ప్రసారాలు పునరుద్ధరించాలని పదేపదే ఉత్తర్వులిచ్చినా ఎందుకు పట్టించుకోలేదంటూ ఏపీ ఫైబర్ నెట్ కి భారీ జరిమానా విధించింది. ఛానెల్ పై నిషేధం ఎత్తివేసేంతవరకు రోజుకి రెండు లక్షల చొప్పున చెల్లించాలంటూ ఆదేశించింది. అలాగే, తమ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు కూడా ఏపీ ఫైబర్ నెట్ కి భారీ జరిమానా విధించింది.  ఉద్దేశపూర్వకంగానే ఛానెళ్లపై నిషేధం విధించినట్లు భావిస్తున్నామని టీడీశాట్ వ్యాఖ్యానించింది. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము చేస్తున్నామన్న ఏపీ ఫైబర్ నెట్ పై ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. మీకు ఆదేశాలిస్తున్న ఆ ఉన్నత వ్యక్తి ఎవరో చెప్పాలంటూ ప్రశ్నించింది. మీడియా సంస్థలకు ఉండు భావప్రకటనా స్వేచ్ఛను ప్రభుత్వ సంస్థలు ఉల్లంఘించడం ప్రమాదకరమని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలు మరోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇక, ఇప్పటివరకు జరిగిన ఉల్లంఘనలకు 15లక్షల రూపాయల జరిమానా విధించాల్సి ఉన్నప్పటికీ, కేవలం 5లక్షలు మాత్రమే విధిస్తున్నట్లు ట్రిబ్యునల్ ప్రకటించింది టీడీశాట్ ఆదేశాలు ఇలాగుంటే, ప్రభుత్వ పెద్దలపైనే ఆ రెండు న్యూస్ ఛానెళ్లు ఆరోపణలు చేస్తున్నాయి. జగన్ సర్కారు ఒత్తిడితోనే ఎంఎస్ వోలు ప్రసారాలను నిలిపివేశారని, మంత్రులే స్వయంగా ఆపరేటర్లపై బెదిరింపులకు దిగారని అంటున్నాయి. ఒక ఛానెల్ అయితే, ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డినే నేరుగా టార్గెట్ చేస్తోంది. ఆ ఛానెల్ కనిపించడానికి అసలు వీల్లేదంటూ స్వయంగా జగనే హుకుం జారీ చేశారని చెబుతోంది. మరి, ఈ ఛానెళ్ల నిషేధం వివాదం ఎక్కడివరకు పోతుందో చూడాలి.

జైల్లో ఉన్నప్పుడే తన బలమేంటో చూపించారు... ఇప్పుడు ప్రభుత్వాధినేతగా... జగన్ పై సీబీఐ వాదనలు

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ...జైల్లో ఉన్నప్పుడే తన బలమేంటో చూపించారని, ఇప్పుడు ప్రభుత్వాధినేతగా మరింత ప్రభావితం చేస్తారంటూ సీబీఐ వాదనలు వినిపించింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టులో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. జగన్ జైల్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని, ఇప్పుడు ప్రభుత్వాధినేతగా మరింతగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని సీబీఐ గట్టిగా వాదించింది. వాస్తవాలను దాచిపెట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారంటూ సీబీఐ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర విభజనతో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, ఇది అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమంటూ సీబీఐ... కోర్టుకు తెలిపింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనేక సౌకర్యాలు కల్పిస్తారని, ఆ సౌకర్యాలతో వారానికోసారి విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం పెద్ద కష్టమేమీ కాదని సీబీఐ వాదించింది. జగన్ పిటిషన్ పై తీవ్ర అభ్యంతరం తెలిపిన సీబీఐ... ఏపీలో రెవెన్యూ లోటు కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరడం సరికాదని తెలిపింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వ్యక్తిగతంగా హాజరుకావడం ఎంతో అవసరమన్న సీబీఐ.... జగన్ పిటిషన్ ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని కోరింది.

కలిసిపోయిన ఫోర్డ్ మరియు మహింద్ర

  భారతదేశం నుండి జనరల్ మోటార్స్ మరియు ఫియట్ నిష్క్రమించిన తరువాత, ఫోర్డ్ మోటార్ కంపెనీ ఇప్పుడు దేశంలో తన స్వతంత్ర కార్యకలాపాలను ఆపేయాలని నిర్ణయించింది, భారతదేశంలోని తన ఆస్తులను మహీంద్రా మరియు మహీంద్రా (ఎం అండ్ ఎం) లతో జాయింట్ వెంచర్ (JV) గా తరలించడానికి అంగీకరించింది. అందులో 51% నియంత్రణ వాటాను ఫోర్డ్ మోటార్ కంపెనీ కలిగి ఉంటుంది. భారతదేశంలో ఫోర్డ్ బ్రాండ్ వాహనాలను అభివృద్ధి చేయడానికి, మార్కెట్ చేయడానికి, పంపిణీ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా అధిక-అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఫోర్డ్ బ్రాండ్ మరియు మహీంద్రా బ్రాండ్ వాహనాలను రూపొందించడానికి రెండు కంపెనీలు ఒక ఖచ్చితమైన ఒప్పందంపై సంతకం చేశాయి. "ఫోర్డ్ తన ఇండియా కార్యకలాపాలను జాయింట్ వెంచర్‌కు బదిలీ చేస్తుంది,  చెన్నై, సనంద్‌లోని సిబ్బంది మరియు అసెంబ్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి అవి ఈ జాయింట్ వెంచర్లో లీనమవనున్నాయి. ఫోర్డ్ సనంద్‌లోని ఫోర్డ్ ఇంజిన్ ప్లాంట్ కార్యకలాపాలతో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ యూనిట్ ఫోర్డ్ క్రెడిట్ మరియు ఫోర్డ్ స్మార్ట్ మొబిలిటీని నిలుపుకుంటుంది ” అని రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. 1990 ల ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థ తొలినాళ్ళలో భారతదేశంలోకి ప్రవేశించిన మొట్టమొదటి ప్రపంచ కార్ల కంపెనీలలో ఒకటిగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్స్ మార్కెట్లో చౌకైన, ఇంధన-సమర్థవంతమైన వాహనాలతో పోటీ పడటానికి ఫోర్డ్ చాలా కష్టపడింది. "మహీంద్రా మరియు ఫోర్డ్ కలిసి రావడం రెండు సంస్థల మధ్య సహకారం మరియు పరస్పర గౌరవం యొక్క సుదీర్ఘ చరిత్రకు నిదర్శనం" అని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. "మా ఉమ్మడి బలాలు - విలువ-కేంద్రీకృత ఇంజనీరింగ్‌లో మహీంద్రా యొక్క నైపుణ్యం మరియు దాని విజయవంతమైన ఆపరేటింగ్ మోడల్, ఫోర్డ్ యొక్క సాంకేతిక నైపుణ్యం, గ్లోబల్ రీచ్ మరియు భవిష్యత్ టెక్నాలజీకి  శక్తివంతమైన మిశ్రమం" అని ఆయన చెప్పారు.

ఎట్టకేలకు మీడియా ముందుకు ఉండవల్లి... జగన్ కు సూచనలు-హెచ్చరికలు

  చంద్రబాబు హయాంతో మాటిమాటికీ మీడియా ముందుకొచ్చి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా మీడియా ముందుకు ఎందుకు రాలేదంటూ అనేక విమర్శలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకవైపు ఇసుక విధానం ఆలస్యం... మరోవైపు ఇసుక కొరత కారణంగా దాదాపు 50లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడి అల్లాడిపోతుంటే... ఈ మేధావి ఎందుకు మీడియా ముందుకొచ్చి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని నిలదీసినవాళ్లున్నారు. రివర్స్ టెండరింగ్, పీపీఏల సమీక్ష, పోలవరం ప్రాజెక్టు వివాదం, రాజధాని అమరావతి గొడవ, విద్యుత్ కోతలు, ఆశావర్కర్ల ఆందోళనలు, రాజకీయ వేధింపులు... ఇలా వంద రోజుల్లో వందకు పైగా అరాచకాలు చేశారంటూ ఒకపక్క విపక్షాలు... మరోపక్క ప్రజలు గగ్గోలు పెడుతుంటే... ఈ మేధావి అసలెందుకు ఒక్క చిన్న ప్రెస్ మీట్ పెట్టి తన వాయిస్ ఎందుకు వినిపించలేదని ఎంతోమంది ప్రశ్నించారు. చివరికి ఉండవల్లిపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా సర్క్యులేట్ అయ్యాయి. మరి ఇవన్నీ ఉండవల్లికి చేరాయో లేదో తెలియదు గానీ మొత్తానికి జగన్ పరిపాలనపై తన ఫస్ట్ రియాక్షన్ బయటపెట్టారు. జగన్ పాలనపై ఇప్పటివరకు పొగిడేందుకు గాని.... తిట్టేందుకు కానీ ఏమీ లేదంటూ సేఫ్ సైడ్ కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, అలాగని అంతా బాగుందని చెప్పడానికి కూడా లేదంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. అయితే, ఇసుక కొరత, విద్యుత్ కోతలు జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చాయని అన్నారు. ఇక, నవరత్నాల అమలులో ఏ చిన్న తేడా వచ్చినా తీవ్ర ప్రజావ్యతిరేకత తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. పీవీ, ఎన్టీఆర్ కూడా 50శాతానికి పైగా ఓట్లతో ముఖ్యమంత్రులైనా తొమ్మిదే తొమ్మిది నెలల్లో దిగిపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇప్పుడు జగన్ నైనా దింపేస్తారంటూ చరిత్రను గుర్తుచేస్తూ కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడున్న 151మంది ఎమ్మెల్యేల బలాన్ని చూసుకుని... ఇదే శాశ్వతమని భావించొద్దని జగన్ ను హెచ్చరించారు. ప్రజల్లో మంచి పేరుతోపాటు ఎమ్మెల్యేల మనసు కూడా గెలుచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి... తమ మాటను వింటున్నారనే విశ్వాసం ఎమ్మెల్యేల్లో కలగాలన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలను పట్టించుకోకపోతే పీవీ నర్సింహరావు, ఎన్టీ రామారావుకి పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు.  ఇక, ఇసుక కొరత, విద్యుత్ కోతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్న ఉండవల్లి... కారణాలు ఏమైనప్పటికీ ప్రజలకు అవసరం లేదని, అంతిమంగా ఫలితమే ముఖ్యమన్నారు. అలాగే, నవరత్నాల్లో ఏ ఒక్కటి అమలు జరగకపోయినా సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమన్నారు. ఇక, ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యవస్థలు సరిగా లేవన్న ఉండవల్లి... ముందు వాటిని సరిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. మొత్తానికి కొంత బ్యాలెన్స్ డ్ గా ఉండవల్లి తన ఫస్ట్ రియాక్షన్ ను బయటపెట్టారు. ఒకపక్క సూచనలు ఇస్తూనే... మరోపక్క హెచ్చరించారు.

ఇకపై  మారనున్న బ్యాంక్ పనివేళలు

  బ్యాంక్ పనివేళల సమయాన్ని పెంచుతూ ఆర్ బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ ద్వారా ఎంతయినా లావాదేవీలు జరుపుకోవచ్చు. కమిషన్ కూడా తగ్గిస్తూ వ్యాపార వర్గాలకు ఆర్ బీఐ శుభవార్త చెప్పింది. అక్టోబరు ఒకటి మంగళవారం నుండి ప్రభుత్వ రంగ బ్యాంకులు పని వేళల్లో మార్పులు జరగనున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళల్లో ఒకటి ఎంపిక చేసుకొనే అమలు చేస్తారు. దేశం లోని నాలుగు జిల్లాల్లో ఖాతాదారుడు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు అక్టోబరు మూడు నుంచి ఏడు దాకా ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర బ్యాంకర్ల సమితి కన్వీనర్ కెవి నాంచారయ్య తెలిపారు. విజయవాడ లోని ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ మణిమాల, ఎస్ బీఐ ఏజీఎం డీజే ప్రసాద్ ,ఆంధ్రా బ్యాంక్ డీజీఎం వెంకటేశ్వర స్వామి, ఎస్ ఎల్ బిసి ఏజీఎం కె అజయ్ పాల్ తదితరులు విలేకరులతో మాట్లాడారు భారత బ్యాంకర్ల సంఘం సూచనల మేరకు మూడు రకాల పనివేళలు రూపొందించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఐదు గంటల వరకు పనిచేయనున్నాయని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోని జిల్లా స్థాయి సంప్రదింపుల సమితి లో చర్చించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కి పంపిస్తారు. వారి ఆమోదంతో ఈ పనివేళలు అమలు చేస్తారు. అకౌంట్ హోల్డర్ లు సివిల్స్ స్కోర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇందులో రైతులకు కూడా మినహాయింపు లేదు. ప్రకృతి వైపరీత్యాలు రుణాల రీషెడ్యూల్ బట్టి అంశాలను పరిగణలోనికి తీసుకుని స్థానిక బ్యాంకు మేనేజర్ లు సానుకూల నిర్ణయం తీసుకుంటారు.

సీఎం జగన్ కి బాబు లేఖ.. రాజకీయాలు మాని నిధులు విడుదల చేయండి

  ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఉపాధి హామీ పథకం పనుల నిలిపివేత, పెండింగ్ బిల్లులపై టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఉపాధి హామీ పనులు, పెండింగ్ బిల్లుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరితో జీవనోపాధి లేక నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రద్దులు, కూల్చివేతలు, నిలిపివేతలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని విమర్శించారు. రాజకీయాలు మాని వెంటనే ఉపాధిహామీ నిధులు విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. గత నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పారు. కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  క‌న్వెర్షన్ విధానంతో 22 శాఖ‌ల్లో నిధుల‌ను మ‌హాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ ప‌థ‌కానికి అనుసంధానించి అన్ని గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్పనకు కృషి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిద‌ని చెప్పుకొచ్చారు. త‌మ హ‌యాంలో దేశానికి ఏపీ ఒక న‌మూనాగా మార‌డంతోపాటు వంద‌కుపైగా అవార్డుల‌ను సాధించిన‌ట్టు చంద్రబాబు లేఖ‌లో పేర్కొన్నారు.

అప్పుడు 'కావాలి జగన్, రావాలి జగన్'.. ఇప్పుడు 'కావాలి ఇసుక, రావాలి కరెంటు'

  ఏపీలో కరెంట్ కోతలపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. "రివర్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారూ, పవర్లోకి వచ్చిన మీరు సరికొత్త పాలన అంటుంటే ఏంటో అనుకున్నాం. 4 నెలల్లోనే పవర్ కట్ లతో కొవ్వొత్తులు, విసనకర్రల కాలానికి తీసుకెళ్లి అందరికీ అన్నింటా 'కోత' పాలన చూపిస్తున్నారు. తెదేపా హయాంలో కరెంటుపోతే విచిత్రం.. మీ జమానాలో కరెంటు ఉంటే అదృష్టం." అని లోకేష్ ఎద్దేవా చేసారు. "ఆంధ్రప్రదేశ్ ని అంధకారప్రదేశ్ గా మార్చిన ఘనత మీ సొంతం. విద్యుత్ కోతలు అలా పల్లెల నుంచి పట్టణాల వరకూ పెంచుకుంటూ పోతున్నారు. అధికారం మత్తు, అనుచరుల భజనల మధ్య మీకు వినిపించడంలేదు కానీ, కావాలి ఇసుక, రావాలి కరెంటు అంటూ జనం హై పిచ్ లో పాడుతున్నారు." అంటూ మరో ట్వీట్లో సెటైర్లు వేశారు.

మంత్రుల పేషీలపై నిఘా... సెక్రటేరియట్ ను సాక్షి ఉద్యోగులతో నింపేస్తున్న జగన్.!

  మొదట్నుంచీ మంత్రుల కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచుతోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ఏకంగా వాళ్ల పేషీలపైనే నిఘా పెట్టారట. మంత్రుల ప్రతీ కదలికా తనకు తెలిసేలా పేషీలను తన మనుషులతో నింపేస్తున్నారట. కొందరు మంత్రులు, వాళ్ల పీఎస్ లు, పీఏలు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావడంతో... తనకు నమ్మకస్తులైన వాళ్లను అమాత్యుల కార్యాలయాల్లో పీఆర్వోలుగా నియమించే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ముఖ్యమంత్రి సలహాదారు జీవీడీ... పీఆర్వోల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు చెబుతున్నారు. సాక్షి ఉద్యోగులనే మంత్రుల పేషీల్లో పీఆర్వోలుగా నియమించేందుకు రంగంసిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు కీలక విభాగాల్లో సాక్షి ఉద్యోగులను నియమించి సీనియర్ ఐఏఎస్ లను మించి లక్షల్లో జీతాలు కట్టబెడుతోన్న జగన్మోహన్ రెడ్డి... ఇఫ్పుడు సాక్షి విలేకరులను మంత్రుల పేషీల్లో పీఆర్వోలుగా నియమించాలని నిర్ణయించారట. వీళ్లంతా ఒకట్రెండు రోజుల్లోనే మంత్రుల పేషీల్లో విధుల్లోకి చేరనున్నట్లు తెలుస్తోంది. జగన్ మనుషులు... మంత్రుల పేషీల్లో అడుగుపెడితే, ఇకపై సెక్రటేరియట్ లో జరిగే ప్రతి కదలిక... ముఖ్యంగా మంత్రులను ఎవరెవరు కలుస్తున్నారు... ఏమేం చేస్తున్నారు... అనే సమాచారం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరనుంది. అయితే, సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు మంత్రులకు ఇబ్బందికరంగా మారుతున్నాయట. తాము పేరు మాత్రమే మంత్రులమని, అన్నీ నిర్ణయాలు ముఖ్యమంత్రే తీసుకుంటున్నారని వాపోతున్నారట. అయితే, చంద్రబాబు హయాంలోనూ మంత్రుల పేషీల్లో తన మనుషులను ఎమ్మెల్వోలుగా నియమించి, పేషీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ మంత్రులు మాత్రం బాబు నియమించిన పీఆర్వోలను, ఎమ్మెల్వోలను తిరస్కరించారు. తమకు నచ్చినవారినే నియమించుకున్నారు. అలాగే, సీనియర్ మంత్రులు కూడా తమ మనుషులనే పేషీల్లో అపాయింట్ చేసుకున్నారు. దాంతో, చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు జగన్ నియమిస్తున్న పీఆర్వోలు, ఎమ్మెల్వోలను మంత్రులు స్వీకరిస్తారో? లేక తిరస్కరిస్తారో? చూడాలి.

హర్ట్ అయిన పోలీసు అధికారి.. విజయవాడలో అర్ధనగ్న ప్రదర్శన

  తన తప్పు లేకపోయినా మందలించారన్న మనస్తాపంతో ఓ పోలీసు అధికారి అర్ధనగ్న ప్రదర్శనకు దిగిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఈ ఘటన గత రాత్రి 11 గంటల సమయంలో దుర్గగుడి ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ మంత్రి అనుచరులు కొందరు ఉత్సవ కమిటీ కార్లలో వస్తుండగా సదరు పోలీసు అధికారి అడ్డుకున్నారు. దీంతో వారు మంత్రికి ఫోన్ చేయడంతో.. ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు మంత్రి అనుచరులు వెళ్తున్న కార్లను ఆపిన పోలీసు అధికారికి ఫోన్ చేసి మందలించారు. తన తప్పు లేకున్నా మందలించడంతో ఆ పోలీస్ అధికారి మనస్తాపానికి గురయ్యారు. తాను ఎటువంటి తప్పూ చేయలేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయిస్తామంటూ పై అధికారులు మండిపడ్డారని సదరు పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, మనస్తాపంతో చొక్కా విప్పి నిరసన తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ అది నిరసన కాదని, అతడు ఫిట్స్ వచ్చి పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పడం కొసమెరుపు.

ఒక్క రూపాయికే ఎకరం భూమా? కేసీఆర్ సర్కారుకు హైకోర్టు నోటీసులు

  కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోట్ల రూపాయల విలువైన భూమిని అత్యంత చౌకగా ఎలా కేటాయిస్తారంటూ మండిపడింది. హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి భూముల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు వివరణ కోరింది. ఎకరం రూపాయి చొప్పున శారదా పీఠానికి రెండు ఎకరాలు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేవలం రూపాయికే ఎకరం భూమిని కట్టబెట్టడంలో ప్రభుత్వ వైఖరి ఏంటో తెలపాలని ఆదేశించింది. 2019 జూన్ 22న హైదరాబాద్ కోకాపేటలో రెండెకరాలను ఎకరం రూపాయి చొప్పున శారదా పీఠానికి కేటాయిస్తూ టీఆర్ఎస్ సర్కారు జీవో 71 జారీ చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని, జీవో 71ను సవాలు చేస్తూ, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కోకాపేటలో ఎకరం భూమి కోట్లల్లో ఉందని, అలాంటిది కేవలం ఒక్క రూపాయికే ఎలా కట్టబెడతారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీవో 71ను కొట్టివేసి, శారదా పీఠానికి చేసిన భూకేటాయింపులను రద్దుచేయాలని పిటిషనర్ కోరాడు. దాంతో శారదా పీఠానికి భూముల కేటాయింపుపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ కోర్టు ఆదేశించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోపాటు శారదాపీఠం ధర్మాధికారికి నోటీసులసు ఇచ్చింది.

పయ్యావుల కేశవ్ సొంతూరులో అలజడి... గ్రామాన్ని విడగొట్టేందుకు ప్రయత్నాలు...

  ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో అలజడి రేగింది. రాజకీయ కారణాలతో గ్రామాన్ని రెండుగా విడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, రాసిపల్లి, మైలారంపల్లి గ్రామాలు ఉన్నాయి. దాదాపు 5వేలకు పైగా జనాభా ఉన్న పెద్ద కౌకుంట్ల మొదట్నుంచీ మేజర్ పంచాయతీగా కొనసాగుతోంది. అయితే, జగన్మోహన్ ‌‌రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలంటూ వైసీపీ వర్గాలు డిమాండ్ రావడంతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే, గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయారు. పెద్ద కౌకుంట్ల... ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వగ్రామం కావడం... ముందునుంచీ టీడీపీకి పట్టు ఉండటంతో... తెలుగుదేశం వర్గీయులు.... మేజర్ పంచాయతీగానే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైసీపీ వర్గీయులు మాత్రం వై.రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. దాంతో గ్రామస్తులు...పార్టీల వారీగా విడిపోయి రగడకు దిగారు. అయితే, పెద్ద కౌకుంట్ల... టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సొంత గ్రామం కావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ప్రజాభిప్రాయసేకరణకు రావడంతో పెద్ద కౌకుంట్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వయంగా రంగంలోకి దిగి, తెలుగుదేశం శ్రేణులకు అండగా నిలిచారు. అయితే, గ్రామస్తులు... పార్టీల వైజ్‌... రెండు వర్గాలుగా విడిపోయి... వాదోపవాదాలకు దిగడంతో... ఉద్రిక్తత మధ్యే అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో... మొత్తం 1672మంది పాల్గొంటే, వై.రాంపురం గ్రామాన్ని... పెద్ద కౌకుంట్ల పంచాయతీలోనే కొనసాగించాలని 1522మంది కోరగా, కేవలం 150మంది మాత్రమే ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. దాంతో, గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఉరవకొండ ఎంపీడీవో తెలిపారు. ఇదిలాఉంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, పచ్చని గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి పనిగట్టుకుని... తమ గ్రామాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో మరో అరెస్ట్... ఆడియో టేపులపై దర్యాప్తు

  ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో మరొకర్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏడుగురిని రిమాండ్ కి పంపిన ఏసీబీ... తాజాగా ఈఎస్‌ఐ సీనియర్ అసిస్టెంట్‌ సురేంద్రనాథ్‌బాబును జైలుకు పంపింది. ఈఎస్‌ఐ డైరెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సురేంద్రనాథ్‌బాబు... డైరెక్టర్ దేవికారాణి చెప్పినట్లు మొత్తం కథ నడిపించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించకుండానే తప్పుడు బిల్లులతో కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తేల్చారు. ఆర్సీపురం బ్రాంచ్‌లో ఉద్యోగిగా ఉన్న సురేంద్రనాథ్‌... అనధికారికంగా డైరెక్టర్ కార్యాలయంలో పనిచేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే, నకిలీ బిల్లులు సృష్టించాలని ఈఎస్‌ఐ డాక్టర్స్‌ను సురేంద్రనాథ్‌బాబు బెదిరించినట్లు తేల్చిన ఏసీబీ అధికారులు... ఆడియో టేపులపైనా దర్యాప్తు జరుపుతున్నారు. ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి డిస్పెన్సరీ కేంద్రంగా జరిగిన కుంభకోణంలో రెండు వందల కోట్లపైనే అవినీతి జరిగినట్లు గుర్తించారు. డైరెక్టర్ స్థాయి నుంచి సెక్షన్ ఆఫీసర్ వరకు ముడుపులు అందినట్లు ఆధారాలతో సహా సేకరించారు. 2015లో దేవికారాణి డైరెక్టర్‌‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ఈ స్కామ్ మొదలైనట్లు గుర్తించారు. ఇక, ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణిని అడ్డంపెట్టుకుని ఫార్మాసిస్టులు అందినకాడికి దోచుకున్నట్లు రికార్డుల్లో తేలింది.

కేసీఆర్ ని టెన్షన్ పెట్టిస్తున్న ఖమ్మం.. తుమ్మల, పొంగులేటి.. ఇద్దరిలో ఎవరో ఒక్కరే!!

  తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకొని ఘన విజయం సాధించింది. అయితే  ఖమ్మం జిల్లాలో మాత్రం మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. రాష్ట్రమంతా కారు టాప్ గేరులో దూసుకుపోతే.. ఖమ్మంలో మాత్రం ఫస్ట్ గేర్ లోనే బ్రేకులు పడ్డాయి. దీంతో కేసీఆర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అనూహ్యంగా లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరింది. 'సారు కారు పదహారు' అంటూ లోక్ సభ పోరుకి హుషారుగా దూసుకెళ్లిన టీఆర్ఎస్ కు.. బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో షాకిచ్చాయి. కానీ ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో ఖమ్మం ఫలితాలు గులాబీ బాస్ కి ఎప్పటికీ అంతుబట్టని ఓ ప్రశ్నలా మిగిలిపోయాయి. ఖమ్మం జిల్లా ఫలితాలే కాదు, రాజకీయాలు కూడా కేసీఆర్ కి అంత ఈజీగా అర్థంకావట్లేదని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీటే గెలిచినప్పటికీ.. తరువాత ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో బలపడింది. ఆ బలం ఎంపీ సీటు గెలవడానికి ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్.. తరువాత టీఆర్ఎస్ లో చేరి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో.. జిల్లాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి వారి ఓటమికి కారణమయ్యారని ఆరోపణలున్నాయి. దీంతో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. ఎన్నిక‌ల ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వ‌ర‌రావుకి టికెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి టీఆర్ఎస్ ని వీడరతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఆయనకు రాజ్యసభ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో పార్టీని వీడే ఆలోచనను అప్పుడు పొంగులేటి పక్కన పెట్టారని వార్తలొచ్చాయి. మరోవైపు సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లాలో ప‌ట్టు నిలుపుకుంటున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, మాజీ మంత్రి, జిల్లాలో సీనియర్ నేతగా మంచి పట్టు, తనున్న పార్టీ అధికారంలో ఉండటం.. అయితే ఇన్నున్నా తనకి ప్రస్తుతం ఏ పదవి లేకపోవడంతో తుమ్మల అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తనకి మళ్లీ మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తారనుకున్నారట. కానీ కేసీఆర్ మాత్రం.. ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు. దీంతో తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. మరోవైపు తుమ్మలకి కూడా రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే తుమ్మల మొదటినుండి కేంద్ర రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు కాదు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడి మేనేజ్ చేయడం కష్టం అనేవాళ్ళు. మరి అలాంటి తుమ్మలను.. ఇప్పుడు రాజ్యసభకు పంపుతానంటే అంగీకరిస్తారా అంటే అనుమానమే. ప్రస్తుతం తుమ్మల, పొంగులేటి ఇద్దరిది ఇంచుమించు ఒకటే పరిస్థితి. జిల్లాలో పట్టుంది కానీ పదవి లేదు. ఒకవేళ భవిష్యత్తులో పదవి దక్కినా ఇద్దరిలో ఎవరో ఒక్కరికే దక్కే అవకాశముంది. దీనికితోడు జిల్లాలో వీరిద్దరి మధ్య వర్గపోరు కూడా నడుస్తుందని అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ ని వీడి బీజేపీ గూటికి చేరే అవకాశముందని అంటున్నారు. తుమ్మలకు ఆయన అనుచరులు పార్టీ మారమని సూచిస్తున్నారట. ఇప్పటికే తుమ్మల సమీప బంధువు గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరడంతో.. ఆయన ద్వారా సంప్రదింపులు జరిపి బీజేపీలో చేరే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి. మరోవైపు పొంగులేటి అనుచరులు కూడా పార్టీ మారాలని ఆయన మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో పొంగులేటి బీజేపీలో చేరే ఆలోచనలో పడ్డారట. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ రెండు స్థానాలకు అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. మరి ఆ పోటీలో పొంగులేటికి అవకాశం దక్కుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీజేపీలో చేరడం కరెక్ట్ అని భావిస్తున్నారట. మరి తుమ్మల, పొంగులేటి ఇద్దరిలో ఎవరో ఒకరు బీజేపీలో చేరతారో లేక ఇలాగే టీఆర్ఎస్ లో కొనసాగుతారో చూడాలి. మొత్తానికి ఖమ్మం రాజకీయాలు గులాబీ బాస్ ని తెగ కలవరపెడుతున్నాయట.

కొందరి కోసం లక్షల మందిని దూరం చేసుకుంటున్న జగన్!!

  గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా లక్షకు పైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించడం రికార్డు అని ఏపీ ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది. సచివాలయాల వ్యవస్థతో తమ పార్టీకి ఇటు యువతలో, అటు గ్రామ ప్రజల్లో బోలెడంత మైలేజ్  వస్తుందని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ప్రజల అభిప్రాయం పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు.. సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీ, ఒకే సామజిక వర్గానికి పెద్ద పీట ఇలా పలు కారణాలు ఉన్నాయి అంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం యువత పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. దాదాపు 20 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. వారిలో లక్ష మందికి పైగా (1,26,738) ఎంపిక అయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ లోపంతో ఎక్కువ మంది అర్హతలేని వారు ఉద్యోగానికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, తన సానుభూతి పరులకు ముందే పేపర్ లీక్ చేసి పరీక్ష రాయించారని ప్రచారం జరిగింది. మొదటి 250 ర్యాంకుల్లో ఒకే సామజిక వర్గానికి చెందినవారు 190 కి పైగా ఉండటంతో లీకేజీ అనుమానాలు బలపడ్డాయి. దీంతో స్వల్ప తేడాతో ఉద్యోగం చేజారిన వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అర్హులైన వారిని పక్కనపెట్టి.. తమ పార్టీ సానుభూతిపరులకు, తమ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ భావిస్తున్నట్లు సచివాలయాల వ్యవస్థ వల్ల అధికార పార్టీకి మైలేజీ వస్తుందన్న సంగతి పక్కన పెడితే.. బోలెడంత నెగటివ్ ఇమేజ్ వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరీక్ష నిర్వహణ లోపం, ఫలితాలపై కులముద్ర పడటంతో మిగతా కులాల వారిలో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 18 లక్షల మందికి పైగా నిరాశ తప్పలేదు. ఎంపికైన లక్షమంది మరియు వారి కుటుంబాలు జగన్ సర్కార్ పట్ల ఎంత సానుకూలంగా ఉంటారో.. అంతకు పదింతలు ఎంపిక కాని లక్షల కుటుంబాల వారు జగన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండే అవకాశముంది. పరీక్ష నిర్వహణ లోపం వల్లే తమకు ఉద్యోగం దక్కలేదని మెజారిటీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అది జగన్ సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంపిక కాని అభ్యర్థులు జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సొసైటీ మీద సోషల్ మీడియా ప్రభావం బలంగా ఉంది. అంతెందుకు వైసీపీ అధికారంలోకి రావడంలో కూడా సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడదే సోషల్ మీడియాలో యువత జగన్ సర్కార్ పై తిరగబడుతోంది. ఇది మరింత ఉధృతమైతే వైసీపీకి తీవ్ర నష్టమని చెప్పక తప్పదు. ఓ రకంగా సచివాలయ వ్యవస్థ కూడా ఇసుక మాదిరిగానే లక్షల కుటుంబాలపై ప్రభావం చూపి వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారనుందని చెప్పాలి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు నిలిచిపోయాయి. లారీ డ్రైవర్లు, కూలీలు ఇలా లక్షల కుటుంబాలు పని దొరక్క రోడ్డున పడ్డాయి. వారంతా జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సచివాలయ ఉద్యోగాలు దక్కని అభ్యర్థుల కుటుంబాలు కూడా చేరితే.. జగన్ మరింత గడ్డు కాలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అసలు గ్యాప్ వస్తే కదా... భర్తీ అవడానికి

కొణిదెల అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయని కొన్నాళ్లుగా మీడియాలో వినిపించే మాట. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన సమయంలో మెగా బ్రదర్స్ మధ్య చీలిక వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే, అన్నయ్య చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహారెడ్డి'కి తమ్ముడు పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంతేనా? అన్నయ్య పుట్టినరోజు వేడుకలకు అతిథిగా హాజరయ్యాడు. 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరు ఎన్ని రికార్డులు బద్దులుకొట్టినా చిరంజీవిగారి అనుభవాన్ని కొట్టలేరని ఆవేశంగా మాట్లాడాడు. దాంతో అన్నదమ్ముల మధ్య గ్యాప్ భర్తీ అయినట్టేనని చాలామంది వ్యాఖ్యానించారు. 'మీకు, మీ తమ్ముడికి మధ్య గ్యాప్ భర్తీ అయినట్టేనా?' అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవిని ప్రశ్నిస్తే... "అసలు గ్యాప్ వస్తే కదా... భర్తీ అవడానికి" అని సమాధానం ఇచ్చారు. అదంతా మీడియా సృష్టేనని, అటువంటి వార్తలు బాధ కలిగిస్తాయని ఆయన అన్నారు. అయితే, అమ్మ దగ్గర కలిసినప్పుడు వాటి గురించి నవ్వుకుంటామని చిరంజీవి అన్నారు. తమ్ముడితో రాజకీయ చర్చలు ఉండవని, రావని ఆయనస్పష్టం చేశారు. ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారన్న ప్రశ్నకు 'సినిమా పార్టీ' అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.

సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాల్ని అందజేసిన సీఎం జగన్

  పరిపాలనలో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చి గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తామన్న వైసీపీ సర్కార్ వాటికి ఎంపికైన ఉద్యోగులకు నియామక పత్రాల్ని అందజేసింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా ఉద్యోగులకు నియామక పత్రాల్ని అందజేశారు. కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం నిజంగా దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే ఒక చరిత్ర సృష్టించే రికార్డ్ అని గర్వంగా చెప్పారాయన. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం పెట్టడం, తద్వారా ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి పది నుంచి పన్నెండు కొత్త గవర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వగలిగారన్నారు. ఇది కాక ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇవ్వడం జరిగిందని, ఇది ఉద్యోగాల చరిత్రలో ఓ సరి కొత్త రికార్డు అని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు తిరగక మునుపే అక్షరాలా నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. ఈ రికార్డు మరింత గొప్పగా, మరింత గర్వపడేలా ఉండాలంటే ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగంగా తీసుకోకుండా, ఒక ఉద్యమం మాదిరిగా తీసుకోవాలి అని జగన్ అన్నారు. సొంత మండలంలోనే ప్రభుత్వ ఉద్యోగం చేసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుందని, ఉద్యోగం వచ్చిన ప్రతీ ఒక్కరూ అలాంటి గొప్ప అదృష్టవంతులు అని, కాబట్టి తమ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి అని జగన్ ఉద్యోగస్తులకు సూచించారు. ఉద్యోగ పరిసర ప్రాంత ప్రజల కోసం ఆలోచన చేయండని, అక్కడి ప్రజల కోసం చిత్తశుద్ధితో నిజాయితీగా లంచాలు లేని, వివక్ష లేని, పారదర్శక పాలన అందించమని ఉద్యోగస్తులను కోరారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోరు... తాము ఎవరికీ కొమ్ము కాయడం లేదు

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోరులో నామినేషన్ ఘట్టం ముగియనుంది. నామినేషన్ సమర్పణకు ఈరోజే ఆఖరు తేది, మరోవైపు పొత్తులు, యుక్తులతో ఉప ఎన్నికలను రాజకీయ పార్టీ నేతలు క్రమంగా వేడెక్కిస్తున్నారు.  తమ అభ్యర్థికి మద్దతు ప్రకటించారని టి.ఆర్.ఎస్ ఇప్పటికే సీబీఐ ని కోరింది. ఓటమి భయంతోనే టీ.ఆర్.ఎస్ పొత్తులకు వెళుతోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది, మరోవైపు మేము బరిలో ఉన్నామంటోంది టిడిపి. హుజూర్ నగర్ లో నామినేషన్ లకు ఈరోజే ఆఖరు తేదీ కావడంతో పోలీసు బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేశారు. అనుమతి లేని ర్యాలీలు, సభలపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఎస్పీ వెంకటేశ్వరులు. ఎన్నికల నిర్వహణ లో పారదర్శకంగా ఉంటామన్నారు. ఎన్నికల నేపథ్యంలో హుజూర్ నగర్ లో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ ఉప ఎన్నికలు పొలిటికల్ గా సెన్సిటివ్ కాబట్టి ఎన్ ఫోర్స్ మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో పదమూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయటం జరిగిందని, దీంట్లో ఐదు చెక్ పోస్టులు ఆంధ్రా బోర్డర్ తో కలిసున్నాయని ఇప్పటికే నలభై మూడు లక్షల క్యాష్, లిక్కర్ ను కూడా సీజ్ చేయటం జరిగిందని ఎస్పీ తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వస్తున్న ఉదంతుల నేపథ్యంలో ఎస్పీ మాట్లాడుతూ, తాము ఎవరికీ కొమ్ము కాయడం లేదని, నిజం నిప్పులాంటిదని, తాము పారదర్శకంగా ఉంటున్నామని తెలిపారు. తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వెంకటేశ్వరులు అన్నారు.

చివరికి కేసీఆర్ కి ఆ తోక పార్టీనే కావాల్సి వచ్చింది!!

  హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం, ఆయన సతీమణి బరిలో దిగడంతో.. ఎలాగైనా గెలిచి తమ సత్తా చూపాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా.. హుజూర్‌నగర్‌ లో గెలిచి ఉత్తమ్ కి గట్టి షాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. అందుకే ఉన్న ఏ అవకాశాన్ని టీఆర్ఎస్ వదులుకోవట్లేదు. హుజూర్‌నగర్‌ లో తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర నాయకత్వానికి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ నాయకులు కె.కేశవరావు, నామా నాగేశ్వర రావు, బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆదివారం సీపీఐ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితర నేతలతో భేటీ అయ్యి చర్చలు జరిపారు. కాగా, అక్టోబరు ఒకటో తేదీ సీపీఐ కార్యవర్గం సమావేశమై టీఆర్‌ఎస్‌ వినతిపై నిర్ణయం తీసుకోనుంది. అయితే టీఆర్ఎస్ హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల కోసం సీపీఐ మద్దతు కోరడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలను తోక పార్టీలు అన్నారు. మరి ఇప్పుడు తోక పార్టీ అయిన సీపీఐ మద్దతు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అందితే తల, అందకపోతే తోక అన్నట్టు.. ఒకప్పుడు మీరు తోక అన్న పార్టీ తోడే ఇప్పుడు మీకు కావాల్సి వచ్చిందా అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.