పోలీసులు సంయమనం పాటించండి! చంద్రబాబునాయడు
posted on Apr 21, 2020 @ 12:22PM
అత్యవసర మందుల కోసం వెళ్తున్న గౌస్‌పై పోలీసులు లాఠీఛార్జి చేయడం గర్హనీయమని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించాలే తప్ప, దురుసుగా ప్రవర్తించడం సరికాదని సూచించారు.
గుండెజబ్బుతో బాధపడుతున్న ఒక యువకుడు అత్యవసరమైన మందుల కోసం రోడ్డు మీదకు వస్తే పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. లాఠీ దెబ్బలకు అతని ప్రాణాలు పోయాయి. దీంతో ఆగ్రహించిన స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున నిరసన కు దిగారు. పోలీస్‌స్టేషన్ ఎదుట భైఠాయించారు. దీంతో ఈ సంఘటనకు కారణమైన ఎస్‌ఐని సస్పెండ్ చేస్తున్నట్లు గుంటూరు రేంజి ఐజి జె ప్రభాకరరావు ప్రకటించారు.
వెంకటపతి కాలనీలో నివసించే 30 సంవత్సరాల షేక్ మహ్మద్ గౌస్ బిల్డింగ్ సెంట్రింగ్ వర్కర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు సంవత్సరాల కిందట గుండెకు సంబంధించిన సమస్య రావడంతో ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. ఈ క్రమంలో అత్యవసరమైన మందుల కోసం సోమవారం ఉదయం 7.30 గంటలకు మెడికల్ షాపును వెళ్లి వస్తున్న ఆయనపై నరసరావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు విరుచుకు పడ్డారు. అతను చెబుతున్నది వినకుండా లాఠీలతో కొట్టడంతో గౌస్ కుప్పకూలిపోయాడు. పోలీసుల సమాచారంతో అక్కడకు వచ్చిన గౌస్ తండ్రి ఆదాం తన కుమారుడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
గౌస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయం పట్టణంలో తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు కదిలారు. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి బైఠాయించారు. గంటల తరబడి ఈ ఆందోళనసాగింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సంఘటనకు కారణమైన ఎస్‌ఐ డి. రమేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.