కేంద్రం ప్రకటించిన సడలింపులు తెలంగాణాలో అనుమతించం!
posted on Apr 19, 2020 @ 8:36PM
ఈ రోజు కూడా 18 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 858 మంది. ఇప్పట్టి వరకు 21 మంది మృతి చెందారు. 186 మంది పూర్తిగా కోలుకున్నారు. 651 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణాలో నాలుగు జిల్లాల్లో అసలు కేసులే నమోదు కాలేదు. దేశంలో డబుల్ కావడానికి 8 రోజులైతే. తెలంగాణాలో 10 రోజులకు పేషంట్ల సంఖ్య డబుల్ అయింది. మిలియన్ మందిలో దేశంలో 254 మందికి టెస్ట్ చేస్తుంటే తెలంగాణాలో 375 మందికి టెస్ట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు.
ప్రారంభంలో మెడికల్ సదుపాయాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో అవసరమైన మెడికల్ సదుపాయలు, కిట్స్, మాస్కలు, ఎక్విప్‌మెంట్ పూర్తి స్థాయిలో వుంది. అవసరమైన మందులన్నీ అందుబాటులో వున్నాయి. ముఖ్యంగా గర్భిణీలకోసం అమ్మ ఒడి వాహనాల్ని సిద్ధంగా వుంచాం. తలసేమియా పేషంట్లకు రక్త కొరత లేకుండా చూసుకుంటున్నాం. ప్రస్తుతం 42 దేశాలు సంపూర్ణ లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. చైనా 77 రోజులు లాక్ డౌన్ పాటించిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తెలంగాణాలోనూ లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 3వ వరకు కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్రం కొన్ని విషయాల్లో సడలింపులిచ్చింది. అయితే తెలంగాణాలో వున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సడలింపులకు తెలంగాణాలో అనుమతించరాదని క్యాబినెట్ లో నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.