టీవీ5 కార్యాలయంపై దాడి ఓ దుష్టచర్య: ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌

హైదరాబాదులోని టీవీ5 చానల్ ప్రధాన కార్యాలయంపై గత అర్ధరాత్రి కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి మీడియాపై దాడి అంటే వారి విధులకు ఆటంకం కలిగించడమేనని ట్వీట్ చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని దర్యాప్తు అధికారులను కోరారు. ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. తాను ఎంతో బాధపడ్డానని తెలిపారు. ఇలాంటి దుష్ట చర్యలు మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోషులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని పవన్ ట్వీట్ చేశారు. టీవీ5 చానల్ యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే కుట్రలో భాగమేనని, మీడియా సంస్థలను, జర్నలిస్టులను టార్గెట్ చేసి జరుపుతున్న ఇలాంటి దాడులను ప్రజలు ప్రజాతంత్రవాదులు ఖండించాల‌ని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తండ్రీ కొడుకుల్ని వ్యాన్‌లో పంపండి! విజయసాయిరెడ్డి ట్వీట్‌!

హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ యంత్రాంగంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు , ఆయన కుమారుడు లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'పెదనాయుడు చిననాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్‌లో ఉండిపోయింది. వారిద్దరినీ బలవంతంగా వ్యాన్‌ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండి. విమానంలోనే వైజాగ్ వెళ్తానని రెండు రోజులుగా మారాం చేస్తున్నావ్‌. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా?' అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

లిక్కర్ కోసం వేల‌మంది? శ‌వ‌యాత్ర‌కైతే 20 మందే! మోదీ నిబంధ‌న‌పై శివ‌సేన ట్వీట్‌!

లాక్‌డౌన్ నిబంధనల సడలింపులపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్ర‌ ప్ర‌భుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శవయాత్రలో పాల్గొన‌డానికి అయితే కేవలం 20 మందికి అనుమతి ఇచ్చి, మద్యం షాపుల ఎదుట మాత్రం వేల మందికి అనుమతి ఇవ్వడంపై తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. శవ యాత్రలో 20 మందిని మాత్రమే అనుమతించారు, ఎందుకంటే ఆత్మ(స్పిరిట్‌) అప్పటికే శరీరాన్ని వదిలి వెళ్లి ఉంటుంది. అదే మద్యం షాపుల ముందు మాత్రం వేలాది మందికి అనుమతిచ్చారు. ఎందుకంటే మద్యం షాపుల్లోనే స్పిరిట్‌ ఉంటుంది కాబట్టి అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్! ఎస్సై, 4 మావోయిస్టులు మృతి!

చత్తీస్‌గఢ్‌లో నిన్న రాత్రి జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఎస్సై సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మాన్పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో ఈ ఎన్‌కౌంట‌ర్ జరిగింది. తమకు తారసపడిన పోలీసులపై మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఎస్సైతోపాటు నలుగురు మావోయిస్టులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్, రెండు 315 బోర్ రైఫిళ్లు, ఒక ఎస్ఎల్ఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్టు రాజ్‌నందగాన్ ఏఎస్పీ జీఎన్ బాఘెల్ తెలిపారు.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్!

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న 22 ఏళ్ల గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు. ప్రత్యేక జాగ్రత్తల మధ్య గైనిక్ వైద్య బృందం మహిళకు డెలివరీ చేశారు. తొలి సారిగా కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణికి శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేసి గాంధీ వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. సదరు మహిళ కరోనాతో పాటు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోంది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని... చిన్నారిని వేరుగా ఉంచినట్టు డాక్ట‌ర్లు వివరించారు. చిన్నారి స్వాబ్ సేకరించి.. పరీక్షల కోసం పంపినట్టు తెలిపారు. అరుదైన ఈ ఘనతను సాధించిన వైద్యులను మంత్రి ఈటల అభినందించారు. అయితే ఈ మహిళ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వారందరూ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి! 40 లక్షల కేసులు! 2 ల‌క్ష‌ల 70 వేల మంది బ‌లి!

ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని కబళిస్తూ కరోనా క‌రాళ నృత్యం చేస్తోంది. వైరస్ ఉద్ధృతి ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 40 లక్షలకు చేరువైంది. 2.70 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పుడీ మహమ్మారి బ్రెజిల్‌ను పట్టి పీడిస్తోంది. గత 24 గంటల్లో ఇక్కడ ఏకంగా 20 వేల కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.36 లక్షలకు పెరిగింది. నిన్న ఒక్క రోజే కొత్తగా 35 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 610 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 9,146కు చేరుకుంది. బ్రెజిల్ దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కి అల్లాడుతున్నా ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మాత్రం ఏమీ పట్టనట్టగా వ్యవహరిస్తున్నారు. ఆయన అధికార ప్రతినిధి ఒటావియో బారోస్ కూడా కరోనా బారినపడినా అధ్యక్షుడు మాత్రం కరోనా విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన తొలి ఐదు దేశాల్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యాలు ఉన్నాయి. బ్రిటన్‌లో తాజాగా మరో 626 మంది మరణించగా, వీరిలో ఆరు వారాల చిన్నారి కూడా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. లాక్‌డౌన్ ఎత్తివేసిన దేశాల్లో వైరస్ ఉద్ధృతి కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జర్మనీలో నిన్న 1,209 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1.67 లక్షలకు చేరింది. స్విట్జర్లాండ్‌లో నిన్న 81 మంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 30,207కు పెరగ్గా, ఇప్పటి వరకు 1,526 మంది మృత్యువాత పడ్డారు.

కొన్నేళ్లపాటు కరోనాతో క‌లిసి జీవించాల్సిందే! డబ్ల్యూహెచ్‌ఓ!

కరోనాతో ఆఫ్రికాకు పెనుముప్పు పొంచివుంది. లక్షల మంది మృతి చెందే ప్రమాదమంటూ డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చ‌రించింది. కరోనా క‌ట్ట‌డికి తగిన చర్యలు చేపట్టకపోతే ఆఫ్రికా ఖండానికి పెనుముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇదే పరిస్థితులు ఉంటే ఈ ఏడాది కాలంలో 2.9 కోట్ల నుంచి 4.4 కోట్ల మందికి వ్యాధి సోకే అవకాశం ఉందని, 1.9 లక్షల మంది మరణించే ప్రమాదం ఉందని హెచ్చ‌రించింది. ఆఫ్రికా ఖండంలోని 47 దేశాల్లోని పరిస్థితులను పరిశీలించిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించకపోతే కొన్నేళ్లపాటు ఈ వ్యాధి ప్రజల జీవితంలో ఓ భాగంగా మారిపోతుందని హెచ్చరించింది.

టీవీ 5 కార్యాలయం పై దాడిని ఖండించిన లోకేష్!

హైదరాబాద్ టీవీ 5 కార్యాలయం పై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. టీవీ 5 కార్యాలయం పై రాళ్ల దాడి పిరికిబంద చర్య అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలని ఆయ‌న అన్నారు. పత్రికా స్వేచ్చని హరించే విధంగా జరుగుతున్న సంఘటనల పై మీడియా ఐక్యంగా పోరాటం చెయ్యాలి లేకపోతే ఇలాంటి పరిస్థితి అందరికి వచ్చే ప్రమాదం ఉంది లోకేష్ అభిప్రాయ‌ప‌డ్డారు. అన్ని రాజకీయ పార్టీలు మీడియా,మీడియా ప్రతినిధులపై దాడులను తీవ్రంగా ఖండించి భావ ప్రకటనా స్వేచ్చని కాపాడటానికి ముందుకు రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని లోకేష్ విజ్ఞ‌ప్తి చేశారు.

ముంబయి చేరుకోనున్న విదేశాల్లోని తెలుగు ప్రజలు! హోటళ్ల‌లో 1000 గదులు సిద్ధం చేసిన ఏపీ స‌ర్కార్‌

విదేశాల నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు పెయిడ్ క్వారంటైన్ కు తరలించ‌నున్నారు. వారి కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో హోటళ్లు, లాడ్జీల్లో 1000 గదులు సిద్ధం చేసింది. 14 రోజుల తర్వాత నెగెటివ్ వస్తే ఇళ్లకు పంపిస్తారు. అవసరాన్ని బట్టి 28 రోజుల వరకు క్వారంటైన్ పెంచే అవకాశం ఉంది. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. 64 ప్రత్యేక విమానాల ద్వారా విదేశాల్లోని భారతీయులను తీసుకురావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. అందులో వున్న తెలుగువారిని ముంబయి నుంచి హైదరాబాద్, గన్నవరంకి తరలిస్తారు. ఈ క్రమంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారు సోమవారం నాటికి ప్రత్యేక విమానాల్లో ముంబయి చేరుకోనున్నారు. వారిని ముంబయి నుంచి హైదరాబాదుకు, గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించనున్నారు.

పబ్‌లు, రెస్టారెంట్లు, బార్‌లలో మద్యం అమ్మకాలు!

మద్యం విక్రయాలపై కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మే 9వతేదీ నుంచి 17వతేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో కూడా రిటైల్ ధరలకు మద్యం విక్రయాలకు అనుమతిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో మందుబాబులు ఇంటికి తీసుకువెళ్లేలా అమ్మకాలు చేసుకోవచ్చని సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించింది. ఇప్పుడు మద్యం విక్రయాల ద్వార మరింత ఆదాయం పెంచుకునేందుకు మద్యాన్ని రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో కూడా రిటైల్ ధరలకు విక్రయించవచ్చని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 753కు చేరింది.

లాక్ డౌన్ వేళ మావంతు సాయం చేస్తున్నాం: నారా భువనేశ్వరి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. సంక్షోభ సమయంలో సేవ చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. లాక్ డౌన్ వేళ తెలుగు రాష్ట్రాల్లో తమవంతు సాయం చేస్తున్నామని వెల్లడించారు. భౌతికదూరం పాటిస్తూ ఇప్పటివరకు 20 వేల మంది పేదలకు నిత్యావసరాలు అందించామని, బియ్యం, నూనె, పండ్లు, గుడ్లు, కూరగాయలు పంపిణీ చేశామని వివరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 2.5 లక్షల మందికి ఎస్ఎస్-99 మాస్కులు అందించామని భువనేశ్వరి తెలిపారు. 3 వేల మంది కూలీలకు పులిహోర, బిస్కెట్లు పంపిణీ చేశామని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.  ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ 24 గంటలూ అత్యవసర సేవలు అందిస్తోందని, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి బ్లడ్ బ్యాంకుల ద్వారా 5,000 యూనిట్లు పంపిణీ చేశామని వివరించారు.

మద్యం అమ్మకాలను నిషేధించాలని ఆదేశాలివ్వలేం: సుప్రీం

మద్యం అమ్మకాలను నిషేధించాలని ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మద్యం అమ్మకాలపై రాష్ట్రాలవి విధానపరమైన నిర్ణయాలని.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మద్యం కొనుగోలు సమయంలో చాలాచోట్ల భౌతిక దూరం పాటించడం లేదని, అందువల్ల మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను శుక్రవారం విచారించిన అనంతరం సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే.. రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను పాటించాలని ధర్మాసనం సూచించింది. రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించాలని, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మద్యాన్ని హోం డెలివరీ చేయాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలకు సూచించింది.

నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు తీర్పు రిజర్వ్!

ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుధీర్ఘంగా విచారించిన అనంతరం నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. ఐదు రోజుల పాటు వాద ప్రతివాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.  243కె అధికరణలో పదవీకాలం రక్షణ ప్రస్తావన లేదని ఏజీ తెలిపారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని.. నిష్పక్షికంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్న పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదని కోర్టుకు వాదనలు వినిపించారు. అంతేకాదు.. ఆర్డినెన్స్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణార్హం కాదని ఏజీ కోర్టుకు తెలిపారు. ఎస్ఈసీ కనగరాజ్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్. ప్రసాద్ వాదనలు వినిపించారు. మాజీ న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం శుభపరిణామమని ఈ సందర్భంగా కోర్టుకు వినిపించారు. కమిషనర్ పదవిని వయసుతో ముడిపెట్టడం సరికాదని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ తరుపున రాతపూర్వకంగా వాదనలు సమర్పించేందుకు మాజీ అడ్వకేట్ జనరల్ సీవీ మోహన్ రెడ్డి సమయం కోరారు. వచ్చే సోమవారం వరకు హైకోర్టు సమయం ఇచ్చింది.

నిబంధనలు అతిక్రమిస్తే సహించం: గౌతమ్‌రెడ్డి

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గ్యాస్‌ లీకేజ్‌ ఘటనపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సహించమని.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  కష్టకాలంలో బాధితులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించారని పేర్కొన్నారు. తనతో సహా మంత్రులను విశాఖకు పంపించి.. సాధారణ పరిస్థితి వచ్చేలా చూడాలని సీఎం జగన్ చెప్పారని వెల్లడించారు. ఎల్జీ కంపెనీని రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయమని గ్రీన్ ‌ట్రిబ్యునల్‌ ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు. 100 శాతం సురక్షితంగా మారాక గ్రామస్తులను అనుమతిస్తామని తెలిపారు. విశాఖ పోలీసులు, వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని మంత్రి గౌతమ్‌రెడ్డి అభినందించారు.  ఎల్జీ పాలిమర్స్‌ ప్రతినిధులు,నిపుణులతో మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ట్యాంక్‌ పరిస్థితిపై సమీక్షించామని తెలిపారు. ట్యాంక్ ఉష్ణోగ్రత 120 కన్నా తక్కువ గా ఉందని.. కొన్ని రసాయనాలు వాడి పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గిస్తున్నారని తెలిపారు. ‘‘ఇప్పుడు వచ్చిన నిపుణులు ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది.  స్టైరిన్ గాల్లో తక్కువ మోతాదులో ఉంది. దీని వల్ల ప్రమాదం లేదు. ఇది ఎక్కువ శాతం గాల్లో కూడా ఉండదు. ఇది భూమి మీద పడిపోతుంది. దీని వల్ల ప్రమాదం లేదని’’ మంత్రి వివరించారు. రాష్ట్రంలో 86 కంపెనీలు గుర్తించామని.. భద్రత ప్రమాణాలు పరిశీలించిన తరువాతే ప్రారంభించడానికి అనుమతులు ఇస్తామని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.

సంక్షోభాన్ని రాజకీయం చేస్తారా?: బొత్స

టీడీపీలా సంక్షోభాన్ని రాజకీయానికి వాడుకోవడం తమ పార్టీకి తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ ఘటన విషయంలో ప్రభుత్వ స్పందనను ఒక టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు హర్షించాయని చెప్పారు. ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో టీడీపీ చేసే కామెంట్స్ చూసి బాధపడ్డామని అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఏ విషయంలో ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యమో చెప్పాలని అన్నారు. చౌకబారు ఆరోపణలు చేయడం తగదన్నారు.  భద్రతా పరమైన చర్యలు చేపట్టకపోవడం కంపెనీ తప్పని అన్నారు. అయితే ఎల్జీ కంపెనీతో లాలూచీ పడుతున్నామంటూ చౌకబారు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ నుంచి పరిహారం వస్తుందా లేదా అనే తదుపరి విషయం అని, ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినా తప్పుపడతారా? అని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అత్యవసర సర్వీసుల కింద ఏ కంపెనీకి అనుమతులు ఇవ్వలేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.  అనుమతి పొందడానికి ముందు కంపెనీ ప్రతినిధులు పర్యవేక్షించే సమయంలో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. విశాఖలో పాలిమార్స్ కాలుష్య సమస్య పరిష్కారం అయ్యే వరకూ మంత్రులందరూ విశాఖలోనే ఉంటారని బొత్స తెలిపారు.

ఎల్జీ పాలిమర్స్ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉంది: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

గ్యాస్ లీకేజ్ ప్రమాదం సంభవించిన ఎల్ జి పాలిమర్స్ కర్మాగార ప్రాంతంలోగల ఐదు గ్రామాలలో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కర్మాగారానికి దక్షిణ దిశలో ఉన్న గ్రామాల్లోనే విష వాయువు ప్రభావం కొద్దిగా మిగిలి ఉన్నదని తెలిపారు.  నిర్వాసితులకు  పునరావాసం, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు.454 మంది ఆసుపత్రిలో ఉన్నారని వారిలో 20 మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. కర్మాగారం గేటు వద్ద వెంకటాపురంలో మాత్రమే పాయింట్ 0.2 ppm గాఢత ఉందని గోపాలపట్నం వేపగుంట ప్రాంతాల్లో విషవాయువు గాఢత  “0” గా నమోదైందని వెల్లడించారు.  కర్మాగారం లోని బ్రాయిలర్ ల ఉష్ణోగ్రత అదుపులోనే ఉందన్నారు. ఇతర సాంకేతిక విషయాలపై నిపుణులు, సాంకేతిక కమిటీ లతో చర్చించడం జరుగుతుందన్నారు.  జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.కోటి అందజేయడం జరుగుతుందని, తర్వాత న్యాయపరమైన అంశాల తో కంపెనీ నుండి నష్టపరిహారం చేస్తామని తెలిపారు.

రూ.30 కోట్లు ఎక్స్‌‌గ్రేషియా విడుదల! ఉత్తర్వులను జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా విడుదల చేసింది. రూ.30 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రథమచికిత్స చేసుకున్న వారికి రూ.25 వేలు. ఆస్పత్రిలో రెండు, మూడు రోజులు ఉన్నవారికి రూ.లక్ష. వెంటి లెటర్‌పై ఉన్నవారికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.  గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ.30 కోట్లు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్‌ లీక్‌ ఘటనలో మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. అలాగే విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైనవారికి విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు గ్యాస్‌ లీకేజి అరికట్టేందకు 9 మంది నిపుణుల బృందంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నిపుణల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.

8 గంటల్లోనే రైల్వే వంతెన పునర్ నిర్మాణం!

విజయవాడ డివిజన్లో రికార్డు సమయంలో రైల్వే పాత వంతెనను పునర్ నిర్మించారు. ఇంజనీరింగ్ బృందం ఆధ్వర్యంలో పాత వంతెనను కేవ‌లం 8 గంటల రికార్డు సమయంలో ఒంగోల్ - కరావాడి విభాగం మధ్య డౌన్-లైన్లో ప్రీ-కాస్ట్ ఆర్సిసి బాక్స్లతో నిర్మాణం పూర్తి చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలోని పాత శిధిలావస్థలో ఉన్న  రాతి వంతెనను ప్రీ కాస్ట్ ఆర్సిసి (రీఇన్ఫోర్స్ డ్ సిమెంట్ కాంక్రీట్) బాక్సులతో కిలో  నెం.  588 డౌన్ మెయిన్ లైన్లో విజయవంతంగా పూర్తి చేశారు. వంతెనను మార్చడానికి వీలుగా గురువారం 07:30 - 15:30 గంటల మధ్య డౌన్ లైన్లో 8 గంటల మెగా బ్లాక్ లతో కూడి పనులు చేపట్టేందుకు చర్యలు విజయవంతం గా పూర్తి.  దీనితో డివిజన్ ఎదుర్కొంటున్న 5 ప్రధాన వంతెన బ్లాక్లు లాక్డౌన్ సమయంలో రికార్డు సమయంలో మరమ్మతులు పూర్తయ్యాయి.   మూడు 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల క్రేన్లు, 4 ప్రోక్లెయినర్లు, 2 పవర్ బ్రేకర్లు, 4 టిప్పర్ లారీలు, టవర్ కార్ పరికరాలు మరియు 20 మంది కనీస సిబ్బంది  శ్రమను ఉపయోగించి 8 గంటల రికార్డు సమయంలో సమీకరించడం ద్వారా  రైలు రాకపోకలు కి ఎటువంటి అంతరాయం కలగకుండా పనిని  పూర్తీ చేశామని డివిజనల్ ఇంజనీర్ సంజీవ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, విధుల్లో భాగస్వామ్యం అయిన కార్మికుల్ని  క్షుణ్ణంగా పరీక్షించడం, వారికి పిపిఇలు, శానిటైజర్లు అందించామన్నారు.  పని సమయంలో భౌతిక దూరాన్ని  ఖచ్చితంగా పాటించడం ద్వారా అన్ని భద్రతా జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు.     ఇటువంటి పనులు సాధారణ రోజుల్లో జరిపితే  ఈ ప్రధాన మార్గంలో  200 కంటే ఎక్కువ రైళ్ల సేవల కదలికలను ప్రభావితం అవుతాయని తెలిపారు. ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చెయ్యడంతో, విజయవాడ డివిజన్  నాలుగు ప్రధాన వంతెన బ్లాక్లు పూర్తయ్యాయన్నారు.  సిగరాయకొండ-టంగూటూర్ మరియు రాజమండ్రి-విశాఖపట్నం సెక్షన్ మధ్య రెండు వంతెనలు, మరియు విజయవాడ యార్డ్ వద్ద సిజర్స్ క్రాస్ఓవర్ను పిసిసి స్లీపర్లతో భర్తీ చెయ్యగలిగామన్నారు. లాక్డౌన్ కాలంలో ఇలాంటి కీలకమైన పనులు చేసినందుకు ఇంజనీరింగ్ బృందాన్ని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్  పి.శ్రీనివాస్ అభినందించారు.

రైలు ప్రమాద ఘటన తెలిసి ఎంతో బాధపడ్డాను: చంద్రబాబు

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి రైలు ప్రమాద ఘటనపై స్పందిస్తూ చందబ్రాబు ట్వీట్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ - నాందేడ్ మార్గంలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఘటన సమాచారం తెలిసి తాను ఎంతో బాధపడ్డానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.  కాగా,  ఈ రైలు ప్రమాదంలో 16 మంది మరణించినట్టు సమాచారం. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది.