ఒక్క రూపాయికే ఎకరం భూమా? కేసీఆర్ సర్కారుకు హైకోర్టు నోటీసులు

  కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోట్ల రూపాయల విలువైన భూమిని అత్యంత చౌకగా ఎలా కేటాయిస్తారంటూ మండిపడింది. హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి భూముల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు వివరణ కోరింది. ఎకరం రూపాయి చొప్పున శారదా పీఠానికి రెండు ఎకరాలు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేవలం రూపాయికే ఎకరం భూమిని కట్టబెట్టడంలో ప్రభుత్వ వైఖరి ఏంటో తెలపాలని ఆదేశించింది. 2019 జూన్ 22న హైదరాబాద్ కోకాపేటలో రెండెకరాలను ఎకరం రూపాయి చొప్పున శారదా పీఠానికి కేటాయిస్తూ టీఆర్ఎస్ సర్కారు జీవో 71 జారీ చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని, జీవో 71ను సవాలు చేస్తూ, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కోకాపేటలో ఎకరం భూమి కోట్లల్లో ఉందని, అలాంటిది కేవలం ఒక్క రూపాయికే ఎలా కట్టబెడతారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీవో 71ను కొట్టివేసి, శారదా పీఠానికి చేసిన భూకేటాయింపులను రద్దుచేయాలని పిటిషనర్ కోరాడు. దాంతో శారదా పీఠానికి భూముల కేటాయింపుపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ కోర్టు ఆదేశించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోపాటు శారదాపీఠం ధర్మాధికారికి నోటీసులసు ఇచ్చింది.

పయ్యావుల కేశవ్ సొంతూరులో అలజడి... గ్రామాన్ని విడగొట్టేందుకు ప్రయత్నాలు...

  ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో అలజడి రేగింది. రాజకీయ కారణాలతో గ్రామాన్ని రెండుగా విడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, రాసిపల్లి, మైలారంపల్లి గ్రామాలు ఉన్నాయి. దాదాపు 5వేలకు పైగా జనాభా ఉన్న పెద్ద కౌకుంట్ల మొదట్నుంచీ మేజర్ పంచాయతీగా కొనసాగుతోంది. అయితే, జగన్మోహన్ ‌‌రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలంటూ వైసీపీ వర్గాలు డిమాండ్ రావడంతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే, గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయారు. పెద్ద కౌకుంట్ల... ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వగ్రామం కావడం... ముందునుంచీ టీడీపీకి పట్టు ఉండటంతో... తెలుగుదేశం వర్గీయులు.... మేజర్ పంచాయతీగానే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైసీపీ వర్గీయులు మాత్రం వై.రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. దాంతో గ్రామస్తులు...పార్టీల వారీగా విడిపోయి రగడకు దిగారు. అయితే, పెద్ద కౌకుంట్ల... టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సొంత గ్రామం కావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ప్రజాభిప్రాయసేకరణకు రావడంతో పెద్ద కౌకుంట్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వయంగా రంగంలోకి దిగి, తెలుగుదేశం శ్రేణులకు అండగా నిలిచారు. అయితే, గ్రామస్తులు... పార్టీల వైజ్‌... రెండు వర్గాలుగా విడిపోయి... వాదోపవాదాలకు దిగడంతో... ఉద్రిక్తత మధ్యే అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో... మొత్తం 1672మంది పాల్గొంటే, వై.రాంపురం గ్రామాన్ని... పెద్ద కౌకుంట్ల పంచాయతీలోనే కొనసాగించాలని 1522మంది కోరగా, కేవలం 150మంది మాత్రమే ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. దాంతో, గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఉరవకొండ ఎంపీడీవో తెలిపారు. ఇదిలాఉంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, పచ్చని గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి పనిగట్టుకుని... తమ గ్రామాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో మరో అరెస్ట్... ఆడియో టేపులపై దర్యాప్తు

  ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో మరొకర్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏడుగురిని రిమాండ్ కి పంపిన ఏసీబీ... తాజాగా ఈఎస్‌ఐ సీనియర్ అసిస్టెంట్‌ సురేంద్రనాథ్‌బాబును జైలుకు పంపింది. ఈఎస్‌ఐ డైరెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సురేంద్రనాథ్‌బాబు... డైరెక్టర్ దేవికారాణి చెప్పినట్లు మొత్తం కథ నడిపించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించకుండానే తప్పుడు బిల్లులతో కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తేల్చారు. ఆర్సీపురం బ్రాంచ్‌లో ఉద్యోగిగా ఉన్న సురేంద్రనాథ్‌... అనధికారికంగా డైరెక్టర్ కార్యాలయంలో పనిచేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే, నకిలీ బిల్లులు సృష్టించాలని ఈఎస్‌ఐ డాక్టర్స్‌ను సురేంద్రనాథ్‌బాబు బెదిరించినట్లు తేల్చిన ఏసీబీ అధికారులు... ఆడియో టేపులపైనా దర్యాప్తు జరుపుతున్నారు. ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి డిస్పెన్సరీ కేంద్రంగా జరిగిన కుంభకోణంలో రెండు వందల కోట్లపైనే అవినీతి జరిగినట్లు గుర్తించారు. డైరెక్టర్ స్థాయి నుంచి సెక్షన్ ఆఫీసర్ వరకు ముడుపులు అందినట్లు ఆధారాలతో సహా సేకరించారు. 2015లో దేవికారాణి డైరెక్టర్‌‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ఈ స్కామ్ మొదలైనట్లు గుర్తించారు. ఇక, ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణిని అడ్డంపెట్టుకుని ఫార్మాసిస్టులు అందినకాడికి దోచుకున్నట్లు రికార్డుల్లో తేలింది.

కేసీఆర్ ని టెన్షన్ పెట్టిస్తున్న ఖమ్మం.. తుమ్మల, పొంగులేటి.. ఇద్దరిలో ఎవరో ఒక్కరే!!

  తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకొని ఘన విజయం సాధించింది. అయితే  ఖమ్మం జిల్లాలో మాత్రం మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. రాష్ట్రమంతా కారు టాప్ గేరులో దూసుకుపోతే.. ఖమ్మంలో మాత్రం ఫస్ట్ గేర్ లోనే బ్రేకులు పడ్డాయి. దీంతో కేసీఆర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అనూహ్యంగా లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరింది. 'సారు కారు పదహారు' అంటూ లోక్ సభ పోరుకి హుషారుగా దూసుకెళ్లిన టీఆర్ఎస్ కు.. బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో షాకిచ్చాయి. కానీ ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో ఖమ్మం ఫలితాలు గులాబీ బాస్ కి ఎప్పటికీ అంతుబట్టని ఓ ప్రశ్నలా మిగిలిపోయాయి. ఖమ్మం జిల్లా ఫలితాలే కాదు, రాజకీయాలు కూడా కేసీఆర్ కి అంత ఈజీగా అర్థంకావట్లేదని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీటే గెలిచినప్పటికీ.. తరువాత ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో బలపడింది. ఆ బలం ఎంపీ సీటు గెలవడానికి ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్.. తరువాత టీఆర్ఎస్ లో చేరి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో.. జిల్లాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి వారి ఓటమికి కారణమయ్యారని ఆరోపణలున్నాయి. దీంతో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. ఎన్నిక‌ల ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వ‌ర‌రావుకి టికెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి టీఆర్ఎస్ ని వీడరతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఆయనకు రాజ్యసభ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో పార్టీని వీడే ఆలోచనను అప్పుడు పొంగులేటి పక్కన పెట్టారని వార్తలొచ్చాయి. మరోవైపు సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లాలో ప‌ట్టు నిలుపుకుంటున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, మాజీ మంత్రి, జిల్లాలో సీనియర్ నేతగా మంచి పట్టు, తనున్న పార్టీ అధికారంలో ఉండటం.. అయితే ఇన్నున్నా తనకి ప్రస్తుతం ఏ పదవి లేకపోవడంతో తుమ్మల అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తనకి మళ్లీ మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తారనుకున్నారట. కానీ కేసీఆర్ మాత్రం.. ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు. దీంతో తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. మరోవైపు తుమ్మలకి కూడా రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే తుమ్మల మొదటినుండి కేంద్ర రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు కాదు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడి మేనేజ్ చేయడం కష్టం అనేవాళ్ళు. మరి అలాంటి తుమ్మలను.. ఇప్పుడు రాజ్యసభకు పంపుతానంటే అంగీకరిస్తారా అంటే అనుమానమే. ప్రస్తుతం తుమ్మల, పొంగులేటి ఇద్దరిది ఇంచుమించు ఒకటే పరిస్థితి. జిల్లాలో పట్టుంది కానీ పదవి లేదు. ఒకవేళ భవిష్యత్తులో పదవి దక్కినా ఇద్దరిలో ఎవరో ఒక్కరికే దక్కే అవకాశముంది. దీనికితోడు జిల్లాలో వీరిద్దరి మధ్య వర్గపోరు కూడా నడుస్తుందని అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ ని వీడి బీజేపీ గూటికి చేరే అవకాశముందని అంటున్నారు. తుమ్మలకు ఆయన అనుచరులు పార్టీ మారమని సూచిస్తున్నారట. ఇప్పటికే తుమ్మల సమీప బంధువు గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరడంతో.. ఆయన ద్వారా సంప్రదింపులు జరిపి బీజేపీలో చేరే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి. మరోవైపు పొంగులేటి అనుచరులు కూడా పార్టీ మారాలని ఆయన మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో పొంగులేటి బీజేపీలో చేరే ఆలోచనలో పడ్డారట. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ రెండు స్థానాలకు అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. మరి ఆ పోటీలో పొంగులేటికి అవకాశం దక్కుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీజేపీలో చేరడం కరెక్ట్ అని భావిస్తున్నారట. మరి తుమ్మల, పొంగులేటి ఇద్దరిలో ఎవరో ఒకరు బీజేపీలో చేరతారో లేక ఇలాగే టీఆర్ఎస్ లో కొనసాగుతారో చూడాలి. మొత్తానికి ఖమ్మం రాజకీయాలు గులాబీ బాస్ ని తెగ కలవరపెడుతున్నాయట.

కొందరి కోసం లక్షల మందిని దూరం చేసుకుంటున్న జగన్!!

  గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా లక్షకు పైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించడం రికార్డు అని ఏపీ ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది. సచివాలయాల వ్యవస్థతో తమ పార్టీకి ఇటు యువతలో, అటు గ్రామ ప్రజల్లో బోలెడంత మైలేజ్  వస్తుందని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ప్రజల అభిప్రాయం పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు.. సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీ, ఒకే సామజిక వర్గానికి పెద్ద పీట ఇలా పలు కారణాలు ఉన్నాయి అంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం యువత పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. దాదాపు 20 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. వారిలో లక్ష మందికి పైగా (1,26,738) ఎంపిక అయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ లోపంతో ఎక్కువ మంది అర్హతలేని వారు ఉద్యోగానికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, తన సానుభూతి పరులకు ముందే పేపర్ లీక్ చేసి పరీక్ష రాయించారని ప్రచారం జరిగింది. మొదటి 250 ర్యాంకుల్లో ఒకే సామజిక వర్గానికి చెందినవారు 190 కి పైగా ఉండటంతో లీకేజీ అనుమానాలు బలపడ్డాయి. దీంతో స్వల్ప తేడాతో ఉద్యోగం చేజారిన వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అర్హులైన వారిని పక్కనపెట్టి.. తమ పార్టీ సానుభూతిపరులకు, తమ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ భావిస్తున్నట్లు సచివాలయాల వ్యవస్థ వల్ల అధికార పార్టీకి మైలేజీ వస్తుందన్న సంగతి పక్కన పెడితే.. బోలెడంత నెగటివ్ ఇమేజ్ వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరీక్ష నిర్వహణ లోపం, ఫలితాలపై కులముద్ర పడటంతో మిగతా కులాల వారిలో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 18 లక్షల మందికి పైగా నిరాశ తప్పలేదు. ఎంపికైన లక్షమంది మరియు వారి కుటుంబాలు జగన్ సర్కార్ పట్ల ఎంత సానుకూలంగా ఉంటారో.. అంతకు పదింతలు ఎంపిక కాని లక్షల కుటుంబాల వారు జగన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండే అవకాశముంది. పరీక్ష నిర్వహణ లోపం వల్లే తమకు ఉద్యోగం దక్కలేదని మెజారిటీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అది జగన్ సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంపిక కాని అభ్యర్థులు జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సొసైటీ మీద సోషల్ మీడియా ప్రభావం బలంగా ఉంది. అంతెందుకు వైసీపీ అధికారంలోకి రావడంలో కూడా సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడదే సోషల్ మీడియాలో యువత జగన్ సర్కార్ పై తిరగబడుతోంది. ఇది మరింత ఉధృతమైతే వైసీపీకి తీవ్ర నష్టమని చెప్పక తప్పదు. ఓ రకంగా సచివాలయ వ్యవస్థ కూడా ఇసుక మాదిరిగానే లక్షల కుటుంబాలపై ప్రభావం చూపి వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారనుందని చెప్పాలి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు నిలిచిపోయాయి. లారీ డ్రైవర్లు, కూలీలు ఇలా లక్షల కుటుంబాలు పని దొరక్క రోడ్డున పడ్డాయి. వారంతా జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సచివాలయ ఉద్యోగాలు దక్కని అభ్యర్థుల కుటుంబాలు కూడా చేరితే.. జగన్ మరింత గడ్డు కాలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అసలు గ్యాప్ వస్తే కదా... భర్తీ అవడానికి

కొణిదెల అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయని కొన్నాళ్లుగా మీడియాలో వినిపించే మాట. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన సమయంలో మెగా బ్రదర్స్ మధ్య చీలిక వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే, అన్నయ్య చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహారెడ్డి'కి తమ్ముడు పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంతేనా? అన్నయ్య పుట్టినరోజు వేడుకలకు అతిథిగా హాజరయ్యాడు. 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరు ఎన్ని రికార్డులు బద్దులుకొట్టినా చిరంజీవిగారి అనుభవాన్ని కొట్టలేరని ఆవేశంగా మాట్లాడాడు. దాంతో అన్నదమ్ముల మధ్య గ్యాప్ భర్తీ అయినట్టేనని చాలామంది వ్యాఖ్యానించారు. 'మీకు, మీ తమ్ముడికి మధ్య గ్యాప్ భర్తీ అయినట్టేనా?' అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవిని ప్రశ్నిస్తే... "అసలు గ్యాప్ వస్తే కదా... భర్తీ అవడానికి" అని సమాధానం ఇచ్చారు. అదంతా మీడియా సృష్టేనని, అటువంటి వార్తలు బాధ కలిగిస్తాయని ఆయన అన్నారు. అయితే, అమ్మ దగ్గర కలిసినప్పుడు వాటి గురించి నవ్వుకుంటామని చిరంజీవి అన్నారు. తమ్ముడితో రాజకీయ చర్చలు ఉండవని, రావని ఆయనస్పష్టం చేశారు. ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారన్న ప్రశ్నకు 'సినిమా పార్టీ' అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.

సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాల్ని అందజేసిన సీఎం జగన్

  పరిపాలనలో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చి గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తామన్న వైసీపీ సర్కార్ వాటికి ఎంపికైన ఉద్యోగులకు నియామక పత్రాల్ని అందజేసింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా ఉద్యోగులకు నియామక పత్రాల్ని అందజేశారు. కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం నిజంగా దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే ఒక చరిత్ర సృష్టించే రికార్డ్ అని గర్వంగా చెప్పారాయన. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం పెట్టడం, తద్వారా ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి పది నుంచి పన్నెండు కొత్త గవర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వగలిగారన్నారు. ఇది కాక ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇవ్వడం జరిగిందని, ఇది ఉద్యోగాల చరిత్రలో ఓ సరి కొత్త రికార్డు అని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు తిరగక మునుపే అక్షరాలా నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. ఈ రికార్డు మరింత గొప్పగా, మరింత గర్వపడేలా ఉండాలంటే ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగంగా తీసుకోకుండా, ఒక ఉద్యమం మాదిరిగా తీసుకోవాలి అని జగన్ అన్నారు. సొంత మండలంలోనే ప్రభుత్వ ఉద్యోగం చేసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుందని, ఉద్యోగం వచ్చిన ప్రతీ ఒక్కరూ అలాంటి గొప్ప అదృష్టవంతులు అని, కాబట్టి తమ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి అని జగన్ ఉద్యోగస్తులకు సూచించారు. ఉద్యోగ పరిసర ప్రాంత ప్రజల కోసం ఆలోచన చేయండని, అక్కడి ప్రజల కోసం చిత్తశుద్ధితో నిజాయితీగా లంచాలు లేని, వివక్ష లేని, పారదర్శక పాలన అందించమని ఉద్యోగస్తులను కోరారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోరు... తాము ఎవరికీ కొమ్ము కాయడం లేదు

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోరులో నామినేషన్ ఘట్టం ముగియనుంది. నామినేషన్ సమర్పణకు ఈరోజే ఆఖరు తేది, మరోవైపు పొత్తులు, యుక్తులతో ఉప ఎన్నికలను రాజకీయ పార్టీ నేతలు క్రమంగా వేడెక్కిస్తున్నారు.  తమ అభ్యర్థికి మద్దతు ప్రకటించారని టి.ఆర్.ఎస్ ఇప్పటికే సీబీఐ ని కోరింది. ఓటమి భయంతోనే టీ.ఆర్.ఎస్ పొత్తులకు వెళుతోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది, మరోవైపు మేము బరిలో ఉన్నామంటోంది టిడిపి. హుజూర్ నగర్ లో నామినేషన్ లకు ఈరోజే ఆఖరు తేదీ కావడంతో పోలీసు బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేశారు. అనుమతి లేని ర్యాలీలు, సభలపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఎస్పీ వెంకటేశ్వరులు. ఎన్నికల నిర్వహణ లో పారదర్శకంగా ఉంటామన్నారు. ఎన్నికల నేపథ్యంలో హుజూర్ నగర్ లో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ ఉప ఎన్నికలు పొలిటికల్ గా సెన్సిటివ్ కాబట్టి ఎన్ ఫోర్స్ మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో పదమూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయటం జరిగిందని, దీంట్లో ఐదు చెక్ పోస్టులు ఆంధ్రా బోర్డర్ తో కలిసున్నాయని ఇప్పటికే నలభై మూడు లక్షల క్యాష్, లిక్కర్ ను కూడా సీజ్ చేయటం జరిగిందని ఎస్పీ తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వస్తున్న ఉదంతుల నేపథ్యంలో ఎస్పీ మాట్లాడుతూ, తాము ఎవరికీ కొమ్ము కాయడం లేదని, నిజం నిప్పులాంటిదని, తాము పారదర్శకంగా ఉంటున్నామని తెలిపారు. తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వెంకటేశ్వరులు అన్నారు.

చివరికి కేసీఆర్ కి ఆ తోక పార్టీనే కావాల్సి వచ్చింది!!

  హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం, ఆయన సతీమణి బరిలో దిగడంతో.. ఎలాగైనా గెలిచి తమ సత్తా చూపాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా.. హుజూర్‌నగర్‌ లో గెలిచి ఉత్తమ్ కి గట్టి షాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. అందుకే ఉన్న ఏ అవకాశాన్ని టీఆర్ఎస్ వదులుకోవట్లేదు. హుజూర్‌నగర్‌ లో తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర నాయకత్వానికి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ నాయకులు కె.కేశవరావు, నామా నాగేశ్వర రావు, బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆదివారం సీపీఐ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితర నేతలతో భేటీ అయ్యి చర్చలు జరిపారు. కాగా, అక్టోబరు ఒకటో తేదీ సీపీఐ కార్యవర్గం సమావేశమై టీఆర్‌ఎస్‌ వినతిపై నిర్ణయం తీసుకోనుంది. అయితే టీఆర్ఎస్ హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల కోసం సీపీఐ మద్దతు కోరడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలను తోక పార్టీలు అన్నారు. మరి ఇప్పుడు తోక పార్టీ అయిన సీపీఐ మద్దతు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అందితే తల, అందకపోతే తోక అన్నట్టు.. ఒకప్పుడు మీరు తోక అన్న పార్టీ తోడే ఇప్పుడు మీకు కావాల్సి వచ్చిందా అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయండి: సీఎం జగన్

  గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాతపరీక్షల్లో అర్హత సాధించి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం వైఎస్ జగన్ సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం సహా మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఉద్యోగాల చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని సగర్వంగా చెబుతున్నానని అన్నారు. నాలుగు నెలల్లోనే నాలుగు లక్షలపైగా ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు. దాదాపు లక్షన్నర శాశ్వత ఉద్యోగాలను ఇచ్చామని తెలిపారు. గ్రామ వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. అధికారం చెలాయించడం కోసం ఉద్యోగం చేయడం లేదు.. సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతీ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలని అన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని విఙ్ఞప్తి చేశారు. ఉద్యోగులు నిజాయతీగా, లంచాలు తీసుకోకుండా పని చేయాలని అన్నారు. తాను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని సీఎం కోరారు.

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న డెంగ్యూ ఫీవర్...

  డెంగ్యూ ఫీవర్ తెలుగు రాష్ట్రాలకు ప్రాణాంతకంగా మారింది. రెండు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరంతో వందలాది మంది మంచం పడుతున్నారు, కొన్ని చోట్ల ప్రాణాలే పోతున్నాయి. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకూ డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నారు. విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు అన్న తేడా లేకుండా రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఎలీజా టెస్ట్ లు సగటున తొంభై శాతం పాజిటివ్ రావడంతో రోగుల గుండెల్లో గుబులు పుడుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో ప్రతి గుమ్మంలో కన్నీరు, ప్రతి ఇంట్లో విషాదం నెలకొంది. ఈ మహమ్మారి బారినపడి పదుల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటీవలె కురిసిన భారీ వర్షాలకి ఏజెన్సీలో అంటు రోగాలు ప్రబలుతున్నాయి. విషజ్వరాలు విజృంభిస్తుండటంతో పల్లె ప్రాంతాలు మంచం పడుతున్నాయి. డెంగ్యూ పేరు వినగానే చింతలపల్లి వాసులు భయంతో వణికిపోతున్నారు. డెంగ్యూ వస్తే తమ పరిస్థితి ఏంటని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చింతలపల్లి గ్రామంలో గడిచిన పదిహేను రోజుల్లో డెంగ్యూ జ్వరం బారిన పడి ఐదుగురు చనిపోయారు. మరో నలభై మందికి పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించి అంటువ్యాధులు సోకి జనం మంచం పడుతున్నారు. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థితిలో లేని వారు సర్కారు వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు. చింతలపల్లి గ్రామంలో పదిహేను రోజుల్లో ఐదుగురు చనిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న జాన్సీ అనే యువతికి డెంగ్యూ సోకి చనిపోయింది. ఈ ఘటనలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పందించి గ్రామాల్లో స్పెషల్ హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక వైద్యుల బృందం గ్రామంలో పర్యటించి వైద్య పరీక్షలు మందులను బాధితులకు అందజేశారు.

ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు నేటితో బంద్‌

  ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు నేటితో తెరపడనుంది. ప్రైవేటు మద్యం షాపులు కనుమరుగై.. వాటి స్థానంలో ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు మద్యం దుకాణాలకు సెప్టెంబరు 30వ తేదీ చివరి రోజు. 1వ తేదీ నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో, షాపులను ఖాళీ చేసే పనుల్లో మద్యం వ్యాపారులు ఉన్నారు. మరోవైపు, ఎక్సైజ్‌ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరుకు నింపి.. సిబ్బందిని సమకూర్చుకుని.. కొత్తగా అమ్మకాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి విడతలో ప్రస్తుతం ఉన్న 4,380 షాపుల్లో 20 శాతం తగ్గించి, 3,448 దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు... ఇప్పుడు చరిత్రలో కలిసిబోతోంది...

తెలంగాణ రాష్ట్ర పరిపాలన కేంద్రం మూగబోయింది. ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన సెక్రటేరియట్‌కు తాళం పడింది. హైదరాబాద్ స్టేట్ మొదలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వరకు... అలాగే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి సేవలందించిన సెక్రటేరియట్‌ ఇకపై చరిత్ర కానుంది. ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలన సాగించిన చారిత్రక సచివాలయానికి మూతపడింది.  హైదరాబాద్‌ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఇక్కడ మొదలైన పాలన, ఆ తర్వాత 1956లో కోస్తాంధ్ర, రాయలసీమలను విలీనం చేస్తూ ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహరావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామ్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నందమూరి తారకరామారావు, నాదెండ్ల భాస్కరరావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కోణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు... ఇక్కడ్నుంచే పరిపాలన కొనసాగించారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్... ప్రారంభంలో కొద్దిరోజులు ఈ సచివాలయం నుంచి పరిపాలన సాగించినా, వాస్తు బాగోలేదంటూ, క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ నుంచే అధికార కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు. ప్రభుత్వ శాఖలన్నీ ఇక్కడే ఉన్నా, కేసీఆర్ సమీక్షలన్నీ ప్రగతి భవన్‌ నుంచే సాగాయి. అయితే, మంత్రులు మాత్రం సెక్రటేరియట్ నుంచే అధికారిక వ్యవహారాలు కొనసాగించారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడున్న ప్రాంతంలోనే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించడంతో సచివాలయాన్ని ఖాళీచేసి మూసివేశారు. ఇక, సుమారు 4వందల కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాలతో కొత్త సెక్రటేరియట్‌ నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతమున్న భవనాలను కూల్చివేసి, ఇప్పుడున్న ప్లేస్‌లో కొత్త సెక్రటేరియట్‌‌ను నిర్మించనున్నారు. అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో, చరిత్రలో నిలిచిపోయేలా, అన్ని శాఖలు ఒకేచోట ఉండేలా, పక్కా వాస్తుతో దాదాపు 6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.

సాక్షి ఉద్యోగుల పంట పండుతోంది... ఇక మిగిలింది కొమ్మినేని ఒక్కరే..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో సాక్షి ఉద్యోగుల పంట పండుతోంది. ఒకరి తర్వాత మరొకరికి కేబినెట్ ర్యాంక్ పదవులు దక్కుతున్నాయి. సీనియర్ ఐఏఎస్ లను మించిన జీతాలు, సౌకర్యాలతో కీలక పదవులు కట్టబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుగా నియమించుకుని కేబినెట్ ర్యాంకు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి... ఆ తర్వాత సాక్షి ఉద్యోగులు కృష్ణమోహన్, హరికృష్ణలను సీఎంవోలోకి తీసుకున్నారు. ఇక తెలంగాణ జర్నలిస్టు దేవుపల్లి అమర్ ను జాతీయ మీడియా - ఇంటర్ స్టేషన్ మీడియా సలహాదారుగా నియమించుకుని నెలకు దాదాపు 4లక్షల జీతం, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఇక ఇఫ్పుడు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తిని ప్రజాసంబంధాల సలహాదారుగా నియమించారు. అయితే, రామచంద్రమూర్తి కూడా తెలంగాణ జర్నలిస్టే. అయితే, వీళ్లందరికీ సాక్షిలో ఏ స్థాయిలో జీతాలు ఇచ్చారో తెలియదు కానీ, ప్రభుత్వం మాత్రం 4లక్షలపైనే వేతనమిస్తూ, అలవెన్సులు, సౌకర్యాలు అదనంగా కల్పిస్తోంది. ఇక వీళ్లే కాకుండా, పీఆర్వోలుగా, ఫొటో-వీడియోగ్రాఫర్లుగా, ఆఫీస్ బాయ్ లుగా దాదాపు 150మంది సాక్షి ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ డిజిటల్ మీడియాలోకి మరో 150మంది సాక్షి ఉద్యోగులనే తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, సజ్జల, దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తి, కృష్ణమోహన్, హరికృష్ణను వివిధ హోదాల్లో నియమించుకుని, పలువురికి కేబినెట్ ర్యాంక్ హోదా కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి... వీరభక్తుడైన కొమ్మినేని శ్రీనివాసరావుకు మాత్రం అన్యాయం చేస్తున్నారనే మాట వినిస్తోంది. తెలంగాణ జర్నలిస్టులందరికీ పెద్దపీట వేసిన జగన్..... అసలుసిసలు ఆంధ్రా జర్నలిస్టుకు మాత్రం ఇంకా ఎందుకు పదవి ఇవ్వలేదని అంటున్నారు. సాక్షిలో పెద్ద తలకాయలందరికీ దాదాపు పదవులిచ్చేశారు... ఇక, కొమ్మినేనికి కూడా ఏదోఒక కీలక పదవి ఇచ్చేస్తే బ్యాలెన్స్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. మరి వీరభక్తుడికి జగన్ ఏ పదవి కట్టబెడతారో చూడాలి.

ఈరోజు శ్రీవారికి... ఐదున అమ్మవారికి... పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్

తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవీ నవరాత్రి శోభ దేదీప్యమానంగా కనిపిస్తోంది. కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకావడంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దాంతో ఇందకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక, ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... అక్టోబర్ 5న అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదే సమయంలో, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అంకురార్పణతో మొదలైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 9వరకు జరగనున్నాయి. ఇక, బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తోంది. దాదాపు 6వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, తిరుమల నడకదారుల్లో 1650 సీసీ కెమెరాలతో నిఘాపెట్టారు. ఇక గదుల కేటాయింపు, దర్శనాల్లో సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తామని టీటీడీ ఈవో చెప్పుకొచ్చారు. ఇక, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమల వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక, రాత్రికి తిరుమలలోనే బసచేయనున్న సీఎం జగన్‌... రేపు ఉదయం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కుల రాజకీయాలు... పేరు మార్చుతారన్న ప్రచారంపై కలకలం...

ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. దాంతో ఎవరు అధికారంలోకొస్తే, వాళ్లు తమ వర్గానికి పెద్దపీట వేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. చంద్రబాబు హయాంలో తన సామాజిక వర్గానికే ప్రతిచోటా కీలక పదవులను కట్టబెట్టారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది కూడా టీడీపీ ఘోర పరాజయం పాలవడానికి కారణాల్లో ఒకటని అంటారు. ఇక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో... రెడ్డి కమ్యూనిటీకి పెద్దపీట వేస్తున్నారనే మాట వినిపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50శాతం కోటా అంటూ చట్టం తెచ్చినప్పటికీ, కీలక పదవుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకే పెద్దపీట దక్కుతుందనేది ఆరోపణ. అయితే, ఈ కుల రాజకీయాలు... విశ్వవిద్యాలయాల్లో కూడా అలజడి సృష్టిస్తున్నాయట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక వైద్య విశ్వవిద్యాలయంలో ఇఫ్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో, ఆ సామాజికవర్గ ప్రముఖులు.... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో పాగా వేయడానికి సిద్ధమయ్యారట. అందులో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ సీవీరావును తప్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారట. దాంతో ఎందుకొచ్చిన తలపోటని సీవీరావు రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఇష్యూ... సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో అతిత్వరలోనే, వీసీ సీవీరావును తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు స్వయంప్రతిపత్తి కలిగిన వైద్య విశ్వవిద్యాలయంపై వైద్యారోగ్యశాఖ ముఖ్య అధికారి అప్పుడే తనదైన శైలిలో పెత్తనం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ముందు పెద్ద తలకాయలను తప్పిస్తేనే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో తాము అనుకున్నది చేయగలుతామని నిర్ణయానికి వచ్చిన జగన్ సామాజికవర్గ నేతలు, అధికారులు.... ముందుగా వీసీని వెంటనే తప్పించాలని జగన్ పై ఒత్తిడి పెంచారట. అంతేకాదు, అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాలని సీఎం దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తొలగించాలని జగన్ సామాజికవర్గం డిమాండ్ చేస్తోందట. అయితే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కుల రాజకీయాలపై అక్కడి అధికారులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడేళ్ల పదవీ కాలానికి ఎన్నికైన సీవీరావును వీసీగా తప్పిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక, యూనివర్శిటీ పేరు మార్చుతారన్న ప్రచారంపైనా ఉద్యోగులు ఫైరవుతున్నారు. ఎన్టీఆర్ పేరును తొలగిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు.

మేఘా వెనుక కేవీపీ.! కాళేశ్వరం, పోలవరం కాంట్రాక్టులు అందుకే దక్కాయా?

కేవీపీ రామచంద్రరావు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ఆత్మ... ఇప్పుడదే ఆత్మ రెండు రాష్ట్రాల్లోనూ, తెర వెనకుండి నడిపిస్తోందన్న వాదన, రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌‌గా సాగుతోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కేవీపీ మాటే చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. తెలంగాణ కాళేశ్వరం... ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుల కాంట్రాక్టులను మేఘా సంస్థ దక్కించుకోవడం వెనుక కేవీపీనే ఉన్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు, కేసీఆర్-జగన్ ఫ్రెండ్షిప్ వెనుకా కేవీపీయే ఉన్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోంది మేఘా సంస్థే... అయితే, మేఘాకి ఈ ప్రాజెక్టు దక్కడం వెనుక కేవీపీ కీలక పాత్ర పోషించారన్న వాదన ఉంది. ఎందుకంటే, ప్రత్యక్షంగా కనిపించకపోయినా, కేసీఆర్‌కు కేవీపీకి మంచి సంబంధాలున్నాయని అంటున్నారు. ఇద్దరి సామాజికవర్గం కూడా ఒక్కటే కావడమూ కారణమంటున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోన్న కంపెనీయే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లో పోలవరం కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే, మేఘా సంస్థ... పోలవరం కాంట్రాక్టు దక్కించుకోవడం వెనుక కూడా కేవీపీయే ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. వందల కోట్ల రూపాయల నష్టం వస్తుందని తెలిసినప్పటికీ, 12.6 శాతం తక్కువకు కోట్ చేస్తూ, మేఘా సంస్థ బిడ్ దాఖలు చేయడం వెనుక కేవీపీ వ్యూహం ఉందని మాట్లాడుకుంటున్నారు. మేఘా కంపెనీ ఇంత తక్కువకు బిడ్ దాఖలు చేయడం వెనుక, కేవీపీతోపాటు జగన్ కూడా ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే, మేఘాకి పోలవరం కాంట్రాక్టు దక్కడంతో వైసీపీ నేతలు ఖుషీ అవుతున్నారట. మరోవైపు, మేఘా సంస్థలో కేవీపీకి భారీగా షేర్లు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అందుకే మేఘా కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కాంట్రాక్టులు దక్కేలా చేస్తున్నారని అంటున్నారు.

ముందు అపాయింట్ మెంట్ లెటర్లు... ఆ తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్...

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. అక్టోబర్ రెండు నుంచి గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు విజయవాడలో నియామక పత్రాలు అందజేయడంతోపాటు, వారినుద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. అలాగే, జిల్లాల్లో మంత్రులు... నియామక పత్రాలు అందజేయనున్నారు. నియామక పత్రాల్లో కేవలం ఉద్యోగానికి ఎంపికైనట్లు మాత్రమే తెలియజేస్తారు. పోస్టింగ్ ఆర్డర్లు ఆ తర్వాత అందజేస్తారు. ఎంపికైన ఉద్యోగులకు వారు కోరుకున్న విధంగా, జిల్లా-మండల పరిధిలోనే పోస్టింగ్ ఇవ్వనున్నారు. అయితే, సొంత గ్రామంలో మినహా ఉద్యోగులు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించారు. పోస్టింగ్‌ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు.

చంద్రబాబు బాటలో జగన్... వన్‌మ్యాన్‌ ఆర్మీలా పరిపాలన..!

చంద్రబాబు తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు వేయడం మొదలుపెట్టారట. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. విప్లవాత్మక నిర్ణయాలతో తాను దూసుకుపోతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు... తన స్పీడ్ ను అందుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తంచేస్తున్నారట. అంతేకాదు తన అంచనాలు ఒకలా ఉంటే... మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మాత్రం మరోలా ఉందని జగన్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. క్లిష్ట సమయాల్లో కీలక పరిస్థితుల్లో మంత్రులు చాకచక్యంగా వ్యవహరించలేకపోతున్నారని జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా విపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారంటూ మంత్రులకు జగన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతున్నారని జగన్ ఫైరయ్యారట. ముఖ్యంగా గత ప్రభుత్వం కంటే గొప్పగా మనమేం చేస్తున్నామో చెప్పుకోవడంలో ఇటు మంత్రులు... అటు ఎమ్మెల్యేలు వెనుకబడుతున్నారని జగన్ క్లాస్ పీకారట. అయితే, జగన్ స్పీడ్‌ను తట్టుకోలేక మంత్రులు ఇబ్బంది పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా, అంతే వేగంగా రిసీవ్ చేసుకోలేకపోతున్నామని అంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఉంటోందని చెబుతున్నారు. దాంతో ఒక్క సీఎం తప్పా...మిగతా వాళ్లెవరూ పనిచేయడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిందని, అదే సమయంలో పరిపాలన మొత్తం జగన్ వన్‌మ్యాన్‌ ఆర్మీలా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ఇదే పరిస్థితి కొనసాగితే, ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.