స్టైరీన్ ప్రభావిత గ్రామాల్లో బస చేయండి! మంత్రులకు సి.ఎం. ఆదేశం!
posted on May 11, 2020 @ 10:34AM
మంత్రులు, అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. గ్యాస్ ప్రమాద బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులు మెరుగుపరచాలన్నారు. ప్రభావిత గ్రామాల్లో ఇంటా, బయట పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయాలని సూచించారు. రసాయన అవశేషాలు లేకుండా శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సోమవారం సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో రాత్రి బస చేయాలని చెప్పారు.
వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలన్నారు. సోమవారం ఉదయం మంత్రులు, అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేయాలని పేర్కొన్నారు. పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. ఆర్థిక సాయం అందలేదని బాధితులెవరూ విజ్ఞాపనలు చేసే పరిస్థితి ఉండకూడదని సీఎం పేర్కొన్నారు. స్టైరీన్ రసాయనం విశాఖలో ఉంచడానికి వీల్లేదని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. గ్యాస్ లీక్ ప్రాంతాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని సీఎంకు అధికారులు వివరించారు.