21 రోజుల పాటు దేశమంతా లాక్ డౌన్: ప్రధాని మోడీ

ఈ రోజు  రాత్రి 12 గంటలనుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో  ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ 21 రోజులు అమల్లో ఉంటుందని ప్రధాని ఎల్లడించారు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు దేశమంతా ఒక్కతాటిగా నిలిచిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. జాతిని ఉద్దేశించి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. జనతా కర్ఫ్యూను మనసా వాచా పాటించారంటూ దేశ ప్రజలను అభినందించిన మోడీ, దేశానికి ఇది పరీక్ష సమయమని, సామాజిక దూరం అనేది ప్రతి ఒక్కరూ పాటించటమే కరోనా వైరస్ విసిరే  సవాల్ కు అసలైన జవాబు అన్నారు మోడీ. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి, సామాజిక దూరం పాటించాలని, ఈ లాక్ డౌన్ నిర్ణయం ప్రతి ఇంటికీ లక్ష్మణ రేఖ లాంటిదని , అందువల్ల ఇది విధిగా పాటించాలనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 14 వరకూ అమల్లో ఉండే ఈ లాక్ డౌన్ కాలం లో ఇళ్ల నుంచి వెలుపలకు రావద్దని ఆయన సూచించారు. ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి వీధి లాక్ డౌన్ లో ఉంటుందని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ. ఇది కర్ఫ్యూ తరహా వాతావరణమని అభివర్ణించిన నరేంద్ర మోడీ, సామాజిక దూరం అనేది ప్రధాని తో సహాఅందరూ పాటించాల్సిన విషయమన్నారు.

నిర్ల‌క్ష్యం చేస్తే పెద్ద ప్ర‌మాదంలో ప‌డ‌తాం

ద‌య‌చేసి ప్ర‌జ‌లంద‌రూ ఇంటి నుంచి బ‌య‌టికి రాకుండా నియంత్ర‌ణ పాటించ‌మ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఒక వ్య‌క్తితో వెయ్యి మందికైనా క‌రోనా వ‌చ్చే ప్ర‌మాదం వుంది. సైన్యాన్ని దింపే ప‌రిస్థితి తీసుకురావ‌ద్దు. ప్ర‌జ‌లే స్వ‌యంగా స్వీయ‌నియంత్ర‌ణ చేసుకోవాలి. ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లోప‌లే వుండాల్సిందే. మాట విన‌ని షాపుల్ని సీజ్ చేయాండి. అవ‌స‌ర‌మైతే షూట్ అండ్ సైట్ అర్డ‌ర్స్ ఇస్తాం. అవ‌స‌ర‌మైతే 24 గంట‌ల పాటు క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తాం. ముందు జాగ్ర‌త్త‌లు క‌ఠినంగా తీసుకుంటున్నాం. కర్ఫ్యూ అమ‌లులో వుంది. సాయంత్రం 6 గంట‌ల నుంచి షాపుల‌న్నీ బంద్ చేయాల్సిందే. హోం క్వారెంటైన్‌లో వున్న బ‌య‌టికి వ‌స్తే వారి పాస్‌పోర్ట్ సీజ్ చేస్తాం. అవ‌స‌ర‌మైతే వారి పాస్‌పోర్ట్ ర‌ద్దుచేసి నిర్దాక్షిణ్యంగా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశాం. ధ‌ర‌లు పెంచి నిత్యావ‌స‌ర‌వ‌స్తువుల్ని అమ్మే వారిపై పి.డి.యాక్ట్ కింద అరెస్టు చేస్తాం. ప్ర‌జ‌ల ర‌క్తం పిండాల‌నుకునే వారి షాప్‌లు శాశ్వ‌తంగా సీజ్ చేస్తామ‌ని సి.ఎం. హెచ్చ‌రించారు. క‌రోనా నియంత్ర‌ణ విష‌యంలో అధికారులే క‌నిపిస్తున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు ఎక్క‌డ వున్నారు. జంట‌న‌గ‌రాల్లోని 150 మంది కార్పోరేట‌ర్లు అంద‌రూ బ‌య‌టికి రావాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. శాస‌న‌స‌భ్యులు త‌మ‌త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్ళి ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేయాలి. ప్ర‌జాప్ర‌తినిధులు బ‌య‌టికి రావాల్సింది. మంత్రులు జిల్లాల‌ల‌కు వెళ్ళండి. శాస‌న‌స‌భ్యులు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌ధాన పాత్ర వ‌హించండి. ఆరోగ్య‌శాఖ మంత్రి, మున్సిప‌ల్‌, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి త‌ప్ప మిగ‌తావారంతా జిల్లాల‌కు వెళ్ళాల్సిందేన‌ని సి.ఎం. ఆదేశించారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో గ్రామ‌పంచాయితీలోని స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హ‌కారం తీసుకొని కీల‌క‌పాత్ర వ‌హించాల‌ని సి.ఎం. సూచించారు. ఇప్ప‌ట్టి వ‌ర‌కు 36 కేసులు తెలంగాణాలో బ‌య‌ట‌ప‌డ్డాయి. అంద‌రూ కోలుకుంటున్నారు. తెలంగాణాలో ఇంకా అనుమానితులు 114 మంది వున్నారు. వారిలో 82 మంది విదేశాల నుంచి వ‌చ్చిన‌వారు, మిగ‌తా వారు స్థానికులు. ఎంత మందికి సోకిందో త్వ‌ర‌లోనే తెలుస్తోందని సి.ఎం.చెప్పారు. క‌రోనా వైర‌స్ గురించి క‌వి స‌మ్మేళ‌న‌లు పెట్టి టీవీల్లో చూపించండి. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌మ‌ని సి.ఎం. సూచించారు.

ఏ పీ లో తోపుడు బండ్ల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యావసరాలు : పీ వీ రమేష్

పారాసిట్ మాల్-650 ఎంజీ వేసుకోవచ్చు కానీ, యా స్ప్రిన్ వేసుకోవద్దని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రెటరీ డాక్టర్ పీ వీ రమేష్ సూచించారు. కరోనాతో ఆందోళన వద్దని, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. వైద్య సేవలు అందించేందుకు రిటైరైన డాక్టర్లు.. నర్సుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. " గ్రామాల్లో స్వీయ నియంత్రణ ఎక్కువగా ఉంది. నిత్యావసర వస్తువుల దుకాణాలను రోజంతా తెరిచే ఉంచే ఆలోచన కూడాఉందని ఆయన అన్నారు. తోపుడు బళ్ల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యావసరాలని తెచ్చే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తోన్న  ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నారు. నిత్యావసర వస్తువుల రవాణ విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, డాక్టర్ల సూచనలు లేకుండా హైడ్రో క్లోరోక్విన్ మెడిసిన్ వాడవద్దని , డాక్టర్ల సూచనలు లేకుండా అమెరికాలో హైడ్రో క్లోరోక్విన్ వినియోగించి భార్యా భర్తలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయని కూడా డాక్టర్ పీ వీ రమేష్ గుర్తు చేశారు.  

సి.ఎం రిలీఫ్ ఫండ్ కు క‌రోనా విరాళాలు!

లాక్ డౌన్ ప్ర‌భావంతో తెలంగాణా ప్ర‌భుత్వానికి వ‌చ్చే రాబ‌డి తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడింది. పైగా కరోనా నియంత్ర‌ణ‌ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదంతా ప్రభుత్వానికి తలకు మించిన భారంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో పలువురు వ్యక్తులు, స్వచ్చంద సంస్థలు స్పందించి మానవత్వం చాటుకుంటున్నారు. త‌మ‌వంతు సాయం అందిస్తున్నారు. మేము సైతం అంటూ కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తున్నారు. సీఎం సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు. హీరో నితిన్‌ పది లక్షల విరాళాన్ని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి చెక్‌ అందించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఒకరోజు మూల వేతనాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు సీఎం సహాయనిధికి రూ.48కోట్లు విరాళంగా అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి సత్యనాదెళ్ల సతీమణి అనుపమ రూ.2కోట్ల విరాళం అందించారు. ఈ సందర్భంగా అనుపమ తండ్రి, విశ్రాంత ఐఏఎస్‌ కేఆర్‌ వేణుగోపాల్‌ సీఎంను కలిసి చెక్‌ అందజేశారు.  

ఒక్క తప్పు.. 130 కోట్ల మందికి శిక్ష

ఫ్లయిట్ దిగగానే క్వారంటైన్ చేస్తే ఇపుడు కోట్ల మంది ఇళ్లలో క్వారంటైన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా .. ఇది మన దేశంలో పుట్టిన వైరస్ కాదు కేవలం ఫ్లయిట్ ఎక్కి వచ్చిన ఒక వైరస్.. కరోనా వైరస్ పేరు చెపితేనే ప్రపంచం ఉలిక్కి పడుతోంది. ఇప్పటికే చైనా, ఇటలీ లలో వేలాది మంది మృత్యు వాత పడ్డారు. ఇపుడు భారత్ లో కరోనా సెకండ్ స్టేజ్ నడుస్తోందని నిపుణులు చెపుతున్నారు. ఐతే అసలు కరోనా భారత్ లోకి ప్రవేశించకుండా చేసే అవకాశం ఉందా.. ఈ ప్రశ్న ఎందుకు వస్తోందంటే ఇపుడు రాష్ట్రాలన్నీ దాదాపుగా లాక్ డౌన్ ప్రకటించేసాయి. దీనితో సామాన్యుడు బయటకు వచ్చి కుటుంబానికి కావలసిన నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే వెజిటబుల్స్ నుండి ఉప్పు, పప్పుల వరకు ముందుగానే స్టాక్ పెట్టుకున్న వారి పరిస్థితి పర్వాలేదు కానీ ఈ లాక్ డౌన్ తో చుక్కలనంటుతున్న ధరల తో సామాన్యుడు కొనే పరిస్థితి లేదు అలాగే షాపుల వద్ద క్రౌడ్ ఎక్కువైతే అది మరీ ప్రమాదకరమే కదా.. మరీ ముఖ్యంగా 130 కోట్ల ప్రజలను గడప దాటొద్దనే కంటే అసలు భారత్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో వచ్చే ప్రతి ఒక్కరిని హౌస్ క్వారంటైన్ చేసే కంటే ఎయిర్ పోర్టు దగ్గరలోనే టెంపరరీ క్వారంటైన్ రూమ్స్ లో ఉంచి అవసరం ఐతే పారామిలటరీ దళాల పహారాలో వీటిని మైంటైన్ చేస్తే ఈ తిప్పలు తప్పేవి కదా ఎందుకంటే ఇపుడు హౌస్ క్వారంటైన్ విధించ బడిన వాళ్ళు 14 రోజుల క్వారంటైన్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా జనం లో కలిసి తిరిగేస్తున్నారు. ఒక వేళ ఫారిన్ నుండి వచ్చిన వ్యక్తి బుద్ధిగా హౌస్ క్వారంటైన్ పాటించినా ఇపుడు వెలుగు చూస్తున్న కేసులను బట్టి వారి ఇంటి నుండి మరో వ్యక్తికి కూడా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దింతో ఈ వైరస్ వ్యాప్తి ని ఎలా అదుపు చేయాలా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఒక వైపు లాక్ డౌన్ విధించి బయటకు రావద్దు అన్నా వినిపించుకొని జనాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ పోలీసులు పహారా ఉన్నా మాట వినని జనం. దీనికి అల్తర్నేటివ్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర్లోనే క్వారంటైన్ రూమ్స్ ఏర్పాటు చేసి ఫారిన్ నంది వచ్చే ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఈ రూముల్లోనే 14 రోజుల క్వారంటైన్ పూర్తీ చేసి వెళ్లాలని డిక్లెర్ చేసి ఉంటె ఈ రోజు నూట ముప్పయి కోట్ల మంది కి ఇబ్బందులు తప్పేవి కదా. అలాగే ఈ రూల్ ముందే డిక్లెర్ చేస్తే గట్టిగ అవసరం ఉన్నవాళ్లే ఇండియా కు వచ్చేవారు. దింతో ఫ్లోటింగ్ కూడా తగ్గేది. మరి ఎందుకో ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకోలేదు .. దేశంలోని 30 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల వద్ద ఇటువంటి పటిష్టమైన చర్యలు తీసుకుని ఉంటె ఈ రోజు 130 కోట్ల మంది బిక్కుబిక్కు మనకంటూ బ్రతకాల్సిన పరిష్టితి వచ్చేది కాదు కదా.  

ప్రతి ఐదుగురిలో ఒకరు క‌రోనా ప‌డ‌గ కింద వున్నార‌ట‌!

ప్ర‌తి ఐదుగురిలో ఒక‌రు క‌రోనా ప‌డ‌గ నీడ కింద వున్నారు. అయితే ఎవ‌రిపై ఎప్పుడు కాటు ప‌డుతుందో! ఏ మాత్రం అప్ర‌మ‌త్తంగా లేకున్నా క‌రోనా కాటుకు గురై బ‌లికావాల్సిందేనంటోంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో ప్రతి ఐదుగరిలో ఒకరు (20 శాతం మంది) కరోనా ఆధీనంలోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. వైద్యులు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటించకుంటే వీరంతా కరోనా బారిన పడతారని డబ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది. మంగళవారం ఉదయం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 3,78,679 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 16,500 మందికి పైగా కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. కాగా, ఇప్పటి వరకు 1,01,000 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొదటి లక్ష మందికి కరోనా సోకడానికి 67 రోజులు పట్టింది. అయితే కేవలం నాలుగు రోజుల్లోనే మరో లక్ష మందిని కరోనా చుట్టుముట్టి జీవితాన్ని దుర్భ‌రం చేస్తోంది. దీంతో దీనిని ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. అవసరమైతే 170 కోట్ల మందిని నిర్బంధంలోనే ఉంచాలని, వారిని బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో ప్ర‌పంచ‌దేశాల‌కు విజ్ఞ‌ప్తి చేసింది.

విశాఖ లో కరోనా రెండో స్టేజ్ కు చేరుకుంది

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని నేడు విశాఖలో పరిస్థితిపై నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఇప్పటికి మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో 7 పాజిటివ్ కేసులు నమోదు జరిగింది. 220 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా 168 మంది కి నెగెటివ్ వచ్చింది,మిగిలిన వారికి నివేదికలు కోసం వేచి చూస్తున్నాము. విశాఖ జిల్లా లో మూడు కేసులు నమోదు జరిగింది. విశాఖలో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చేసిన సేవలు అభినందనీయం. ఎంత చేసిన ఇంకా అప్రమత్తం అవ్వాలి. లాక్ డౌన్ ప్రకటించినా ఇంకా ప్రజలు సహకారం ఇవ్వాలి. లాక్ డౌన్ విజయవంతం చేయాలి అప్పుడే వైరస్ వ్యాప్తి అడ్డుకోగలమన్నారు.  విశాఖ లో కరోనా రెండో దశలో అడుగు పెట్టింది.విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు వచ్చింది. మూడో దశలోకి రాకుండా విశాఖ వాసులు ప్రభుత్వ సూచనలు పాటించాలి. ఉచిత రేషన్ ఇస్తున్నాము. వచ్చే నెల 4 వ తేదీ ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము అన్నారు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. "విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలి,వారు గృహ నిర్బంధం లో ఉండాలి. సీతమ్మ ధార, అనకాపల్లి, గాజువాక, అల్లిపురం ప్రాంతాలు హై రిస్క్ లో ఉన్నాయి.విశాఖ లో 20 కమిటీలు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పనిచేస్తున్నారు. విశాఖలో 1472 మంది విదేశాల నుంచి నగరానికి వచ్చారు.వైద్య సిబ్బందికి మాస్కలు, పిపిఏ కిట్ లు అందుబాటులో ఉంచుతున్నాము. ఔట్ సోర్స్ ఉద్యోగులకు జీతాలు చెలిస్తాము.విదేశాల నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి గా పాటించాలనీ, " డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సూచించారు. లాక్ డౌన్ ప్రకటించిన అనవసరంగా రోడ్ల పై తిరిగితే  ఆ వాహనాలు సీజ్ చేస్తాం.ఈ సాయంత్రం నుంచి మరింత కఠిన ఆంక్షలు విధిస్తున్నామనీ చెప్పారు. ఫార్మా పరిశ్రమలు తక్కువ సిబ్బంది తో పని చేయాలి. మీడియా పై నియంత్రణ లేదు , పోలీస్ సిబ్బంది వారి విధులకు ఆటంకం కలిగించవద్దు.జివిఎంసి మరింత గట్టిగా పనిచేయాలి. రైతు బజార్ లను స్కూల్ గ్రౌండ్స్, పెద్ద మైదాన్లలో నిర్వహిస్తాం. నిత్యావసర వస్తువు ధరలు పెరిగితే వారిపై కేసులు పెడతా మన్నారు మంత్రి పేర్ని నాని.

ఖాళీగావున్న‌సెక్రటేరియట్ ను ఐసోలేషన్ కేంద్రంగా వాడండి!

హైదరాబాద్ సెక్రటేరియట్ ఖాళీగా ఉన్నందున ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని తెలంగాణా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ముఖ్య‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో COVID-19 రోగుల సంఖ్య అధికంగా పెరుగుతున్నాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితులలో, అన్ని సంస్థలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సమిష్టిగా కృషి చేసి, భయంకర కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముఖ్య‌మంత్రి తీసుకుంటున్న చర్యలను, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర శాఖ తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ లేఖ‌రాశారు. ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయ‌న స్పష్టం చేశారు. కొంత మంది ఈ విపత్తును అవకాశంగా తీసుకొని స్వలాభం కోసం స్వార్ధంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ఫలితంగా సామాన్య, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకొని, ధరల నియంత్రణ చేపట్టగలరని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో వున్న బిజెపి కార్య‌క‌ర్త‌లు ప్ర‌భుత్వం చేప‌ట్టే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఎం.పి.బండి సంజయ్ కుమార్ తెలిపారు.

బుధ‌వారం నుండి విజ‌య‌వాడ న‌గ‌రంలో కఠిన ఆంక్షలు

ఉ. 6 నుండి ఉ.9 వరుకు మూడుగంటలే రోడ్ల మీదకి అనుమతి. పచారి షాపులు, పళ్లుమార్కెట్, రైతు బజార్లు, కాళేశ్వరరావు మార్కెట్ మాత్రమే ఉ.6 నుండి 9 వరుకు తెరిచి ఉంటాయి. ఉదయం 4 నుండి ఉ. 8 వరుకు మిల్స్ & డైరి ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయి. ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి. ఉ. 7 నుండి సాయంత్రం 7 వరుకు టెక్ ఎ వే హోటల్స్ కు అనుమతి. ప్రభుత్వ, పోలీస్, ఫైర్ ,ఎలక్ట్రసిటి, రెవిన్యూ , వీయంసీ , మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికల్స్ కు మాత్రమే అనుమతి. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు, ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి. జ్యూవలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్, ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్ & ఐస్ క్రీమ్ పార్లర్స్, రెడీమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఐరన్ & స్టీల్ షాప్స్, గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్, పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ & ఆటోనగర్ లాక్ డౌన్ అయ్యేవరుకు ఓపెన్ కు అనుమతి లేదు. పదిమంది ఎక్కడా గుమిగూడి ఉండద్దు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చ‌రించారు.

చైనాలో మరో వైరస్‌.. ఒకరు మృతి.. 32 మందికి వైద్య పరీక్షలు

అసలే చైనా పుణ్యమా అని కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతుంటే.. తాజాగా చైనాలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. చైనాలోని యువన్ ఫ్రావిన్సులో 'హంటా వైరస్' బారిన పడి 39 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. అతడు హంటా వైరస్‌తో మృతి చెందినట్లు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అతడు ఓ బస్సులో ప్రయాణించాడని, దీంతో ఆయన ప్రయాణించిన బస్సులో 32 మందిని టెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ హంటా వైరస్ వ్యాప్తికి ఎలుకలే ప్రధాన కారణమని తెలుస్తోంది. 1959 లో ఈ వైరస్ ను మొదటిసారి గుర్తించగా.. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ 2016 నుండి అందుబాటులో ఉంది. అయితే ఓ వైపు కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ.. ఈ హాంటా వైరస్ రీఎంట్రీ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

ఏటీఎం విత్‌డ్రాలపై కేంద్రం తీపి కబురు 

కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటించాలని ఆదేశించిన కేంద్రం క్యాష్ విత్‌డ్రాలపై ఆంక్షలను సడలించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసినా ఎటువంటి చార్జీలు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. మూడు నెలల వరకూ ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆమె తెలిపారు.బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ పరిమితిని కూడా ఎత్తేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ నిర్ణయంతో లాక్‌డౌన్‌ను పాటించే ప్రజలకు కొంత ఊరటనిచ్చినట్టయింది. ఈ సడలింపుతో కనీస నగదు నిల్వను కూడా దైనందిన ఖర్చులకు వినియోగించుకునే అవకాశం ప్రజలకు లభించింది.

శానిటైజర్స్, మాస్కులపై పన్నుల రద్దుకు చంద్రబాబు డిమాండ్ 

శానిటైజర్స్,మాస్క్ లు ఇతర పారిశుద్య వస్తువులపై పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. డిజిటల్ సోషలైజేషన్ మాత్రమే ప్రస్తుత సమయంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గమని కూడా  మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన,ఇటు ప్రభుత్వం, ప్రజలు అంతా కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఈ కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి బైటపడలేమన్నారు. "ఇప్పటిదాకా ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 3,75,673మందికి సోకింది. 16,642మంది చనిపోయారు. ఇటలీలో 6,007మంది, చైనాలో 3,277మంది, స్పెయిన్ లో 2,311మంది, ఇరాన్ లో  1,812మంది యుఎస్ ఏలో 553మంది చనిపోయారు. ఇండియాలో కూడా దాదాపు 500మందికి సోకింది, 10మంది చనిపోయారు. చైనాలో పుట్టిన కరోనా ఇప్పటికి 196దేశాలకు విస్తరించింది. మొదటి 67రోజుల్లో లక్షమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గడిచిన 11రోజుల్లోనే 2లక్షల మందికి వచ్చింది. అంటే ఎంత వేగంగా విస్తరిస్తుందో తెలుసుకోవాలి. తొలుత ఒకరిద్దరికి వచ్చిన కరోనా 11రోజుల్లో 2లక్షల మందికి వచ్చింది, ఇప్పుడు 3లక్షల 75వేల మందికి పాకింది. మొదటి దశలో విదేశాలనుంచి వచ్చినవాళ్లనుంచి సోకుతుంది. రెండవ దశలో వారినుంచి స్థానికులకు వ్యాపిస్తుంది. స్టేజి 3లో అంటువ్యాధిగా ఈ మహమ్మారి విజృంభిస్తుంది. 4వ దశకు వస్తే దీనిని ఆపడం అసాధ్యం," అని నాయుడు వివరించారు.    దీని నిరోధానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలనీ,  విదేశాలనుంచి వచ్చిన వారందరికీ క్వారంటైన్ చేయాలనీ,  14రోజులు పకడ్బందీగా క్వారంటైన్ లో ఉండి నెగటివ్ వస్తేనే వాళ్లను బైటకు పంపాలనీ నాయుడు సూచించారు. కానీ ఇక్కడ మనదగ్గర క్వారంటైన్ పెట్టలేక పోయారు. దీనివల్ల కొంత విస్తరించే ప్రమాదం ఏర్పడింది. ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తే చాలదు, దీనికోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు నెలకొల్పాల్సి ఉందన్నారు. ప్రధాని పిలుపు జనతా కర్ఫ్యూకు ప్రజలంతా సంఘీభావంగా నిలిచారు. రైల్వే సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సులు రద్దు చేశారు. అంతర్ జిల్లా రాకపోకలను కూడా మహారాష్ట్ర రద్దు చేసింది. దేశీయ విమాన సర్వీసులు ఈ అర్ధరాత్రి నుంచి ఆపేస్తున్నారని కూడా నాయుడు చెప్పారు. " ఈ పరిస్థితుల్లో మార్గం ఒక్కటే...అందరూ సామాజిక దూరం విధిగా పాటించాలి. డిజిటల్ సోషలైజేషన్ ద్వారా సమాచార మార్పిడి జరగాలి, ఉద్యోగులు తమ విధులను డిజిటల్ సోషలైజేషన్ ద్వారా నిర్వర్తించాలి. సెల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో ముఖాముఖి చర్చించుకుని, విధులు నిర్వర్తించాలి. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార మార్పిడి జరగాలి. డిజిటల్ సోషలైజేషన్ మాత్రమే ప్రస్తుత సమయంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గం. డిజిటల్ సోషలైజేషన్ ద్వారా డిజిటల్ వర్క్ చేసుకోవాలి. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు, అందరిలో అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగకరం. ఇళ్లలోనుంచే కార్యాలయ విధులు నిర్వర్తించే పరిస్థితి కల్పించాలి. డిజిటల్ వర్కింగ్ ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి," అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.   ఒక్కరోజులే మన ఎకానమి 4వేల పాయింట్లు పడిపోయింది. అసంఘటిత రంగంలో కార్మికులు పెద్దఎత్తున ఉపాధి కోల్పోయారు. అనేకరాష్ట్రాలలో 144సెక్షన్ విధించారు. ఇంటికొకరే బైటకెళ్ళి టూ వీలర్ పై ఒకరు, కార్లలో ఇద్దరే బైటకు వెళ్లి అత్యవసర విధులు నిర్వర్తించాలని ఆంక్షలు వచ్చాయి. ప్రపంచంలో 20% ఇళ్లవద్దే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్రమోది ప్రకటించిన లాక్ డౌన్ కంపల్సరీగా  అందరూ ఆమోదించాలి, ఆచరించాలి. అప్పుడే ఈ భయంకరమైన వైరస్ ను నిరోధించ గల్గుతాం.  కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పాటించకపోవడం కరెక్ట్ కాదు, అందరూ దీనిని ఆచరిస్తేనే కరోనా మహమ్మారిని పారదోలగలం. ఇండియా ఏవిధంగా దీనిని నిరోధిస్తుందో చూడాలని, ఇండియా దీనిని కట్టడి చేయగలిగితే ప్రపంచానికి కూడా కొంత ఊరట వస్తుందని, ఈ వ్యాధిని నియంత్రించగలరని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య కూడా ఎదురు చూస్తోందని నాయుడు చెప్పుకొచ్చారు. కరవు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే దెబ్బతిని ఉన్నారు. కోళ్ల పరిశ్రమ, ఆక్వా పూర్తిగా దెబ్బతింది. హార్టీకల్చర్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే చురుగ్గా వ్యవహరించాలి. ఆన్ లైన్ వినియోగం ద్వారా రైతులను ఆదుకునే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. నిత్యావసర వస్తువుల ధరలు ప్రతిచోటా పెరిగిపోతున్నాయి. కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వమే చొరవ చూపాలి. పిడిఎస్ ద్వారా ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా నిత్యావసరాలను సరఫరా చేయాలన్నారు నాయుడు.  వ్యక్తిగత పరిశుభ్రత అందరూ పాటించాలి. అందుబాటులో ఉన్న శానిటైజర్లు, సబ్బుల ద్వారా ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. టచ్ పాయింట్స్ పూర్తిగా తగ్గించుకోవాలి. తలుపులు తీసినప్పుడు, వేసినప్పుడు, లిప్ట్ పాయింట్స్, డోర్ బెల్స్ తదితరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. శానిటైజర్స్,మాస్క్ లు ఇతర పారిశుద్య వస్తువులపై పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలి. కరెన్సీ నోట్లు, నాణేల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. ఆన్ లైన్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామాలు,వార్డులలో పరిశుభ్రత పాటించాలి. ఆయా శాఖలు శరవేగంగా స్పందించి పారిశుద్య చర్యలు చేపట్టాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కూడా నాయుడు సూచించారు.

భారత్ బంద్ వైపు ప్రధాని మొగ్గు 

ఈ రోజు రాత్రి  ప్రధాని మోదీ భారత్ బంద్ ప్రకటించే అవకాశం. రాష్ట్రాలకు సీఆర్ఫీఎఫ్,ఆర్మీ బలగాలోచ్చే అవకాశం. భారత్ లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రధాని చేయబోయే ప్రకటన కీలకం కాబోతోందని తెలుస్తోంది. ముంబైలో మూడుకు చేరిన మృతుల సంఖ్య. నిన్న సాయంత్రం ప్రాణాలు కోల్పోయిన 65 ఏళ్ల వ్యక్తి. భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈరోజుకు దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 446కి చేరుకున్నాయి. నిన్న ఒక్క రోజే 99 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 9 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ముంబై నగరంలో ముగ్గురు మరణించారు. నిన్న సాయంత్రం 65 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. ఈయన  ఈనెల  15న యూఏఈ నుంచి అహ్మదాబాద్ వచ్చారు. మార్చి 20న అక్కడి నుంచి ముంబైకి వచ్చారు. కరోనా లక్షణాలతో ఉన్న ఆయనను కస్తూర్బా ఆసుప్రతిలో చేర్చారు. చికత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రం చనిపోయారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో , ప్రధాని ఈ రాత్రి చేయబోయే ప్రసంగం లో వచ్చే నెలాఖరు వరకూ నేషనల్ లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దేశం లోని అన్ని రాష్ట్రాల నుంచి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న మిలిటరీ బలగాల లెక్కల్ని కేంద్రం అడిగి తీసుకున్నట్టు సమాచారం.

ప్రతి రోజు 20వేల మందికి కరోనా టెస్టులు!

క‌రోనా ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా వుండండి! నిర్లక్ష్యం వద్దంటున్న కిషన్ రెడ్డి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 లక్షల 24 వేల 266 మందికి క‌రోనా వైర‌స్‌కు సంబంధించి స్క్రీనింగ్ చేసిన‌ట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో 492 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయ‌న తెలిపారు. 37 మంది డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. 69వేల 436 మందిని హౌస్ క్వారంటైన్ చేశామన్నారు. 20,707 మంది శాంపిల్స్‌ టెస్ట్ చేశామని వివ‌రించారు. ల్యాబ్‌ల సంఖ్యను 118కి పెంచామని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 94,963 క్వారంటైన్ బెడ్లను సిద్ధం చేశామన్నారు. ప్రతి రోజు 20వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్రం ఖర్చుతో 48 దేశాల నుంచి 2040 మంది భారీతీయులను తీసుకొచ్చామన్నారు. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విదేశాల నుంచి వచ్చిన వాళ్ల కుటుంబాలకు కరోనా సోకుతోందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరోనా నివారణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా రాదనుకునే భావన ఎవరిలో ఉండొద్దని హెచ్చరించారు. కరోనా వైరస్‌కు ధనిక, పేద, గ్రామం, నగరం అనే తేడా ఏమీ లేదని, ముందస్తు జాగ్రత్తలే మనల్ని రక్షిస్తాయని చెప్పారు.

విశృంఖల శృంగారానికి తెర దించిన ఐరోపా సెక్స్ క్యాపిటల్

* ' వైఫ్ స్వాపింగ్ ' కు స్వస్తి చెప్పాలని దేశ ప్రజలకు బెల్జియం ఆరోగ్య మంత్రి డే బ్లాక్ విజ్ఞప్తి * కరోనా దెబ్బకు, విచ్చలవిడి శృగారం వద్దని బెల్జియం ప్రకటన    * ముగ్గురు కి మించి పాల్గొనే విచ్చలవిడి మదన కేళికి ' షార్ట్ బ్రేక్ ' ప్రకటించాలని పార్లమెంట్ సాక్షిగా విన్నపం * మానవ-జంతు శృంగారానికి మాత్రం మినహాయింపు నిచ్చిన బెల్జియం * కింగ్ లియోపోల్డ్-II అలవాటు చేసిన వికృత సంస్కృతి తో బెల్జియం దేశానికి చెడ్డపేరు * 16 వ శతాబ్దం లో ఆంధ్ర ప్రాంతం లో చెలరేగిన ఈ విష సంస్కృతికి చరమ గీతం పాడిన ఆంధ్ర పాలకుడు బెల్జియం ప్రభుత్వం ఒక కఠోర నిర్ణయాన్ని ప్రకటించింది. విచ్చలవిడి , విశృంఖల శృంగారానికి తెర దించాల్సిందిగా ఆ దేశ పౌరులకు పార్లమెంట్ సాక్షిగా విజ్ఞప్తి చేసింది. భార్యల మార్పిడి ని తమ దేశ సంస్కృతిలో భాగంగా భావించే బెల్జియం దేశానికి యూరోప్ సెక్స్ క్యాపిటల్ అని కూడా పేరుంది. అంతే కాదు బెల్జియం అంటే బీర్బలుల దేశం గా ( అంటే బీరు ను అమితంగా సేవించే ప్రజలున్న దేశంగా ) మిగతా ప్రపంచం అంతా కూడా బెల్జియం ను పిలుస్తుందనే విషయం చాలా మందికి తెలుసు. సరే, ఇదేదో బయట దేశాల వారు అనుకుంటే లేదా గొణుక్కుంటె, అదేదో తేలిగ్గా తీసేయచ్చులే అనుకునే వారికి కళ్ళు బైర్లు కమ్మేలా, ఆ దేశ ఆరోగ్య శాఖా మంత్రి డే బ్లాక్ ఏకంగా పార్లమెంట్ లోనే ప్రకటించిందంటే, ఆ దేశం లో విశృంఖల శృంగారానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో వేరే చెప్పక్కర్లేదు. తమ తమ ఇళ్లల్లో ఇద్దరికి మించి ఎవరూ శృంగారం లో పాల్గొనవద్దని, కోవిడ్ -19 వైరస్ పై పోరాటం లో భాగంగా 'సామాజిక దూరం' పాటించాలని, అందువల్ల ముగ్గురు లేదా అంతకు మించిన వారు పాల్గొనే  'నాన్ ఎసెన్షియల్ సెక్సువల్' కార్యకలాపాలను బెల్జియం లో నిషేధిస్తున్నామని మహిళ కూడా అయినా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి డే బ్లాక్ ఏకంగా పార్లమెంట్ లోనే ప్రకటించింది. బెల్జియం దేశానికి బాహ్య ప్రపంచం లో ' బీర్ డ్రింకిన్గ్, ఇంకా " ఐరోపా సెక్స్ క్యాపిటల్" అని ఉన్న చెడ్డ పేరు దృష్ట్యా, అనివార్యంగా తానూ పార్లమెంట్ లో ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని ఆరోగ్య మంత్రి డే బ్లాక్ స్పష్టం చేశారు. భార్యల మార్పిడి, అలాగే ముగ్గురుకి మించి పాల్గొనే విశృంఖల శృంగార కార్యకలాపాలు , బెల్జియం దేశం లో కోవిడ్ -19 అదుపులోకి వచ్చేంతవరకూ నిషేధిస్తున్నట్టు ఆమె పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. అయితే, ఒకరు లేదా ఇద్దరి మధ్య సాగే విచ్చలవిడి శృంగార కార్యకలాపాలను, అంటే -హస్త ప్రయోగం, యానల్ సెక్స్, ఓరల్ సెక్స్ , ఇంకా మానవ-జంతు శృంగార (బెస్టాలిటీ) కార్యకలాపాలను మాత్రం బెల్జియం ఆరోగ్య మంత్రి నిషేధించలేదు. ఇప్పుడు ప్రకటించిన శృంగార నిషేధాజ్ఞలు మానవ శృంగారానికి పరిమితమని, మానవ-జంతు శృంగార కార్యకలాపాలకు ఇవి వర్తించవని ఆమె ప్రకటించటం తో మీడియా ప్రతినిధులు నిర్ఘాంత పోయారు. 2018 లో జరిగిన ఒక సర్వే ప్రకారం- బెల్జియం లోని 78 శాతం దంపతులు ' భార్యల మార్పిడి ' శృంగారాన్ని బహిరంగంగానే ప్రాక్టీస్ చేస్తారని వెల్లడైంది. 19 వ శతాబ్దం లో బెల్జియం ను పాలించిన కింగ్ లియోపోల్డ్-II ఈ తరహా వికృత శృంగార క్రీడ ను తమ దేశ సంస్కృతి లో ఒక భాగం గా మార్చేసినట్టు చారిత్రిక ఆధారాలున్నాయి.  74 ఏళ్ల వయసులో మరణించేంత వరకూ కూడా కింగ్ లియో పోలండ్-II ఈ 'వైఫ్ స్వాపింగ్ ' కు,  తమ సంస్కృతిలో భాగంగా విస్తృత ప్రచారం కల్పించినట్టు చరిత్ర కారులు చాలా చోట్ల ప్రస్తావించారు. అయితే, ఈ తరహా వికృత , విశృంఖల స్వేచ్ఛా శృంగార మదన కేళి 16 వ శతాబ్దం నుంచి ఆంధ్ర ప్రాంతం లోని కృష్ణా, గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో ' కంచుకోత్సవం ' పేరిట రాజ ప్రాసాదాలు ప్రోత్సహించిన సందర్భాల గురించి పలు చారిత్రిక గ్రంధాల్లో అంతర్లీన ప్రస్తావన ఉంది. అయితే, ఆ విచ్చలవిడి క్రీడకు చరమ గీతం పాడిన సంస్కరణల రూపకర్త అయిన , ఒక ఆంధ్ర పాలకుడి గురించి 'తెలుగు వన్ ' ప్రత్యేక కథనం త్వరలో మీ కోసం..

కర్ఫ్యూ ఉల్లంఘిస్తే 2లక్షల‌రూపాయ‌ల‌ జరిమానా!

సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు అక్కడి సర్కార్ కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ సమయంలో ఎవరైతే ఆంక్షలను ఉల్లంఘిస్తారో వారిపై కఠిన చర్యలు ఉంటాయని తాజాగా అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. 10వేల రియాల్స్(రూ.2లక్షల 2వేలు) జరిమానాతో పాటు జైలుకి కూడా వెళ్లాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే వైద్య రంగానికి చెందిన ఉద్యోగులు, సెక్యూరిటీ, మిలిటరీ అధికారులకు మినహాయింపు ఇచ్చింది. సౌదీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 562కి చేరింది. ఇక కర్ఫ్యూ సమయంలో దేశ పౌరులతో పాటు ప్రవాసులు కూడా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు.

షహీన్‌బాగ్ శిబిరాన్ని ఎత్తేసిన పోలీసులు

కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఢిల్లీ లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక నిరసన శిబిరాన్ని తొలగించామని పోలీసులు చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చిన సాయుధ పోలీసులు పొక్లెయినర్ల సాయంతో శిబిరాన్ని కూల్చివేసి లారీలో టెంటు, కుర్చీలు, ఇతర సామాన్లను తరలించారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లులో వుంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ పోలీసులు మంగళవారం ఉదయం షహీన్‌బాగ్ నిరసన శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని నెలలుగా వందలాది మంది మహిళలు షహీన్‌బాగ్ శిబిరంలో నిరసన తెలుపుతున్నారు. ఈ శిబిరంలో ఉన్న కొందరు మహిళలు ప్రతిఘటించినా పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకొని షహీన్‌బాగ్ నిరసన శిబిరాన్ని ఖాళీ చేయించారు. 144 సెక్షన్ ను ఉల్లంఘించారని 9మంది నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.

రాజ్యసభ ఎన్నికల్ని వాయిదా వేసిన ఈ.సి.

కరోనా వైరస్  నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. దేశంలోని పది రాష్ట్రాల్లో 37 సీట్లు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 18 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మిగిలిన సీట్లకు దాఖలైన నామినేషన్లు పరిశీలన పూర్తయింది. కానీ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఈ.సి. ప్ర‌క‌టించింది. తదుపరి పోలింగ్, కౌంటింగ్ తేదీలను ప్రకటించనున్నారు.  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO సైతం కరోనాను ప్రపంచ అంటువ్యాధిగా ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ అలాగే కొనసాగుతుంది. కరోనా వైరస్ తదుపరి పరిస్థితిని సమీక్షించిన అనంతరం తేదీలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనలో వెల్ల‌డించింది.