'సైరా' క్రేజ్ తో చిక్కుల్లో పడ్ద పోలీసులు...

  సైరా సినిమా చూసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకున్న ఆరుగురు ఎస్సైలను, ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు అక్కడ ఉన్నతాధికారులు. కేవలం సినిమా చూస్తేనే శిక్ష ఉంటుందా అనుకోవచ్చు కానీ బందోబస్తుకు పంపిన పోలీసులు ఆ పని వదిలేసి సినిమాకూ పరుగులు తీస్తే చర్యలు తీసుకోమా అంటున్నారు అధికారులు. అవుకు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కొలిమిగుండ్ల ఐఎస్ఐ జగదీశ్వరెడ్డి, నందివర్గం ఐఎస్ఐ హరిప్రసాద్, బండి ఆత్మకూర్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య, రాచర్ల ఎస్ఐ ప్రీతంరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అశోక్ ను ఎస్పీ ఆఫీస్ కు  తరలించారు. బందోబస్తుకి పంపితే ఈ ఆరుగురు ఎస్ఐలు కోయిల కుంట్లలోని ఒక ఫంక్షన్ హల్లో విందు ఆరగించి సైరా నరసింహా రెడ్డి సినిమాకు వెళ్ళారు. డ్యూటిని వదిలి పెట్టి సినిమా చూశారనే దానిపై విచారణ జరుగుతుంది అందరూ కూడా తన దగ్గరకు వచ్చి ఈ రోజు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు ఎస్పీ .ఈ విచారణ తర్వాత వారి పై చర్యలు తీసుకుంటారా లేకుంటే క్షమాపనలతో  సరిపెడతారా అనేది తేలాల్సి ఉంది. ఎస్పీ దీనిపై స్పందిస్తూ ఎవరైన సినిమా చూస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ సెలవ పెట్టకుండా ఎవ్వరికీ చెప్పకుండా విధులు పక్కన పెట్టి సినిమా చూడటం అనేది చాలా తప్పు ఇది ప్రజలలో చాలా తప్పుడు సమాచారం తీసుకువెళ్తుందనేది తమ ఉద్దేశం అని వారు తెలియజేశారు. ప్రస్తుతం అయితే ఎస్పి దగ్గర విచారణ జరుగుతుంది. ఆరుగురు ఎస్ఐలు కూడా విచారణకు హాజరయ్యారు. విచారణ తరువాత ఏమి జరుగుతుంది అనేది తేలాల్సి ఉంది.

ఈఎస్ఐ స్కామ్ లో వెలుగులోకి వస్తున్న విషయాలు...

  ఈఎస్ఐ స్కామ్ లో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతోంది. నిందితుల ఇళ్లతో పాటు అనుమానితుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన డాక్యుమెంట్లు పరిచేజ్ ఇండెంట్లను నిందితుల ఇళ్లలో పట్టుబడ్డాయి. ఓమ్నీ మెడీకి చెందిన నిందితుడు నాగరాజు ఇంట్లో అధికారిక పత్రాలు ఇండెంట్లు పర్చేజ్ ఆర్డర్ లు దొరికాయి. అతని ఇంట్లోనే నలభై ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ఒరిజినల్ ఇండెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో తవ్విన కొద్ది మొత్తం అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే ఎనిమిది మందిని అటు ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మందికి సంభవించిన ఇళ్లల్లో సోదాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున పత్రాలను కూడా సోదా చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ స్కామ్ లో కీలకంగా ఉన్న ఓమ్ని మెడిఫార్మర్ కి సంబంధించినటువంటి ప్రతి నిధుల ఇళ్ళలలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలు చేయడం ప్రారంభించారు. దీనిలో ఇప్పటికే ఓమ్ని మెడీ ఫర్మర్ కు సంబంధించిన యజమాని బాబ్జిని ఏసీబీ అధికారు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఆ కంపెనీకి సంబంధించిన కొంతమంది ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల ఇండ్లలో పెద్ద మొత్తంలో సమాచారం ఉందని చెప్పి అటు బాబ్జీ చెప్పటంతో ఈ రోజు ఉదయం నుంచి అటు బాబ్జీకి సంబంధించిన ఉద్యోగుల ఇళ్ళలలో ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదా చేస్తున్నారు. ఈ సోదాలో ప్రధానంగా  మెడికల్ డైరెక్టరేట్ ఆఫీసులో ఉండాల్సిన పత్రాలు మొత్తం కూడా నాగరాజు చెప్పి మిడిఫార్మాకి  ఉద్యోగి ఇంట్లో మొత్తంగా నలబై ఆరు కోట్ల రూపాయలకు సంబంధినటువంటి పత్రాలు కూడా లభ్యం కావడం జరిగింది. ముందు ముందు ఈఎస్ఐ స్కామ్ లో ఏ ఏ విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.

ఆర్టీసి కార్మికుల డిమాండ్లపై మొదలయిన చర్చ...

  ఆర్టీసి కార్మికుల సమ్మె యోచనపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. వాళ్ళు ఆలోచన నుంచి బయటకు వచ్చేలా ముందుగానే చర్యలు చేపట్టింది. కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరుపుతోంది, నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఆర్.టి.సి సమస్యలపై రెండు గంటల పాటు చర్చించిన మంత్రి వర్గం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ ఐఏఎస్ లు సోమేష్ కుమార్, రామకృష్ణా రావు సునీల్ శర్మలతో చర్చలు జరపవచ్చు అని చెప్పింది. ఆ ఆదేశాల ప్రకారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో చర్చలు మొదలయ్యాయి. డిమాండ్ లకు సరే అని చెబితే సమ్మె విరమించుకుంటామని అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగ సంఘాల నేతల ముఖ్య డిమాండ్లు ప్రభుత్వంలో ఆర్.టి.సి కార్మికులను విలీనం చేయాలి, అలాగే కొత్తగా రిక్వైర్ మెంట్ లు తీసుకోవాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను అంగీకరిస్తే సమ్మె పూర్తిగా విరమిస్తామని ఆర్.టీ.సీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్ లోని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కార్యాలయంలో దీనికి సంబంధించి కమిటీ మీటింగ్ ప్రారంభమైంది. దీంట్లో ఆర్.టీ.సీ యూనియన్ మెంబర్ అశ్వరామశర్మ తదితరులు పాల్గొన్నారు. రెండు గంటల పాటు జరిగే ఈ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తారా లేదా అన్నది చర్చ తరువాత తెలియనుంది.

పసిబిడ్డను తొట్టిలో పడేసిన కిరాతకుడు

  కంటికి రెప్పలా ఉండాల్సిన వాడే కాలయముడయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రేగుంట ఇప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ పల్లెలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఊహకందని దారుణం కళ్ల ముందుకు వెలుగులోకి వచ్చింది. ఒడిలో ఉండాల్సిన పసిబిడ్డను తొట్టిలో పడేసి చంపాడు ఒక కిరాతక తండ్రి. కంటే కూతుర్నే కనాలి, మనసుంటే మగాడిలా పెంచాలి ఈ మాట అక్షర సత్యం. అన్ని రంగాల్లో ఆడపిల్లలూ దూసుకెళ్తున్నారు కానీ ఈ కాలంలో కూడా ఇంకా వివక్ష కొనసాగుతోంది. అందుకు నిదర్శనమే రెంటాల గ్రామంలో జరిగిన ఈ దారుణమైన సంఘటన. కానీ ఇంత ఘోరానికి పాల్పడ్డాడు ఒక కన్న తండ్రి. అందరిలోనూ విషాదం నెలకొల్పింది ఈ ఘటన. వివరాళ్లోకి వెళ్తే  సూర్యతేజ వృత్తిరిత్యా ఆటో డ్రైవర్ ఇదే గ్రామానికి చెందిన అఖిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇతని ప్రేమ పెళ్లికి సూర్యతేజ తలిదండ్రులు అంగీకరించలేదు. దాంతో అత్తగారింటి పక్కనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. మొదట్లో బాగానే ఉండేవాడు వీళ్ళ అన్యోన్యతకు గుర్తుగా ఓ పాప పుట్టింది. బిడ్డను కూడా బాగా చూసుకునేవాడు. గారభం చేసేవాడు అంతా బాగానే ఉంది.వారికీ మళ్ళీ రెండవ పాప పుట్టగా ఇతడిలో ఉన్మాదం చోటు చేసుకుంది. ఒక రోజు ఊరు ఊరంతా కలిసి సూర్యతేజ చేతులు కట్టేసి చితక్కొట్టేశారు. కొట్టడం కాదు ఇలాంటోడిని ఏం చేసినా ఫర్వాలేదని ప్రతి ఒక్కరూ అసహ్యించుకున్నారు. ఒళ్లు హూనమైనా సరే సూర్యతేజ మాత్రం తేలుకుట్టిన దొంగలా నల్లిల ఉండిపోయాడు. కోపాన్ని అదుపు చేసుకున్న గ్రామస్తులు సూర్యతేజను చర్ల పోలీసులకు అప్పగించారు. అతడు చేసిన నిర్వాకం తెలిసి ఖాకీలు సైతం విస్తుపోయారు.మరోవైపు సూర్యతేజను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అఖిల పరుగు పరుగున ఆసుపత్రికి వెళ్లింది. తన ఒళ్లో ఉండాల్సిన చిట్టితల్లి మార్చురీలో ఉందని తెలిసి తల్లడిలిపోయింది ఆ తల్లి. ఇంకా నెల కూడా నిండని ఆ చిట్టి తల్లికి నూరేళ్లు నిండిపోయాయి. అఖిల సూర్యతేజల రెండో కూతురు అప్పుడే అనంత లోకాల్లోకి వెళ్లిపోయింది.'బేటీ పడావ్ బేటీ బచావో ' అనే  నినాదం పెరిగిపోతున్నా ఈరోజుల్లో రెండోసారీ ఆడకూతురే పుట్టిందని సూర్యతేజ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యభర్తల మధ్య విబేధాలు ప్రేమ పెళ్లిని అంగీకరించని తల్లిదండ్రుల నుంచి వేధింపులు కూడా తిరిగి ఈ పసికందుకు నూరేళ్లు నిండిపోయేలా చేశాయి.

ఆంధ్రప్రదేశ్ లో భారీగా విద్యుత్ కోతలు

  ఆంధ్రప్రదేశ్ ప్రజలను వర్షాకాలంలో కూడా విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. గ్రామాల్లో వారం రోజుల నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. అనేక మండలాల్లో ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ విద్యుత్ కోతలు విధిస్తున్నాయి. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవటంతో డిమాండ్ పెరగిపోగా విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయి. ఏపీకి ప్రస్తుతం పది నుంచి పదకొండు వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది కానీ కేవలం ఎనిమిది వేల మెగావాట్స్ మాత్రమే ప్రస్తుతం విద్యుదుత్పాదన జరుగుతోంది. వర్షాలు పడటంతో పంటల విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ మోటార్లను రైతాంగం విరివిగా ఉపయోగిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగిందని ట్రాన్స్ కో అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది. సౌర, పవన, విద్యుత్ సంస్ధల నుంచి విద్యుత్ తీసుకునేందుకు ప్రభుత్వం నిరాకరించింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను పున సమీక్షించాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై సౌర, పవన, విద్యుత్ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో, కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో సౌర, పవన, విద్యుత్ సంస్థలపై ఉన్న విభేదాలతో  వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం విద్యుత్ సరఫరాను తీసుకోవటం నిలిపివేసింది. దీనివల్ల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు థర్మల్ స్టేషన్ల పై ఆధారపడింది. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ఎక్కువగా ఉండటం వల్ల అదనంగా పది లక్షల టన్నుల బొగ్గు నిల్వలు కరిగిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం బొగ్గు కొరత ఏర్పడింది. ఒడిశాలో ఉన్న బొగ్గు గనుల నుంచి కూడా సరఫరా తగ్గిపోయింది. మహారాష్ట్రలో ఎన్నికలుండటంతో ఒడిశా నుంచి బొగ్గును మహారాష్ట్రకు తరలించి అక్కడ విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఏపీకి బొగ్గు సరఫరా నిలిచిపోయాయి ఫలితంగా థర్మల్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన తగ్గిపోయింది. అందువల్లే విద్యుత్ కోతలు పెరిగాయి. వివిధ విద్యుత్ కంపెనీలకు బకాయిలు చెల్లించకపోవడంతో జాతీయ విద్యుత్ ఎక్స్ చేంజ్ లో ఏపీని బ్లాక్ లిస్టులో చేర్చారు. దీంతో బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు సాధ్యం కాలేదు.వెంటనే నూట ఇరవై ఐదు కోట్లు కొన్ని విద్యుత్ సంస్థలకు చెల్లించింది ఏపీ ప్రభుత్వం .దాంతో ఏపీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. అయితే ఇప్పటికే అక్కడ మిగులు విద్యుత్ అమ్మకాలు పూర్తి అయ్యాయి. వివిధ రాష్ట్రాలు తమ వద్ద ఉన్న మిగులు విద్యుత్ ను ఇప్పటికే వేరే రాష్ట్రాలకు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో విద్యుత్ కొనుగోలుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏ రాష్ట్రం దగ్గరైనా మిగులు విద్యుత్తు ఉందేమోనని ఏపీ అధికారులు వాకబు చేస్తున్నారు. బొగ్గు లభ్యత పూర్తిగా పడిపోవడంతో విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన డెబ్బై శాతానికి పైగా పడిపోయింది. విదేశాల నుంచి ఓడల్లో వస్తున్న బొగ్గుతో ప్రస్తుత ఒక యూనిట్ లో మాత్రం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరో యూనిట్ పాక్షికంగా పని చేస్తోంది. దీంతో విద్యుత్ కష్టాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు.

బతుకమ్మ పండగను విశ్వ వ్యాప్తం చేసిన వారికి అభినందనలు తెలిపిన కె.టి.ఆర్...

  దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడంలో తెలంగాణ జాగృతి సంస్థ చేసిన కృషి అమోఘమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. పువ్వుల్ని పూజించే విశిష్ట సాంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా మార్చిన ఘనత జాగృతిదే అన్నారు. బతుకమ్మ పండగను విశ్వ వ్యాప్తం చేసిన సోదరి కవితకు జాగృతిలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు. దేశ విదేశాల్లో ఈ రోజు బతుకమ్మ ప్రాచుర్యం పొందిందంటే, దేశ విదేశాల్లో ఈ రోజు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారు అంటే తెలంగాణ ఆడబిడ్డలు సంబరంగా ఈ బతుకమ్మలో పాల్గొంటున్నారు అంటే దానికి విశేషమైన ఖ్యాతి, విశేషమైన కీర్తి తెలంగాణ జాగృతి సంస్థకు దక్కుతుందని కె.టి.ఆర్ అన్నారు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం ట్యాంక్ బండ్ పైన మహిళలందరూ జరుపుకునే బతుకమ్మని నిషేధిస్తే తెలంగాణ జాగృతి హైకోర్టుకు వెళ్లి ఆనాడు ఒక ఆర్డర్ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో ఒక మంచి పాత్ర పోషించిందన్నారు. బతుకమ్మ పండుగ ఈ రోజు తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణ లోని మహిళామణులందరికీ సంతోషాన్ని ఇస్తుందన్నారు. ప్రభుత్వం ఒక వైపు సిరిసిల్ల నేతన్నలకు ఉపాధిని ఇస్తూ, బతుకమ్మ చీరలు అందివ్వడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సోదరీమణులందరూ సగర్వంగా, సంతోషంగా పండుగ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనీ, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి కె.టి.ఆర్ అభినందనలు తెలిపారు.

ఉండవల్లి నోట తిరుగుబాటు మాట... జగన్ పై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా?

  వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మొదటిసారి మీడియా ముందుకొచ్చి ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే మొదట్నుంచీ సాఫ్ట్ కార్నర్ చూపించే ఉండవల్లి... పొంచివున్న ముప్పును సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గానే చెప్పేశారు. చరిత్రను గుర్తుచేస్తూమరీ హెచ్చరికలు చేశారు. 51శాతం ఓట్లు... 151 సీట్లు వచ్చాయని విర్రవీగొద్దని చెప్పకనే చెప్పారు. జాతీయ పార్టీల్లో నేతలకు తమ అసంతృప్తిని, ఆవేదనను చెప్పుకోవడానికి హైకమాండ్స్ ఉంటాయన్న ఉండవల్లి... వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు అన్నీ జగనేనని, అందువల్ల ఎమ్మెల్యేల మనసు గెలుచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి తామంటే నమ్మకముందనే విశ్వాసం ఎమ్మెల్యేల్లో కలిగించాలన్నారు. లేదంటే తిరుగుబాటు వచ్చే ప్రమాదముందని చరిత్రను తవ్వితీశారు. 1972లో పీవీ నర్సింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ 56శాతం ఓట్లు... 219 సీట్లు వచ్చాయని, కానీ పీవీని 9నెలల్లోనే దింపేశారని గుర్తుచేశారు. ఇక, 1984లో టీడీపీకి 54శాతం ఓట్లు... 213 సీట్లు వచ్చాయని, కానీ 9నెలల్లోనే ఎన్టీఆర్ కూడా కుర్చీ దిగాల్సి వచ్చిందనే విషయం మర్చిపోవద్దన్నారు. అయినా, ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరగబడతారని ఎవరైనా అనుకున్నారా? అన్న ఉండవల్లి... రాజకీయాల్లో ఊహించనవే జరిగే వీలుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉండవల్లి హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇప్పుడు జగన్ నైనా దింపేస్తారంటూ చరిత్రను గుర్తుచేస్తూ ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడున్న 151మంది ఎమ్మెల్యేల బలాన్ని చూసుకుని... ఇదే శాశ్వతమని భావించొద్దని జగన్ ను సూచించిన ఉండవల్లి.... ప్రజల్లో మంచి పేరుతోపాటు ఎమ్మెల్యేల మనసు కూడా గెలుచుకోవాలని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎమ్మెల్యేలను పట్టించుకోకపోతే పీవీ నర్సింహరావు, ఎన్టీ రామారావుకి పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు.  అయితే, ఉండవల్లి నోట తిరుగుబాట మాట అనే మాటలను చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. లేదంటే జగన్ పరిపాలనపై మొదటి మీడియా మీడియా సమావేశంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే మామూలు విషయం కాదు. ఏదో ఆషామాషీగా ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేయరు. తనకొచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకే ఉండవల్లి రియాక్షన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పదేపదే మీ ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉండాలంటూ ప్రస్తావించడం చూస్తుంటే.... మంత్రులు, ఎమ్మెల్యేలు... జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. ఏదిఏమైనా అధికారం శాశ్వతం కాదని, ఎమ్మెల్యేలు సంతోషంగా లేకపోతే... మీ వాళ్లే మీ మీద తిరగబడతారంటూ... జగన్ కు పొంచివున్న ముప్పుపై ఉండవల్లి హెచ్చరించారు.

మరో పది మెట్రో స్టేషన్ లకి మరమ్మత్తులు

  హైదరాబాద్ లోని వివిధ మెట్రో స్టేషన్ లో లోటుపాట్లపై అధికారులు స్పందించారు. అమీర్ పేటలో పెచ్చులు ఊడిపడి ఒక యువతి మరణంచిన సంఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. తర్వాత కొన్ని స్టేషన్ లలో ఉన్న లోపాలు వెలుగులోకి  వచ్చాయి. దీంతో భద్రతాపరమైన అంశాలను సీఎం ఆర్ఎస్ ప్రత్యక్షంగా పరిశీలించారు. మిగతా స్టేషన్ ల పై సమీక్షలు జరిపారు. దీనితో ఎక్కడెక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో అధికారులు గుర్తించారు. ఇందు కోసం ఆరు ఎల్ఎన్టి ఇంజనీరింగ్ టీమ్ లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు పది స్టేషన్ లలో లోపాలను గుర్తించి వాటిని సవరించారు. ఇటు ప్రభుత్వం అటు సీఎం ఆర్ఎస్ ఆదేశాలతో అన్ని స్టేషన్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా అర్ధరాత్రి తర్వాత ఫ్లడ్ లైట్ల వెలుతురులో బూమ్ లిప్స్ ఉపయోగించి మరమ్మతులు చేస్తున్నట్లుగా ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రతీ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి చిన్న చిన్న విషయాల్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లుగా వివరించారు. అనుభవజ్ఞులైన ఇంజినీరింగ్ బృందాలు భద్రతే ప్రధానంగా ఎక్కడా రాజీపడకుండా పరిశీలించి లోపాలు సవరిస్తున్నట్లుగా చెప్పారు. అమీర్ పేటలో ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా మెట్రో అధికారులు, ఎల్ఎన్టి అధికారాలు కూడా స్పందించి తక్షణమే చర్యలు కూడా చేపట్టారు. దీనికి సంబంధించి దాదాపు డెబ్బై రెండు కిలో మీటర్ల ఉన్నటువంటి అరవై నాలుగు మెట్రో స్టేషన్స్ లో దాదాపు నలభై ఎనిమిది వాడకంలో ఉండగా, వాటిలో పది స్టేషన్స్ లో కూడా ఈ లోపాలను గుర్తించారు అధికారులు. ఎక్కడెక్కడైతే పగుళ్ళు ఉన్నాయో, సీలింగ్ కి సంబంధించి,పెచ్చులు ఊడిపోయినటువంటి వాటికి సంబంధించి మొత్తం కూడా సర్వేకు సంబంధించి ఇలాంటి లోపాలన్నిటిని కూడా గుర్తించారు. దాదాపు అన్ని వీలైనంత త్వరలో అన్నింటిని సవరించే పనిలో పడ్డారు అధికారులు. బాలానగర్ మెట్రో స్టేషన్, పరేడ్ గ్రౌండ్సు, రసూల్ పురా మెట్రో స్టేషన్, హైటెక్ సిటీ, గంధీభవన్, ఎల్బీనగర్, న్యూ మార్కెట్ ఇలా  దాదాపు పది స్టేషన్స్ లో మాత్రం మరమత్తులు పూర్తి చేశారు అధికారులు.ఇంకా ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగక మందే అధికారులు వీలైనంత త్వరలో పరశ్కరించాలని ప్రజలు కొరుతున్నారు.

గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు సిధ్ధమైన ఏపీ సర్కార్...

  మహాత్ముడు జన్మదినం రోజు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. గ్రామ సచివాలయాల వ్యవస్థను శ్రీకాకుళం జిల్లా కరపలో జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా లోనే ఎనిమిది వందల ముప్పై ఐదు సచివాలయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో సచివాలయంలో పది టేబుళ్లు, ముప్పై కుర్చీలూ, ఆరు ఫైల్ రాక్స్, ఒక గ్రామ సచివాలయం బోర్డ్, ఒక ఇనుప బీరువా ఉంటాయి. ఇవన్నీ టెండర్ల ప్రకారం కొనుగోలు చేయాల్సింది. నవంబర్ నెలాఖరు కల్లా అన్ని సచివాలయాల్లో సౌకర్యాల ఏర్పాటు చేయాలన్నది సర్కారు లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందాలన్న లక్ష్యంతో గ్రామ సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ముందుగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తోంది, వాళ్ళ ద్వారానే ఇంటింటికీ పథకాలు అందేలా ప్రభుత్వం చేయబోతోంది. కరపలో పైలాన్ ను సీఎం జగన్ ఆవిష్కరించారు, గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు అనంతరం అన్ని సచివాలయాలకు నవంబరు నెలాఖరు కల్లా పూర్తిగా అమలయ్యేలా చూస్తామన్నారు. గ్రామాల్లో అభివృద్ధికి ఊతమిచ్చేలా సచివాలయం ఏర్పాట్లు ఉంటుందన్నారు. అన్ని సచివాలయాలకు నవంబర్ నెలాఖరు కల్లా పూర్తి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా కరప గడపలో కొత్తదనం వుంటుందనీ  గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ అన్నారు.

మెరుగైన సేవలకై పలు శాఖలకు సబ్ కమిటీలు

  రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఆరోగ్యం శానిటేషన్ తో సహా పలు అంశాల పై సూచనలకు ఎనిమిది క్యాబినెట్ సబ్ కమిటీలను నియమించింది. అటు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వారి సమస్యల పై కూడా పరిశీలన కొరకు సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీ వేసింది. ఇవాళ కార్మిక సంఘాల నాయకులతో భేటీ కానున్న అధికారులు వీలైనంత త్వరగా రిపోర్టు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. సుదీర్ఘంగా ఏడున్నర గంటల పాటు జరిగిన ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల పై చర్చ జరిగింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారం కోసం సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీని వేసింది. ప్రభుత్వం వీలైనంత త్వరగా కమిటీ రిపోర్టు ఇవ్వాలని సూచించింది. రిపోర్టు ఆధారంగా ఆర్టీసీ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. పండుగ సమయంలో సమ్మె వద్దని కార్మికులకు సూచించింది.  ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సర్కార్ ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేసేందుకు ప్రధాన శాఖల పనితీరుపై ఎనిమిది క్యాబినెట్ సబ్ కమిటీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు పౌల్ట్రీ పై పాలసీలు రూపొందించాలని తీర్మానించారు. మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, తలసాని సభ్యులుగా వైద్య, ఆరోగ్య కమిటీని వ్యవహరించగా, మంత్రి ఎర్రబెల్లి నేతృత్వంలో ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ సభ్యులుగా  గ్రామీణ పారిశుధ్య కమిటీని వ్యవహరిస్తుండగా, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, తలసాని, సబితా ఇంద్రా రెడ్డి సభ్యులుగా పట్టణ పారిశుధ్య కమిటీ పనులు నియమించారు. మత్రి హరీశ్ నేతృత్వంలో కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ సభ్యులుగా వనరుల సమీకరణ కమిటీని వ్యవహరించగా, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని, ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా పచ్చదనం కమిటీని వ్యవహరించగా, మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి సభ్యులుగా వ్యవసాయ కమిటీని వ్యవహరించగా, మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్, అధ్యక్షతన ఈటెల, నిరంజన్ రెడ్డి సభ్యులుగా పౌల్ట్రీ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితి పై క్యాబినెట్ విస్తృతంగా చర్చించింది. వర్షాకాలంలో పండిన అన్ని రకాల పంటలను ప్రభుత్వ పరంగా కొనుగోలు చెయ్యడానికి పౌరసరఫరాల సంస్థతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు సిద్ధం కావాలని ఆదేశించింది. రబీకి కావలసిన విత్తనాలు, ఎరువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించింది. మరోవైపు గ్రామాల్లో అమలవుతున్న ముప్పై రోజుల గ్రామ ప్రణాళిక అమలుపై చర్చించేందుకు ఈ నెల పది న మంత్రులు కలెక్టర్లతో భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశానికి డీపీవోలను, డీఎల్ పీఓలను కూడా ఆహ్వానించనున్నారు అని సమాచారం.

తాడేపల్లిగూడెం వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం...

  పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో క్రికెట్ బెట్టింగ్ పేరుతో ఒక విద్యార్థిపై మరో విద్యార్థి దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. బాధిత విద్యార్థిపై దాడి చేయడమే కాకుండా దాడి ఘటనను వీడియో తీసి బాధిత విద్యార్థిపై పైశాచికంగా వ్యవహరించడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గత నెలలో ఇద్దరు విద్యార్థుల మధ్య క్రికెట్ బెట్టింగ్ జరిగినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా తణుకు మండలం వడ్లూరుకు చెందిన విద్యార్థి, తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం విద్యార్థికి బాకీ పడ్డట్లు సమాచారం. అయితే బాకీ పడ్డ సొమ్ములో కొంత డబ్బు ఇస్తారని పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది, అయితే మరింత డబ్బు ఇవ్వాలని బాధిత విద్యార్థిపై దాడికి పాల్పడ్డాడు మరో విద్యార్థి. కాలేజ్ ఫీజుకని తెచ్చిన డబ్బును కూడా లాక్కున్నారని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఫీజ్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగితే తనను బాత్ రూమ్ లోకి తీసుకువెళ్ళి చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. జరిగిన ఘటనపై బాధిత విద్యార్థి తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని సమాచారం. ఈ విషయం వెలుగు లోకి రాకుండా తికమక పెట్టే పరిస్థితి ఉంది.

పిఓకే గురించి అమెరికాలో‌ మాట్లాడిన జైశంకర్

  అమెరికా యొక్క అగ్రశ్రేణి థింక్ ట్యాంక్ అయిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో తన ప్రధాన విదేశాంగ విధాన ప్రసంగం తర్వాత ఒక ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. "జమ్మూ కాశ్మీర్‌లో భారతదేశం అభివృద్ధిని ప్రారంభించిన తర్వాత, రాష్ట్రానికి వ్యతిరేకంగా గత 70 సంవత్సరాలుగా పాకిస్తాన్ చేసిన ప్రణాళికలన్నీ ఫలించవు, కాశ్మీర్ లోయలో మొబైల్ నెట్‌వర్క్ పై ప్రస్తుత సస్పెన్షన్ భారతీయ వ్యతిరేక శక్తులను సమూలంగా అరికట్టడానికి,  ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా నిరోధించడం కోసం అంతేకాకుండా ఈ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడమే లక్ష్యంగా ఈ‌  సస్పెన్షన్ ఉందని మంత్రి వాషింగ్టన్ ప్రేక్షకులకు తెలిపారు." "అక్కడ ప్రతిచర్యలు ఉన్నాయి. 70 ఏళ్లుగా నిర్మించిన స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. స్థానిక స్వార్థ ఆసక్తి ఉంది. సరిహద్దులో స్వార్థపూరిత ఆసక్తి ఉంది"అని జైశంకర్ అన్నారు. " ఏదైనా ఒకదానిపై యథాతథ స్థితిని చాలా గణనీయమైన రీతిలో మార్చినప్పుడు పరివర్తన ప్రమాదాలు ఎదురవుతాయి మరియు ప్రతిచర్యలు ఉంటాయి. కానీ మేము నిజంగా జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధిని సాధించగలిగితే, గత 70 సంవత్సరాలుగా పాకిస్తానీయులు ప్రణాళిక వేసిన ప్రతిదీ పనికిరాదని అర్థం చేసుకోండి" అని ఆయన చెప్పారు. "మేము జమ్మూ కాశ్మీర్‌ను అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లగలిగితే, పాకిస్తాన్ ఆక్రమణలో దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న పిఓకే నివాసితులు తమంతట తాముగా మన వైపు వచ్చే రోజు చాలా దూరంలో లేదు" అని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ గత నెలలో చెప్పినట్లుగా విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా తెలిపారు.

మహిళా ఉద్యోగుల విషయంలో కాగ్నిజెంట్ ఘనత

  టెక్ మేజర్ కాగ్నిజెంట్ తన ప్రపంచ మహిళా ఉద్యోగుల బలం 1,00,000 మార్కును దాటిందని, అందులో 75,000 మంది భారతదేశంలో ఉన్నారని తెలిపింది. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 1,00,000 మంది మహిళలను నియమించడం కంపెనీ లక్ష్యం, కానీ ఇది షెడ్యూల్ కంటే ముందే లక్ష్యాన్ని సాధించింది అని  కంపెనీ యాజమాన్యం తెలిపింది. "మన భారతదేశ హెడ్‌కౌంట్‌లో దాదాపు 38% మంది మహిళా నిపుణులను కలిగి ఉన్నారు. కోయంబత్తూర్, కొచ్చి, మంగళూరు వంటి టైర్-టూ స్థానాల్లో, ఆ ప్రదేశాలలో మొత్తం హెడ్‌కౌంట్‌లో మహిళా ఉద్యోగులు  50% మంది ఉన్నరు ”అని కంపెనీ తెలిపింది. మొత్తం గ్లోబల్ టాలెంట్ పైప్‌లైన్‌లో, ఈ ఏడాది కొత్త ఉద్యోగులలో 40% మంది మహిళలు ఉన్నారు.ఇద్దరు మహిళలు ఇప్పుడు కాగ్నిజెంట్ డైరెక్టర్ల బోర్డులో పనిచేస్తున్నారు, మరియు కాగ్నిజెంట్ యు.ఎస్. ఫౌండేషన్ డైరెక్టర్ల బోర్డులో సగం మంది స్త్రీలు ఉన్నారు. కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్ మరియు ఎండి రామ్‌కుమార్ రామమూర్తి మాట్లాడుతూ, "మేము ఈ మైలురాయిని ఇంకా కొనసాగించే దిశగా  మా మహిళా సహచరుల కెరీర్ అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాము, అలాగే ఆసక్తిని ఉత్తేజపరిచేందుకు, మహిళలను టెక్‌లోని కెరీర్‌లోకి ఆకర్షించే కార్యక్రమాలకు సహాయపడతాము." అన్నారు.

కిలో ప్లాస్టిక్ కి ఒక మొక్క ఒక సంచి ఎక్కడ??

  మంగళవారం బొంగైగావ్ పట్టణంలోని గాంధీ మైదానంలో 1,000 మందికి పైగ ఒక మొక్క, ఒక వస్త్ర సంచి కోసం ఒక కిలో ప్లాస్టిక్‌ను ఇచ్చారు. బొంగాగావ్ జిల్లా ప్రధాన కార్యాలయం బొంగాగావ్ గువహతికి పశ్చిమాన 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.70 ఏళ్ల వయసున్న రేణుకా రాయ్ చౌదరి అందరికంటే ముందుగా తన ఇంటి నుండి ప్లాస్టిక్‌ను బొంగైగావ్ మునిసిపల్ బోర్డు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బ్యాంకులో జమ చేయచేసింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని తొలగించడంలో పాత తరాలు ముందడుగు వేయాలి అనే సందేశాన్ని ఈ సందర్భం‌గా  ఆమె తెలిపింది. “సోషల్ ఫారెస్ట్రీ నర్సరీలలో మాకు తగినంత మొక్కలు ఉన్నాయి, కాని 'ప్లాంట్స్ ఫర్ ప్లాస్టిక్' మార్పిడి కార్యక్రమం కోసం కేవలం 200 మొక్కలు మాత్రమే తీసుకువచ్చారు. కాని ప్రజల స్పందన చూశాక  మేము చాలా తక్కువ మోతాదులో మొక్కలు తీసుకువచ్చామని మాకు అర్థమైంది ”అని జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదిల్ ఖాన్ అన్నారు. శ్రీమతి చౌదరి మరియు మరో 199 మందికి గూస్బెర్రీ, ఆలివ్, మామిడి, జాక్‌ఫ్రూట్, మహోగని మరియు ఇతర స్థానిక జాతుల చెట్ల మొక్కలను మొత్తం 200 కిలోల ప్లాస్టిక్ జమ చేసినందుకు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి స్థానిక మహిళల స్వయం సహాయక బృందాలు తయారుచేసిన వస్త్ర సంచి కూడా లభించింది. ఈ సంచులలో ప్రతి 2 కిలోల కంటే ఎక్కువ బరువును తట్టుకోగలవు. మంగళవారం మొక్కలు అందని వారికి తరువాత ఒకదాన్ని అందిస్తామని మిస్టర్ ఖాన్ చెప్పారు. "పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది లేకుండా పోయెంత వరకు మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. మున్సిపల్ బోర్డ్ కార్యాలయంలో ఎవరికైనా ఒక కిలో ప్లాస్టిక్ జమ చేసి, ప్రతిఫలంగా ఒక మొక్కను పొందటానికి ప్లాస్టిక్ బ్యాంక్ తెరవబడుతుంది ”అని ఆయన అన్నారు.

అరుదైన అవకాశం దక్కించుకున్న సంగక్కర

  చారిత్రాత్మక మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) మొదటి బ్రిటీష్ యేతర అధ్యక్షుడిగా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీలంక మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ ఎంసిసి కి  మొదటి బ్రిటీష్ యేతర అధ్యక్షుడు, ఈ పదవిని ఒక సంవత్సరం పాటు నిర్వహిస్తారు. మేలో లార్డ్స్‌లో జరిగిన ఎంసిసి వార్షిక సర్వసభ్య సమావేశంలో అవుట్‌గోయింగ్ ప్రెసిడెంట్ ఆంథోనీ వ్రేఫోర్డ్ అతని నామినేషన్‌ను ప్రకటించారు. "ఎంసిసి ప్రెసిడెంట్  ప్రతిష్టాత్మక పదవిని పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఈ అద్భుతమైన క్రికెట్ సంవత్సరాన్ని నిర్మించడానికి ఎంసిసి తో కలిసి కృషి చేయాలని నేను ఎదురుచూస్తున్నాను" అని సంగక్కర ఒక ప్రకటనలో తెలిపారు, అలాగే "క్రికెట్  కోసం స్థానికంగా, జాతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఎంసిసి చేసే అద్భుతమైన పని గురించి వారికి అవగాహన కల్పించే అవకాశం మాకు ఉంది" అని ఆయన చెప్పారు. "ఎంసిసి ప్రెసిడెంట్ పాత్రను పోషించడానికి సంగక్కర కంటే గొప్ప వ్యక్తి మరొకరు లేరు. కమ్యూనిటీలను నిమగ్నం చేయడానికి క్రికెట్ శక్తిని అతను గట్టిగా నమ్ముతున్నాడు మరియు ఎంసిసి చేసే ముఖ్యమైన పనికి అతను కీలక రాయబారిగా ఉంటాడు. " అని అవుట్గోయింగ్ ఎంసిసి ప్రెసిడెంట్ వ్రెఫోర్డ్  అన్నారు. "కుమార్ లార్డ్స్ వద్ద మాత్రమే కాకుండా, క్లబ్ యొక్క ప్రపంచ స్థితిపై నిరంతర ప్రభావాన్ని చూపగలడు. ఎంసిసి  మొట్టమొదటి బ్రిటీష్ కాని అధ్యక్షుడిగా అతని ప్రపంచవ్యాప్త విజ్ఞప్తి, ఈ ప్రాంతంలో సానుకూల ప్రభావాన్ని చూపడానికి వీలు కల్పిస్తుంది. ” అని వ్రెఫోర్డ్  అన్నారు.

క్షీనిస్తున్న జీఎస్టీ వసూళ్ళు

  ఆర్థిక వ్యవస్థలో తగ్గిన డిమాండ్ ఫలితంగా వస్తు, సేవల పన్ను సెప్టెంబరులో వరుసగా రెండవ నెలలో పడిపోయి 19 నెలల కనిష్ట స్థాయి 91,916 కోట్ల రూపాయలకు పడిపోయింది. అయితే విశ్లేషకులు రాబోయే పండుగ నెలలలో పెరుగుతుందని ఆశాభావం‌ వ్యక్తం చేశారు. గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు సెప్టెంబరులో వసూలు ఆగస్టులో, 98,202 కోట్ల నుండి పడిపోయాయి, ఇది జూలైలో వసూలు చేసిన 1,02,083 కోట్ల కన్నా తక్కువ. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సగటు నెలవారీ వసూళ్లు  1,01,049 కోట్లు. జిఎస్‌టి వసూళ్ల మొదటి పూర్తి నెల అయిన ఆగస్టు 2017 లో వసూలు చేసిన ₹ 95,633 కోట్ల కన్నా 2019 సెప్టెంబర్‌లో వసూళ్లు తక్కువ. "2019 సెప్టెంబర్ నెలలో సేకరించిన మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం, 91,916 కోట్లు, అందులో సిజిఎస్టి 16,630 కోట్లు, ఎస్జిఎస్టి ₹ 22,598 కోట్లు, ఐజిఎస్టి  45,069 కోట్లు మరియు సెస్ 7,620 కోట్లు" అని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. "ఆగస్టు నెలలో 2019 సెప్టెంబర్ 30 వరకు దాఖలు చేసిన జిఎస్‌టిఆర్ 3బి రిటర్న్‌ల సంఖ్య 75.94 లక్షలు". అంతకుముందు ఏడాది ఇదే నెలలో సేకరించిన దానికంటే 2019 సెప్టెంబర్‌లో ఆదాయం 2.67% తక్కువ. "ఏప్రిల్-సెప్టెంబర్, 2019 లో, దేశీయ భాగం 7.82% పెరిగింది, దిగుమతులపై జిఎస్టి ప్రతికూల వృద్ధిని చూపించింది మరియు మొత్తం సేకరణ 4.9% పెరిగింది" అని ఒక  విడుదల ప్రకటనలో తెలిపింది. "గత రెండు నెలలుగా, రాష్ట్ర జిఎస్టి వసూళ్ళలో తగ్గుదల కేంద్ర జిఎస్టి (సిజిఎస్టి) కన్నా ఎక్కువ, దీనికి కారణాలను వివరంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది" అని పిడబ్ల్యుసి ఇండియా  నాయకుడు ప్రతీక్ జైన్ అన్నారు. "వసూళ్లను బట్టి చూస్తే, ఆర్థిక సంవత్సరం చివరి వరకు జిఎస్టి రేటు తగ్గింపు ఇప్పుడు అసంభవం అనిపిస్తుంది" అని జైన్ చెప్పారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో నో కామ్రేడ్స్...

  హుజూర్ నగర్ ఉప ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లు 76, దాంట్లో 45 తిరస్కరణకు గురి కాగా బరిలో 31 మంది ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నేటివరకూ గడువు ఉంది. ఈ నెల 21 న పోలింగ్ జరగనుంది కాగా ఫలితాలు ఈ నెల 24 న వెలువడనున్నాయి. హుజూర్ నగర్ లో సీపీఐ కు మంచి పట్టుంది కానీ, ఎన్నికల బరిలో నుంచి సిపీఐ తప్పుకుంది, సీపీఐ అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాగా ఎన్నికల ప్రచారానికి మద్దతుగా కాంగ్రెస్ ని కాదని టీ.ఆర్.ఎస్ వైపు మొగ్గు చూపింది. టీ.ఆర్.ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి తరపున సీపీఐ ప్రచారం చేయనుంది. ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ను సీ.పి.ఐ తిరస్కరించి టి.ఆర్.ఎస్ తో దోస్తీ ఎందుకు చేసిందో తెలియాల్సి ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని నారాయణ పేర్కొన్నారు. అయితే పట్టున్న జిల్లాలలో సిపీఐ పోటీ చేయలేకపోవటం దురదృష్టకరంగా భావిస్తున్నారు. దీంతో ఎన్నికల బరిలో తెలుగుదేశం, బిజెపి, టీ.అర్.ఎస్ తదితర పార్టీలు ఉన్నాయి. అయితే హుజూర్ నగర్లో ఎవరి జెండా ఎగరనుందో ఈ నెల 24 న తెలియనుంది. ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సిధ్ధమయ్యాయి, గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహ రచనలు చేస్తున్నారు.

తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు...

  తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం సమ్మెకు సై అంటున్న ఆర్టీసీ కార్మికులను ఊరటించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయాలని తీర్మానించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పరిశీలించేందుకు శాశ్వత ప్రాతిపదికన క్యాబినెట్ సబ్ కమిటీలను నియమించాలని నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున సమ్మె యోచన విరమించుకోవాలని సూచించింది మంత్రివర్గం, కార్మికులు డిమాండ్ లు చెప్పారని ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో చర్చించాలని సూచించింది. ప్రభుత్వ సంస్థను కాపాడే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా క్యాబినెట్ స్పష్టం చేసింది. శాఖల వారీగా చూస్తే వైద్య ఆరోగ్యంపై ఒక కమిటీని నియమించిన తెలంగాణా ప్రభుత్వం ఇందులో ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల అధ్యక్షుడిగా ఉన్నారు. కేటీఆర్, ఎర్రబల్లి, తలసాని సభ్యులుగా కొనసాగుతారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సీజనల్ జబ్బులు, అంటువ్యాధులు తదితర విషయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, సేవలపై కమిటీ పర్యవేక్షిస్తుంది. గ్రామీణ పారిశుద్ధ్యం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షుడిగా ఉంటారు, ఇందులో సభ్యులుగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ ఉంటారు. ప్రస్తుతం అమలవుతున్న ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళిక పరిస్థితి గ్రామాల్లో ఇతర పారిశుధ్య పరిస్థితులను కమిటీ చూసుకుంటుంది. అవసరమైతే సరికొత్త కార్యాచరణ కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవచ్చు. పట్టణ పారిశుద్ధ్యానికి మరో కమిటీ ఏర్పాటైంది, దీనికి అధ్యక్షులు హరీశ్ రావుతో పాటు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి ఇందులో సభ్యులుగా ఉంటారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం, ఈ కమిటీ లక్ష్యంగా ఉండబోతోంది. వనరుల సమీకరణకు మరో కమిటీ ఉంది, దీనికి అధ్యక్షుడిగా కూడా మంత్రి హరీశ్ రావే ఉంటారు, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ సభ్యులుగా కొనసాగుతారు. పచ్చదనం కమిటీకి అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండి, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని, ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. సాగును పెంచేలా వ్యవసాయంపై మరో కమిటీ ఏర్పాటు అవగా, దానికి అధ్యక్షుడిగా మంత్రి నిరంజన్ రెడ్డి సభ్యులుగా గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి ఎర్రబెల్లి ఉంటారు. సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడం, కల్తీలు నిరోధించటం, సాగుపై సమగ్ర విధానాన్ని అమలు చేయడమే ఈ కమిటీ లక్ష్యం. ఇక పౌల్ట్రీ కోసం కూడా కమిటీని ఏర్పాటు చేసింది క్యాబినెట్. దీనికి చీఫ్ గా తలసాని శ్రీనివాస్ వుంటే సభ్యులుగా శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి ఉన్నారు. సంక్షేమ కమిటీకి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షుడు, సభ్యులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ ఉంటారు. ఈ నెల పదిన మంత్రులు, కలెక్టర్ లతో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.  గ్రామాల్లో అమలవుతున్న ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై సీఎం వీరితో సమావేశమవుతారు, ఈ భేటీకి మంత్రులు, అధికారులు, డీపీవోలు, డీ.ఎల్.పీ.వోలు హాజరవుతారు.

టెక్కలి లో రాజకీయ ఉద్రిక్తత

  శ్రీకాకుళం జిల్లా టెక్కలి పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చాకిపల్లి గ్రామంలో టిడిపి సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు నిలిపి వేయడంతో గ్రామస్తులు వాలంటీర్లను నిలదీశారు. దీంతో ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. వాలింటర్ల ఫిర్యాదుతో పలువురు టిడిపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. టిడిపి సానుభూతిపరుల అరెస్టు పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసు అధికారులు పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. అన్యాయంగా అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. మరోవైపు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు టెక్కలి పీఎస్ ఎదుట నిరసనకు దిగారు. అక్రమంగా అరెస్టు చేసిన టిడిపి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి నుంచి తెల్లవార్లూ స్టేషన్ ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. చాకిపల్లిలో జరిగిన ఘటన నిన్న సాయంత్రం నుంచి కూడా వివాదం చిలికి చిలికి గానివానగా మారింది. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డులు అదే విధంగా గ్రామానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి టిడిపి సానుభూతిపరులకు ఇవ్వటం ఆపేశారు. దానికి గ్రామ వాలంటీర్లు వంత పాడినటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్ ,మాజీ ఎంపీటీసీ వసంతరావు వీళ్లిద్దరూ కూడా వాలంటీర్లను నిలదీశారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి గలాటా నేపథ్యంలో వారిద్దరిని కూడా టెక్కలి పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళారు. మొత్తానికి టెక్కలి పోలీస్ స్టేషన్ దగ్గర హైడ్రామా నడిచిందని సమాచారం. ఎందుకంటే భారీగా పోలీసుల మోహరింపు మరోవైపు టిడిపి కార్యకర్తలు కూడా అదే విధంగా భారీగా మోహరించారు. తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఆ నేపథ్యంలో కార్యకర్తలకు అండగా నిలిచేందుకు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. ఆ పోలీస్ స్టేషన్ దగ్గరే ఆయన నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఇంక ఈ హైడ్రామా ఎటు మలుపు తిరగబోతుందో వేచి చూడాలి.