ప్రధానితో భేటీకానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు...
posted on Oct 4, 2019 @ 10:23AM
కేసీఆర్ ప్రధానిని కలిసిన మర్నాడే ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఢిల్లీలో మోదీతో సమావేశమౌతారు. ప్రధానంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్రం నుంచి సహకారం కోరనున్నారని సమాచారం. దీంతో పాటు ఈ నెల పదిహేను నుంచి అమలు చేసే రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని స్వయంగా ఆహ్వానించేందుకే ఢిల్లీ వెళుతున్నారని సమాచారం. విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపైనా జగన్ మోదీకి వినతి పత్రం ఇవ్వనున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం వల్ల రాష్ట్రాలకు కేంద్రం వాటా నిధులు తగ్గడం, రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతున్న నేపధ్యంలో తెలంగాణాకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. తెలంగాణాలోని ఒక నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ములుగు నారాయణపేట కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జోనల్ వ్యవస్థలో మార్పులు విభజన హామీల అమలు, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ లు కర్మాగారంతో పాటు వెనకబడిన జిల్లాలకు కేంద్రం అమలు చేస్తున్న పథకాల కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని కోరనున్నట్టు తెలుస్తోంది.
అదే విధంగా పంటలకు మద్దతు ధరలు వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం ఆహార శుద్ధి పరిశ్రమలకు కేంద్ర సహాయం వంటి వాటిని ప్రస్తావించే అవకాశం ఉంది. మోదీని కలిసిన తర్వాత కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై ప్రధానితో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఇటీవల తెలంగాణ, ఎపీ ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా రెండు నదుల అనుసంధానం అంశంపై మాట్లాడుతున్నారు. అనుసంధానం తరవాత రెండు రాష్ట్రాల్లోని ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలకు నీటి వనరుల సౌకర్యం కల్పించే ప్రాజెక్టుపై చర్చించనున్నారు. దీనికి అరవై వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అవుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ప్రధానిని కలుస్తున్నారని తెలుస్తోంది.