కరోనాకు 45 రోజుల బాలుడు బలి!
posted on Apr 20, 2020 @ 4:45PM
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్‌తో అత్యంత పిన్న వయస్కుడు మరణించాడు. కేవలం 45 రోజుల చిన్నారి కోవిడ్-19తో మరణించాడు. ఈ బాలుడి మృతితో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 21కి పెరిగింది. నారాయణపేట జిల్లాకు చెందిన బాలుడు మృత్యువాతపడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ బాలుడికి కరోనా సోకినట్లు నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ బాలుడు జన్మించాడు. ఇటీవల అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ చిన్నారికి కరోనా ఎలా సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. చిన్నారికి కరోనా పాజిటివ్ రావడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా పాజిటివ్ సోకిన చిన్నారికి సంబంధించిన 18 మంది కుటుంబసభ్యులు, బంధువులు, ఓ వైద్యుడిని ఐసొలేషన్‌కు తరలించారు. వారి నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 93 మంది చిన్నారులు కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది. 53 మంది చిన్నారులు గాంధీ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వైరస్ సోకిన ఈ చిన్నారులంతా 12 ఏళ్ల లోపువారే. వారిలో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 23 రోజుల పసికందుతో పాటు మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. గాంధీ ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన చిన్నారులకు వైరస్ సోకింది. ఆంధ్రప్రదేశ్ లోనూ 40 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. ఎక్కువ మంది దిల్లీలోని మర్కజ్ కు హాజరైనవారి కుటుంబసభ్యులేనని తేలింది.