సీబీఐ కోర్టులో చిదంబరానికి చుక్కెదురు...
posted on Oct 4, 2019 @ 11:26AM
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి కోర్టులో కష్టాలు కొనసాగుతున్నాయి. చిదంబరం బెయిల్ పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ పదిహేడు వరకు పొడిగించింది, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. చిదంబరం బెయిల్ పిటిషన్ మళ్లీ నిరాకరించడంతో ఆయన తీవ్ర షాక్ లో ఉన్నారు. ఢిల్లీ హై కోర్టు కూడా ఇప్పటికే చిదంబరం బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు లో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలైంది, జస్టిస్ రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. చిదంబరం బెయిల్ పిటిషన్ ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు.
యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ఆయన విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు అనుమతిచ్చారు. ఆ కంపెనీ పెట్టుబడులను సేకరించింది చిదంబరం తనయుడు కార్తీ కంపెనీల నుంచే, ఈ కంపెనీల మధ్య మూడు వందల ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయని కేసు నమోదైంది. గతంలో ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టు తిరస్కరించింది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ హోదాలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం సమావేశాలను ఆయనే నిర్వహించేవారు, ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థకు విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు అనుమతి ఇవ్వడం ఈ కేసుకు మూలాధారం.
ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థ పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలది. అడ్వాంటేజ్ ఇండియా సింగపూర్ లోని దాని అనుబంధ సంస్థ అడ్వాంటేజ్ సింగపూర్ నుంచి ఐఎన్ఎక్స్ మీడియా పెట్టుబడులు స్వీకరించినట్లు రికార్డుల్లో చూపారు. ఈ రెండు కంపెనీలు చిదంబరం కుమారుడు ప్రస్తుత ఎంపీ కార్తీ చిదంబరానివి. తండ్రి పదవి అండతో విదేశీ పెట్టుబడులకు అనుమతులను సులభంగానే సాధించారు, ఎఫ్ఐపీబీ అనుమతులు తీసుకో కుండా ఐఎన్ఎక్స్ న్యూస్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి అందులో ఇరవై ఆరు శాతం పెట్టుబడులు పెట్టారు. తండ్రి ఆర్ధిక మంత్రి కావడంతో దీన్ని అడిగేవారు లేకపోయారు. ఈ కేసులో కీలక నిందితులైన పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీ దంపతులు అప్రూవర్ లుగా మారారు. తమ మీదకు కేసు రాకుండా చూసుకునేందుకు కార్తీకి వారు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.