ఇండోనేషియ‌న్లు పెట్టిన చిచ్చు.. కరీంనగర్‌లో 76వేల మందికి స్క్రీనింగ్

ఇండోనేషియా నుంచి వచ్చిన వారు 70మంది కలిసినట్టు అధికారులు గుర్తించారు. ఇంటింటికీ వెళ్లి అనుమానితులను వైద్య బృందాలు గుర్తిస్తున్నాయి. మూడు రోజుల్లో ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో సంచరించారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలెక్టరేట్‌‌కు అతి సమీపంలోని మ‌సీదుల‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మార్చి 14,15 తేదీల్లో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వీరు సంచారించారని అధికారులు గుర్తించారు. ఇంకా వీరు తిరిగిన ప్రాంతాలను తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక ఇండోనేషియన్ల పుణ్యమా అని కరోనా వైరస్ కరీంనగర్ కు పాకింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన మత ప్రచారకుల బృందంలో 9మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన ఇండోనేషియన్లు కరీంనగర్ లో బస చేశారు. కరీంనగర్ నగరంలో కరోనా బాధితులను గుర్తించే పనిలో బిజీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కరీంనగర్ ను జల్లెడ పడుతున్నారు. కరీంనగర్‌లో 50 వేల మందికి పరీక్షలు చేశాం. అయితే ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలకు అసౌకర్యం కలగొద్దని కరీంనగర్‌ పర్యటన వాయిదా వేసుకున్నానని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ఇండోనేషియన్లు ఎక్కడెక్కడ తిరిగారో విచారణ చేస్తున్నాం. ఎయిర్‌పోర్టులు, పోర్టులు మూసివేయాలని ప్రధానికి చెప్పాను. ఒకేసారి మూసివేయడం కూడా సాధ్యం కాదని సి.ఎం. చెప్పారు.

క‌రోనాను టెస్ట్‌ క్రికెట్‌తో పోల్చిన టెండూల్క‌ర్‌

భారత దేశంలో ఇప్పటికే 294 మందికి కరోనా సోకగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. శ‌ర‌వేగంతో విస్త‌రిస్తున్న క‌రోనాను అడ్డుకోవ‌డానికి టెస్టు క్రికెట్ మ్యాచ్ త‌ర‌హాలో సిద్ధం కావాల‌ని స‌చిన్ అంటున్నారు. పిచ్‌ పరిస్థితులను, బౌలర్‌ శైలిని మనం అర్థం చేసుకుని సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేయాలి. ఇక్కడ అత్యంత రక్షణాత్మకంగా ఆడటం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత ప్రపంచానికి కావాల్సిందే ఓర్పు. కరోనాపై మనల్ని రక్షించుకోవాలంటే ఎంతో ఓపిక అవసరం' అని సచిన్‌ వివరించారు. ఈ పోరులో ప్రజలందరికీ సహనం, సమష్టితత్వం, అప్రమత్తత అవసరమని సచిన్‌ తెలిపారు. వైరస్‌ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. 'జనతా కర్ఫ్యూ'కు అందరూ సహకరించాలని కోరారు. అంతా కూడా స్వీయ నిర్భందాన్ని పాటించాలన్నారు. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 'సేఫ్‌ హ్యాండ్స్‌' చాలెంజ్‌ను సచిన్ స్వీకరించారు. చాలెంజ్‌లో భాగంగా తన చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. దాదాపు 20 సెకండ్లు సచిన్ చేతులు శుభ్రం చేసుకున్నారు.

కూక‌ట్‌ప‌ల్లిలో వెలుగులోకి వ‌చ్చిన క‌రోనా, దేశంలో బాధితుల సంఖ్య 294

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్‌ను నిరోధించకపోతే రాబోయే రోజుల్లో లక్షలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. దావానంలా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను కట్టిడి చేయకుండా అలాగే వదిలేస్తే పరిస్థితి చేయిదాటిన ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో ప్రజలు మరణించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 11 వేల మందిని బలితీసుకున్న ఈ వైరస్‌తో విశ్వవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులు దిగజారాయని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 294కి చేరింది. వీరిలో 267 మందికి ఐసోలేషన్ వార్డుల్లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. 23 మంది మాత్రం ఇప్పటివరకూ రికవరీ అయ్యారు. మృతుల సంఖ్య 4గా ఉంది. కరోనా వ్యాధి సోకిన వారిలో భారతీయులు 256 మంది ఉండగా... విదేశీయులు 38 మంది ఉన్నారు. మొత్తం పాజిటివ్ కసుల్లో విదేశాల నుంచి వచ్చిన భారతీయులతో పాటు.. స్థానికులు 256 మంది ఉంటే.. దేశానికి వచ్చిన విదేశీయులు 38 మంది కరోనా పాజిటివ్ గా తేలింది. దేశంలో ఇప్పటివరకూ 63 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. కేరళ 40 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 26, ఉత్తరప్రదేశ్ 24, రాజస్థాన్ 23 కేసులతో ఉండగా... తెలంగాణ 21 కేసులతో ఆరో స్థానంలో ఉంది. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో 3 పాజిటివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ఫేజ్-2లో ఉండే ఓ మహిళకు కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆ మహిళను వైద్యం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె సోదరుడు ఇటీవలే బ్రిటన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఇంటిలో ఉన్న మరో ఇద్దరికి కరోనా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పూర్తి అవగాహనతో జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ఒంగోలులో నమోదైన కరోనా పాజిటివ్ బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అతనితో సంబంధం ఉన్న అందరినీ గుర్తించామన్నారు. వాళ్లని కూడా ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలన చేస్తున్నామన్నారు. బాధితుడి కుటుంబం సభ్యుల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కేసులు వైద్యుల పరిశీలనలో ఉన్నాయి.ఇప్ప‌ట్టి వ‌ర‌కు 3 కేసులు పాజిటివ్ వచ్చాయి'అని మంత్రి తెలిపారు.

రేపు ఉదయం నుంచి 24గంటల పాటు తెలంగాణ బంద్

* పక్క రాష్ట్రాల బస్సులకూ అనుమతి లేదు: ముఖ్యమంత్రి  * సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులు  * మెట్రో రైలు సర్వీసులు కూడా రేపు ఉండవు  * విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా డాక్టర్లను సంప్రదించాలి: సి ఎం   విదేశాల నుంచి వచ్చిన వారు స్థానిక హాస్పిటల్ లో కానీ,పోలీస్ స్టేషన్ లలో స్వచ్ఛందంగా వారి వివరాలు వెల్లడించాలని కె సి ఆర్ సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇలా చేయడం వల్ల వైరస్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు..ఇది మన సామాజిక బాధ్యతగా చేయాలన్నారు ముఖ్యమంత్రి.  జ్వరం,దగ్గు,జలుబు ఉన్న వాళ్ళు డాక్టర్ ను సంప్రదించండి..మీరు సమాచారం ఇస్తే చాలు మేమె హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయిస్తాం..విదేశాల్లో నుంచి వచ్చిన వారు ప్రతి ఒక్కరు స్వచ్ఛద్దంగా రిపోర్ట్ చేయండి..డాక్టర్లని సంప్రదించండి..రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇంట్లోనే వుండండని కూడా కె సి ఆర్ సూచించారు. తెలంగాణ మొత్తం ఆర్ టీ సి  బస్సులు నిలిపివేస్తున్నాం..తప్పనిసరి పరిస్థితిలో డిపోలో 5 బస్సులు పెడతాం...వేరే రాష్ట్రాల బస్సులను కూడా తెలంగాణలోకి రానివ్వమనీ చెప్పారు ముఖ్యమంత్రి. ..మెట్రో ట్రైన్ లు కూడా బంద్...ఎమర్జెన్సీ కోసం 5 మెట్రో ట్రైన్ లు అందుబాటులో ఉంటాయి..షాప్స్,మాల్స్ అన్ని మొత్తం బంద్ చేయాలనీ సి ఎం ఆదేశించారు. 

కరోనా ఎఫెక్ట్.. కేసీఆర్ కు చప్పట్లు.. కవితకు చివాట్లు!!

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. రోజురోజుకి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తగు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై.. కేంద్రం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ సూచనలు తీసుకుంది. అయితే ఒక వైపు కరోనా కోసం సీఎం కేసీఆర్ ఇంతలా చర్యలు తీసుకుంటుంటే.. ఆయన కూతురు కల్వకుంట్ల కవిత మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కవితకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌కు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తరలించినట్లు తెలుస్తోంది. వీడియోలో.. ఒకేచోట 500 మందికి పైగా మందు చిందులతో హల్‌చల్ చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ.. సమావేశాలు, వివాహాలు, వేడుకలు వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తుంటే.. మరోవైపు అధికార పార్టీ నేతలే ఇలా రిసార్ట్స్ లో గుంపులుగా ఉంటూ చిందులేయడంతో నెటిజనులు మండిపడుతున్నారు. ప్రజాక్షేమం కంటే రాజకీయం ముఖ్యమా? ఓ వైపు కరోనా అంతలా విజృంభిస్తుంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. https://twitter.com/INCTelangana/status/1241259152942350341?s=20  

ఓ వైపు కరోనా వణుకుపుట్టిస్తుంటే.. ఆ మంత్రికి ఎన్నికలు కావాలట!!

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తూ.. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ అధికార పార్టీ ఎన్నికల వాయిదాను తప్పుబట్టింది. సీఎం వైస్ జగన్ మొదలుకొని మంత్రులు, ఇతర నేతలు ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సీఎం కూడా రమేష్ కుమార్ పై ఇవే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు.. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనాకు కళ్లెం వేయొచ్చని చెప్పుకొచ్చారు.  కానీ కరోనా సీఎం చెప్పినంత తేలికగా లేదు. కరోనాకి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అయినా జగన్ సర్కార్ మాత్రం అబ్బే అంత ప్రమాదం లేదు.. ఎన్నికలు జరిపించాలంటూ.. సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీం కూడా ఎన్నికల వాయిదాను సమర్థిస్తూ జగన్ సర్కార్ కి షాకిచ్చింది. తర్వాతర్వాత కరోనా మరింత విజృంభిస్తుండటంతో.. దాని ప్రభావం ఏపీ సర్కార్ కి కూడా తెలిసొచ్చినట్టుంది. చాలా రోజుల తరువాత ఆరోగ్యమంత్రి మీడియా ముందుకి వచ్చారు. సీఎం కూడా అధికారులతో సమీక్షలు జరుపుతూ.. కరోనాని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఉగాదికి చేయాలనుకున్న పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మొత్తానికి ఏపీ సర్కార్ కి కరోనా ప్రభావం తెలిసొచ్చింది, చర్యలు తీసుకుంటుంది అనుకుంటుంటే.. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యలు మాత్రం విమర్శలకు దారితీస్తున్నాయి. స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం అప్రజాస్వామ్యం అని మంత్రి బుగ్గన అన్నారు. ఎన్నికల వాయిదాపై ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదించిందా? రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్య శాఖను సంప్రదించిందా? రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో ఉందో ఈసీకి తెలుసా? అని బుగ్గన ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు అధికారపక్షం వైపే ఉంటారని బుగ్గన చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఒకవైపు ప్రజలు కరోనా భయంతో బిక్కుబిక్కు మంటుంటే.. మంత్రి గారికి ఎన్నికలు కావాల్సి వచ్చాయా అని ప్రజలు మండిపడుతున్నారు. కరోనాపై ప్రజలకు అహగాహన కలిగించాల్సిన స్థాయిలో ఉన్న మంత్రి బుగ్గన.. ఇలా ఎన్నికల కోసం తాపత్రయ పడటం ఏంటని విమర్శిస్తున్నారు.

బీ అలెర్ట్.. కరెన్సీని టచ్ చేస్తే.. కరోనా సోకినట్టే!!

కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం జనమంతా 'షేక్ హ్యాండ్ వద్దు నమస్కారం ముద్దు' అంటున్న సంగతి తెలిసిందే. షేక్ హ్యాండ్ ఇస్తే ఎక్కడ వైరస్ ఒకరి నుండి ఒకరికి అంటుకుంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే షేక్ హ్యాండ్ అంటే నై నై అంటున్నారు. అయితే కరోనా ఉన్న వ్యక్తుల్ని తాకడం వల్లనే కాదు, వారు తాకిన వస్తువుల్ని తాకినా వైరస్ అంటుకుంటుంది. అందుకే అనవసరంగా వేటిని తాకవద్దని, ఎప్పటికప్పుడు వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు మనం ఊహించని విధంగా కూడా వైరస్ విస్తరించే అవకాశముందని తెలుస్తోంది. అదే కరెన్సీ. నోట్లు ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారడం వల్ల కూడా వైరస్ విస్తరించే ప్రమాదముంది. నోట్ల రద్దు పుణ్యమా అని.. మన దేశంలో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ అలవాటైంది. టీ స్టాల్, కిరాణ షాపులు మొదలు పెద్ద పెద్ద షాపింగ్ ల వరకు.. మొబైల్ యాప్స్ తో డబ్బు చెల్లించడం యువతకి అలవాటైంది. అయితే ఇది పదిశాతం కూడా ఉండదు. తొంబై శాతానికి పైగా నగదు ఇప్పటికీ చేతులు మారుతూనే ఉంది. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కొందరికి నోట్లు లెక్కించేటప్పుడు.. వేలిని నాలుకపై పెట్టి తడి చేయడం అలవాటు. ఒక వేళ కరోనా సోకిన వ్యక్తి  తడి చేసి నోట్లను లెక్కిస్తే.. ఆ వైరస్‌ నోట్లకూ పాకుతుంది. కరోనా వైరస్‌ వ్యక్తి నుంచి నోట్లు బయటకి వస్తే.. ఆ నోట్ల పై ఉన్న వైరస్ అంతరించేలోపు.. ఎందరో చేతులు మారే అవకాశముంది. అదే జరిగితే ఎందరో చేతికి వైరస్‌ చేరినట్లే. దాని వల్ల జరిగే నష్టం ఊహకు కూడా అందదు. అందువలన ఎవరైనా సరే.. నోట్లను నోటితో తడి చేయకుండా లెక్కిస్తే మంచిది. అదేవిధంగా వీలైనంతవరకు నగదు చెల్లింపులు.. మొబైల్ పేమెంట్ యాప్స్ లేదా ఆన్ లైన్ ద్వారా చెల్లిస్తే మంచిది.

వీరికి ఉరి ఎప్పుడు?

రేప్‌ హ‌త్య కేసుల్లో జైళ్ల‌లో విచార‌ణ ఎదుర్కొటున్న 32 వేల 559 మంది ఆ రాక్ష‌సుల క్ష‌ణికావేశానికి అమ్మాయిలు బ‌లైపోయారు. అవును దిశ మానభంగం, హత్య కేసులో మనమందరం మానసికంగా ఆనందం పొందినా, న్యాయం జరిగిందని అనుకుంటున్నా.... ఏవేవో ప్రశ్నలు మన‌ల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి... 1. ప్రత్యూష కేసు, 2. నిర్భయ కేసు, 3. ఆయేషా మీరా కేసు, 4. ఉన్నవ్ కేసు 5. హాజీపూర్ అంతకుడు శ్రీనివాస్ రెడ్డి. 6. హనుమకొండ లో తొమ్మిది నెలల పాప కేసు. 7. టేకు లక్ష్మి కేసు, 8. జడ్చర్లలో హర్షిని కేసు, 9. వరంగల్ జిల్లాలో మానస కేసు... ఇంకా రాసుకుంటూ పోతే.... ఇంకా .. ఇలా హత్యలు మానభంగాలు చేసి న్యాయ విచారణ పేరుతో జైళ్ల‌ లో పడి పందికొక్కుల్లా మెక్కు తున్న, 32 వేల‌, 559 మంది టైం పాస్ చేస్తూ రోజులు గ‌డుపుతున్నారు. ఈ విషయాన్ని పోలీస్ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని సమాజం చూస్తుండగానే మరి కాల్చి చంపితే... ఇలాంటి దారుణాలు ఆగుతాయా? 2008 డిసెంబర్ లో సజ్జనార్ గారు వరంగల్ జిల్లాలో ముగ్గురు ని కాల్చి చంపారు మళ్లీ 2019 డిసెంబర్లో అలాంటి కేసులోనే నలుగురు యువకులను కాల్చి చంపారు. (NCRB) నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్ర‌కారం 2012 నుండి 2017 వరకు జరిగిన మానభంగ, హత్య కేసుల సంఖ్య 32 వేల 559. రేప్, హ‌త్య నేరాల కేసులో నిందితులు. ఇంత దారుణానికి పాల్ప‌డిన వీరిని విచార‌ణ పేరుతో జైల్లో పెట్టి పందుల్లా మేపుతున్నారు. మనదేశంలో చిల్లర దొంగతనం చేసిన వాడిని చితకబాది, పెద్ద పెద్ద బ్యాంకులు లూటీ చేసిన వారిని రాజ మర్యాదలతో ఫ్లైట్ ఎక్కించి తలదాచుకునేలా చేస్తారు మన పాలకులు. హత్య చేసిన సామాన్యుని ఎన్కౌంటర్ చేస్తారు. పొలిటిషియన్స్, బడా వ్యాపారుల బడాబాబుల కొడుకులను మాత్రం భద్రంగా దాచి పెడతారు. ఇది మన దేశ రాజకీయ వ్యవస్థ. సామాన్యుని ఆందోళన పరిచే వ్యవస్థ. సామాన్యుడికి కష్టమొస్తే న్యాయస్థానంలో న్యాయమే దొరకడం క‌ష్ట‌మే. పోలీస్ స్టేషన్లో విచారణ జరగదు. టీవీ ఛానల్ లో వార్తలు రావు. పొలిటిషన్ ఓదార్పు ఉండవు. ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి. తేడాలెందుకు. అందరం మనుషులమే కదా? మన దేశంలో ప్రియాంక రెడ్డి కి ఒక న్యాయం. ప్రత్యూష, నిర్భయ, అయేషా, మానస, టేకు లక్ష్మి, అశ్వినీ లాంటి పేద బిడ్డలకు ఒక న్యాయమా? ప్రియాంకా రెడ్డి లాగే అందరికీ ఒకే న్యాయం జరగాలన్నదే సగటు మనిషి ఆవేదన! మానభంగం అత్యాచారం చేసి జైలు న్యాయ విచారణ పేరుతో ఉన్న32 వేల 559 మందికి శిక్ష ఎప్ప‌ట్టి లోపు ప‌డుతుందో? 8 ఏళ్ళ గ‌డిచిన బాధితుల‌కు న్యాయం ల‌భించ‌లేదు. సజ్జనార్ లాంటి అధికారుల‌ను ఆద‌ర్శంగా తీసుకొని పోలీసులే సీన్ రికన్స్ట్రక్షన్ చేయాల‌ని ప్ర‌జ‌లంతా కోరుకుంటున్నారు.  

ఫలించనివ్యూహాలు... మే లోగా ఏపీ సచివాలయం తరలింపు సాధ్యమేనా?

సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఉగాదికి  ఏపీ సచివాలయం  వైజాగ్ కు తరలించాలని ప్లాన్ చేసుకున్నారు.. కానీ ప్రస్తుత పరిస్తితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు...ఉగాదికి  ప్రోసెస్ మొదలుపెట్టి ఏప్రిల్ చివరికల్లా క్లోజ్ చేద్దామనే ఆలోచనతో ముందుకు వెళ్లింది ప్రభుత్వం. కానీ న్యాయస్థానాలు, కరోనా ప్రబావం ఈ ప్రక్రియకు పెద్ద బ్రేక్ వేసేసింది...కరోనా ప్రభావం తగ్గేందుకు కనీసం మూడు నెలలు సమయం పట్టేలా ఉంది.. ఈ లోపు తరలింపు కూడా కష్టమే.. ప్రధానంగా ఇఫ్పుడు ప్రయాణాలు చేసే పరిస్థితి కూడా లేదు..ఒక వేళ   కాదూ కూడదు అని చేసినా  రకరకాల  ఇబ్బందులు... మరో వైపు ఆరు వారాల్లో స్థానిక సంస్థల  ఎన్నికలు జరగాల్సి ఉంది....ఇవి పూర్తయితే కానీ  తరలింపు అంశం ముందుకు కదలదు... స్థానిక సంస్తల ఎన్నికలు  ఆరు వారాల్లో పూర్తి అవుతాయా  లేక మరికొంత  కాలం పొడిగిస్తారా అనేది కూడా చర్చనీయాంశమే...ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావంతీవ్రంగా ఉంది.....ఇలాంటి పరిస్థితుల్లో  ఎన్నికలు నిర్వహించడం కష్టమే......దీంతో షిప్టింగ్ కు ఎన్నికలు కూడా ఇబ్బందే... మరో వైపు  ప్రస్తుతం  నాలుగు రోజులు అసెంబ్లీసమావేశాలు జరిపి కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టనున్నారు.పూర్థి స్తాయి బడ్జెట్ కు  మరో మూడు నెలలు సమయం కావాలి...ఒక వేళ  మే లో  షిప్టింగ్ జరిగినా  మళ్లీ బడ్జెట్ సమావేశాల కోసం వెంటనే అమరావతి రావాల్సి  ఉంటుంది... ప్రధానంగా న్యా య  స్థానాల్లో  కొన్ని కేసులు నడుస్తున్నాయి..ఇప్పటికే కర్నూలుకు రెండు కార్యాలయాలు తరలింపు వద్దని హైకోర్టు చెప్పింది....అమరావతి రైతుల కేసులు కూడా ఉన్నాయి..ఈ   రైతుల సమస్ పరిష్కారం కాకుండా  ముందుకెళ్లే పరిస్థితి కూా డా లేదు.దీంతో  సీఎం  అనుకున్నదొక్కటీ...అయ్యిందొక్కటీ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి...

కరోనా ఎఫెక్ట్.. శ్రీవారి లడ్డూలు ఉచితం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతాకాదు. భక్తులు స్వామి దర్శనానికి ఎంతగా ఎదురుచూస్తారో.. లడ్డూ ప్రసాదం కోసం కూడా అంతే ఎదురుచూస్తారు. స్వామి దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీ. దీనికి అదనంగా భక్తులు ఇంకా లడ్డూలు కొనుక్కుంటూ ఉంటారు. అంత డిమాండ్ ఉన్న లడ్డూలు.. కరోనా పుణ్యమా అని ఇప్పుడు టీడీపీ ఉద్యోగులకు ఉచితంగా వరించనున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీటీడీ శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే తయారు చేసిన లడ్డూలు పాడవకుండా ఉండటం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్కొక్కరికి  10 లడ్డూలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దాదాపు రెండు లక్షల లడ్డూలను, ఉగాది కానుకగా ఈనెల 25వ తేదీన.. తిరుపతిలోని ఉద్యోగుల విశ్రాంతి సముదాయం వద్ద ఉద్యోగులకు లడ్డులను పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.

జనతా కర్ఫ్యూకు ఎలా ప్రిపేర్ అవ్వాలి!

కరోనావైరస్ మహమ్మారి మొత్తం ప్రపంచానికి ఒక పరీక్ష వంటిది. మన దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతున్నది. భవిష్యత్తులో మహమ్మారి వ్యాప్తి చెందడం చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితుల్లో దేశం లోని పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం, వివిధ విభాగాలు మరియు సంబంధిత ఆరోగ్య నిపుణులు ఇచ్చే సూచనలను,సలహాలను ఖచ్చితంగా పాటించాలి. 1. శనివారం రోజే రెండు రోజులకి సరిపడా పాలు పెరుగు దగ్గర పెట్టుకోండి. 2. రెండు రోజులకి సరిపడా కూరలు కొనండి. 3. అవసరమైన మందులు ఉన్నాయా లెవా చూసుకొని ఒకవేళ లేకపోతె శని వారం తెచ్చుకోండి. 4. పిల్లలకి కావలసిన స్నాక్స్ తెచ్చి పెట్టుకోండి. 5. ఆదివారం చేద్దాం అనుకున్న బయట పనులు వాయిదా వేసుకోండి. లేకపోతె శనివారం పూర్తి చెయ్యండి. 6. ఇంట్లో కూడా ఎక్కువమందిని ఆహ్వానించకండి. 7. అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇల్లు క్లీనింగ్ పనులు చెయ్యండి ఎందుకంటే నూతన సంవత్సరాది దగ్గర్లోనే వస్తోంది. 8. పారాసెటమాల్ టాబ్లెట్స్ ఒక స్ట్రిప్ దగ్గర ఉంచుకోండి. 9. డోర్ కర్టైన్స్ విండో కర్టైన్స్ అన్నీ బయటకు తీసి వీలయితే వాషింగ్ చెయ్యండి. 10. బయట నుండి ఫుడ్ ఆర్డర్ ఇవ్వకండి. 11) ఇంట్లో ఉన్న టీవీ remote, AC Remote. Lighter, Door nobs, door handles, Door latches, మీరు వాడే bike లు,.watch strips, bike key s, anni kooda Dettol కలిపిన water lo clean cheyandi. 12) Bike లు కూడా వీలయితే Dettol కలిపిన water tho ఇంట్లోనే clean cheyandi.(Atleast handle grips, etc) 13) పండుగ వస్తుంది కాబట్టి, ఇంట్లో మీ శ్రీమతి కి house cleaning lo సహాయ పదండి. 14) Lunch అందరు కలిసి చేయండి.(ఇంట్లో prepare chesina food మాత్రమే) 15) After lunch పైన ఉన్న అన్ని రకాల పనులు చేశారు కాబట్టి rest తీసుకోండి. 16) సరిగ్గా 5.00PM కు మీ ఇంటి gate దగ్గర నిలబడి 5 నిమిషాలు, ఇంత కష్ట సమయంలో కూడా ధైర్యంగా వైద్యం అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియచేయండి. 17) Evening టీవి లో మీకు నచ్చిన సినిమా చూడండి.

వాంతులు, విరేచనాలు, రుచితెలియ‌పోవ‌డం కూడా క‌రోనా ల‌క్ష‌ణాలే!

కరోనా వైరస్ బారిన పడ్డ వారిని గుర్తించడం క‌ష్టంగా మారుతుంది. ఈ వ్యాధి సోకిన వారి ల‌క్ష‌ణాల‌పై జ‌ర్మ‌నీ ప‌రిశోధ‌న‌ల్లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలిశాయి. కేవ‌లం జ్వ‌ర‌మే కాదు వాంతులు, విరేచ‌నాలౌనా క‌రోనా ల‌క్ష‌ణాలుగా భావించి ప‌రీక్ష‌లు చేయించుకోవాలంటున్నారు. కొంద‌రిలో జలుబు ఉంటుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, ఛాతిలో నొప్పి.. వీటితో పాటు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నలత, గొంతునొప్పి, చలిజ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటన్నింటిని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది న్యూమోనియాకు దారి తీసి.. శరీర అవయవాలపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి పరిస్థితి రాకముందే ప్రతీ ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. ఇన్ని రోజులు కేవలం జ్వరం, జలుబు ఉన్నవారిని మాత్రమే కరోనా వ్యాధిగ్రస్తులుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం మరి కొన్ని లక్షణాలు కూడా దానికి తోడు అయ్యాయి. జర్మన్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా బారిన పడిన వారిలో వాసన, రుచి సామర్థ్యం బలహీనపడుతుందట‌. రుచి తెలియ‌క‌పోవ‌టం, వ‌స‌న‌ను గుర్తించ‌క‌పోవ‌డం కూడా క‌రోనా ల‌క్ష‌ణాలేన‌ట‌. 66 శాతం మంది రోగులలో ఈ లక్షణాలు కనిపించాయి. అలాగే విరేచనాలు కరోనా వ్యాధికున్న మరో లక్షణంగా తెలుస్తోంది. కరోనా రోగులలో 30 శాతం మందిలో ఈ లక్షణం కూడా కనిపించిందని వైద్యులు సూచిస్తున్నారు.   

రాజకీయ నేతల్లో క‌రోనా ‘బేబీ’ డాల్‌ కలకలం

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ గా తేల‌డంతో రాజకీయ నాయకుల్లో కరోనా ప్రకంపనలు మొదలయ్యాయి. కనిక ప్రకంపనలు పార్లమెంట్‌, రాష్ట్రపతి భవన్‌ దాకా చేరాయి. పలువురు ఎంపీలు, నేతలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. 250-300 మందిని ఆమె కలుసుకొన్నట్టు కనిక తండ్రి రాజీవ్‌ కపూర్ చెబుతున్నారు. రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. దుష్యంత్‌ను కలిసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌, బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ, అప్నాదళ్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌.. క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఎంపీ దుష్యంత్‌ ఇటీవల పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వరుణ్‌గాంధీతో సన్నిహితంగా మెలిగారు. ఈ నెల 18న జరిగిన పార్లమెంట్‌ స్థాయి సంఘం సమావేశంలో ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ రెండు గంటలపాటు దుష్యంత్‌ పక్కనే కూర్చున్నారు. గురువారం దుష్యంత్‌ హాజరైన ఓ దావత్‌లో అనుప్రియా పటేల్‌ పాల్గొన్నారు. రాష్ట్రపతి కోవింద్‌ ఈ నెల 18న ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు ఎంపీ దుష్యంత్‌ కూడా హాజరయ్యారు. అయితే ‘బేబీ డాల్ వరుసగా ఎంత మందికి అంటించిందో భ‌విష్య‌త్‌లో తేల‌నుంది.

జనతా కర్ఫ్యూ పర్వవేక్షణ కోసం ఏపి సచివాలయంలో కంట్రోల్ రూమ్

 మానిటరింగ్ కోసం ముగ్గురు ఐ ఏ ఎస్ లు  ఐ ఏ ఎస్ లు ఎవరు రాజధాని దాటవద్దు: సి ఎం   జనతా కర్ఫ్యూ కార్యాచరణను ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించ నుంది. ఈ రోజు మధ్యాహ్నం రాజధాని లో అందుబాటు లో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా నిత్యావసరాలు , ఇతర వైద్య పరమైన సహాయం కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరేట్లలో , పోలీసు కార్యాలయాలలో హెల్ప్ లైన్ సేవలు అందుబాటు లో ఉంచాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే , ఐ ఏ ఎస్ లు ఎవరూ కూడా ఏ ఆదివారం హెడ్ క్వార్ట్రర్స్ దాటి వెళ్లవద్దని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాలతో అనుసంధానం కోసం సెక్రెటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలనీ ముఖ్యమంత్రి ఆదేశాలు జరీ చేశారు. ఈ మొత్తం వ్యవహార పర్వవేక్షణ బాధ్యతను సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు -డాక్టర్ పీ వీ రమేష్ (ముఖ్యమంత్రి కార్యాలయం), పూనమ్ మాలకొండయ్య, ఇంకా జవహర్ రెడ్డి లకు అప్పచెప్పారు. 

క‌రోనా నియంత్రణకు స‌రైన‌ చర్యలు తీసుకోవ‌టంలేదంటున్న ఐఐసీటీ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు

క‌రోనా వైరస్‌ నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న దేశాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలించని కారణంగా వచ్చే వారం, పది రోజుల్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళనకు గురిచేస్తోందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. వచ్చే 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ కాకపోతే ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌వాసులను మరో భయం పట్టుకుంది. కరోనా నేపథ్యంలోనే వివిధ దేశాల నుంచి నగరానికి వచ్చిన వారి సంఖ్య తెలిసి అందరికీ చెమటలు పడుతున్నాయి. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రయాణికులు 'ఐసోలేషన్‌' ప్రక్రియను విస్మరించి ప్రజల్లో కలసిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఏ మూల నుంచి ఏ ఉపద్రవం వచ్చి పడుతుందేమోనన్న ఆందోళన అధికార యంత్రాంగంలో నెలకొంది. మార్చి నెలలోనే సుమారుగా 69 వేల మంది ప్రయాణికులు హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కోవిడ్‌-19 ఉధృతమై వందలాదిగా కేసులు నమోదైన యూరప్‌లోని ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌ వంటి దేశాల నుంచి గడిచిన 10 రోజుల్లోనే 540 మంది నగరంలో ప్రవేశించారు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే ఐసోలేషన్‌ సెంటర్‌కు వెళ్లినట్లుగా అధికార లెక్కలు చెబుతున్నాయి.     అమెరికా, యూరప్‌ దేశాల నుంచి వచ్చిన వారే 40 వేల మంది ఉన్నారని, మలేసియా, సింగపూర్, దుబాయ్‌తో పాటు ఇతర గల్ఫ్‌ దేశాల నుంచి 20 వేల మందికి పైగా భారత్‌లో ప్రవేశించారని, వారంతా హైదరాబాద్‌కే వచ్చినట్లుగా సమాచారం. మార్చి 10 నుంచి అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికులను పరీక్షించడం మొదలైన తర్వాత కూడా ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌ నుంచి వచ్చిన 540 మంది ప్రజల్లో కలసిపోయారనే వార్తలు మరింత కలవర పెడుతున్నాయి.   కరోనాను ఆదిలోనే కట్టడి చేయకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఐఐసీటీ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు హెచ్చ‌రిస్తున్నారు.    

అమ్మ సెంటిమెంటే సింగ్ ను నిర్భయ ముద్దాయిలకు దగ్గర చేసిందా? 

* వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి కి అత్యంత ఆప్తుడు లాయర్ సింగ్  * సింగ్ వ్యవహారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా ! అమ్మ సెంటిమెంట్, ఆ లాయర్ ని నిర్భయ కేసులో ముద్దాయిల తరఫున వాదించేలా చేసిందా ? అవుననే అంటున్నారు ఆ లాయర్ సన్నిహితులు. నిర్భయ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమైన నేపథ్యంలో నిందితుల తరఫున వాదించేందుకు లాయర్లెవరూ ముందుకు రాలేదు. తాము కేసును టేకప్ చేయబోమని పలు బార్ అసోసియేషన్లు బాహాటంగా ప్రకటించాయి. నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌ భార్య పునీతా దేవి తొలుత ఏపీ సింగ్ ను కలవగా.. కేసు తీసుకోబోనని వెనక్కి పంపించారు. అయితే, సింగ్ దగ్గర జూనియర్ గా పనిచేస్తోన్న లాయర్ ద్వారా.. ‘మదర్ సెంటిమెంట్' గురించి తెల్సుకున్న ఓ తీహార్ జైలు అధికారి.. ఆ సమాచారాన్ని అక్షయ్ కుటుంబానికి చేరవేశాడు. దీంతో అక్షయ్ భార్య పునీతా.. నేరుగా ఏపీ సింగ్ తల్లి విమలా సింగ్ ను కలిసి వేడుకున్నారు. దోషుల కుటుంబాల పరిస్థితి విని చలించిపోయిన విమలా సింగ్.. కేసు టేకప్ చేయాలంటూ కొడుకు ఏపీ సింగ్ కు సూచించింది. కాదనలేని స్థితిలో ఆయన నిర్భయ కేసులోకి ఎంటరయ్యారు. 1997లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లో సభ్యత్వం పొందిన తొలినాళ్లలో ఆయనకు చంద్రస్వామితో పరిచయం ఏర్పడింది. అప్పటికే వివాదాస్పద తాంత్రికుడిగా, అప్పటి ప్రధాని పీవీకి ఆథ్యాత్మిక సలహాదారుగా, ఇటు రాజకీయ, వ్యాపార వర్గాలు, అటు దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా లీడర్లతోనూ దగ్గరి సంబందాలున్న వ్యక్తిగా చంద్రస్వామి పేరుగాంచారు. ఆ గురువుగారు కొనిచ్చిన డ్రెస్ ధరించే ఏపీ సింగ్ లాయర్ గా తొలి కేసు వాదించారు. వివిధ కేసుల్లో చంద్రస్వామి దోషిగా నిర్దారణ అయి, 2017లో చనిపోయేదాకా ఆయనతో సింగ్ అనుబంధం కొనసాగింది. ఇదిలా ఉండగా, బీజేపీకి చెందిన కీలక నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందకు బెయిల్ ఇప్పించింది కూడా ఏపీ సింగే కావడం గమనార్హం. తన ఆశ్రమానికి చెందిన లా కాలేజీలో చదివే విద్యార్థినిపై చిన్మయానంద అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టులో నిర్ధారణ అయింది. అయితే లైంగిక బంధం ద్వారా ఇద్దరూ ప్రయోజనాలు పొందారని, ఇందులో ఒకరిని మాత్రమే తప్పుపట్టాల్సిన అవసరం లేదన్న సింగ్ వాదనతో కోర్టు ఏకీభవించడం, ఆ వెంటనే బెయిల్ పై విడుదలైన చిన్మయానందకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలకడం తెలిసిందే. తాను రాజ్‌పుత్ నని గర్వంగా చెప్పుకునే ఏపీ సింగ్.. మనిషికి పరువు కంటే మించింది ఏదీ లేదని అంటారు. సమాజంలో మహిళల పాత్రపైనా ఆయనకు తనవైన అభిప్రాయాలున్నాయి. దేశంలో ఆత్మహత్యకు పాల్పడేవాళ్లలో ఎక్కువ మంది మగాళ్లేనని, అందులోనూ మహిళల కారణంగా చనిపోతున్నవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉందని ఆయన వాదిస్తారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మాదిరిగా మగవాళ్ల కోసం కూడా ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను చాలా కాలంగా వినిపిస్తున్నారు.

ప్రతి గంటకు ఆరుగురు చొప్పున మరణిస్తున్నారట‌!

ఇరాన్‌లో క‌రోనా విలయం తాండ‌వం చేస్తోంది. ప్రపంచం అల్లాడిపోతోంది. ఇటలీ.. ఫ్రాన్స్.. ఇరాన్ లాంటి దేశాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఆయా దేశాల్లో కరోనా మూడో స్టేజ్ లోకి వెళ్లిపోవటం.. రోజు తిరిగే సరికి కరోనాకు ఎఫెక్ట్ అయ్యే వారు వందల నుంచి వేలల్లోకి వెళ్లిపోతోంది. దీంతో.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం చిక్కుకుంది.ఇరాన్ లో చోటు చేసుకున్న పరిస్థితుల గురించి ఆ దేశానికి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రతి గంటకు ఇరాన్ లో 50 మంది వరకూ కరోనాకు గురి అవుతున్నట్లు చెప్పారు. ప్రతి పది నిమిషాలకు ఒకరు చొప్పున కరోనా కారణంగా మరణిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవటం సాధ్యం కావట్లేదన్న మాటను వారుచెబుతున్నారు. ఇప్పటి వరకూ ఆ దేశంలో కరోనా కారణంగా 1200 మంది మరణిస్తే.. తాజా లెక్కల ప్రకారం 18400 మంది ప్రజలు కరోనా బారిన పడినట్లుగా ఆ దేశ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న రిపోర్టుల ప్రకారం ప్రతి గంటకు ఆరుగురు చొప్పున మరణిస్తున్నారని.ఇరాన్ అధికారులు తెలిపారు.   ప‌రిస్థితి ఇంత దారుణంగా వుండ‌టంతో ఇరాన్ ప్రజలు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమైన పనులు చేస్తున్నారు. తమను తాము కాపాడుకోవాటానికి ఇరాన్ ప్రజలు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ద‌ర్గాల‌కు, మ‌త‌గురువుల స‌మాధుల వ‌ద్ద‌కు వెళ్లి అక్కడి గోడల్ని..గ్రిల్స్ లను నాకుతున్నారు. ఒకపక్క కరోనా లాలా జలం (ఉమ్మి) నుంచి అత్యంత వేగంగా విస్తరిస్తుందని డాక్టర్లు చెబుతున్నా, ప‌ట్టించుకోకుండా ఇరాన్ ప్రజలు చేస్తున్న పిచ్చి పనికి అధికారులు ఏమీ చేయ‌లేక చేతులెత్తేస్తున్నారు.

సీఎం జగన్ మాటలు ఇబ్బందిగా మారాయా...

కరోనా విషయంలో సీఎం జగన్ ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి..కరోనా  ఏం లేదు అని లైటర్ వే లో సీఎం మాట్లాడడం  ఇబ్బందిగా మారింది...స్థానిక ఎన్నికలు కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డాయి.ఒకవేళ ఎన్నికలు వాయిదా పడకపోతే ఇప్పుడు ఇబ్బంది కర పరిస్థితిఏర్పడేది.....సాక్షాత్తూ ప్రధాన మంత్రి ఈ నెల 22 జనతా కర్జ్యూ  నిర్ణయం ప్రకటించారు కాబట్టి తప్పనిసరిగా  ఎన్నికలను వాయిదా  వేసుకునే పరిస్థితి....అయితే సీఎం జగన్ ఏపీలో కరోనా ఎఫెక్ట్ లేదని  చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది..దీనిపై  టిడిపి విపరీతమైన విమర్శలు చేసింది.....పారాసిట్మాల్,  బ్లీచింగ్ పౌండర్  అంశాలను  జనంలోకి బాగా తీసుకెళ్లింది అనే అ భిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.... వైసీపీతో పాటు ప్రభుత్వంలో మంత్రులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..కరోనా పై సీఎ:  చాలా సింపుల్ గా మాట్లాడినపుడు మేము ప్రత్యేకంగా కరోనాపై మాట్లాడడానికి ఏముంటుంది అనే అభిప్రాయాన్ని కొంత మంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు...లోపల ఎన్ని రివ్యూలు చేసినా పైకి మాత్రం సీఎం చేసిన కామెంట్లే  బలంగా పోతున్నాయి..పక్క  రాష్ట్రాన్ని పోల్చి చూసి   మరీ  ఏపీ సీఎం పై  విమర్శలు చేస్తున్నారు...ఏపీలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సీఎం కామెంట్లతో  ఏమీ జరగడం లేదనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది..టిడిపి దీన్ని మరింత క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉంది..  ఏది  ఏమైనా ఆరోజు ప్రెస్ మీట్లో సీఎం ఏం కామెంట్ చేసినా  తిరిగి సరిదిద్దుకునే  పరిస్థితి ఉంది అంటున్నారు కొంత మంది...కరోనా విషయంలో అప్పటికి ఇప్పటికీ పరిస్థితి తేడా ఉందని సీఎం మరోసారి చెబితే సరిపోతుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి...

తెలుగు రాష్ట్రాలకు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు

    తెలుగు రాష్ట్రాలకు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులుంటాయి: స్వామి స్వరూపానందేంద్ర  కరోనా కారణం గా విశాఖ శ్రీ శారదాపీఠం ఆలయాల మూసివేత    విశాఖ శారదాపీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రకటించింది. సర్వదర్శనాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రకటించారు.  అయితే, నిత్య కైంకర్యాలు యదావిధిగా కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. కైంకర్యాల అనంతరం మన్యుసూక్త, అమృత పాశుపత హోమాలు, ధన్వంతరి జపం, అరుణ పారాయణ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో విశాఖ శారదాపీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాలు కూడా మూసివేస్తున్నట్టు చెప్పారు.  ఇదిలా ఉండగా, కరోనా వైరస్ నిర్మూలనకు నియంత్రణ చర్యలు పాటించడం ఒక్కటే కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి తరుణోపాయం   అని, ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడ వద్దని, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్వామి స్వరూపానందేంద్ర సూచించారు. రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలకు పరిపూర్ణంగా ఉంటాయని స్వామి స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.