విశాఖ కరోనా కేసుల లెక్కపై భిన్నాభిప్రాయాలు.. కావాలనే దాస్తున్నారా?

ఏపీ కొత్త రాజధానిగా ప్రభుత్వం ఎంపిక చేసిన విశాఖపట్నంలో పది రోజులుగా ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్మగలరా ? అవును ఇదే నిజమంటోంది వైసీపీ సర్కారు. అంతర్జాతీయ విమానాశ్రయం కలిగిన విశాఖపట్నంలోనే కరోనా తొలి నాళ్లలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా నమోదవుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటివరకూ సాగర తీరంలో నమోదైన కేసుల సంఖ్య 20 మాత్రమే. అందులోనూ 10 మంది ఇప్పటికే చికిత్స పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. మరో పది మంది మాత్రమే ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స తీసుకుంటున్నారు. రేపోమాపో వీరిని కూడా విడుదల చేసే అవకాశముంది.  విశాఖపట్నంలో కొత్త రాజధాని రాబోతున్న నేపథ్యంలో అంత కంటే ముందే వచ్చేసిన కరోనా వైరస్ ప్రభావాన్ని ఎలా తగ్గించాలా అని ఏపీ ప్రభుత్వం ఆలోచించని రోజు లేదు. ఇప్పటికే అక్కడ విమ్స్ ప్రత్యేక కోవిడ్ 19 ఆస్పత్రితో పాటు క్వారంటైన్ చర్యలు కూడా ఘనంగా సాగుతున్నాయి. దీంతో అక్కడ నిత్యం ఒక్క కొత్త కేసు కూడా నమోదు కావడం లేదు. ఇదీ వైసీపీ ప్రభుత్వ వాదన. కానీ అక్కడ పరిస్ధితి అంత గొప్పగా ఉందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్దితి. నిన్నటికి నిన్న కేజీహెచ్ లో పేషెంట్లకు కరోనా చికిత్స అందిస్తున్న ఐదుగురు నర్సులకు కోవిడ్ 19 లక్షణాలు కనిపించాయి. వీరికి నిబంధనల ప్రకారం రోజువారీ డ్యూటీలు చేయించాల్సి ఉండగా, అదనపు గంటలతో పాటు అదనపు రోజుల్లోనూ సేవలకు వాడుకుంటున్నారు. దింతో వీరికి కోవిడ్ 18 లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు. పని చేయకపోతే ఉద్యోగాలు పోతాయన్న భయంతో నర్సులు రోజువారీ విధులకు హాజరవుతూ కరోనా బారిన పడినట్లు స్ధానికంగా ప్రచారం జరుగుతోంది. ఇదే కోవలో విశాఖ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ లక్షణాలతో జనం ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కొత్త కేసే నమోదు కాలేదని చెబుతోంది. ఇదే అంశంపై ఇవాళ మాట్లాడిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం ప్రభుత్వ లెక్కలపై అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. త్వరలో విశాఖకు రాజధానిని తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం కావాలనే కరోనా ప్రభావాన్ని తక్కువ చేసి చూపుతోందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. స్ధానికంగా జరుగుతున్న ఇతర పరిణామాలను బట్టి చూసినా ప్రభుత్వ వాదనపై అనుమానాలు తప్పడం లేదు. కానీ రాష్ట్రంలోనే కరోనా లేదని చెప్పే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నియంత్రణ చర్యలకు దిగినట్లు.. విశాఖలోనూ పరిస్ధితి అదుపు తప్పితే అప్పుడు వాస్తవాలు ఒప్పుకోక తప్పదనే వాదన వినిపిస్తోంది. 

కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ లో లేరా, అంటూ బొత్స సెటైర్లు!

* విశాఖలో కరోనా రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారా..?కరోనా కేసులను మేం దాస్తే.. చంద్రబాబు బయటపెట్టొచ్చుగా..? ఏంటండి ఈ మాటలు: బొత్స  * ప్రజల్లో ఆందోళన పెంచే విధంగా చంద్రబాబు కామెంట్లు చేస్తున్నారు: బొత్స  * రాయపాటి ఈరోజు ఒకటి మాట్లాడతారు...తర్వాత నా భావం అదికాదంటారు....అతనేదో ఓ భావం చెబితే మనం కరెక్ట్ గా రియాక్ట్ అవ్వచ్చు కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నారా, లేరా అనే డౌట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సడెన్ గా వచ్చింది.  కరోనా పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై  శ్వేతపత్రం ప్రకటించాలని రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారనే అంశాన్ని, బొత్స ముందు ప్రస్తావించగా, ఆయన పై విధంగా స్పందించారు.  " ప్రతిరోజు కరోనా నియంత్రణ చర్యలు, ఇతర అంశాలపై ప్రభుత్వం వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడి చేస్తోంది. కన్నాలక్ష్మీనారయణగారు ఈ రాష్ట్రం లో లేరా", అని మంత్రి బొత్సవ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం,వ్యవసాయఉత్పత్తులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా మధ్దతు,గిట్టుబాటుధరలు వచ్చేవిధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, కరోనా లాక్ డౌన్ అంశంలో కేంద్రప్రభుత్వంతో రాష్ట్ర అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా టెస్టుల సామర్ధ్యం పెంచుకున్నాం.ఫిబ్రవరి లో 50 మందికి కూడా టెస్ట్ లు చేసే సామర్ధ్యం లేని పరిస్దితినుంచి నేడు రోజుకు 2 వేల పైబడి నిర్ధారణ టెస్టులు నిర్వహించేలా చేయగలిగామని బొత్స పేర్కొన్నారు. పది నిమిషాల్లో టెస్టు రిజల్ట్స్ వచ్చే ఎక్విప్ మెంట్  సిద్దంగా ఉంది.లక్ష కరోనా టెస్టింగ్ కిట్లను స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలనుంచి తెప్పించి అందుబాటులోకి తెచ్చామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటరీవ్యవస్ద ద్వారా ప్రతి ఇంట్లో ఆరోగ్యపరిస్దితులు తెలుసుకుని, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.  రెడ్ జోన్లలో మందులు,నిత్యావసరాలు,కూరగాయలు అందిస్తున్నాం.నిత్యం ముఖ్యమంత్రి సమీక్షచేస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ రకంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు, టీడీపీ చేసే తప్పుడు ప్రచారం బాధ కలిగిస్తోందని బొత్స వాపోయారు. " పేదల ప్రాణాలతో ఆడుకోవద్దని చంద్రబాబు అంటున్నారు.సూటిగా ఆయనను అడుగుతున్నాను. హైదరాబాదులో కూర్చొన్న చంద్రబాబుకు,ఆయన కుమారుడికి ఏపీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. మీకున్న ఛానల్స్,పత్రికలు రాజకీయకోణంలో ఆలోచన చేస్తున్నారు తప్పితే మరేం చేయడంలేదు.దేశంలో కరోనా టెస్ట్ లు అత్యధికంగా చేస్తున్న ఐదారు రాష్ట్రాలలో ఏపి ఉందా... లేదా... ఇది వాస్తవం కాదా," అని బొత్స ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరి కాదు.పరీక్షల విషయంలో ఏపీ మిగిలిన రాష్ట్రాలకంటే ముందంజలోనే ఉంది. చంద్రబాబు మాట్లాడుతున్నమాటలు దివాళాకోరు రాజకీయాలు కాదా... .ఇక్కడ పొరపాట్లు జరిగాయని చెప్పండి. లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటాం.. కానీ అడ్డగోలుగా రాష్ట్రంలో ఏమీ జరగడంలేదు.. ఏం చేయడం లేదంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. విశాఖలో కరోనా పరీక్షలు చేయడం లేదని....వాస్తవాలు చెప్పడం లేదని ఎందుకంటే.... రాజధానిని అక్కడకు తరలిస్తారని, ఆ ఎఫెక్ట్ పడుతుందనే దిశగా టీడీపీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  " హైదరాబాదులో పాజిటీవ్ కేసులున్నాయని తెలంగాణ రాజధానిని మార్చేస్తారా..?...ముంబైలో పాజిటీవ్ కేసులున్నాయని మహారాష్ట్ర రాజధానిని మార్చేస్తారా..?మీకు ఆలోచన ఉందా...భాధ్యతఉందా...మీరు మనుషులా...విమర్శలు చేసే ముందు అర్ధం ఉండక్కర్లేదా..? కరోనా కేసులు దాచేస్తే.. ఎంత ప్రమాదమో మాకు తెలీదా..? ప్రతి అంశాన్ని సూక్ష్ణస్దాయిలో పరిశీలన చేసి సిఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు," అని బొత్స తీవ్ర స్వరంతో చెప్పారు.  మీ నేతలకు ఏమైంది బుధ్ది....విశాఖలో రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి.పెద్ద పెద్ద ఆస్పత్రులు పది ఉన్నాయి.అక్కడ ఉన్నవాటిని స్టాండ్ బైలో పెట్టాం.అత్యవసరపరిస్థితులు వచ్చినా తట్టుకునేవిధంగా కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని కూడా మంత్రి వివరించారు. పేషంట్లకు ఎలా చికిత్స అందించాలి.ఎంతమంది డాక్టర్లు ఉండాలి అనే ఇతర అంశాలను సైతం పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. శాంపిల్ లెక్కలు చెబుతుంటే ఈ లెక్కలకు ఆ లెక్కలకు పొంతనలేదంటూ మాట్లాడుతున్నారు.ఇదేమైనా ఆర్దికలెక్కలా...ఏ ఒక్కరికైనా సరే ఆరోగ్యానికి సంబంధించిగాని,క్వారంటైన్ సెంటర్లలో ఇబ్బందులు ఉంటే అవి మాకు చెప్పండని కూడా బొత్స సూచించారు.

విపత్తు సమయంలో ఏపీ సీఎం ముందుచూపు

* బీమాలో ప్రభుత్వం వాటా వెంటనే చెల్లింపు * రూ. 400 కోట్ల బీమా చెల్లింపునకు జగన్ నిర్ణయం * గత ఏడాది నవంబర్‌ నుంచి క్లెయిమ్‌లను పరిష్కరించని ఎల్‌ఐసీ * ఇప్పటికే పలుమార్లు ప్రధాన మంత్రి సీఎం లేఖలు * ప్రధానమంత్రి నుంచి ఎల్‌ఐసీకి లేఖ * అయినా పరిష్కారానికి నోచుకోని బీమా క్లెయిములు * దీనికోసం పోరాటం కొనసాగిస్తూనే ప్రభుత్వ వాటాను నేరుగా బీమాదారులకు చెల్లించాలని సీఎం నిర్ణయం * రేపటి నుంచి (శనివారం) చెల్లింపులకు నిర్ణయం * ఎల్‌ఐసీ ఇవ్వకుంటే.. మిగిలిన మొత్తాన్ని కూడా రాష్ట్రఖజానానుంచే ఇవ్వాలని సీఎం ఆదేశం విపత్తు సమయంలో  ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బీమా క్లెయిములు ఎల్‌ఐసీ మంజూరుచేయకున్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ నిర్ణయించారు. గడచిన నవంబర్‌ నుంచి పరిష్కారం కాని క్లెయిముల కుటుంబాలకు వెంటనే చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఈమేరకు శనివారం ( రేపటి ) నుంచి డబ్బులను ఆయా కుటుంబాలకు అందించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లాంటి సదుపాయాల్లేని వారు, కూలిపనులు చేసుకునేవారు, చిన్న  జీతాలతో నెట్టుకు వస్తున్న వారు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు  సహజమరణం చెందినా, లేదా ప్రమాదవశాత్తూ మరణించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎల్‌ఐసీ కలిసి బీమాను అందించేవి. వయస్సుల వారీగా, సహజ మరణానికి ఒక తరహా బీమా, ప్రమాదవశాత్తూ మరణిస్తే మరో రకమైన బీమాను చెల్లించేవి. అయితే గడచిన నవంబర్‌ నుంచి ఈ క్లెయిములు పరిష్కారం నిలిచిపోయింది. ఈ అంశంపై వెంటనే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి  4 సార్లు లేఖ రాశారు. ప్రధాని మోదీకూడా ఎల్‌ఐసీకి లేఖరాశారు. అయినా సరే ఇప్పటివరకూ క్లెయిమ్‌లను మంజూరుచేయలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సహజ మరణాలవల్లో, ప్రమాదాల వల్లో పెద్ద దిక్కును కోల్పోయిన ఆయా కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. క్లెయిమ్‌ల మంజూరు కోసం పోరాటం చేస్తూనే, దానితో ఆగిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా సుమారు రూ. 400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.  ఒకవేళ బీమా సంస్థ తాను ఇవ్వాల్సిన దాన్ని చెల్లించకున్నా.., బీమా సంస్థ ఇవ్వాల్సిన మొత్తాన్నికూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాలని సీఎం  నిర్ణయించారు. కరోనా లాంటి విపత్తు నెలకొన్న పరిస్థితుల్లో, ప్రభుత్వం ఆదాయం పడిపోయిన సమయంలోకూడా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీక్షా రాజ‌కీయాలతో వేడిపుట్టిస్తున్న నేత‌లు!

ఓ వైపు కరోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. మ‌రో వైపు రాజ‌కీయ నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌డానికి కారణాలు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా విపక్ష టీడీపీ, సీపీఐ పార్టీల నేతలు కరోనా సాయం పేరిట ఎవరి ఇళ్ళలో వారు ధర్నాలు, దీక్షలంటూ కూర్చుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాలను రక్తికట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలోనూ రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్ర‌చారం చేసుకుంటూ బిజీగా గ‌డ‌ప‌డానికే ఏపీ నేత‌లు ఉత్సాహం చూపుతున్నారు. వీరి నినాదం ఒక్క‌టే పేద‌ల‌కు ఆర్థిక స‌హాయం చేయాలి. క‌రోనాను వెంట‌నే నియంత్రించాలి. ఇదే రాజ‌కీయం. విశాఖ, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ, సీపీఐ నేతలు దీక్షలు నిర్వహించారు. వీరిలో కొందరు పేదలకు కరోనా సాయం కింద 5 వేల నుంచి 10 వేల రూపాయల దాకా ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తే మరికొందరు అఖిల పక్ష సమావేశాలు నిర్వహించి, కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని విఙ్ఞప్తి చేశారు. ఆర్థిక సాయం పేరిట నిరాహార దీక్షలకు దిగుతున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వర రావు తన ఇంట్లోనే 12 గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. రేషన్ కార్డు ఉన్నా, లేకపోయినా పేదలందరికీ 5000 రూపాయలు ఇవ్వాలని, అన్నా క్యాంటీన్లు తెరిచి పేదలకు టిఫిన్, భోజనం అందించాలని, కరోనా వైరస్‌పై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఇతర అధికారులందరికీ నాణ్యమైన రక్షణ కిట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. క్వారెంటైన్ పీరియడ్ పూర్తి చేసిన ప్రతి ఒక్క పేదకు 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్, మాల్యాద్రి నిరాహారదీక్షకు కూర్చున్నారు. లాక్ డౌన్ నేపద్యంలో ఒక్కో పేదవాడికి 10 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలను ప్రారంభించిన ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వీరి దీక్షలను ప్రారంభించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ స్థాయిలో మోదీ అందరితో మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యలను తీసుకుంటుంటే.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఒంటెద్దుపోకడలకు పోతోందని రామకృష్ణ విమర్శించారు.

భారీగా తగ్గిన బంగారం డిమాండ్!

భార‌త్‌లో ఆభరణాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే ప్ర‌తి ఏడాది దాదాపు 800 నుండి 900 టన్నుల బంగారాన్ని భార‌త్ దిగుమతి చేసుకుంటుంది. లాక్ డౌన్ కారణంగా పసిడి వినియోగం తగ్గింది. దాంతో జనవరి-మార్చి క్వార్టర్‌లో బంగారం దిగుమతులు 55% తగ్గాయి. ఈ ఏడాది మన దేశంలో పసిడి వినియోగం గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గనుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ తెలిపారు. గత ఏడాది 690.4 టన్నుల పసిడి వినిమయం ఉండగా, ఈసారి వినియోగం మూడు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. వినియోగం 1991 నాటి 350 టన్నుల నుండి 400 టన్నుల మధ్య పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమయంలో లాక్ డొన్ కొనసాగుతోంది. ప్రస్తుతం బంగారం కొనలేని పరిస్థితులు. బంగారానికి కీలకమైన ఇలాంటి సీజన్‌లో లాక్ డౌన్ ఉండటంతో కొనుగోళ్లు క్షీణించాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 11 శాతం పడిపోయి 35.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయ‌ని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభ‌న్ తెలిపారు.

6,000 కోట్ల ఆదాయం కోల్పోయిన ఏపీ సర్కార్

కరోనా వైరస్ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ ఆదాయానికి భారీగా గండి కొట్టింది. ఆబ్కారీ శాఖలో రూ.1500 కోట్లు, వాణిజ్యశాఖలో రూ.4500 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి ఈ విషయాలను వెల్లడించారు. ఆదాయం కోల్పోయినప్పటికీ, తమ ప్రధమ ప్రాధాన్యం ప్రజారోగ్యమేనని ఆయన స్పష్టం చేశారు.  లాక్ డౌన్ సమయంలో చాలా చోట్ల బార్లకు సంబంధించిన స్టాక్ ను బయట అధికరేట్లకు అమ్ముతున్నారన్న వార్తల నేపథ్యంలో అన్ని బార్లలో, షాపుల్లో స్టాక్ ను తనిఖీ విస్తృతం చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి వస్తే చర్యలకు ఆదేశిస్తామన్నారు. నాటుసారా, ఎన్డీపీఎల్ పై ప్రత్యేక దాడులు నిర్వహించే దిశగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు.   లాక్ డౌన్ సమయంలో 2791 కేసులు, 2849 మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. సుమారు 22 వేల లీటర్ల ఐడీని సీజ్ చేశామని వెల్లడించారు. 2100 కేసులు ఐఎమ్ఎల్, 1500 కేసులు బీర్లు, 1457 కేసులు ఎన్డీపీఎల్ సీజ్ చేశామన్నారు. అదే విధంగా 665 వెహికిల్స్ ను సీజ్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షాపుల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించామన్నారు. ఐడీని నియంత్రించేందుకు పీడీ కేసులు కూడా పెట్టమని చెప్పామన్నారు. బార్లలో అవకతవకలు జరిగితే బార్ లైసెన్స్ రద్దు చేయడానికైనా వెనకాడబోమన్నారు. అదే విధంగా బైండ్ ఓవర్ అమౌంట్ ను పెంచామని చెప్పామన్నారు.  బార్లలో దొంగతనంగా మద్యం అమ్ముతున్నారని వచ్చిన కథనాల్లో వాస్తవం ఉందని, తమ దృష్టికి రాగానే వెంటనే వాటిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్సైజ్, రెవెన్యూ శాఖలు కలిసి విచారణ చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఒక సీఐని, ముగ్గురు ఎస్సైలను, ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని వివరించారు. శాఖాపరమైన విచారణ చేసిన అనంతరం అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే ఉద్యోగాలు తొలగించడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు.

కువైట్ క్షమాభిక్షతో లాభ‌ప‌డ‌నున్న 40 వేల మంది భార‌తీయులు!

కువైట్‌లో 40 వేల మంది భార‌తీయులున్నారు. వీరిలో 25 వేల మంది వ‌ద్ద ఇండియ‌న్ పాస్‌పోర్ట్ లేదు. వీరికి ఎంబ‌సీ ద్వారా తాత్కాలిక పాస్‌పోర్ట్, ఎమ‌ర్జ‌న్సీ స‌ర్టిఫికెట్ ఇస్తున్నారు. దీని కోసం కువైట్ ఐదు దీనార్లు అంటే మ‌న ఇండియాకు చెందిన 1,233 రూపాయ‌లు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే కేంద్ర విదేశాంగ స‌హాయ మంత్రి వి.ముర‌ళీధ‌ర‌న్ ట్వీట్ చేస్తూ ఈ ఫీజును ర‌ద్దుచేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కువైట్ ప్ర‌క‌టించిన క్ష‌మాభిక్ష ద్వారా 40 వేల మంది భార‌తీయుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. అయితే ఇందులో 10 వేల మంది వ‌ర‌కు తెలుగువారు వున్న‌ట్లు అక్క‌డి తెలుగు సంఘాలు తెలుపుతున్నాయి. ఎలాంటి జరీమానాలూ లేకుండా దేశం విడిచి వెళ్ళేందుకు వీలుగా కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్షను ప్ర‌క‌టించింది. అయితే కువైట్‌ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షను దక్కించుకునేందుకు పెద్దయెత్తున భార‌తీయులు లైన్ల‌లో నిల‌బ‌డ్డారు. ఫర్వానియా మరయు జిలీబ్‌ ప్రాంతాల్లో రెండు క్షమాభిక్ష కేంద్రాల్ని భారతీయుల కోసం మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 20 వరకు క్షమాభిక్ష అభ్యర్థనల్ని ఈ సెంటర్స్‌ స్వీకరిస్తాయి. ఉదయం 8 గంటల నంచి 2 గంటల వరకు ఇందుకు అనుమతినిస్తున్నారు. పురుషులు: 1. ఫర్వానియా గవర్నరేట్‌ - ఫర్వానియా ప్రైమరీ స్కూల్‌ - గర్ల్స్‌, బ్లాక్‌ 1, స్ట్రీట్‌ 76 2. జిలీబ్‌ అల్‌ షుయోఖ్‌, నయీమ్ బిన్‌ మసౌద్‌ స్కూల్‌ - బాయ్స్‌, బ్లాక్‌ 4, స్ట్రీట్‌ 250 మహిళలు: 1. ఫర్వానియా గవర్నరేట్‌ - అల్‌ ముథాన్నా ప్రైమరీ స్కూల్‌ - బాయ్స్‌, బ్లాక్‌ 1, స్ట్రీట్‌ 122 2. జిలీబ్‌ అల్‌ షుయోక్‌, రుఫైదా అల్‌ అస్లామియా - గర్ల్స్‌, బ్లాక్‌ 4, స్ట్రీట్‌ 200 చెల్లుబాటయ్యే పాస్‌పోర్టులు వున్న భారతీయులు, ఆయా కేంద్రాల్ని బ్యాగేజ్‌తో సందర్శించాల్సి వుంటుంది. అక్కడ ఏర్పాటు చేసే షెల్టర్స్‌లో తదుపరి ఇన్‌స్ట్రక్షన్స్‌ వరకు వుండేందుకు వీలుగా వెళ్ళాల్సి వుంటుందని ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. వాలీడ్‌ డాక్యుమెంట్స్‌ లేనివారు (మహిళలు, పురుషులు), ఫర్వానియా ప్రైమరీ స్కూల్‌ - గర్ల్స్‌, బ్లాక్‌ 1, స్ట్రీట్‌ 76 వద్ద కేంద్రాన్ని సందర్శించాల్సి వుంటుంది బయో మెట్రిక్‌ ఐడెంటిఫికేషన్‌ కోసం. ఇలాంటివారు ఎలాంటి బ్యాగేజీ తీసుకురావాల్సిన అవసరం వుండదు. వారికి ప్రస్తుతం అక్కడ ఎలాంటి షెల్టర్‌ ఏర్పాటు చేయరు. వాలంటీర్ల ద్వారా ఇసి కోసం దరఖాస్తు చేసుకున్నవారు పై కేంద్రాల్ని సందర్శించాల్సిన అవసరం లేదు. ఇసి పూర్తయ్యాక, దరఖాస్తుదారుల్ని సంబంధిత వాలంటీర్లే సంప్రదిస్తారు. జ‌న‌ర‌ల్‌గా గ‌ల్ఫ్ దేశాల్లో ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లోనే క్ష‌మాభిక్ష ప్ర‌క‌టిస్తారు. స‌డ‌న్‌గా కువైట్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం చాలా మంది తెలుగువాళ్ళ‌ల్లో ఆంధ్ర‌కు చెందిన వారే కువైట్‌లో ఎక్కువ‌గా వున్నాట్లు తెలుగుసంఘాలు తెలుపుతున్నారు.

మోదీకే ఎదురెళ్తున్న కేసీఆర్!

కేంద్రం తాజాగా విడుదల చేసిన లాక్ డౌన్ కు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకూడదు అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది . కెసిఆర్ ఈనెల మొదటిలోనే తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గిపోతుంది అని అంచనా వేశారు. అయితే ఢిల్లీ జమాత్ సంఘటన తర్వాత అంచనాలకు భిన్నంగా హైదరాబాద్ తో పాటు మరిన్ని జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో పాజిటివ్ కేసులు తెర మీదకి వచ్చాయి. నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు మరియు లాక్ డౌన్ మినహాయింపులను తెలంగాణలో అమలు చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే భారత ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా క్షీణించిన పరిస్థితిలో కేంద్ర ప్ర‌భుత్వం వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 వ తేదీన లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలిస్తున్నామంటూ మార్గదర్శకాల‌ను జారీచేసింది. ఇప్పటికే అత్యవసర సేవల కు మొదటి నుండి లాక్ డౌన్ కు మినహాయింపులు ఇవ్వగా ఇప్పుడు దీనికి తోడుగా మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు కొందరిలో హర్షం వ్యక్తం చేశాయి . అయితే ఈ నెల 20 నుండి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్దగా రుచించలేదు. అయితే ప్ర‌ధాని మోడీ తో సంబంధం లేకుండా తెలంగాణతో సహా మరో నాలుగు రాష్ట్రాలు వచ్చే నెల 30 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్న‌ట్లు ప్రకటించుకున్నారు. ఆ త‌రువాత ప్ర‌ధాని మే 3 వ‌ర‌కు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

త్వ‌ర‌లో క‌రోనా స‌హ‌జ స్వ‌భావాన్ని కోల్పోతుంది!

ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోంది. గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడం లేదు. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి శుభ‌వార్త చెప్పారు. ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కరోనాతో మ‌న‌ దేశానికి అంతగా చేటు జరగదని స్వామీజీ అన్నారు. కరోనా వైర‌స్ గురించి నైరాశ్యం వద్దు. మ‌న దేశం ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితులను చూసిందని స్వామీజీ అన్నారు. ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని స్వరూపానందేంద్ర ఆశాభావం వ్య‌క్తం చేశారు.. ఈ కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో దాని ప్రభావం తగ్గుతుందని స్వామీ చెప్పారు. విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నామని...కరోనా ప్రభావాన్ని నివారించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించామని స్వామి తెలిపారు. ఈ సమయంలో భగవంతుని నామస్మరణే ప్ర‌జ‌ల్ని కాపాడుతోంది. అదే రక్షణ. లాక్ డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచండి అని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు.

లాక్ డౌన్ ఎత్తేసే వరకూ అన్న ప్రసాదం అందిస్తాం: టీటీడీ చైర్మన్

* వెంటిలేటర్లు వెంటనే తెప్పించండి * రెండు రోజుల్లో 500 బెడ్లు సిద్ధం కావాలి * లాక్ డౌన్ ఎత్తేసే వరకూ అన్న ప్రసాదం అందిస్తాం * కోవిడ్  ఆసుపత్రిని పరిశీలించిన టీటీడీ ఛైర్మన్  వైవీ.సుబ్బారెడ్డి కోవిడ్ బాధితుల చికిత్స కోసం కేటాయించిన శ్రీ పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రిలో రెండు రోజుల్లో వెంటిలేటర్లతో సహా మొత్తం 500 బెడ్లు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి  స్విమ్స్  డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు. ఈ విషయం గురించి ఆయన జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తాతో మాట్లాడారు. ఈ రోజు ఉదయం ఆయన కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించారు. వెంటిలేటర్లు, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, సానిటైజర్ల అందుబాటు గురించి అధికారులను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు.                500 బెడ్లతో కోవిడ్ ఆసుపత్రి  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు పద్మావతి వైద్యకళాశాల ఆసుపత్రిని కోవిడ్ ఆస్పత్రిగా ఏర్పాటు చేశామన్నారు.  ముందుగా అంచనా వేసి ముందుజాగ్రత్త చర్యగా ఇక్కడ 500 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 110 వెంటిలేటర్లు , 390 బెడ్లు ఉంటాయన్నారు. ఇక్కడ వైద్య పరికరాలు, ఇతర కిట్ల కొనుగోలు కోసం టీటీడీ దాదాపు 20 కోట్లు జిల్లా కలెక్టరుకు అందించిందన్నారు.    అన్న ప్రసాదం పంపిణీ కొనసాగిస్తాం లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, పేదలకు తిరుపతి, పరిసర ప్రాంతాల్లో రోజుకు 1.40 లక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా 26 లక్షలకు పైగా ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు ఛైర్మన్ చెప్పారు. లాక్డౌన్ ఎత్తేసే వరకూ అన్న ప్రసాదాల పంపిణీ కొనసాగిస్తామని తెలిపారు.     మూర్ఛవ్యాధి వారికి ఇంటికే మందులు స్విమ్స్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో సుమారు 250 మంది మూర్ఛ వ్యాధి రోగులకు ప్రతినెలా మూడో ఆదివారం ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. లాక్డౌన్ వల్ల వీరు ఇబ్బంది పడకుండా వారి గ్రామాలకే పీహెచ్ సీల ద్వారా మందులు పంపాలని డైరెక్టర్ వెంగమ్మను ఆదేశించారు. ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్,  కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్లు భార్గవ్, రాంచరణ్ , ప్రజాసంబంధాల విభాగం డీడీ వెంకట్రామిరెడ్డి, పీఆర్ఓ రాజశేఖర్ పాల్గొన్నారు.

జి.20 దేశాల్లో భారత్ బెస్ట్! ఆర్బీఐ గవర్నర్

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. అయినా భారత ఆర్థిక పరిస్థితి మిగతా దేశాల కంటే బాగుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాల వృద్ధి రేటు తిరోగమనంలో ఉంటే, G20 దేశాల్లో భారత్ ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేస్తుందని IMF వెల్లడించిన‌ట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.  ఆర్‌బిఐ భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తోంది.  క్వారంటైన్‌లో ఉండి సేవలు అందిస్తున్న ఉద్యోగులకు, కరోనా ఉద్యోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కృత‌జ్ఞ‌త‌లుతెలిపారు. 1930 నాటి సంక్షోభాన్ని ఇప్పుడు కరోనా గుర్తు చేస్తోంది. ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని శక్తికాంత దాస్ చెప్పారు. లాక్ డౌన్ తర్వాత వ్యవస్థలోకి రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశారు. జీడీపీలో 3.2 శాతం ద్రవ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.  బ్యాంకుల్లో సరిపడా ద్రవ్యం అందుబాటులో ఉంది.  2020 ఏడాదిలో భారత వృద్ధి రేటు 1.9 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారీగా దెబ్బతిన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఖరీఫ్‌లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఏప్రిల్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు 2.3శాతం పెరిగాయి. ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి. విద్యుత్‌ వినియోం బాగా తగ్గింది. బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగాసాగుతున్నాయి.  లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్‌ డాలర్ల నష్టం'' అని శక్తికాంత దాస్‌ వివరించారు.

'కళ్లంలోనే కొనుగోళ్లు' మాటలకే పరిమిత‌మా?

'అమ్మబోతే అడవి. కొనబోతే కొరివి...ఇది ఏపిలో రైతుల దీన‌స్థితి.  లాక్‌డౌన్‌తో ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. వరి, జొన్న, మొక్కజొన్న లాంటి ఆహార పంటలు, మిర్చి, పొగాకు, పసుపు తదితర వాణిజ్య పంటలను కొనే నాథుడే లేడు. ఇక పండ్లు, పూలు, కూరగాయల రైతుల బాధలు వర్ణనాతీతం. చేనులోనే పంట ఎండిపోవడమో లేక రోడ్లపై పారబోయడమో జరుగుతోంది. కష్టకాలంలో సైతం పండినదాంట్లో జొన్న, మొక్కజొన్న కేవలం 25 శాతం, ధాన్యంలో 60 శాతం మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరి కాదు. ఇక కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలన్నా ఇ-క్రాప్‌ బుకింగ్‌, ఇతర షరతులతో మరిన్ని కష్టాలు పడాల్సి వస్తోంది. అందునా కౌలురైతుల పరిస్థితి దయనీయంగా వుంది. 'కళ్లంలోనే కొనుగోళ్లు' అన్నవి మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణ లోకి రావడంలేదు. ఉత్పత్తిదార్లు తమ పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా చాలా తక్కువకు వ్యాపారులకు, దళారులకు అమ్ముకోవలసి వస్తోంది. వ్యవసాయ కార్మికులకు పనులు లేవు.  పని కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చిన వలస కార్మికుల పరిస్థితి అయితే దారుణ‌మే మ‌రి. అటు ఎస్‌ఇజెడ్‌, భారీ పరిశ్రమలేగాక చిన్న చిన్న పరిశ్రమల్లోనూ పని చేసే కార్మికులు గాని ఇటు భవన నిర్మాణ పనివారంతా ఇబ్బందులు వర్ణనాతీతం. వ్యవసాయ పనుల కోసమే జిల్లాలు దాటి వచ్చిన వలస జీవులు వేల సంఖ్యలో వున్నారు. వీరందరికీ పని లేదు సరికదా రోజువారీ ఆహారం కూడా కనాకష్టమైపోతోంది.  కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలూ చేపట్టే ఆహార పంపిణీ కార్యక్రమాల కోసం ప్రతి రోజూ ఎదురు చూసే దుస్థితి ఏర్పడింది. దాంతో ఇక్కడ వుండలేక తమ స్వగ్రామాలకు కాలినడకనైనా వెళ్లిపోవాలన్న స్థితికి వారొచ్చారు. ముఖ్యంగా మే3 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించాక ఈ ధోరణి గత రెండు రోజులుగా ఇంకా పెరుగుతోంది.  స్థానికంగానే వుంటూ రోజుకు  ఐదారొందల రూపాయ‌ల‌ వరకు సంపాదించే ఆటో, భవన నిర్మాణ, హమాలీల్లాంటి అసంఘటిత కార్మికులకు ఇప్పుడు రూపాయి కూడా ఆదాయం లేదు. వారందరినీ ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతే!

మౌలానా సాద్ కు ఢిల్లీ ప్రభుత్వ సహకారంపై ఇంటెలిజెన్స్ అనుమానాలు

విచారణకు రాకుండా, తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్ ఇల్లు మారడంపై ఢిల్లీ సర్కిల్స్ లో పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం లోని కొందరి పెద్దల సహకారం తోనే, మౌలానా సాద్ పోలీసులతో దోబూచులాడుతున్నారనే అనుమానాలను ఢిల్లీ పోలీసు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మౌలానాపై ఇప్పటికే రెండు కేసులు నమోదు కాగా, 2 వేల మందిపై లుక్‌ అవుట్ నోటీసుల జారీ అయ్యాయి. పోలీసుల నోటీసులను పట్టించుకోని సాద్, ఇల్లు మారటం పై ఇంటెలిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.  దేశ వ్యాప్తంగా కరోనా విస్తరించడానికి కారణమైన తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడు. ప్రస్తుతం ఉన్న ఇంటిని కూడా మార్చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి సమావేశం నిర్వహించి దేశంలో కరోనా ప్రబలేందుకు కారణమయ్యాడన్న ఆరోపణలపై సాద్‌పై పోలీసులు నేరపూరిత హత్యయత్నం కింద కేసులు నమోదు చేశారు. తాజాగా, నిన్న ఆయనపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదైంది. దర్యాప్తు కోసం తమ ఎదుట హాజరు కావాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సాద్‌కు పలుమార్లు నోటీసులు పంపారు. వాటిని ఏమాత్రం పట్టించుకోని సాద్.. పరీక్షల్లో తనకు కరోనా సోకలేదని తేలిన తర్వాత ఇల్లు మారిపోయాడు. తబ్లిగీ జమాత్ సదస్సుకు దేశం నలుమూలల నుంచీ హాజరైన వారిలో వెయ్యిమందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సాద్‌ కరోనా పరీక్షలు చేయించుకోగా, ఆయనకు వైరస్ సోకలేదని తేలింది. దీంతో అదే ప్రాంతంలో మరో ఇంటికి ఆయన మకాం మార్చినట్టు తెలుస్తోంది. గతంలో హోం క్వారంటైన్‌లో ఉండడంతో సాద్‌ను పోలీసులు ప్రశ్నించలేకపోయారు. ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు మాత్రం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. తాజాగా, అతడిపై పలు కేసులు నమోదు కావడంతో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం నోటీసులు పంపినా ఫలితం లేకుండా పోయింది. కాగా, సాద్ సహా 18మంది జమాత్ నేతలతో పాటు 2 వేల మంది సభ్యులు దేశం విడిచి వెళ్లకుండా ఢిల్లీ పోలీసులు లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు.

రోడ్డు మీద‌కి వ‌స్తే.. నేరుగా జైలుకే సీపీ వార్నింగ్!

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మీద‌కి వ‌స్తే కేసు న‌మోదు చేస్తామ‌ని హైద‌రాబాద్‌ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ఇళ్ల‌లోనే వుంటూ ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ హెచ్చ‌రించారు. రోడ్డు మీద క‌నిపిస్తే జైలులో వేస్తామ‌ని సీపి వార్నింగ్ ఇచ్చారు. లాక్ డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు సహకరిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతామని సీపి అన్నారు. అత్యవసరం వుంటేనే బ‌య‌టికి రావాలి. లేకున్నా వాహనాలపై బయట తిరుగుతున్న వాళ్ళను జైలుకు పంపిస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.   బ‌య‌ట తిరుగుతున్న వారి వ‌ల్ల ఇన్ని రోజుల కష్టం వృథా అవుతుందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పిల్లలు బయటికు రాకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి పంపించవద్దని కోరారు.  లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 3,500 పీటీ కేసులు న‌మోదు చేశారు. అలాగే 17 వేల మందిపై ట్రాఫిక్ విభాగం కేసులు నమోదు చేసి 2,724 వాహనాలను సీజ్ చేశారు.

1500 బెడ్స్‌తో ప్ర‌త్యేక క‌రోనా హాస్పిట‌ల్! గాంధీలో పిల్లలకు ప్రత్యేక వార్డు!

700 పాజిటివ్ కేసులు, అందులో 18 మంది మృతి చెంద‌డం తెలంగాణాలో క‌ల‌క‌లం రేపుతోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల‌తో క‌రోనా వైర‌స్ తెలంగాణాలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌భుత్వం అన్ని విధాల చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌రోనాపై పోరాటానికి తెలంగాణా ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో స‌మాయ‌త్తం అయింది. పెరుగుతున్న కేసుల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్ప‌ట్టికే గచ్చిబౌలిలో 1500 బెడ్స్ తో క‌రోనా పేషెంట్ల కోసం ప్ర‌త్యేక హాస్పిటల్ సిద్ధ‌మైంది.  ఈనెల 20న ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. 10 లక్షల పిపిఇ కిట్స్, పది లక్షల ఎన్‌-95 మాస్క్ లు అందుబాటులో ఉంచారు. అవ‌స‌ర‌మైన ప్ర‌త్యేక కిట్‌ల‌న్నీ వైద్య సిబ్బందికి, డాక్టర్ల కు అందరికి అందుబాటులో ఉన్నాయి. ఇతర సిబ్బంది కి కూడా పిపిఇ కిట్స్ ఇవ్వాలని అధికారులు నిర్ణ‌యించారు.  రోజుకు 5000 పరీక్షలు చేసే సామర్ధ్యానికి తెలంగాణా రాష్ట్ర ల్యాబ్‌లు చేరుకున్నాయి. ఇప్పుడు ఉన్నవాటితో పాటు సనత్ నగర్ ఇఎస్ఐతో పాటు మరొక హాస్పిటల్ కి క‌రోనా పరీక్షలు చేసేందుకు అనుమతి రానుంది.   తెలంగాణా ప్ర‌భుత్వం ప్లాస్మా థెరపీ చేయడానికి అనుమ‌తి కోరుతూ ఇప్పటికే సి ఎస్ ఐ ఆర్ కు విజ్ఞప్తి చేసింది. అనుమతి రాగానే ఈ విధానాన్ని మొదలు పెట్ట‌నున్నారు.  గాంధీ ఆస్పత్రి, కింగ్ కోఠి , చెస్ట్ ఆస్పత్రిలో సౌకర్యాలను మ‌రింత మెరుగుప‌రుస్తున్నారు.  ముఖ్య‌మంగ‌తా ప్రతి బాత్రూం శుభ్రంగా ఉండేటట్లు 24 గంటలు మీరు నీరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.  పిల్లల తల్లిదండ్రులకు కరోనా వచ్చి పిల్లల్ని చుసుకొలేకపోతే ఆయాలను కూడా ఏర్పాటు చేశారు. గాంధీ లో పిల్లలకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు.  గర్భిణీ స్త్రీలకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ, పౌష్టికాహారం అందిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరణపై భిన్న వాదనలు

కరోనా మహమ్మారి నివారణకు టీకాను ఆవిష్కరించటానికి, ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 18 నెలల కలం పడుతుందని శాంతాబయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కె ఐ వరప్రసాద రెడ్డి లాంటి ఫార్మా రంగ ప్రముఖులు చెపుతుంటే, కరోనా వ్యాక్సిన్ ను మరో రెండు నెలల్లోనే కనుగొనే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వ్యాఖ్యానించటం గందరగోళానికి దరి తీస్తోంది.  గతంలో పోలియో, రేబిస్ టీకాలను తయారు చేసిన క్రియారహిత (ఇన్ యాక్టివేటెడ్) వైరస్ టీకాపై తాము దృష్టిని సారించామని ఆయన చెప్పుకొచ్చినప్పటికీ, ఈ అంశానికి సంబంధించి ఆర్ ఎండ్ డి ప్రొటొకాల్స్ ఎలా ఉంటాయో, ఇప్పటికే డాక్టర్ వరప్రసాద రెడ్డి వివరించారు. మొత్తం నలభై దేశాలు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలెట్టాయనీ, ఎంత లేదన్నా 18 నెలల నుంచి 24 నెలలు సమయం పడుతుందనీ ఆయన సోదాహరణంగా వివరించారు. ఆల్రెడీ డెవెలప్ అయిన ఫార్ములాను బేస్ చేసుకుని , భారతీయ వాతావరణం లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ కు బయటకు తీసుకురావటానికి ఐదున్నరేళ్ళు పట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొరోనా వైరస్ RNA కూడా ఏమిటో తెలియని పరిస్థితుల్లో , సి సి ఎం బి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా మరి ఏ రకంగా , రెండు నెలల్లో కొరోనా వ్యాక్సిన్ ను కనుక్కోగలరనేది  ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.    టీకా తయారీ విధానాన్ని గురించి వివరించిన సి సి ఎం బి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా , తొలుత సజీవ వైరస్ లను ల్యాబ్ లో అధికంగా పెంచుతామని, ఆపైన వాటిపై రసాయనాలు, వేడిని ప్రయోగించడం ద్వారా క్రియారహితం చేసి, ప్రజలకు టీకా రూపంలో వేయాల్సి వుంటుందని అన్నారు. వేడి చేయడం ద్వారా వ్యాధి కారకమైన ప్యాథోజెన్ చనిపోయి, వైరస్ పెరిగే సామర్థ్యం నిలిచిపోతుందని అన్నారు. వీటితో ప్రజలకు ముప్పు ఉండదని, పైగా ఇన్ యాక్టివేటెడ్ వైరస్ టీకా శరీరంలోకి వెళ్లగానే, అది వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని రోగ నిరోధక వ్యవస్థకు అందిస్తుందని అన్నారు.   ఆపై వైరస్ శరీరంపై దాడి చేయగానే, యాండీ బాడీలు భారీగా విడుదలై, వైరస్ పై యుద్ధానికి దిగుతాయని, అనారోగ్యంతో బాధపడేవారు, తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్నవారు, వృద్ధులకు క్రియా రహిత టీకా ఇవ్వడం సురక్షితమని తెలిపారు. ప్రయోగశాలలో వైరస్ ను పెంచిన తరువాత టీకాల తయారీకి పరిశ్రమలకు కూడా వైరస్ ను ఇస్తామని తెలిపారు. కాగా, వైరస్ ను వృద్ధి చేయడం ఇక్కడి వాతావరణానికి సవాలేనని, ఆఫ్రికన్ గ్రీన్ కోతి కణాలకు మానవ కణాలకు పోలికలు ఎక్కువగా ఉండటంతో వీటిపై సెల్ వైరస్ కల్చర్ చేస్తున్నామని కణాల్లో వైరస్ వృద్ధి చెందేలా చూస్తున్నామని రాకేశ్ మిశ్రా వెల్లడించారు. ఇవన్నీ ఆయన వివరించినప్పటికీ, ప్రాక్టికల్ గా హెల్త్ ప్రొటొకాల్స్ ఏ మేరకు సహకరిస్తాయి వేచి చూడాలి.

ఏపీ క్వారంటైన్‌లో కేర్ అద్భుతం...బ్రిటన్ పౌరుడి లేఖ!

బ్రిట‌న్ పౌరుడు కల్లీ క్లైవ్ బ్రయాంట్ రాసిన లేఖ ఇది. శ్రీ పద్మావతి నిలయం వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం చాలా బావుంది. ఇక్క‌డ వున్న వారంద‌రినీ చాలా బాగా చూసుకున్నారు. క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండే వారికి అందించాల్సిన వైద్య సేవల్ని క్ర‌మం త‌ప్ప‌కుండా అందించారు. చక్కగా గాలి వెలుతురు వచ్చేలా విశాలమైన శుభ్రమైన బెడ్రూమ్స్ ఉన్నాయి. గది కిటికీలో నుంచి బయటకు చూస్తే ఆహ్లాదాన్ని కలిగించే తిరుపతి ప్రకృతి కనువిందు చేస్తుంది.  అంతే కాదు అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతిరోజూ ప్రతి రూమ్‌కి అందించారు. స్టాఫ్ కూడా స్నేహపూర్వకంగా ఉన్నారు. టీ, స్నాక్స్, మంచినీళ్లు, వాట్సాప్‌లో అడిగిన వెంటనే ఏమైనా అవసరం ఉంటే అందించారు. అదే స్థాయిలో పరిశుభ్రత కూడా ఉంది.  ప్రతి రోజూ డ్యూటీలో ఉన్న డాక్టర్ క్వారంటైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి చెక్ చేశారు. బయట నుంచి  కౌన్సెలర్ కూడా వచ్చి ఎలాంటి ఆందోళన చెందవద్దని అందరిలో ధైర్యం నింపేవారు. ఇక్కడున్న ప్రొఫెషనల్ స్టాఫ్ ఎంతో శ్రద్ధతో ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకున్నారంటూ బ్రిట‌న్ పౌరుడు కల్లీ క్లైవ్ బ్రయాంట్ స్వ‌ద‌స్తూరితో ఏపి అధికారుల‌కు లేఖ రాశాడు. క్వారంటైన్ ముగియ‌డంతో అత‌నికి భారత్ నుంచి యూకే వెళ్లడానికి అనుమతి ల‌భించింది. కల్లీ క్లైవ్ బ్రయాంట్ 2019 అక్టోబర్‌లో భారత పర్యటనకు వచ్చాడు. ఆ త‌రువాత తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చాడు. అయితే, కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటన వ‌చ్చింది.  దీంతో విదేశీయుడు కావడంతో కల్లీ క్లైవ్ బ్రయాంట్‌ను మార్చి 24 న క్వారంటైన్‌కు తరలించారు. ఆయనకు రెండు సార్లు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.   మార్చి 16వ తేదీన  కల్లీ క్లైవ్ బ్రయాంట్ త‌న‌ క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. కలెక్టర్ అనుమతితో అత‌న్ని క్వారంటైన్ కేంద్రం నుంచి డిశ్చార్జ్ చేశారు. వెళ్లేటప్పుడు అధికారులను అభినందిస్తూ లేఖ రాశాడు.  మళ్లీ తాను తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని సందర్శిస్తానని చెప్పాడు. అలాగే, తనను బాగా చూసుకున్న అధికారులను ఎప్పుడూ మ‌ర్చిపోన‌ని,  అప్పుడు తప్పకుండా పోను చేయ‌డ‌మే కాకుండా భ‌విష్య‌త్‌లో కలుస్తానని తెలిపాడు.   ఏప్రిల్ 17వ తేదీన ఈ రోజు హైదరాబాద్ నుంచి విమానంలో అహ్మదాబాద్ వెళ్తాడు. అక్కడి నుంచి రాత్రి 7 గంటలకు బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ ద్వారా బ్రిటన్ వెళ్తారు.

నగదు రహిత అపరిమిత కాల్స్, డేటా కోసం సుప్రీంలో పిటిషన్

* లాక్ డౌన్ కారణంగా ప్రజలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్న పిటీషనర్  * ఆరోగ్య మంత్రిత్వ శాఖకూ తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి  దేశంలో లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, దీనిని తగ్గించేందుకు ప్రజలందరికీ ఉచిత అపరిమిత కాల్స్, డేటా సౌకర్యంతోపాటు డీటీహెచ్ సేవలు అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉంటున్న వారు, క్వారంటైన్‌లో ఉంటున్న వారు మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖను కూడా ఆదేశించాలని పిటిషన్‌దారు కోరారు. లాక్‌డౌన్ అమల్లో ఉండే మే 3వ తేదీ వరకు అన్ని చానళ్లను అపరమితంగా వీక్షించే సదుపాయం కల్పించేలా చూడాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం, టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్)లను ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు.  లాక్‌డౌన్ సమయంలో వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు అనుగుణంగా చట్ట నిబంధనల ప్రకారం అధికారాలను వినియోగించుకునేలా సూచించాలని పిటిషన్‌దారు కోరారు. ఈ మేరకు మనోహర్ ప్రతాప్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.