ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోండి: అధికారులకు జగన్ ఆదేశాలు

కరోనా నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం.. కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచండి.. నిత్యావసర వస్తువుల ధరలను పెంచితే కఠిన చర్యలు తప్పవు.. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. మార్చి 31 వరకు విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, మాల్స్, సినిమా థియేటర్స్ ను మూసేశామని తెలిపారు. ఆ తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయాలను తీసుకుంటామని చెప్పారు. కరోనా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా... ప్రజల్లో అవగాహన పెంచాలని, వారిలో అపోహలను తొలగించాలని ఆదేశించారు. ప్రజల మధ్య సామాజిక దూరంపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని జగన్ ఆదేశించారు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... నిత్యావసరాల ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో పరిశుభ్రతను పాటించాలని చెప్పారు. ఆసుపత్రుల్లో పారాసిటమాల్, యాంటీ బయోటిక్స్ ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది మొత్తం ఆసుపత్రుల్లో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. స్వీయ నిర్బంధంపై దృష్టి సారించాలని సూచించారు.

ట్విన్ టవర్స్ కూల్చివేతకు, కరోనాకు పోలిక పెట్టిన పవన్ కళ్యాణ్ 

కరోనాపై  పోరాటంలో ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ చేసిన సూచనలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్టు జన సేన చీఫ్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.  మోదీ గారు చేసిన సూచనలను జన సైనికులే కాక తెలుగు వారందరూ పాటించాలని పవన్ కళ్యాణ్  విజ్ఞప్తి చేశారు . " ఈ నెల 22 వ తేదీ ఆదివారాన్ని  మోదీ  చెప్పినట్టు జనతా కర్ఫ్యూ గా పాటిద్దాం. ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదాం. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికిగాను  ప్రమాదమని తెలిసినప్పటికీ  క్షేత్రస్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్,  వైద్య ఆరోగ్య  సిబ్బంది, మీడియా వారు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు..  ఇలా ప్రతీ ఒక్కరికీ మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధాన మంత్రి గారు చెప్పినట్లు  ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు మన ఇంటి బాల్కనీలలో నిలబడి కరతాళ ధ్వనులు ద్వారా వారికి మన సంఘీభావం తెలుపుదాం," అని పవన్ కళ్యాణ్ సూచించారు.  " ఈ సందర్భంగా  అమెరికాలో చూసిన నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2001 సెప్టెంబర్ 11 న ట్విన్ టవర్స్ ను టెర్రరిస్టులు కూల్చి వేసినప్పుడు మరణించిన వారికి అంజలి ఘటించడానికి అమెరికన్లు అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి మృతులకు సంతాపం తెలిపారు. ఆ సమయంలో నేను  అక్కడే ఉన్నాను. ఇది అమెరికన్ల  కార్యక్రమం అయినప్పటికీ సాటి మనిషిగా నేనూ పాలుపంచుకున్నాను," అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.   సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనమందరం మమేకమవడం మన విధిగా భావిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్,  తాను  సైతం ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ.. ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రజల  ముందుకు వస్తానని పేర్కొన్నారు.

బ‌యోవార్  మ‌ధ్య జీవిస్తున్నాం! అప్ర‌మ‌త్తంగా వుండండి!

ప్రజలందరూ ఇళ్ళల్లో ఉండి త‌మ‌ను తాము కాపాడుకోవాల‌ని తెలంగాణ గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్ భవన్ జనతా కర్ఫ్యూ పాటించేందుకు సిద్ధం అవుతోంది" అని ఆమె చెప్పారు. ఈ సందర్భంలో దేశంలోని యువత ఆరోగ్య రక్షణ కోసం యుద్ధం చేయాలని చెబుతూ వైరస్ నివారణ కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. కరోనావైరస్ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, అయితే జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.  స్వీయ సంరక్షణే అత్యుత్తమ సంరక్షణ అని, ప్రజుల ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉన్నట్లు అని గవర్నర్ చెప్పారు.  "కోవిడ్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయ‌ని ఆమె భ‌రోసా ఇచ్చారు. తెలంగాణలో తాజాగా  మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి  కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం వారిద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  దీనితో మొత్తం తెలంగాణ లో పాజిటివ్ కేసుల సంఖ్య 18కు చేరుకుంది. వీరిలో ఒకరు ఇప్పటికే డిశ్చార్జి కాగా.. మరో 17 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ లో ఉన్న కరోనా బాధితుల్లో ఏకంగా 9 మంది విదేశీయులు ఉండడం గమనార్హం. గవర్నర్‌కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు రాజ్‌భవన్  కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన సలహా ను  దృష్టిలో పెట్టుకొని రాజ్‌భవన్ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తిరిగి ఎప్పుడు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశాలు మొదలయ్యేదీ ప్రస్తుతానికి చెప్పలేదు. కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే రాజ్‌భవన్ వర్గాలు నెక్ట్స్ సమావేశాల తేదీలు నిర్ణయించ‌నున్నారు.  

క‌రోనా సెమీ ఫైన‌లా! ఏప్రిల్‌ 19 నాటికి భూమిమీద మనిషే బతికే అవకాశం లేదా?

ఓవైపు కరోనా వైరస్‌తో ప్రపంచం గజగజ వణికిపోతుంటే యుగాంతానికి కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంద‌ని, క‌రోనా సెమీ ఫైన‌ల్ మాత్ర‌మే, అస‌లు ఫైన‌ల్ ఏప్రిల్ 19వ తేదీ అంటూ  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. భూమి అంతం కాబోతోందంటూ కొంద‌రు, కాదు కాదు ప్ర‌ళ‌యం రాబోతుందంటూ మ‌రి కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప్ర‌చారానికి లాజిక్ జోడిస్తూ నాసాను కోట్ చేస్తున్నారు.  వచ్చే నెల 19 నాటికి అసలు ప్రపంచంపై మనిషే బతికే అవకాశం లేదంట‌. 2020 ఏప్రిల్‌ 19న భూమికి సమీపంగా ఓ గ్రహశకలం వెళ్లనుందని మూడేళ్ల క్రితం నాసా తెలిపింది. దాదాపు 2వేల అడుగుల పరిమాణం గల జేఓ25 అనే గ్రహశకలం (స్పేస్‌రాక్‌) భూమి నుంచి 1.8 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందని అప్ప‌ట్లో ఓ వార్త సంస్థ విశ్లేషించింది.   ఇది చంద్రుడి నుంచి భూమికి గల మధ్య దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుందని పేర్కొంది. అయితే, ఆ గ్రహశకలం మన భూమిని తాకే అవకాశం లేదని స్పష్టం చేసింది.  ఇంతకుముందు ఇలాంటి గ్రహ శకలాలు చాలా సార్లు భూమికి అతి సమీపంగా వెళ్లాయి. ఇంతవరకు భూమికి ఎలాంటి నష్టం వాటిళ్లలేదు. అయితే, ఈ గ్రహశకలం పరిమాణం వాటన్నింటికంటే చాలా పెద్దది.   గడిచిన 400ఏళ్లలో, రానున్న 500 ఏళ్లలో భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం ఇదే అని నాసా పేర్కొంది. అయితే, ఏప్రిల్‌ 19 తర్వాత భూమి నుంచి దూరంగా వెళ్లే క్రమంలో రాత్రివేళ టెలిస్కోపు ద్వారా ఈ గ్రహశకలాన్ని చూడవచ్చని నాసా తెలిపింది. 2004 సెప్టెంబర్‌లో ఐదు కిలోమీటర్ల చుట్టుకొలత గల టౌటాటిస్‌ అనే గ్రహశకలం ఒకటి భూమి నుంచి 4 లూనార్లు (ఒక లూనర్‌- చంద్రుడి నుంచి భూమికి మధ్య గల దూరం)తో దూసుకెళ్లింది. రాబోయే గ్రహశకలం టౌటాటిస్‌ కంటే కూడా పెద్దదట‌. ఈ  గ్రహశకలం భూమికి తాకుతుందని, ఆ తర్వాత భూగ్రహం అంతమవుతుందని వార్తలు వైర‌ల్ అవుతున్నాయి.  వచ్చే నెల 19 నాటికి అసలు ప్రపంచంపై మనిషే బతికే అవకాశం లేద‌నే వార్త  సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తోంది.    

లేఖలు, లీకులు బాబు పట్ల విధేయత కోసమేనా ?

  నిమ్మగడ్డ ధోరణిపై మండిపడ్డ విజయసాయి రెడ్డి  యనమల నాలుక మడత పడిపోయిందని వ్యాఖ్య  చంద్రబాబునే ఇప్పటికీ సీఎంగా ఊహించుకునే వారు అకారణంగా భయభ్రాంతులకు గురవడం, తమకు రక్షణ లేదని పీడకలలు కనడంలో వింతేమీ లేదంటూ వై ఎస్ ఆర్ సి పి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ్యుడు వి విజయసాయి రెడ్డి , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రమేష్ లాంటి వారు తమ యజమానికి ఇప్పటికీ ఏదో విధంగా సేవ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. లేఖలు, లీకులు అందులో భాగమేనంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.  స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలని యనమల గారు డిమాండు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. సీబీఐని నిషేధించినోళ్ళు, కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడినోళ్లు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు. మీలాంటి ప్రజాకంటకుల వల్ల ఏం ప్రయోజనం? అనవసర ఖర్చులు తప్ప, అంటూ ఇటు మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడును కూడా విజయసాయి రెడ్డి దులిపేశారు. నిమ్మగడ్డ  రమేష్ కుమార్  శుక్రవారం నుంచి హైదరాబాద్ కేంద్రంగానే విధులు నిర్వహిస్తున్నట్టు ప్రకటించటంతో ,  విజయసాయి రెడ్డి  ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, తన కుటుంబానికి వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, ఏపీలో భ్రద్రత లేదని, నిత్యం బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కేంద్రానికి రాసిన లేఖలో ఆరోపణలు చేయడాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీకి ఇప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రి అని చాలా కొంత మంది విశ్వసిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలన్నీ అందులో భాగమేనన్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే, ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త రాజకీయ సంక్షోభానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వహించటానికి నిర్ణయించుకోవటం ప్రధానకారణంగా కానవస్తోంది. 

సామాజిక దూరం పాటిస్తున్న 'నిమ్మగడ్డ'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్ హైదరాబాద్ కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. కమిషనర్ రమేష్ కుమార్ హైదరాబాద్‌లోని తన నియమించబడిన ప్రాంగణం నుండి కార్యాలయ సాధారణ విధులను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలియచేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వీయ నియంత్రణ లో భాగంగానే కమిషనర్ సామాజిక దూరాన్ని పాటిస్తున్నట్టు  పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని గృహ స్థలాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల  కమిషన్ క్లియర్. అంతకుముందు సుప్రీంకోర్టు తన తీర్పులో కొనసాగుతున్న పథకాలను కొనసాగించడానికి అనుమతి ఇచ్చిందని, అందుకనుగుణంగా కొనసాగుతున్న పథకం అని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందని కమిషనర్ చెప్పారు. వాస్తవాలను తగిన విధంగా పరిగణనలోకి తీసుకుని, కమిషన్  ఆమోదం ఇచ్చిందన్నారు.

మోడీ చెప్పిన మాటకు సరేనన్న నాయుడు!

* కరోనా పై నాలుగు రోజులకే మాట మార్చిన సి.ఎం., సి.ఎస్. జవాబు చెప్పాలని డిమాండ్ చేసిన చంద్రబాబు * జగన్ లాంటి ఫ్యూడల్ పాలకుల గురించి రాజ్యాంగ కర్తలు ముందే ఊహించారన్న చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ తో మొత్తానికి ఇన్నాళ్లకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకీభవించారు. ప్రధాని ఇచ్చిన 'జనతా కర్ఫ్యూ ' పిలుపునకు, నాయుడు చాలా పాజిటివ్ గా స్పందించారు. జనతా కర్ఫ్యూ ను అందరూ విధిగా పాటించాలని సూచించారు. పార్టీ నాయకులతో ఈ రోజు జరిపిన టెలి కాన్ఫెరెన్స్ లో ఆయన ఈ మేరకు, తమ పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వివిధ జిల్లాల  టిడిపి ప్రజా ప్రతినిధులు, వివిధ జిల్లాల నేతలు ఈ టెలి కాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రతరం అవుతోందని,  స్వల్పకాలంలో 177దేశాలకు కరోనా విస్తరించటంతో, 10వేల మందిపైగా కరోనాతో మృతి చెందారని చంద్రబాబు నాయుడు చెప్పారు.  " కరోనా తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలి. ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రధాని మోది ‘‘జనతా కర్ఫ్యూ’’కు పిలుపిచ్చారు. ఆదివారం జనతా కర్ఫ్యూ అందరూ పాటించాలి. 10ఏళ్ల పిల్లలు,65ఏళ్ల వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, " అని నాయుడు సూచించారు. అలాగే , పత్రాలు, బుక్ లెట్స్ పంపిణి చేయాలని చెప్పారు. " స్థానిక ఎన్నికల్లో వైసిపి అక్రమాలపై పోరాడాలి. ప్రతిచోటా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లు సేకరించాలి. వైసిపి బెదిరింపులపై ఎవిడెన్స్ లు సేకరించాలి, బలవంతపు ఏకగ్రీవాలపై సాక్ష్యాధారాలు సేకరించాలి. అన్ని సాక్ష్యాధారాలను ఆర్వోలకు, ఈసికి పంపించాలి. నామినేషన్లు వేయలేక పోయినవాళ్లు అనేకమంది. స్క్రూటినీ లో బలవంతపు ఉపసంహరణలు అనేకం. అభ్యర్ధులను బెదిరించి అనేకం ఏకగ్రీవం చేశారు. 2% ఏకగ్రీవాలు 24%కావడమే ప్రత్యక్ష రుజువు . వేలాదిమందిపై తప్పుడు కేసులు బనాయించారు. ఈసి రాసిన లేఖలో ఈ అక్రమాలన్నీ పేర్కొన్నారు. వైసిపి దాడులు, దౌర్జన్యాలపై కేంద్రానికి నివేదిక పంపినందువల్లనే,  ఈసిపై కత్తికట్టారు, కుటుంబాన్ని బెదిరించారు. ఎన్నికల్లో వైసిపి దౌర్జన్యాలపై కోర్టులలో కేసులు వేయాలి. అటు ప్రజాక్షేత్రంలో, ఇటు న్యాయక్షేత్రంలో పోరాడాలి. ఎన్నికల చట్టాలు, నిబంధనలపై అభ్యర్ధులు అవగాహన పెంచుకోవాలి. చట్ట నిబంధనలను అధ్యయనం చేయాలి, విశ్లేషించాలి," అంటూ నాయుడు పార్టీ యంత్రాంగాన్ని ఉత్తేజపరిచారు.   " ఏపిలో ఎన్నికల ప్రధానాధికారికే భద్రతలేదు. ఈసిని ముఖ్యమంత్రి, మంత్రులు బెదిరించారు. ఎన్నికలు వాయిదా వేశారనే వైసిపి అక్కసు. ఈసిపైనే దాడులకు పాల్పడే నైజం వైసిపి నేతలది. ఈసి కుటుంబ సభ్యులకే ఏపిలో రక్షణ లేదు. కేంద్ర బలగాలు ఈసికి రక్షణగా వచ్చాయి. ఈసి లేఖతో వైసిపి అక్కసు రెట్టింపైంది. టిడిపిపై అసత్య ఆరోపణలకు తెగబడ్డారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి," అని కూడా పార్టీ యంత్రాంగానికి నాయుడు దిశా నిర్దేశం చేశారు. " సిఎస్ లేఖలో కరోనా బెడద 4వారాలు లేదన్నారు. లేఖ రాసిన 4రోజుల్లోనే విద్యాసంస్థలు మూశారు.ఆలయాలు, సినిమాహాళ్లు బంద్ చేశారు. దీనిపై సీఎస్, సిఎం ప్రజలకు జవాబివ్వాలి," అంటూ  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. " కరోనాపై ముఖ్యమంత్రి ఒకరకంగా మాట్లాడారు. మంత్రులు ఇంకోరకంగా మాట్లాడారు.అధికారులు తలోరకంగా కరోనాపై వ్యాఖ్యానాలు. ఒకరికొకరికి పొంతన లేకుండా పోయింది.రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరేం మాట్లాడతారో, ఎవరేం చేస్తారో తెలీని దుస్థితి కరోనా అనేది రోగం కాదని సీఎం అన్నారు. టైఫాయిడ్, ఫ్లూ లాగా కరోనా కామన్ అన్నారు.పారాసిటమాల్, బ్లీచింగ్ వ్యాఖ్యలతో నవ్వులపాలయ్యారు. ప్రజల ఆరోగ్యంతో వైసిపి చెలగాటం ఆడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డపేరు వచ్చింది," అంటూ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.   " ఒక వ్యవస్థ విఫలమైతే, మరోవ్యవస్థ కాపాడుతుంది. అదే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనం. అందుకే దేశంలో 4వ్యవస్థలను నెలకొల్పారు. లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్,జ్యుడిషియరీ,మీడియా. ఏ నాలుగు  వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి మూలస్థంభాలు. ధర్మం నాలుగు పాదాల నడవాలనేది పెద్దలమాట. ఈ నాలుగు  వ్యవస్థలపై ప్రజాస్వామ్యం నిలబడాలని మన రాజ్యాంగం చెప్పేది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యూడల్ పాలకులు వస్తారనే అనుమానంతోనే, మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఈ వ్యవస్థల ద్వారా  కట్టుదిట్టం చేశారు. ఓటు అనేది పౌరుల ప్రాథమిక హక్కు. పోరాడి సాధించుకున్న హక్కు ఓటు. పోటీచేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. నామినేషన్లు వేసే స్వేచ్ఛ అభ్యర్ధులకు ఉండాలి. పౌర హక్కులనే వైసిపి నేతలు కాలరాస్తున్నారు. వైసిపి నేతల అక్రమాలకు బుద్ది చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి," అంటూ చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను  వై ఎస్ ఆర్ సి పి పై సమరానికి సిద్ధం చేశారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

కరోనా ప్రభావం తెలంగాణ పదో తరగతి పరీక్షలపై పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో, పరీక్షలను వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పదో తరగతి పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ఇదివరకే సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. అయితే కరోనా విజృంభిస్తుండటంతో శుక్రవారం నాడు ఈ విషయమై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. అయితే, శనివారం జరగాల్సిన పరీక్ష యథాతథంగా జరగనుంది. సోమవారం నుంచి ఈనెల 30వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడనున్నాయి. కాగా.. ఈ నెల 29న అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

తిరుమలలో దర్శనాలు రద్దు! స్వామి వారి కైంకర్యాలు మాత్రం యథాతథం

తిరుమలలో భక్తుల దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. తిరుమల చరిత్రలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1892లో రెండు రోజుల పాటు కేవలం భక్తులకు దర్శనాన్ని మాత్రమే కాదు. ఏకంగా ఆలయాన్ని కూడా మూసివేసినట్టు రికార్డుల్లో నమోదయ్యిందని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. అయితే స్వామి వారి కైంకర్యాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి. ఇప్పటి వరకు ఉన్న ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు తదపరి ఆదేశాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో తొలిసారిగా వైరస్ వ్యాప్తి కారణంగా యాత్రికులను తిరుమలకు రావద్దని చెప్పడం ఇదే తొలిసారి. రెండేళ్ల క్రితం సంప్రోక్షణ పేరుతో బాలాలయం కోసం 9 రోజుల పాటు దర్శనాలు నిలిపివేశారు. బంద్ , ఇతర ఆందోళనల కారణంగా కొన్ని రోజుల పాటు భక్తుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడిన అనుభవాలున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కొంతకాలం అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే తొలిసారిగా టీటీడీ అధికారులే భక్తులు రావద్దని చెప్పడం ఇప్పుడే జ‌రిగింది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఇప్పుడు కూడా ఎన్ని రోజుల పాటు ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నారన్నది స్పష్టత లేదు.

కరోనా నేపథ్యంలో జనగణన వాయిదా! హొంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌1 నుంచి కేంద్రం చేపట్టాలనుకుంటున్న ఎన్‌పిఆర్‌ను వాయిదా వేస్తున్నామని కిషన్‌రెడ్డి ప్ర‌క‌టించారు. కరోనా నివారణకు కేంద్రం అన్నిచర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాల్లో పర్యవేక్షణ కోసం జాయింట్ సెక్రటరీలను నియమించామని తెలిపారు. జనవరి 26 నుంచి అన్ని విమానాశ్రయాల్లో పరీక్షలు ప్రారంభించామని పేర్కొన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలలో సామూహిక ప్రార్థనలు సాధ్యమైనంత వరకు తగ్గించాలని కోరారు. కరోనా అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఓడల ద్వారా వచ్చే సరకు రవాణాను నిషేధించామని వెల్లడించారు. విదేశాల్లో ఉన్న రాయబారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని తెలిపారు. దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టుమైన నిఘా పెట్టామని తెలిపారు. మనీలాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. క‌రోనా నేప‌థ్యంలో నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌) ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన నమూనాతో ఎన్పీఆర్ వివరాలను సేకరించాల్సిందిగా రాష్ట్రాల‌కు సూచించిన కేంద్రం.. ఆ ప్రశ్నలను చట్టంలోని ఏ సెక్షన్‌ ప్రకారం చేర్చిందో మాత్రం స్పష్టతనివ్వలేదు. ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ).. వివాదాస్పదమైన నేపథ్యంలో తాజాగా ఎన్పీఆర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో ఈ అంశంపై వున్న వివాదంపై కొంత కాలం వ‌ర‌కు తెర‌ప‌డిన‌ట్లే.

కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను ర‌ద్దు చేసిన హైకోర్టు

వరుసగా సవాళ్లు ఎదుర్కొంటున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డికి ఇప్పుడు న్యాయ పరంగా చుక్కెదురైంది. ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..న్యాయ విభాగం పరిధిలోకి వచ్చే శాఖలను కర్నూలును తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జీవో 13 జారీ విషయంలో వివాదం నెలకొని ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పూర్తి సమాచారం లేకుండానే ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి సూచన మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగింది. ఇక, ఈ జీవోల పైన హైకోర్టులో దాఖలైన పిటీషన్ల పైన ప్రభుత్వ వివరణ కోరింది. స్థలం సమస్య కారణంగానే కర్నూలుకు మారుస్తున్నామని ప్ర‌భుత్వం వివరణ ఇచ్చింది. అయితే, స్థలం సరిపోకుంటే పక్క భవనాల్లోకి మార్చుకోవచ్చంటూ కోర్టు సూచించింది. ప్రభుత్వం నుండి సమాధానం వచ్చిన తరువాత హైకోర్టు కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జి.వో 13 పై సి.ఎస్‌. సంతకం లేకపోవడం,సచివాలయం అధికారుల రోజువారీ పనిని గమనించుటకు ఏర్పాటు చేసిన విజిలెన్సు కమిషన్ ఆఫీస్ ను సచివాలయం కు దూరంగా మార్చడం దురుద్దేశంతో కూడుకున్నది అని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించిన పిల్ 20/20 లో ఈ రోజు హైకోర్టు జి.వో 13 ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు జారీ చేసిన జీవో సస్పెన్షన్ చేస్తూ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాల అమలకు వరుస బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లులకు మండలిలో అడ్డు తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా కారణంగా ఎన్నికల సంఘం ఆరు వారాలు ఎన్నికలను నిలుపుదల చేసారు. ఇదే అంశం పైన సుప్రీంకు వెళ్లిన ప్రభుత్వానికి అక్కడ ప్రతికూల ఫలితం వచ్చింది. అయితే, కొంత వెసులుబాటు మాత్రం కలిగింది. ఇక, ఇప్పుడు కర్నూలుకు కార్యాలయాల తరలింపు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాగైనా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే మూడు రాజధానుల వివాదానికి ముగింపు పలికి..విశాఖ నుండి పరిపాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ముహూర్తం సైతం ఖరారు చేసింది. అయితే, ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ప్రభుత్వ ఆలోచనలకు బ్రేక్ పడింది.

ఆ ఎమ్మెల్యే గారికి కాస్త ఎవరైనా చెప్పండయ్యా!!

కరోనా దెబ్బకి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కరోనా విజృంభిస్తుండటంతో కేంద్రప్రభుత్వం మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాల వరకు.. ప్రజలకు పలు సూచనలు చేస్తున్నాయి. బయటికి వెళ్ళొద్దని, ఇంటి వద్ద నుంచే పనిచేసుకోవాలని, ప్రయాణాలు-పెళ్లిళ్లు మానుకోవాలని ఇలా పలు సలహాలు-సూచనలు ఇస్తున్నారు. ఇక విదేశాలకు వెళ్లి వచ్చిన వారినైతే క్వారంటైన్‌ లో ఉంచుతున్నారు. రెండు వారాల పాటు బయట ప్రపంచానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సూచనలు-హెచ్చరికలు అన్నీ సామాన్య ప్రజలకేనా? ప్రజాప్రతినిధులకు పట్టవా?. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు చూస్తుంటే నిజంగానే వారికి ఏ రూల్స్ పట్టవేమో అనిపిస్తుంది. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీరు వివాదాస్పదంగా మారింది. కోనప్ప దంపతులు ఈ నెల 16న అమెరికా నుంచి వచ్చారు. అయితే ఆయన క్వారంటైన్‌లో లో ఉండలేదు. కనీసం బయట వారిని కలవకుండా హౌస్ క్వారంటైన్‌ లోనూ ఉండట్లేదు. మాస్క్ కూడా పెట్టుకోకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. అమెరికా నుండి వచ్చిన మరుసటి రోజే మున్సిపల్‌ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అంతేనా.. ఒకవైపు ప్రభుత్వాలు.. వివాహాలు-వేడుకలు వాయిదా వేసుకోమని చెప్తుంటే.. ప్రజలకు అవగాహన కలిగించాల్సిన స్థానంలో ఉన్న కోనప్ప మాత్రం.. బంధువులు, సన్నిహితుల ఇళ్లలో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతం, వివాహాలకు హాజరయ్యారు. ఇలా విదేశాల నుంచి వచ్చి కనీసం మాస్క్ కూడా లేకుండా, ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా.. ఓ ఎమ్మెల్యే ఇలా తిరగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అన్ని పరీక్షలు చేశారని.. ఆరోగ్యంగా ఉన్నందున క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని కోనప్ప చెబుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే, వైరస్ సోకిన వెంటనే గుర్తించలేమని.. కనీసం మూడు నాలుగు రోజుల తరువాత లక్షణాలు బయటపడతాయని.. అందుకే అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే గారు ఇవేమి పట్టనట్టు సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడిలా ఊరంతా తిరుగుతున్నారు. అధికార పార్టీ పెద్దలైనా ఆయనకు హితబోధ చేస్తే బావుండు.

ఏపీలో కలిసొస్తున్న పరిస్ధితులు..మళ్లీ జోష్‌లో టీడీపీ....

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం  టీడీపీలో జోష్ నింపింది.....కరోనా  ఎఫెక్ట్ కావచ్చు  వేరే కారణ కావచ్చు  ఎన్నికలు కొన్ని వారాలు వాయిదా పడడంతో  టీడీపీకి మంచి ఊరట దొరికింది... ఎన్నికలకు ప్రిపేర్ కావడానికి మంచి టైమ్ దొరకడం  ఒక కారణం  అయితే ఇప్పటికిప్పుడు  ఎన్నికలకు రడీ  అయ్యిన పరిస్థితిలో టిడిపి లేదు...దీంతో తాజా పరిణామాలు  టిడిపికి  ఆనందం కలిగిస్తున్నాయి....ప్రస్తుతం  టిడిపి  నాయకత్వ లోపంతో  కొంత ఇబ్బంది పడుతోంది..చంద్రబాబు ఎంత మోటీవేట్ చేసినా  నాయకులు క్రమంగా జారిపోతున్నారు....చాలా చోట్ల అసలు పోటీ చేయడానికి కూడా   ముందుకు కాని పరిస్థతి ఏర్పడింది.. కొన్ని జిల్లాలు చాలా  నియోజక  వర్గాలలో ఈ పరిస్థితి ఉంది..దీనికి కారణం మొన్న ఎన్నికల్లో  ఘోర సరాజయం పాలవ్వడమే...ఇంతో లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చాయి.... ఔనన్నా కాదన్నా  స్థానిక సంస్థల ఎన్నికల్లో  అధికార పార్టీ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది..కానీ   సాధారణ ఎన్నికలు జరిగిన  రెండు నెలల నుంచే  ఏపీలో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి.....టిడిపి  అయితే  వైసీపీ  పైౌ తీవ్ర స్థాయిలో దాడి  మొదలు పెట్టింది....దీంతో  వైౌసీపీకి కొంత ఇబ్బంది ఎదురయ్యింది..సాధారణంగా  ఎన్నికలు జరిగిన    ఆరు నెలల వరకు  ప్రతిపక్షం సైలెంట్ గా ఉంటుంది..కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు....దీంతో  వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు వ్యవహారం  మొదట్లో వచ్చిన ఇసుక సమస్య  చాలా ఇబ్బండిగా మారాయి....ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి....దీంతో  వైసీపీ  సహజంగానే జోష్ లో ఉంది.కానీ టీడిపి, మిగిలిన ప్రతిపక్షాలు ఇబ్బంది పడే పరిస‌్థితి.. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఎన్నికలు ప్రస్తుతం ఆరు వారాలు వాయదా పడ్డాయి...దీంతో  టిడిపి ఊపిరి  పీల్చుకుని  మెంటల్ గా ఎన్నికలకు  రడీ అయ్యే పరిస‌్థితి వచ్చింది..గెలుపు ఓటమి తర్వాత  విషయం.. ముందు పోటీ చేయడానికి  అధ్యర్ధులు ప్రిపేర్ అవ్వచ్చే అనే భావన పార్టీలో ఏర్పడింది..దీంతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో టిడిపి వర్గాలున్నాయి.....

ఆంధ్ర‌ ఈసీ లేఖ నిజమే : కిషన్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (ఎపి ఎస్‌ఇసి) కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయం నిజమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు. ఎస్‌ఇసి రమేశ్‌ కుమార్‌కు భద్రత కల్పించామని ఆయన స్పష్టం చేశారు. రమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చినప్పుడల్లా భద్రత కల్పిస్తారు. రమేష్‌కు భద్రత కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. నేను కూడా ఏపీ డీజీపీతో మాట్లాడతానని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ జోక్యంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌‌కు భద్రత పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనంతరం అధికార పార్టీ నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయన తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. దీన్ని ఆయన ధృవీకరించలేదు. కానీ కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డి ధృవీక‌రించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో రమేశ్ కుమార్‌కు 1+1 నుంచి 4+4కి ప్రభుత్వం భద్రత పెంచింది. ఉదయం నుంచి 4+4 సెక్యూరిటీ విధుల్లో చేర్చారు.

కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు!

మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లోనే ప్ర‌పంచంలో 500 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం 117 దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు 10,000 మందికిపైగా మృతిచెందగా, వైరస్ సోకినవారి సంఖ్య 2,45,600 దాటింది. భార‌త్‌లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ 5, న‌మోదైన కేసులు 206 భారత్‌లో కరోనా మరణాల సంఖ్య ఐదుకు చేరింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో కరోనా వైరస్‌తో హాస్పిటల్ చేరి చికిత్స పొందుతున్న ఇటలీ పర్యాటకుడు శుక్రవారం చనిపోయాడు. మార్చి మొదటి వారంలో భారత్‌కు వచ్చిన ఇటలీ దంపతులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం మృతుడి భార్య కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. దేశంలో కోవిడ్ మరణాలు నాలుగుకు చేరుకోగా, బాధితుల సంఖ్య 206 కు చేరింది. పంజాబ్‌కు చెందిన వ్యక్తి కరోనా వైరస్‌తో గురువారం చనిపోయాడు. గురువారం దేశవ్యాప్తంగా మరో 27 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో దేశంలో కరోనా లక్షణాలు కనిపించినవారిలో ఇప్పటివరకు 206 పాజిటివ్ కేసులు నిర్ధరణయినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. తెలంగాణలో 16, ఏపిలో మూడు క‌రోనా కేసులు! తెలంగాణలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో క‌రోనా కేసుల సంఖ్య 16కు చేరుకుంద‌ని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఏపీలో మూడో కరోనా వైరస్ కేసు నమోదైంది. ఇటీవల ఉమ్రా యాత్ర కోసం వెళ్లి మక్కా నుంచి తిరిగొచ్చిన విశాఖ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆ వ్యక్తికి చెస్ట్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు ఈ నెల ఆరంభంలో ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. రెండో కేసు ప్రకాశం జిల్లాలో నమోదైంది. మార్చి 15న లండన్ నుంచి ఒంగోలు చేరుకున్న వ్యక్తికి కూడా కోవిడ్ ఉన్నట్లు తేలింది.

కరోనా దూకుడుతో ఏషియన్ అమెరికన్లలో ఆత్మరక్షణ భయం 

50 శాతం నుంచి వంద శాతం వరకూ పెరిగిన గన్ సేల్స్  * ఫిబ్రవరి మాసం లో ఒక్క ఎఫ్ బీ ఐ సిస్టం ద్వారా 2. 8 మిలియన్ గన్స్ విక్రయాలు జరిగాయి. ఇది కిందటి ఏడాది ఫిబ్రవరి తో పోలిస్తే, 36 శాతం పెరుగుదల ఉన్నట్టు లెక్కన్న మాట. నిజానికి 2016 తర్వాత, ఇది రికార్డు స్థాయిలో నమోదైన విక్రయాలు అని లెక్కలు చెబుతున్నాయి.  * కరోనా వైరస్ ఔట్ బ్రేక్ తరువాత , గన్స్ సేల్స్ లో 50 శాతం నుంచి 100 శాతం పెరుగుదల చూసినట్టు, కెవిన్ లిమ్ అనే మరో స్టోర్ మేనేజర్ చెపుతున్నారు.  * ఎక్కువగా ఏషియన్-అమెరికన్ కస్టమర్స్ గన్స్ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్న దాఖలాలు వాషింగ్టన్ స్టేట్ లో, కాలిఫోర్నియా లో నోటీస్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చైనా  లో పురుడు పోసుకున్న కరోనా వైరస్  కారణం గా, ఏసియన్లు టార్గెట్ గా 'జాత్యహంకార దాడుల్లో జరుగుతాయేమోననే భయం తో , ఆసియన్-అమెరికన్లు ఎక్కువగా ఆత్మ రక్షణ సామాగ్రి , రైఫిల్స్ కొనుగోలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి  * లాస్ ఏంజెల్స్ లో  గ్రోసరీ స్టోర్స్ లో కన్నా ఎక్కువగా, గన్ షాప్స్ దగ్గరే జనాలు క్యూ కట్టుకుని మరీ నుంచోడం చూస్తుంటే, కరోనా వైరస్ కారణంగా ఉత్పన్నమైన ఆత్మరక్షణ భయం తాలూకు ఛాయలు, అమెరికన్ -ఏసియన్స్ లో కనిపిస్తున్న విషయం బోధపడుతోంది.  ఎంకి పెళ్లి  సుబ్బి చావుకొచ్చింది  అనే సామెతను ఇక్కడ  తిప్పి చదువుకోవాలి. సుబ్బి చావు తో  ఎంకి  తన పెళ్లి కి సంబారాలు సమకూరుస్తోందనేది  ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నడుస్తున్న టాపిక్. ఒక వేళ దేశం లో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటిస్తే, ఎక్కడ బ్లాక్స్ నుంచి దాడులు ఎదుర్కోవలసి వస్తోందనే భయంతో, ఆ దేశ పౌరులు ఇప్పుడు, తుపాకులు, తపంచాలు కొనుగోలు దిశగా పరుగులు తీస్తున్నారు.  అమెరికా ఎకానమీ ని కల్లోల పరిచిన కరోనా, దేశంలోని వివిధ వ్యవస్థలను నిర్వీర్వ్య పరిస్తే, ఒక్క గన్స్, రివాల్వర్లు పరిశ్రమ మాత్రం దూసుకుపోతోంది. నిజానికి, కిందటి  సోమవారం ఒక్కరోజే పెన్సిల్వేనియా లోని హ్యారిస్ బర్గ్ లోని ఒక గన్ షాప్ 30,000 డాలర్ల మేరకు గన్స్, రివాల్వర్లు విక్రయించినట్టు సమాచారం. ఈ సంగతి అక్కడి స్టాడ్స్ గన్ షాప్ మేనేజర్ కుర్ట్  గ్రీన్ ధృవీకరించారు. ఇది గడిచిన తొమ్మిదేళ్ల అమ్మకాలతోపోలిస్తే, 50 శాతం ఎక్కువ అని అతను చెబుతున్నాడంటే, అక్కడి ప్రజలకు బ్లాక్స్ నుంచి దాడుల భయం ఎంతుందో, సెల్ఫ్ డిఫెన్స్ కు అక్కడ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్ధం అవుతుంది. వాస్తవానికి, అమెరికా లో 20 శాతానికి పైగా  ఆయుధ విక్రయాలు పెరిగాయి. " ఎకానమీ పతనమవుతుంటే, తుపాకుల విక్రయాలు మాత్రం అమాంతం పెరిగాయి," అని ఘంటాపధంగా చెపుతున్న అతని విశ్లేషణ బట్టి చుస్తే, అమెరికా వాసుల కు బ్లాక్స్ నుంచి ఎదురయ్యే దాడులు , ఏ రకంగా ప్రభావితం చేశాయో ఇట్టే అర్ధమవుతోంది.  దేశంలోని గన్ డీలర్స్ అందరూ కూడా దాదాపు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో, ముందస్తుగా గన్స్ బుక్ చేసుకోవలసిన పరిస్థితి కూడా రావచ్చునేమో అని అడ్వెంచర్ ఔట్ డోర్స్ స్టోర్స్ యజమాని ఎరిక్ వాలస్ చెపుతున్నారు. ఆ ఒక్క స్టార్ లోనే కిందటి సోమవారం 500 గన్స్ అమ్ముడయ్యాయి. జార్జియా లోని స్మిర్నా లో ఉన్న ఈ  స్టోర్, దేశం లోని అత్యంత పెద్ద స్టోర్. 80,000 చదరపు గజాల విస్తీర్ణం లో ఉన్న ఈ స్టోర్  లో షాట్ గన్స్ , AR -15 సెమీ ఆటొమ్యాటిక్ రైఫిల్స్ , 9 mm హ్యాండ్ గన్స్ మొదలు అన్ని రకాల మోడల్స్ దొరుకుతాయి. ఈ పైన పేర్కొన్న మూడు రకాల గన్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. గన్స్ సేల్స్ లో 300 శతం వరకూ ఎదుగుదల కనిపించిందని చెపుతున్న ఎరిక్ వాలస్, అమెరికా పౌరులు హంటింగ్ రైఫిల్స్ కోసం కూడా తమను సంప్రదిస్తున్నట్టు చెప్పాడు. భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయటానికి వస్తున్న కస్టమర్స్ అతనితో ఎక్కువగా షేర్ చేసుకున్న అభిప్రాయమేమిటంటే, ఒక వేళ మార్షల్ లా ప్రకటిస్తే, తమను, తమ నివాసాలను రక్షించుకోవటానికి ఆయుధాలు అవసరమని చెపుతున్నారట. ఆయుధాల సరళీకృత విక్రయ విధానం వల్ల, ఆ దేశం లో పౌరులు తమ వ్యక్తిగత భద్రత కోసం అనివార్యం గా ఈ నిర్ణయం తీసుకుంటున్నారని మనకు అర్ధం అవుతోంది.  ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఏ క్షణం లోనైనా పూర్తి లాక్ డౌన్ ప్రకటించే అవకాశముందనే వదంతులు వ్యాపించటం వల్ల, ప్రజల్లో భయాందోళనలు అధికమవుతున్నాయి. అయితే, రిపబ్లికన్ సెనెటర్ మార్కో రూబియో మాత్రం, ఆ వదంతులను కొట్టిపారేశారు.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కోస‌మే ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్‌కు కులం అంట‌గ‌ట్టారా?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ప్ర‌తిపాదించారా? రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నియామ‌కానికి సంబంధించి గ‌వ‌ర్న‌ర్ ఇఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మధ్య ఘర్షణ జ‌ర‌గ‌డానికి కార‌ణం ఏమిటి? ప‌్ర‌భుత్వం పంపిన ఫైల్‌ను ఎందుకు రాజ్‌భ‌వ‌న్ వెన‌క్కి పంపింది? ప‌్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కులాన్ని ఆపాదిస్తూ చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం ఎంత‌? చంద్రబాబు ప్రోద్బలంతోనే ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రమేష్ కుమార్ తీసుకున్నారని సి.ఎం. ఆరోపించారు. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ఇలా వ్య‌వ‌హ‌రించారా? వాస్త‌వం ఏమిటి? 2015 న‌వంబ‌ర్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామ‌కానికి సంబంధించి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ చిత్తరంజన్ దాస్ బిస్వాల్ పేరును ప్ర‌తిపాదిస్తూ చంద్ర‌బాబునాయుడి ప్ర‌భుత్వం రాజ్‌భ‌వ‌న్‌కు ఫైల్ పంపింది. అయితే బిస్వాల్ అర్హ‌త‌ను స‌వాల్ చేస్తూ ఈ నియామ‌కాన్ని గ‌వ‌ర్న‌ర్ అడ్డుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ ఇఎస్ఎల్ నరసింహన్ తన అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈ విషయంపై లీగ‌ల్ ఓపీనియ‌న్ కోరింది. బిస్వాల్ ఎపిపిఎస్సి ఛైర్మన్ పదవీ విరమణ చేశారు. మ‌ళ్లీ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియామకం చేయ‌మ‌ని ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించ‌డాన్ని రాజ్‌భ‌వ‌న్ తిర‌స్క‌రించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన ఫైల్‌ను రాజ్ భవన్ తిప్పి పంపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 319 బి "స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఇతర సభ్యుడు లేదా మరే ఇతర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా నియామకానికి అర్హులు, కానీ ఇతర ఉద్యోగాలకు కాదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక రాజ్యాంగ పదవి. ఇది ఎల్లప్పుడూ ప్రధాన కార్యదర్శి-ర్యాంక్ అధికారులచే నింపబడుతుంది. బిస్వాల్ తన అధీనానికి ముందు చీఫ్ సెక్రటరీ హోదా పొందలేదు. "రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి హైకోర్టు న్యాయమూర్తికి సమానం మరియు ఈ పదవిలో చీఫ్ సెక్రటరీ ర్యాంక్ అధికారులను మాత్రమే నియమిస్తారు. అందుకే రాజ్‌భ‌వ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన పేరును అంగీక‌రించ‌లేదు. అసలు రమేష్ కుమార్ నియామకం జరిగింది తెలుగుదేశం ప్ర‌భుత్వ‌ హయాంలోనే అయినా.. ఆయన్ని నియమించింది, పేరును ప్ర‌తిపాదించింది చంద్ర‌బాబునాయుడు కాదు. చంద్ర‌బాబునాయుడు ప్ర‌తిపాదించిన పేరు బిస్వాల్‌ను కాద‌ని అప్పటి గవర్నర్ నరసింహన్ ర‌మేష్ కుమార్‌ను ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్‌గా నియ‌మించారు.

చైనీస్ వైరస్ అంటున్న‌ ట్రంప్ పై మండిప‌డుతున్న న‌టి లానా కాండోర్‌!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అంటూ చైనాపై తనకున్న అక్కసును ట్రంప్ వెళ్లగక్కారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై నటి లానా కాండోర్ ఘాటుగా స్పందించింది. దేశాల మధ్య చిచ్చుపెట్టే ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలను చేసిన ట్రంప్ ఒక నాయకుడే కాదంటూ మండిప‌డింది. ఒక దేశాధ్యక్షుడి హోదాలో ఉన్నపుడు ఆచి తూచి మాట్లాడాలని కాండోర్ మండిపడింది. అమెరికన్-ఏసియన్లపై ట్రంప్ వ్యాఖ్యలు ఎంతో ప్రభావం చూపుతాయని ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారిని నాయకుడనరని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల చైనా ప్రజలు అభద్రతా భావంలో ఉంటారని చైనా ప్రజలపై దాడి జరిగే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ట్రంప్ సిగ్గుపడాలని చెప్పింది. నాయకుడని పిలుపించుకునే అర్హత ట్రంప్ నకు లేదని - నిజమైన నాయకులు అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా లా ఉంటారని గడ్డిపెట్టింది. లక్షల కొద్దీ మాస్క్ లను జాక్ మా అమెరికన్లకు ఇచ్చి తన వంతు సాయం చేశాడని...ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ఆపాలని ట్రంప్ నకు హితవు పలికింది. మరోవైపు ట్రంప్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మండిపడింది. వైరస్లకు జాతి - కులాలు తెలియవని - అదేం చైనీస్ వైరస్ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. వైర‌స్ పై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాటం చేయాలని ర్యాన్ పిలుపునిచ్చారు.