దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడంలో ఏపీ ఐదో స్థానంలో ఉంది

* పీపీఈ లు 1.35 లక్షలు,  N 95 మాస్కులు 1.16 లక్షలు ఉన్నాయి * ఏపీ లో ప్రతి మిలియన్‌కు 331 మందికి పరీక్షలు చేస్తున్నాం * శాంపిల్‌ రిజల్ట్‌ కోసం మంచి సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాం కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడంలో ఏపీ ఐదో స్థానంలో ఉందని ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి జవహర్‌ రెడ్డి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్-19 పరీక్షల వివరాలను తెలియజేశారు. దేశవ్యాప్తంగా 2,74,599 పరీక్షలు చేశారు. భారతదేశ జనాభాతో పోల్చుకుని లెక్క వేసుకుంటే.. ప్రతి మిలియన్‌కు (10 లక్షలకు) 198 పరీక్షలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి మిలియన్‌ కు  198 పరీక్షలు చేస్తుంటే.. ఏపీ లో ప్రతి మిలియన్‌కు 331 మందికి పరీక్షలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడంలో మన రాష్ట్రం ఐదో స్థానంలో ఉందని జవహర్‌ రెడ్డి తెలిపారు.  "ఈ నెల 7వతేదీ నాటికి రాష్ట్రంలో 4 ల్యాబోరేటరీలున్నాయి. ఈ రోజు 7 ల్యాబోరేటరీలు 24 గంటలూ పని చేస్తున్నాయి. తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజ్, కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కొన్ని సివిల్‌ వర్కులు జరుగుతున్నాయి. రెండు ల్యాబ్‌లకూ సరిపడిన ఎక్విప్‌మెంట్‌ సిద్ధంగా ఉంది. తిరుపతి ల్యాబ్‌ శుక్రవారం (ఏప్రిల్ 17)  నుంచి అందుబాటులోకి వస్తుంది. కర్నూలు ల్యాబ్‌ పూర్తిస్థాయిలో సిద్ధమవడానికి రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది." అని జవహర్‌ రెడ్డి వెల్లడించారు. "గత మూడు రోజులుగా ప్రతి రోజూ 2 వేల శాంపిల్స్‌ పరీక్షిస్తున్నాం. 3వేల శాంపిల్స్‌ పరీక్షలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  ట్రూనాట్‌ కిట్స్‌తో పరీక్షలు చేద్దామని అనుకున్నాం. కానీ కిట్ల లభ్యత అనుకున్న స్థాయిలో లేదు. వాటిని ఎక్కడా తయారు చేయడం లేదు. కొన్ని రోజుల క్రితం  2 వేల కిట్లు వచ్చాయి. వాటితో పరీక్షలు నిర్వహించాం. ఏప్రిల్  16 గురువారం సుమారు 18వేల కిట్లు వచ్చాయి. పరీక్షలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 225 మెషీన్లు ఉన్నాయి. 13 జిల్లాలో 49 సెంటర్లలో ఈ 225 మెషీన్లను  పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే రోజుకు 4 వేల పరీక్షలు చేయవచ్చు.కిట్ల లభ్యత లేకపోవడం వల్ల పరీక్షలు ఎక్కువ మొత్తంలో చేయలేకపోతున్నాం.1 లక్ష కిట్లకు ఆర్డరు పెట్టాం. సరఫరా నిదానంగా ఉంది. దేశంలో ట్రూనాట్‌ కిట్లు ఉపయోగించేది మూడు నాలుగు రాష్ట్రాలే. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటి" అని పేర్కొన్నారు. "ప్రతి రోజూ వేల శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నాం కాబట్టి.. రిపోర్టులు పేపర్లలో తెప్పించుకోడానికి కుదరదు. దీని కోసం  కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాం. శాంపిల్‌ ట్రాకింగ్, శాంపిల్‌ కలెక్షన్, శాంపిల్‌ రిజల్ట్‌ కోసం మంచి సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాం. దాని ద్వారా పని సులభం అవుతోంది. రిపోర్టులు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. 90 నుంచి 95 శాతం రిపోర్టులు ఆన్‌లైన్‌లోనే కనబడుతున్నాయి. శాంపిల్‌ కలెక్షన్‌ నుంచి రిజల్ట్‌ వరకు అన్నీ ఆన్‌లోన్‌లో చూసుకోవచ్చు. ప్రతి జిల్లాలో ఒక కోవిడ్‌ ఆసుపత్రిని పెట్టాం. ఇవి ఇప్పటికే పని చేస్తున్నాయి. పీపీఈ లు 1.35 లక్షలు,  N 95 మాస్కులు 1.16 లక్షలు ఉన్నాయి. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కావాల్సిన ఎక్విప్‌మెంట్‌ పుష్కలంగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు." అని జవహర్‌ రెడ్డి తెలిపారు.

బుద్ధా వెంకన్న కు బెదరింపు కాల్స్

టీడీపీ ఎం ఎల్ సి, చంద్రబాబు నాయుడి అనుంగు అనుచరుడు అయిన బుద్ధ వెంకన్న కు గురువారం సాయంత్రం నుంచీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ విషయం ఆయనే ఒక లేఖ ద్వారా వెల్లడించారు. పాత్రికేయ మిత్రులను ఉద్దేశిస్తూ రాసిన ఈ లేఖలో ఆయన -జగన్మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డి ని దుమ్మెత్తి పోశారు. ప్రజాస్వమ్యం లో ఈ తరహా బెదరింపు ధోరణులు సరి కాదని, ప్రభుత్వం తన కక్ష పూరిత ధోరణిని విడనాడాలని, చంద్రబాబును ఎవరైనా ఏమైనా అనొచ్చు కానీ, తాము మాత్రం ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రశ్నించ కూడదా అని బుద్ధా వెంకన్న నిలదీశారు. మాచర్లలో తనపై జరిగిన హత్యా యత్నాన్ని గుర్తు చేసిన వెంకన్న, ఈ రోజు బెదరింపు కాల్స్ కి భయపడేది లేదని తేల్చి చెప్పారు.

ప్లాస్మా చికిత్స కు సిద్ధమైన ఢిల్లీ ప్రభుత్వం

కరోనా వైరస్ బారిన పడ్డ వారి ప్రాణాలు కాపాడేందుకు చేసే ప్లాస్మా చికిత్సను ఢిల్లీలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీఎం కేజ్రీవాల్  ఓ ప్రకటన చేశారు. వాస్తవానికి, ప్లాస్మా చికిత్సను ప్రయోగాత్మకంగా చేయటానికి కేరళ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి తీసుకుంది. అదే పదహతిలో, మూడు నాలుగు రోజుల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్స చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా లభించాయని చెప్పారు. ఈ చికిత్సా విధానం విజయవంతమైతే కనుక తీవ్ర స్థాయిలో ‘కరోనా’ బారిన పడ్డ వారిని కాపాడుకోవచ్చని చెప్పారు.ఢిల్లీలో ఇప్పటి వరకూ కరోనా బారినపడ్డ వారి సంఖ్య 1,578 మంది కాగా, 42 మంది కోలుకున్నారని, 32 మంది మృతి చెందారని అన్నారు. ఈ నెల మొదటి వారంలో కరోనా బారిన పడి ఆసుపత్రులలో చేరిన వ్యక్తులు కోలుకుంటున్నారని, రెండు మూడ్రోజుల్లో డిశ్చార్జి కానున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పారు.

మూడు నెలల వ్యవధి కావాలన్న సర్కారు వాదనను తిరస్కరించిన ఏపీ హైకోర్టు 

* పార్టీ రంగుల తొలగింపు కేసులో మరోసారి  చుక్కెదురు! ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో మారు షాక్ తగిలింది. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వేసిన పార్టీ రంగులు తొలగించేందుకు మూడు నెలల సమయం కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. మూడు నెలల గడువు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పంచాయతీ భవనాలకు కొత్త రంగులు వేసేందుకు ఎంత సమయం పడుతుందో సోమవారం రోజున చెబుతామని న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు పార్టీల రంగులు వేయ‌డం వివాదాస్ప‌దంగా మారిన విషయం తెలిసిందే.  పంచాయతీరాజ్ శాఖ అధికారులు గ‌త ఏడాది ఆగ‌స్టులో జారీ చేసిన మెమోను లోగడ హైకోర్టు కొట్టివేసింది. అదే స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీల‌కు సంబంధం లేని రంగుల కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాల‌ని సీఎస్‌ని ఆదేశించింది. ప‌ది రోజుల్లోగా ఈ ప్ర‌క్రియ పూర్తి చేయాలని ఇంతకుముందే నిర్దేశించింది. దాంతో అధికారంలో ఉన్న పార్టీల రంగుల‌ను ప్ర‌భుత్వ భ‌వనాల‌కు వేయ‌డం వల్ల.. ఇప్పుడు వాటిని మార్చాల్సి వస్తోందని.. ఫలితంగా ప్ర‌జాధానం వృధా అవుతోంద‌ని ప్ర‌తిప‌క్షాల‌తో పాటు వివిధ రంగాల నిపుణులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం పలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. స్థానిక ప‌రిపాల‌నా వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామ స‌చివాల‌యాలు, వార్డు స‌చివాల‌యాలను ప్ర‌వేశ‌పెట్టింది. రాష్ట్రంలో 17,367 గ్రామాలుండ‌గా, 12,918 గ్రామ‌పంచాయతీలు ఉన్నాయి. న‌గ‌ర పాల‌క‌సంస్థ‌లు, పుర‌పాల‌క సంఘాలు, న‌గ‌ర పంచాయతీలు క‌లిపి మ‌రో 195 ఉన్నాయి. వాటిని ప్ర‌తి 2,000 జ‌నాభాకు ఒక‌టి చొప్పున విభ‌జించి 11,114 గ్రామ స‌చివాల‌యాలు, 3,775 వార్డు స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేసింది. కొత్త‌గా ఏర్పాటు చేసిన వార్డు, గ్రామ స‌చివాల‌యాల‌ కోసం వివిధ ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు. మ‌రికొన్ని చోట్ల అద్దె భ‌వ‌నాల్లో కూడా ఏర్పాటు చేశారు. అయితే పంచాయతీ కార్యాల‌యాల‌తో పాటుగా కొత్త‌గా ఏర్పాటు చేసిన ఈ స‌చివాల‌యాల‌న్నింటికీ మూడు రంగుల‌ను వేయించాల‌ని పంచాయతీరాజ్ శాఖ అధికారులు 2019 ఆగ‌స్టు 11న మెమో రూపంలో ఉత్త‌ర్వులు ఇచ్చారు. అవి కూడా అధికార పార్టీ రంగులు కావ‌డంతో కొంద‌రు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. వాటిని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకున్న దాఖ‌లాలు లేవు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా నాటి అధికార పార్టీ టీడీపీ జెండా రంగుల‌ను అనేక చోట్ల ప్రభుత్వ భవనాలకు వేయించారు. అన్న క్యాంటీన్ల వంటివి స్ప‌ష్టంగా కనిపించాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో 534 పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాలలో మూడు చొప్పున కొత్తగా 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 534 కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 58, కృష్ణా జిల్లాలో 48, ప్రకాశం జిల్లాలో 42,  వైయస్సార్‌ కడప జిల్లాలో 36, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 34, చిత్తూరు జిల్లాలో 23, విశాఖపట్నం జిల్లాలో 20, అనంతపురం జిల్లాలో 21, తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు. కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 20 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. విశాఖపట్నం జిల్లాలో 10 మంది, కృష్ణా జిల్లాలో 4గురు, తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు.. మొత్తం 20 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 500 మంది చికిత్స పొందుతున్నారు.మరోవైపు ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. గుంటూరు, కృష్ణా జిల్లాలలో 4గురు చొప్పున, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున చనిపోయారు.

నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారం లో హైకోర్టును రెండు రోజులు గడువు కోరిన ఏపీ ప్రభుత్వం

ఎలక్షన్ కమిషనర్ తొలిగింపు వ్యవహారం లో ప్రమాణ పత్రం దాఖలు చేసేందుకు రెండు రోజులు అదనపు సమయం కావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టునుకోరింది. శనివారం వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యర్ధించారు. రిజిస్ట్రార్ జ్యుడీషియరికి మెయిల్ ద్వారా అడ్వొకేట్ జనరల్ ఈ విషయం తెలిపారు. తమముందు ఉన్న అవకాశాల ద్వారా కోర్టులో వాదనలు వినిపించేందుకు గడువు కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వై ఎస్ ఆర్ సి పి కూడా పార్టీ పరంగా ఈ  విషయం లో పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే, విజయసాయి రెడ్డి -డి జి పి కి ఒక లేఖ రాస్తూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతకాన్ని తెలుగుదేశం నాయకులు ఫోర్జరీ చేశారనీ, ఆ లేఖలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలనీ కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మరో వైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందనే విమర్శలు అన్ని విపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. అయితే విమర్శల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వం దురుద్దేశపూరితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందనే వాదనకు మద్దతుగా న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనది ఆర్ఢినెన్స్ లో కొన్ని కీలక అంశాలను విస్మరించడంతో పాటు అప్పటికే పదవిలో ఉన్న వ్యక్తికి కొత్త నిబంధనల వర్తింపు వంటివి కూడా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కోసం జారీ చేసిన ఆర్డినెన్స్ లో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. అయితే ఇందులో ఒక అంశానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా రెండో అంశం మాత్రం కచ్చితంగా నిమ్మగడ్డను టార్గెట్ చేసి పెట్టిందే అనే భావన న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. కమిషనర్ పదవీకాలం సవరణ చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగో ఉంది. ఈ విషయంలో నిమ్మగడ్డకు ఎలాంటి రాజ్యాంగ రక్షణ లభించబోదు. అయితే ఆయన సర్వీసు రూల్స్ లో మార్పులు చేసే విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ లో ప్రస్తావించిన సర్వీస్ రూల్స్ మార్పు వ్యవహారం కొత్త కమిషనర్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిందే. అయితే ఈ నిబంధన విషయంలో రాజ్యాంగంలో ఉన్న అర్ధం ప్రకారం ప్రస్తుత కమిషనర్ సర్వీస్ రూల్స్ ను మార్చడం ద్వారా ఆయనకు నష్టం కలిగేలా చేయరాదన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్టికల్ 243లోని పదవీకాలం నిబంధన మాత్రమే వాడుకుని నిమ్మగడ్డను తొలగించింది.

ఏపీ రెడ్ జోన్లను కేంద్రం నమ్మలేదా? హాట్ స్పాట్ల ప్రకటన వెనుక కథేంటి?

ఏపీలో కరోనా వైరస్ ప్రభావాన్నితక్కువ చేసి చూపేందుకు ముందునుంచీ ప్రయత్నిస్తున్న సీఎం జగన్.. రెడ్ జోన్ల ఎంపిక కూడా అదే తరహాలో చేశారనే వాదనలు ఉన్నాయి. ఇందుకు తగినట్లుగానే రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయాలన్న ఆలోచన కూడా జరిగిందనే వాదన ప్రభుత్వ వర్గాల్లో వినిపించింది. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్యనే తక్కువ చేసి చూపుతున్నారని విపక్ష టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో రెడ్ జోన్ల ఎంపిక ద్వారా లాక్ డౌన్ ప్రభావాన్ని తగ్గించాలని జగన్ సర్కార్ భావించింది. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టినట్లు తాజాగా కేంద్రం చేసిన హాట్ స్పాట్ల ప్రకటనతో అర్ధమవుతోంది. దేశవ్యాప్తంగా హాట్ స్పాట్ లను ప్రకటించిన కేంద్రం.. ఈ నెల 20 తర్వాత వాటిలో మినహా మిగిలిన చోట్ల సడలింపులు ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. ఇందులో భాగంగా ఏపీలో మొత్తం 13 జిల్లాలు ఉంటే ఏకంగా 11 జిల్లాలను హాట్ స్పాట్లుగా ప్రకటించింది. ఏపీలో అంతకుముందే కరోనా వైరస్ పాటిజివ్ కేసులు నమోదైన 133 ప్రాంతాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించి చేతులు దులుపుకుందామని భావించిన జగన్ సర్కారుకు కేంద్రం చేసిన హాట్ స్పాట్ల ప్రకటన మింగుడు పడటం లేదనే చెప్పవచ్చు. రెడ్ జోన్లలో లాక్ డౌన్ ఉంచి మిగతా ప్రాంతాల్లో ఏప్రిల్ 14 తర్వాత సడలించాలని భావించిన జగన్ సర్కారు.. ఇప్పుడు కేంద్రం చేసిన ప్రకటనతో కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతోందని అర్ధమవుతోంది. అలాగని కేంద్రంతో ఘర్షణకు దిగే పరిస్ధితి లేదు. కాబట్టి ఏప్రిల్ 20 తర్వాత హాట్ స్పాట్లుగా గుర్తించిన 11 జిల్లాలు మినహాయించి కేవలం శ్రీకాకుళం, విజయనగరం రెండు జిల్లాల్లోనే లాక్ డౌన్ ను సడలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అలాగని అక్కడా పూర్తి స్ధాయిలో లాక్ డౌన్ సడలించే పరిస్ధితి లేదు. కేవలం పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు, మైనింగ్ వంటి వాటికే అనుమతులు ఇవ్వడం ద్వారా తనకు అనుకూలమైన పరిస్ధితిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

700కు పెరిగిన పాజిటివ్ కేసులు! ఈనెల 20న గచ్చిబౌలి కోవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం!

తెలంగాణలో ఈరోజు కొత్త‌గా మ‌రో 50 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దీంతో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కి చేరిందని వైద్య, ఆరోగ్యం శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 68 మందిని ఈ రోజు డిశ్చార్జ్ చేసినట్ల మంత్రి తెలిపారు. ఈనెల 20న గచ్చిబౌలిలో కోవిడ్‌ ఆస్పత్రి ప్రారంభిస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.  ఢిల్లీ మర్కజ్ ప్ర‌కంప‌న‌లు తెలంగాణాలో క‌ల‌క‌లం రేపుతూనే వున్నాయి. ఇప్ప‌ట్టి వ‌ర‌కు తెలంగాణాలో వ‌చ్చిన 700 పాజిటివ్ కేసుల్లో 500కు పైగా మ‌ర్క‌జ్ మూలాల‌కు సంబంధించిన‌వేన‌ని మంత్రి ఈట‌ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతూనే వున్నాయి. అయితే వీటిలో 90 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదౌతున్నాయి. క‌రోనా కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు భావిస్తుండగా.. ఒక్క రోజే ఇన్ని కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే గురువారం ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణాలో 496 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులపై కేబినెట్‌ భేటీ తర్వాతే స్పష్టత వస్తుంద‌ని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో మరో రెండు ల్యాబ్‌లకు అనుమతి వచ్చిందని, దీంతో రోజుకు 5వేల టెస్ట్‌లు చేసే సామర్ధ్యం వస్తుంద‌ని మంత్రి ఈటెల తెలిపారు. వైద్య సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బందికీ రక్షణ పరికరాలు ఇస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు.

పేదల కష్టాలు తీర్చండి! టిడిపి నేత కోటంరెడ్డి!

ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయ‌లు, మూడు నెలలు ఉచితంగా కరెంట్ సరఫరా, అలాగే 3 నెలల పాటు ఉచితం గా వంట గ్యాస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టిడిపి నేత కోటంరెడ్డి డిమాండ్ చేశారు. మీరేమో లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు, పేదోళ్లకు మాత్రం రూ.5 వేలు ఇవ్వలేరా అంటూ ముఖ్య‌మంత్రి జగన్ ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరులోని తన నివాసంలో ఒక‌ రోజు దీక్షను చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తరుణంలో ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.  లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఐదు వేల రూపాయలు అందివ్వాలని , రెడ్ జోన్ ప్రాంతాల్లో నిత్యావసర సరకులు ఉచితంగా పంపిణీ చేయాలని, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే బిల్లులను రద్దు చేయాలని, ఉచితంగా గ్యాస్ అందించాలని ఈ సందర్భంగా కోటంరెడ్డి డిమాండ్ చేశారు.  ఒక్క రోజు దీక్ష చేపట్టిన కోటంరెడ్డికి సంఘీభావంగా పలువురు టిడిపి నేతలు వారి నివాసానికి చేరుకుని మద్దతు తెలిపారు. భౌతిక దూరం పాటించి దీక్షలో పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై పరోక్ష సేవలకు శ్రీకారం చుట్టిన కనకదుర్గమ్మ దేవస్థానం

భక్తుల సౌకర్యార్ధం, ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో జరిగే రుద్ర హోమము, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలను పరోక్షముగా భక్తుల గోత్ర నామాలతో జరిపించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. దేవ స్థానంలో అమ్మవారికి, స్వామివార్లకు జరుగు నిత్యకైంకర్యాలు అన్నీ కూడా ఏకాంత సేవలుగా యధాప్రకారం ఆలయ అర్చకులు నిర్వహిస్తారని ఆలయ  కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు తెలిపారు. దేశం లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానం లో జరిగే,  నిత్య ఆర్జిత సేవలలో, భక్తులు ప్రత్యక్షం గా  పాల్గొనే  అవకాశము లేనందువల్ల,  అన్ని సేవలు ఆలయ అర్చకులుచే  ఏకాంత  సేవలుగా  నిర్వహిస్తున్నట్టు అయన చెప్పారు.  ఈ పరోక్ష  చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలను పరోక్షంగా   జరిపించుకోనదలచిన  భక్తులు టిక్కెట్లు  www.kanakadurgamma.org– website ద్వారా పొందవచ్చునని  ఆలయ కార్యనిర్వహణాధికారి చెప్పారు. దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యములో విజయవాడ నగరంలో ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న రోడ్లపై నివసిస్తున్న యాచకులు, పేద వారు, ఇతరులకు ఆహారం అందించాలన్నఉద్దేశ్యంతో, దేవస్థాన నిత్యాన్నదాన ట్రస్ట్ విభాగం ద్వారా ప్రతి రోజు కదంబం, దద్దోజనం(పెరుగన్నం) ప్యాకెట్లను వీ ఎం సి సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తున్నామని చెప్పారు.   దేవస్థానం జరిపే అన్నదాన కార్యక్రమమునకు విరాళాలు ఇవ్వదలచిన భక్తులు దేవస్థానం వారి వెబ్సైటు www.kanakadurgamma.org  ద్వారా ,  లేదా eosdmsd@sbi అను BHIM UPI ద్వారా QR code ను స్కాన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా విరాళములు పంపవచ్చని కార్యనిర్వహణ అధికారి పేర్కొన్నారు.

కడప జిల్లాలో ఆ 30 మంది మాటేమిటి?

కడప జిల్లా వ్యాప్తంగా 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారిలో కరోనా వైరస్ నుండి పూర్తిగా 13 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. కానీ, ఒక కల్యాణ మండపం లో దాచిపెట్టిన ఆ 30 మంది గురించి మాత్రం వారు  నోరు మెదపటం లేదు.  గత 17 రోజులుగా కోవిద్ హాస్పిటల్ లో చికిత్స పొందిన 13 మంది కి వైద్యులు పలు మార్లు పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ రావడంతో కోవిద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాఋ. డిశ్చార్ అయిన13 మందికి  డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పౌష్టిక ఆహార సామగ్రిని పంపిణీ చేశారు. 13 మందికి నెగెటివ్ రిపోర్ట్ రావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. దీంతో36 నుండి 23 కు  పాజిటివ్ కేసులు తగ్గినట్టయింది.

లాక్‌డౌన్‌ శాశ్వత పరిష్కారం కాదు! రాహుల్ ఆవేదన

ప్రస్తుతం దేశంలో  చాలా తక్కువ మందికి మాత్ర‌మే పరీక్షలు చేస్తున్నారు. దీని సంఖ్యను భారీగా పెంచాల్సి ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడాలి. కరోనా పరీక్షలు వ్యూహాత్మకంగా జరగట్లేదు. కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచ‌డ‌మే మనముందున్న ఏకైక‌ మార్గం. ర్యాండమ్‌ పద్ధతిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. దేశంలో రెండు జోనులు ఏర్పాటు చేయాలి.. ఒకటి హాట్‌స్పాట్‌, మరొకటి నాన్‌ హాట్‌స్పాట్‌ జోన్. ఆ తర్వాత ఆయా జోనుల్లో పలు చర్యలు తీసుకోవాలి" అని రాహోల్ గాంధీ సూచించారు. లాక్‌డౌన్ తో దినసరి కూలీలు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.  చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రణాళికలు రచించాలి. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమయ్యేలా చేయకూడదు" అని రాహుల్ అన్నారు. లాక్‌డౌన్ తో వైరస్ ను తాత్కాలికంగా వ్యాప్తి చెందకుండా క‌ట్ట‌డి చేయ‌డానికి ఉప‌యోగించే తాత్కాలిక పద్ధతి. ఇప్ప‌ట్టికైనా ప్ర‌భుత్వం విస్తృత‌స్థాయిలో టెస్ట్‌ల‌ను నిర్వ‌హించాల‌ని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు.

తిరుమల వీధుల్లో ఎలుగుబంట్లు

తిరుమలేశుని సన్నిధిలో క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం శ్రీవారి సన్నిధి ఆనందనిలయం చెంత అడవి పందులు సంచారం చేయగా తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు యధేచ్ఛగా తిరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  తిరుమలేశుని సన్నిధిలో క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం శ్రీవారి సన్నిధి ఆనందనిలయం చెంత అడవి పందులు సంచారం చేయగా తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు యధేచ్ఛగా తిరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాన రోడ్లకు అడ్డంగా ఎలుగు బంట్ల సంచరిస్తుండడం గమనించిన కొందరు ఈ వీడియోలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తిరుమలలో గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో భక్తుల దర్శనాలు నిరవధికంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. తొలుత వారం రోజుల పాటు దర్శనాలు రద్దు చేసి, ఓన్లీ స్వామి వారి కైంకర్యాలను మాత్రమే నిర్వహించిన టీటీడీ ఆ తర్వాత కేంద్రం లాక్ డౌన్ పొడిగించినప్పుడల్లా భక్తుల దర్శనాల రద్దును పొడిగిస్తూ వస్తోంది. తాజాగా ఈ దర్శనాల రద్దు మే 3వ తేదీ వరకు కొనసాగుతుందని టీటీడీ ప్రకటించింది. ప్రతి నిత్యం వేలాది మంది భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల రోడ్లన్నీ ఇపుడు నిర్మానుష్యంగా మారాయి. కొండమీద నివాసముండే వారికి సైతం లాక్ డౌన్ ఆంక్షలు వుండడంతో రోడ్లమీద జన సంచారం లేకుండా పోయింది. ఈక్రమంలో సమీపంలోని చిట్టడవుల నుంచి కొన్ని జంతువులు తిరుమల వీథులకు యధేచ్ఛగా వచ్చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆనందనిలయం ముందుకు పందులు రాగా.. తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు సంచారం చేశాయి.

స్వరూపానంద చొరవ.. వారణాసి నుంచి స్వస్ధలాలకు 44 మంది తెలుగు వారు..

తెలుగు రాష్ట్రాల నుంచి తీర్ధ యాత్రల కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ వెళ్లిన 44 మంది తెలుగు యాత్రికులు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వీరి పరిస్ధితిని గమనించిన వారణాసిలోని శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం నిర్వాహకులు వీరీకి ఆశ్రయం కల్పించారు. అంతటితో ఆగకుండా వీరిని స్వస్ధలాలకు పంపేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు ప్రారంభించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర లతో మాట్లాడిన ఆశ్రమ నిర్వాహకులు సుందరశాస్త్రి.. వారి సాయం కోరారు. అసలే లాక్ డౌన్, వలస కూలీలను సైతం అనుమతించలేని పరిస్ధితి. అయినా వెనక్కి తగ్గలేదు.  వారణాసిలోని ఆంధ్ర ఆశ్రమంతో పాటు శారదాపీఠం వారణాసి శాఖ సంయుక్తంగా చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించాయి. మూడు వారాల ఇబ్బందుల తర్వాత వారిని స్వస్ధలాలకు పంపేందుకు ప్రభుత్వాలు అంగీకరించాయి. అయితే దారి పొడవునా ఇబ్బందులు, ఆహారం సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆశ్రయ నిర్వాహకులే వీరికి మార్గమధ్యంలో ఆహార కొరత లేకుండా భోజన ప్యాకెట్లను తయారు చేసి యాత్రికులకు అందించారు. యూపీ ప్రభుత్వం తరఫున పోలీసులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. దీంతో వీరు అక్కడి నుంచి స్వస్ధలాలకు బయలుదేరారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను స్వస్ధలాలకు చేర్చేందుకు శారదాపీఠాధిపతులు చూపిన చొరవపై ఇప్పుడు ప్రసంశల జల్లు కురుస్తోంది.

ట్రంప్ టీమ్‌లో తెలుగోళ్లు! కరోనాపై పోరుకు యాక్ష‌న్‌ప్లాన్‌!

కరోనా దెబ్బ‌తో అతలాకుతలమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ చ‌ర్య‌లు చేప‌ట్టారు. 200 మందికి పైగా అగ్రశ్రేణి లీడర్లు, 12 మందికి పైగా ఇతర నిపుణులతో వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేశారు. వీరంతా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలనే దానిపై సూచ‌న‌ల‌ను అందించనున్నారు.  వీరిలో భారత సంతతికి చెందిన ఐటి, కార్పొరేట్ దిగ్గజాలు చోటు ద‌క్కింది. ఈ టీంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లతో సహా ఆరుగురు భారతీయ-అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలను ట్రంప్ ఎంపిక చేశారు. ఈ నిపుణులు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రణాళికలను, సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారని ట్రంప్ ప్రకటించారు. సుందర్ పిచాయ్, నాదెళ్లతో పాటు ఐబిఎం సిఇఒ అరవింద్ కృష్ణ, మైక్రాన్ సిఇఒ సంజయ్ మెహ్రోత్ర ఉన్నారు. వీరంతా సమాచార సాంకేతిక రంగం ఎదుర్కొంటున్నసమస్యలపై పరిష్కారాపై పనిచేస్తారు.  ఉత్పత్తి రంగం పునరుత్తేజ సూచనలిచ్చే బృందానికి పెర్నాడ్ రికార్డ్ బివరేజ్ కంపెనీ సిఇఒ ఆన్ ముఖర్జీని ఎంపిక చేశారు. మాస్టర్ కార్డ్‌కు చెందిన అజయ్ బంగా ఆర్థిక రంగ పునరుద్ధరణ బృందంలో ఉన్నారు.  వ్యవసాయ, బ్యాంకింగ్, నిర్మాణ, కార్మిక, రక్షణ, ఇంధన, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, పర్యాటక, తయారీ, రియల్ ఎస్టేట్, రిటైల్, టెక్, టెలికమ్యూనికేషన్, రవాణా, క్రీడలు ఇలా వివిధ టీంలను ట్రంప్ ఏర్పాటు చేశారు. సంబంధిత రంగాలకు సంబంధించి ఈ బృందం సలహాలను అందివ్వనుంది. ఆపిల్ సిఇఒ టిమ్ కుక్, ఒరాకిల్ లారీ ఎల్లిసన్, ఫేస్ బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ , టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్, ఫియట్ క్రిస్లర్ మైక్ మ్యాన్లీ, ఫోర్డ్ కు చెందిన బిల్ ఫోర్డ్, జనరల్ మేరీ బార్రా లాంటి దిగ్గజాలు కూడా ట్రంప్ సలహా బృందం లో ఉన్నారు.  ఆరోగ్యం, సంపద సృష్టి తో పాటు అమెరికన్ ఆర్థిక వ్యవస్థను  పునరుద్ధరించ‌డానికి ఈ నిపుణుల బృందం త‌మ సూచ‌న‌ల‌తో కూడిన నివేదిక ఇస్తుంద‌ని వైట్ హౌస్ తెలిపింది.

మోదీజీ ఇప్పటికైనా ప్రజారోగ్య వ్యవస్థను ప‌ట్టించుకోండి!

కోవిడ్‌-19 నివారణ, చికిత్సలకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు ఏమిటి? లాకౌడౌన్‌ కొనసాగింపు మినహా కేంద్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేయటానికి అమలు చేస్తున్న నిర్దిష్ట వ్యూహం, చర్యలు ఏమీ లేవు! కరోనాపై సాగే పోరాటం కేవలం ప్రజలే బాధ్యతతో చేయాల్సిన పోరాటంగా పరిమితం చేయాలన్నది ప్రధానమంత్రి వ్యూహంగా కనిపిస్తోంది. కేవలం లాక్‌డౌన్‌ ద్వారా మాత్రమే భారతదేశంలో కరోనా నియంత్రణ సాధించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే హెచ్చరించింది. లాక్‌డౌన్‌ తాత్కాలిక వ్యూహంగా మాత్రమే ఉండాలని, ప్రధాన నియంత్రణ వ్యూహాలుగా ట్రెసింగ్‌, టెస్టింగ్‌ అండ్‌ ట్రీట్మెంట్‌ అంటే గుర్తించటం, రోగ నిర్ధారణ పరీక్షలు చేయటం, నిర్ధారణ అయిన వారిని క్వారంటాయిన్‌లో ఉంచి చికిత్స అందించడం ద్వారా మాత్రమే కోవిడ్‌-19ను పూర్తి స్థాయిలో అదుపు చేయగలుగుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. దీనిగురించి ఎక్క‌డా ప‌ట్టించుకున్న ద‌ఖ‌లాలు లేవు.  ప‌దే ప‌దే ప్ర‌ధాని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రజలదే అంటూ నొక్కివక్కాణించారు తప్ప ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసి కరోనాను కట్టడి చేయటానికి అనుసరించబోతున్న వ్యూహం, దాని అమలుకు కావలసిన విధానాలు, నిధులు గురించిన ప్రస్తావన ప్రధానమంత్రి ఎక్క‌డా చేయలేదు. 200 లాబోరేటరీలు కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగంలో చెప్పారు. అయితే ఇందులో ప్రయివేటు లాబోరేటరీలు ఎన్ని, వాటిలో పరీక్షలకు అయ్యే ఫీజు పరిస్థితి ఏమిటన్న విషయంపై వివరణ ఇవ్వ‌లేదు. ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు చేయాలని సూచించిన సుప్రీంకోర్టు మ‌ళ్లీ మనసు మార్చుకొని పేదలకు మాత్రమే అందించాలని ప్రయివేట్‌ లేబరేటరీలు తాము నిర్ధారించుకున్న ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. వాస్త‌వానికి భారతదేశంలో మొదటి కోవిడ్‌-19 కేసు జనవరి 30న నమోదైంది. 13 మంది కోవిడ్‌-19 రోగ గ్రస్తులైన ఇటలీ పర్యాటకులు రాజస్థాన్‌లో పర్యటించారు. వారితో పాటు ప్రయాణం చేసిన డ్రైవర్‌కు కూడా కోవిడ్‌-19 సోకినట్టు నిర్ధారణ అయిందని ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మార్చి 4న పార్లమెంట్‌లో చెప్పారు.  అప్పటి నుంచి కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణీకుల శరీర ఉష్ణోగ్రతలు చెక్‌ చేసారే తప్ప ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ప్రమాణాల మేరకు పరీక్షలు చేయ‌లేదు. ప్రపంచ స్థాయిలో కమ్ముకొస్తున్న కరోనా ముప్పు నియంత్రణ బాధ్యత కూడా ప్రజలదే అని మోదీ ప్ర‌భుత్వం బుకాయిస్తోంది.  కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వివిధ సుంకాలపై వసూలు చేసిన సెస్‌ రెండున్నర లక్షల కోట్లు ఖర్చు కాకుండా మిగిలి ఉంది.  మరో 20లక్షల కోట్లు ఈ ఆరున్నరేండ్లలో పెట్రోలియం ఉత్పత్తులపై వసూలు చేసిన పన్నులున్నాయి.  కాంగ్రెస్‌ హయాంలో జరిగిన 2జీ స్పెక్త్రం కుంభకోణాన్ని సరి చేయటం ద్వారా కేంద్రానికి రెండు లక్షల కోట్లు ఆదా చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు తనఖా పెట్టి గత ఒక్క ఏడాదిలోనే 35వేల కోట్లు నిధులు సమకూర్చుకుంది కేంద్రం.  అదనంగా ఆర్‌బీఐ బాండ్లు విదేశీ మార్కెట్‌లో జారీచేసి రెండు లక్షల కోట్లు సమీకరించేందుకు పథకం సిద్ధమైంది.   ఇన్ని నిధులున్నా క‌రోనా ర‌కాసి నుండి 130కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిధులు ఎందుకు సిద్ధం చేయలేక పోతోంది మోదీ ప్ర‌భుత్వం.