వాంతులు, విరేచనాలు, రుచితెలియపోవడం కూడా కరోనా లక్షణాలే!
posted on Mar 21, 2020 @ 10:34AM
కరోనా వైరస్ బారిన పడ్డ వారిని గుర్తించడం కష్టంగా మారుతుంది. ఈ వ్యాధి సోకిన వారి లక్షణాలపై జర్మనీ పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కేవలం జ్వరమే కాదు వాంతులు, విరేచనాలౌనా కరోనా లక్షణాలుగా భావించి పరీక్షలు చేయించుకోవాలంటున్నారు. కొందరిలో జలుబు ఉంటుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, ఛాతిలో నొప్పి.. వీటితో పాటు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నలత, గొంతునొప్పి, చలిజ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటన్నింటిని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది న్యూమోనియాకు దారి తీసి.. శరీర అవయవాలపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి పరిస్థితి రాకముందే ప్రతీ ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు.
ఇన్ని రోజులు కేవలం జ్వరం, జలుబు ఉన్నవారిని మాత్రమే కరోనా వ్యాధిగ్రస్తులుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం మరి కొన్ని లక్షణాలు కూడా దానికి తోడు అయ్యాయి. జర్మన్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా బారిన పడిన వారిలో వాసన, రుచి సామర్థ్యం బలహీనపడుతుందట. రుచి తెలియకపోవటం, వసనను గుర్తించకపోవడం కూడా కరోనా లక్షణాలేనట. 66 శాతం మంది రోగులలో ఈ లక్షణాలు కనిపించాయి. అలాగే విరేచనాలు కరోనా వ్యాధికున్న మరో లక్షణంగా తెలుస్తోంది. కరోనా రోగులలో 30 శాతం మందిలో ఈ లక్షణం కూడా కనిపించిందని వైద్యులు సూచిస్తున్నారు.