ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుపై మండిపడ్డ లక్ష్మణ్...
posted on Oct 4, 2019 @ 10:17AM
గోదావరి, కృష్ణా అనుసంధానం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విడివిడిగా రెండ్రోజుల వ్యవధిలో కలుస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో బిజెపి నేతలు కీలక ప్రకటనలు చేస్తున్నారు. కొంత మంది నేతలని బిజెపిలో చేర్పించేందుకు ఢిల్లీ తీసుకువెళ్లినా ఆ పార్టీ అధ్యక్షులైన కేసీఆర్, జగన్ తీరు పై లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ, తెలంగాణ కలసి ఉమ్మడి ప్రాజెక్టులు ఎలా కడతాయని ప్రశ్నించారు. లక్ష కోట్ల ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టులు కమీషన్ లు దండుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ నీటిని ఏపీ దోపిడీ చేసిందని ఆరోపించిన కెసిఆర్ ఇప్పుడు జగన్ తో కలిసి ప్రాజెక్టు ఎలా కడతారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటిని దోపిడీ చేసిందని కెసిఆర్ ఉద్యమాల్లో చెప్పారని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ భూభాగం మీద నుంచి ఏపీకి నీటిని ఎలా తరలిస్తారని లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు. రేపు మోదీతో భేటీలో ఏపీ తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు అంశాన్ని కెసిఆర్ ప్రస్తావిస్తూ, ఆర్ధిక సాయాన్ని కోరనున్నారు. ఐదొవ తేదీ న జగన్ మోహన్ రెడ్డి కూడా మోదీతో భేటీ అయి ఇదే అంశంపై సాయం చేయాలనే కోనలో విజ్ఞప్తి చేయనున్నారు. అయితే అనూహ్యంగా బీజేపీ నేతల నుంచి ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకత వస్తోంది.
ఇది తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలో చర్చనీయాంశమవుతోంది.తెలంగాణ ద్రోహులను ఈ రోజు వారికి మంత్రి పదవులు ఇచ్చి బంగారు తెలంగాణ నిర్మాణమని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు. మన నీళ్ళు దోచుకున్నారని ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి సీమాంధ్ర ప్రజలను అక్కడి నేతలను దూషించి విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకొని ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాజెక్టులు కట్టుకొని తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తెలంగాణ నుంచి సీమాంధ్రకు నీళ్ళను తరలించాలని, ఆంధ్ర ప్రదేశ్ తో కలిసి నీటిని పంచుకొవాలని, దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా ఇద్దరు ముఖ్యమంత్రులూ రెండు రాష్ట్రాల ప్రజలతో దోబూచులాడుతూ ఏ రకంగా ఇవాళ్ల కేసీఆర్ గారు, జగన్ గారు మంతనాలు జరుపుకుంటు గోదావరి నీటిని శ్రీశైలంకి తరలిస్తామనేటువంటి అవసరం ఎందుకొచ్చిందని లక్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు.