విశాఖ విషవాయువు న‌న్నెంత‌గానో క‌లిచివేసింది! ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విశాఖపట్టణం శివార్లలోని ఓ ప్రైవేటు కంపెనీ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైన దురదృష్టకర ఘటనలో జరిగిన ప్రాణనష్టం నన్నెంతగానో కలిచివేసింది. ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటనపై పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డితో మాట్లాడాను.  ఈ విషయంలో అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టామని హోంశాఖ కార్యదర్శి చెప్పారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

పశువులు, పక్షులు బలి! విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

ఎల్జీ పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాస్‌ లీకేజిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. ఊపిరాడ‌క పాకల్లో కట్టేసి ఉన్న పశువులు.. పొలాల్లో ఉన్న పశువులు అక్కడే కుప్పకూలి పోయాయి. పక్షులు గాల్లోనే నుంచి కింద పడిపోయి విలవిల్లాడుతూ కొట్టుకుని చనిపోయాయి...LG పాలిమర్స్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి చుస్తే హృదయ విదారకంగా ఉంది. ప్రజలు ఎక్కడికక్కడ పడిపోయారు. మరోవైపు.. పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల్లోని చెట్లు మాడిపోయాయి.  ఇప్పటివరకూ 2వేల మందికి పైగా స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లు, ఆటోలు, కార్లలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. చుట్టు పక్కల నివాసముంటున్న ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని సైరన్‌లు మోగించి పోలీసుల హెచ్చరిస్తున్నారు. ప్రతి ఇంటినీ పోలీసులు, సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. మొత్తం 5 గ్రామాల ప్రజలు ఇళ్లు వదిలేసి బయటికొచ్చేశారు.

విశాఖ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి చెందారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడంతో పాటు అధిక సంఖ్యలో ఆస్పత్రిపాలు కావడంపై చంద్రబాబు ఆవేదన చెందారు. ఈ ఘటనలో మనుషులే కాకుండా మూగజీవాలు కూడా మృతిచెందాయని ఆయన తెలిపారు.  కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను ప్రభుత్వం వెంటనే కాపాడాలని ఆయన సూచించారు. ఈ విష వాయువు సుమారు 3కిలోమీటర్లు వ్యాప్తి చెందడంతో చెట్లన్నీ రంగుమారడం జరిగిందని, అది విషవాయు తీవ్రతకు నిదర్శనమని ఆయన అన్నారు. యుద్దప్రాతిపదికన వెంటనే ప్రజలందరినీ ఖాళీ చేయించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. గ్యాస్ లీకై ఊళ్లు ఖాళీ చేయాల్సి రావడం బాధాకరమని, బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన సూచించారు. బాధితులకు వెంటనే అత్యున్నత వైద్య సాయం అందించాలని చంద్రబాబు కోరారు.

పాలిమర్స్‌ బాధితులతో నిండిపోయిన కేజీహెచ్!

పాలిమర్స్‌ బాధితులతో కేజీహెచ్‌ నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.  విషవాయువు ప్రభావంతో కళ్లు కనపడక బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు వెంకటాపురంలో పశువులు మృత్యువాత పడ్డాయి. పాలిమర్స్ చుట్టూ ఉన్న చెట్లు మాడిపోయాయి. మరోవైపు సహాయక చర్యలు అందించడానికి వచ్చిన పలువురు పోలీసులు కూడా అస్వస్థత గురవ్వగా.. వారిని కూడా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.  ఘటనను పరిశీలించడానికి వచ్చిన డీసీపీ ఉదయ్‌భాస్కర్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు. మరో రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మీడియాకు వెల్లడించారు.

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం ఆవేదన!

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.  రసాయన వాయువు లీకైన ఘటనలో ఇప్పటి వరకు 8మంది మృతిచెందగా, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.  సీఎం ఇవాళ మధ్యాహ్నం విశాఖ వెళ్లనున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. బాధితులను కాపాడేందుకు అంబులెన్స్‌లు, మెడికల్‌ కిట్‌లతో భారత నావికాదళం రంగంలోకి దిగింది. రసాయన వాయువు ప్రభావానికి వెంకటాపురం గ్రామంలోని మూగజీవాలు మృత్యువాత పడగా, చెట్లన్నీ రంగు మారాయి. ఈ వాయువు గాల్లోకి వ్యాపిస్తుండడంతో.. పరిసర గ్రామాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.  సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

చిన్నారిని కాపాడిన గ్రామ‌స్థులు! పాప క్షేమం!

విశాఖ గ్యాస్ లీక్ కావ‌డంతో  వెయ్యి మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైంది. చుట్టుపక్కల 3కి.మీ వరకు ఈ గ్యాస్ వ్యాపించడంతో.. 1000 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. గ్యాస్ లీక్ సమాచారంతో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా.. గ్యాస్ ప్రభావానికి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. వారిిన అంబులెన్సుల్లో కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాప పేరు: సుచరిత. తండ్రి పేరు : రాజు. ఊరు : వెంకట పురం, గోపాలపట్నం, విశాఖపట్నం.  ఈరోజు జరిగిన  L.G పొలిమెర్స్ గ్యాస్ లీక్ ప్రమాదం వాళ్ళ అక్కడున్న చిన్నారిని చింతలగ్రహారం రైతులు కాపాడి జాగ్రత్తగా చూస్కుంటున్నారు. చిన్నారి క్షేమంగా ఉంది, ఎటువంటి కంగారు పడనక్కర్లేదు. ఈ పాప‌ తల్లితండ్రులు 9440921522 ఫోన్ నెంబర్ కి కాల్ చేయమ‌ని వారు చెబుతున్నారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ లో గ్యాస్ లీక్.. ముగ్గురు మృతి.. 200 మందికి అస్వస్థత

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో భారీగా కెమికల్ గ్యాస్‌ లీక్‌ అయ్యింది. ఈ కెమికల్ గ్యాస్ 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఎల్జీ పాలిమర్స్‌, ఆర్‌.ఆర్‌ వెంకటాపురం పరిసరాల్లోని ప్రజలు.. కెమికల్ గ్యాస్ వాసనకు కళ్లు మండి కడుపులో వికారంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ.. మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పలువరు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనలో దాదాపు 200 మందికి అస్వస్థతకు గురయ్యారు. వీరంతా పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  గ్యాస్ లీకేజీ ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో ఎల్జీ పాలిమర్స్‌, వెంకటాపురం పరిసరాల్లో ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు సైరన్‌లు మోగిస్తూ హెచ్చరించారు. ఇతర ప్రాంతాల ప్రజలు ఎవరు అత్యుత్సాహంతో ఈ ప్రాంతానికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఏపీలో కొత్తగా 13మంది జాయింట్‌ కలెక్టర్లు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో మరో కీలక సంస్కరణ తీసుకువచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు 13మంది జాయింట్‌ కలెక్టర్లను నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే జిల్లాకు ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు ఉండగా, తాజా నిర్ణయంతో వారి సంఖ్య ముగ్గురికి చేరింది. అలాగే ముగ్గురు జేసీల శాఖలను బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రైతు భరోసా, రెవెన్యూ శాఖ.. గ్రామ, వార్డు, సచివాలయాల అభివృద్ధి.. ఆసరా, సంక్షేమ శాఖలకు ఒక్కోరి చొప్పున ప్రత్యేకంగా కొత్త జేసీలను నియమించింది. వీరికి మరికొన్ని శాఖలకు సంబంధించిన బాధ్యతల్ని అప్పగించింది.  1) రైతు భరోసా, రెవెన్యూ శాఖ జేసీ : అగ్రి కల్చర్‌, సివిల్‌ సప్లయ్స్‌, మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్‌, అనిమల్‌ హస్బండరీ, హార్టికల్చర్‌, ఫిషరింగ్‌, సెరీకల్చర్‌, రెవెన్యూ అండ్‌ సర్వే, నాచురల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఇరిగేషన్‌, లా అండ్‌ ఆర్డర్‌, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, మై‍న్స్‌ అండ్‌ జీయోలజీ, ఎనర్జీ  2) గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీ : డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ విలేజ్‌ అండ్‌ వార్డ్‌ సెక్రటేరియట్‌ అండ్‌ విలేజ్‌ అండ్‌ వార్డ్‌ వాలంటీర్స్‌, పంచాయితీ రాజ్‌, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, స్కూల్‌ ఎడ్యూకేషన్‌, టెక్నికల్‌ ఎడ్యూకేషన్‌, హైయ్యర్‌ ఎడ్యూకేషన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, హౌసింగ్‌, మీ సేవా, ఆర్‌టీజీ అండ్‌ ఐటీఈ అండ్ సీ డిపార్ట్‌మెంట్‌, ఆల్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌(ఎనర్జీ, ఇరిగేషన్‌ మినహా) 3) ఆసరా, సంక్షేమ శాఖ జేసీ : రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, ఎస్సీ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్, మైనారిటీస్ వెల్ఫేర్‌, ఇండస్ట్రీస్‌ అండ్‌ కామర్స్‌, ఎండో మెంట్స్‌, స్కిల్‌ డెవలెప్‌ మెంట్.

నయ్‌కూ హతం! భద్రతా దళాల అతి పెద్ద విజయం!

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో టాప్‌ కమాండర్‌, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్‌ నయ్‌కూను భద్రతా బలగాలు అతడి సొంత గ్రామంలోనే హతమార్చాయి. సొంతూరులో అమ్మను కలిసేందుకు బేగ్‌పొరాకు వస్తున్నట్లు ఈ నెల 5న సమాచారం అందగానే సైన్యం అప్రమత్తమైంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒకటిన్నర కిలోమీటర్‌ వరకూ గ్రామాన్ని చుట్టుముట్టారు. ఉదయం 9 గంటలకు రియాజ్ దాక్కున్న ఇంటిని గుర్తించి పేల్చివేశారు. అయితే అక్కడ నుంచి తృటిలో తప్పించుకున్న రియాజ్ మరో ఇంట్లోకి దూరాడు. ఆ ఇంట్లో అప్పటికే ఉన్న సైన్యం రియాజ్‌ను హతమార్చింది. జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ విజ‌య‌వంతం అయింది. గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసే 35 ఏళ్ల రియాజ్‌ 2012లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడు. కరడుగట్టిన ఉగ్రవాది హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ హతమైన తర్వాత ఆ బాధ్యతల్ని రియాజ్‌ చేపట్టాడు. మరో కీలక ముష్కరుడు జాకీర్‌ ముసా ఈ సంస్థ నుంచి వేరైన తర్వాత రియాజే కీలక వ్యక్తిగా మారాడు. కశ్మీర్‌లోయలో యువకుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషించేవాడు. రియాజ్‌ నయ్‌కూ 2016 జనవరిలో వెలుగులోకి వచ్చాడు. అప్పట్లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన షారిక్‌ అహ్మద్‌ భట్‌ అంత్యక్రియల సమయంలో రైఫిల్స్‌తో గాల్లోకి కాల్పులు జరుపుతూ ముందుకునడుస్తూ కనిపించాడు. అవంతిపుర జిల్లాకు చెందిన ఇతడు భద్రతా సిబ్బంది, పోలీసు అధికారుల్ని చంపిన ఎన్నో ఘటనల్లో ప్రధాన నిందితుడు. ఏ ++ కేటగిరీకి చెందిన ఉగ్రవాదిగా ముద్రవేసుకున్నాడు. అతడి తలపై రూ.12లక్షల రివార్డు కూడా ఉంది. కశ్మీర్‌లో హిజ్బుల్‌ ఉగ్రకార్యకలాపాల్లో నయ్‌కూదే కీలక పాత్ర. ఈ ముష్కరుడిని పట్టుకొనేందుకు 2018-19లో భద్రతా దళాలు చాలా తీవ్రంగా కష్టపడ్డాయి. కానీ, అతడు దాక్కోవడం.. పోలీసులు వెతకడం కొనసాగుతూ వచ్చింది. 2018లో ఓ ఉన్నతాధికారి ఎదుట లొంగిపోతానని చెప్పి ఆయననూ బోల్తా కొట్టించాడు. ఈ ఏడాది డజన్‌ మంది యువకుల్ని ఈ ఉగ్రవాద సంస్థలోకి చేరేలా ఆకర్షితుల్ని చేశాడు. 'నయ్‌కూను మనం అంతమొందిస్తే దక్షిణ కశ్మీర్‌లో హిజ్బుల్‌ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్టే' అని గతంలో కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ అన్న మాటల్ని బట్టి చూస్తే హిజ్బుల్‌లో అతడు ఎంత కీలకమైనవాడో, మరెంతో ప్రమాదికారో అర్థం చేసుకోవచ్చు. హంద్వారా ఎన్‌కౌంటర్ జరిగిన 3 రోజుల్లోనే సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. హంద్వారా ఎన్‌కౌంటర్‌లో కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనుజ్ సూద్ తదితరులు అమరులయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. హంద్వారా ఘటన జరిగిన 3 రోజుల్లోనే సైన్యం రియాజ్ సహా నలుగురిని హతమార్చింది.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదాను పొడిగిస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీని తిరిగి ప్రకటించేంతవరకూ వాయిదా కొనసాగుతుందని ఈ మేరకు బుధవారం ప్రకటన చేసింది. పోలింగ్‌ తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కనగరాజ్ ‌తెలిపారు. కాగా  కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

త్వరలో ప్రజా రవాణాకు అనుమతి!

ఆపరేటర్లకు సంకేతాలు ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ... దేశవ్యాప్తంగా త్వరలోనే రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవే సంకేతాలు ఇచ్చారు. కొన్ని  నియంత్రణలతో ఈ రవాణాకు అనుమతించే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. గడ్కరీ బుధవారం నాడు భారత బస్, కార్‌ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో మాట్లాడారు.  బుధవారం గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీరితో మాట్లాడారు. నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా రవాణా తిరిగి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారని తెలిసింది.  బస్సులు, కార్లు నడిపే క్రమంలో ప్రజలు తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఫేస్‌ మాస్క్‌ లు ధరించడం వంటి భద్రతా చర్యలు చేపట్టాలని, భౌతిక దూరం పాటించాలని గడ్కరీ సూచించారు. అయితే ప్రజా రవాణాను ఏ తేదీ నుంచి అనుమతిస్తారనేది మంత్రి వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు మే 17 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. గ్రీన్‌జోన్లలో ప్రభుత్వం ఇప్పటికే పలు సడలింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్‌-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం కల్పించేందుకు కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. గడ్కరీ వెల్లడించినట్లు రోడ్డు రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..అదే  తరహాలో..రైలు, విమాన సర్వీసులు కూడా ప్రారంభం అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విమానాశ్రయాల్లో లాక్ డౌన్ అనంతరం ప్రయాణికుల రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కేంద్రం నిర్ణయం తీసుకోవటమే తరువాయి తమ విమానాశ్రయాల్లో సేవలకు రెడీగా ఉన్నట్లుగా ఇఫ్పటికే ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల డెవలపర్ అయిన జీఎంఆర్ సంస్థ కేంద్రానికి నివేదించింది కూడా...

అదనపు కరెంట్ బిల్లులు వసూలు చేయం: ఏపీ ట్రాన్స్ కో సీఎండీ

లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరి దగ్గర అదనపు కరెంట్ బిల్లులు వసూలు చేసే అవకాశం లేదని ఏపీ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు. మార్చ్, ఏప్రిల్ బిల్లులు కలిపి  ఇచ్చారని అపోహ ఉందని, రెండు బిల్లులు విడిగా లెక్క కట్టామని చెప్పారు. గత ఐదు ఏళ్లగా మార్చ్ లో  46 శాతం వినియోగం, ఏప్రిల్ నెలలో 4 శాతం వినియోగం అదనంగా ఉంటుందన్నారు. అందుకే ఏప్రిల్ నెలలో అధికంగా ఉన్న నాలుగు శాతాన్ని మార్చిలో కలిపినట్లు సీఎండీ అన్నారు. రెండూ 50 శాతం, 50 శాతంగా లెక్క కట్టి బిల్లులు ఇవ్వటంతో స్లాబ్ మారే అవకాశం లేదన్నారు. ఏప్రిల్ నెలలో అదనంగా వచ్చిన యూనిట్లలను మార్చి నెలలో కలిపినట్లు ఆయన తెలిపారు. మార్చి నెలకి ఏప్రిల్ నెలకి బిల్లులు విడివిడిగా ఎస్ఎంఎస్ లు పంపుతున్నామని, సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను సైతం నియమించామన్నారు. ఎక్కడైనా అనుమానాలు ఉంటే 1912కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఏపీ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు.

రేపటి నుంచి విదేశాల్లో వున్న‌ భారతీయుల తరలింపు!

కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టింది.  మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత మళ్ళీ ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమం అని కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. మే 7 నుండి విమానాలు,, నౌకల ద్వారా విదేశాల నుండి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుందని ఆయ‌న చెప్పారు.    ఇప్పటికే మొత్తం 1,90,000 మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో, హై కమీషనర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. మొదటి దశలో వాయుమార్గాన 13 దేశాల నుండి 14,800 మంది భారతీయులను 64 విమానాల్లో భారత్ తీసుకురానున్నారు. మొదటి దశలో అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, బాంగ్లాదేశ్,  యు కె, యు ఏ ఈ, సౌదీ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ వంటి 12 దేశాలకు భారత విమానాలు చేరుకొని అక్కడున్న భారతీయులను తిరిగి తీసుకువస్తాయి . సామాజిక దూరాన్ని పాటించే విధంగా ఒక్కో విమానంలో 200 నుండి 300 మందిని తీసుకువస్తాం. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఈ క్రింది ప్రాధాన్య క్రమంలో భారత్ కు తరలిస్తామ‌ని కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. 1. ఆయా దేశాల నుండి వెలివేయబడిన వారు 2. వీసా గడువు ముగిసిన వారు  3. వలస కార్మికులు 4. ఆరోగ్యరీత్యా భారత్ లోని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అవసరమైన వారు  5. గర్భిణీ స్త్రీలు 6. భారత్ లో చనిపోయిన వారి బంధువులు  7. ఆయా దేశాల్లో చిక్కుకున్న పర్యాటకులు 8. విదేశాల్లో హాస్టల్స్ మూతబడి ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులు  భారత్ కు రాదల్చుకున్న వారు, వారికి కరోనా పరీక్షలు నిర్వహించబడి సర్టిఫికెట్ పొంది ఉండాలి. వారు భారత్ కు చేరుకున్న తర్వాత కూడా పరీక్షలు నిర్వహించబడుతాయి. ఈ రకంగా విదేశాల నుండి వచ్చిన ప్రతి వ్యక్తి 14 రోజుల పాటు  క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటైన్ కేంద్రాలను నిర్వహిస్తాయి.  అదే విధంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో నావెల్ షిప్స్ ద్వారా కొన్ని దేశాల నుండి మన దేశస్థులను తీసుకువచ్చే కార్యక్రమం మన భారత ప్రభుత్వం అధ్వర్యంలో కొనసాగనున్నది.

యాంటీ బాడీని అభివృద్ధి చేశాం!ఇజ్రాయెల్ రక్షణ మంత్రి నెఫ్తాలీ బెన్నెట్

గత ఆర్నెల్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇక మూడినట్టేనని ఇజ్రాయేల్ రక్షణ శాఖ ప్రకటించింది.  ఇజ్రాయెల్ పరిశోధకులు కరోనా వైరస్ ను అంతమొందించే యాంటీ బాడీని అభివృద్ధి చేసిన‌ట్లు జ్రాయెల్ రక్షణ మంత్రి నెఫ్తాలీ బెన్నెట్ ప్రకటించారు. ఈ యాంటీబాడీ పేటెంట్ కోసం ఇజ్రాయెల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. తదుపరి దశలో వాణిజ్య పరంగా పెద్ద ఎత్తున యాంటీబాడీలను ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ తయారీ సంస్థలను సంప్రదిస్తామని అన్నారు.  తమ పరిశోధకులు ఈ ఘనతను సాధించడం గర్వకారణమంటూ బెన్నెట్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఐఐబీఆర్ పరిశోధన శాలలను రెండు రోజుల క్రితం బెన్నెట్ పరిశీలించిన విషయాన్ని తెలియజేస్తూ ఇజ్రాయెట్ పీఎంఓ ఒక ప్రకటన విడుదల చేేసింది. రోమ్‌లోని స్పల్లంజానీ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ఈ వ్యాక్సీన్ ఎలుకల్లో యాంటీబాడీలను ఉత్పత్తిచేస్తున్నట్టు గుర్తించారు. ఇది మానవ కణాలపైనా సమర్థంగా పనిచేస్తుందని ఇటలీ పరిశోధకులు చెబుతున్నారు. నోవల్ కరోనా వైరస్‌ వ్యాక్సీన్‌కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో ఇదే అతిపెద్ద ముందడుగు అని దీన్ని తయారు చేస్తున్న టకిస్ సంస్థ సీఈవో లుయిగి ఆరిసిచియో పేర్కొన్నారు.  కరోనాను అడ్డుకునేందుకు మోనోక్లోనాల్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీని తయారు చేశారు. ఇది శరీరంలోకి వ్యాపించిన వైరస్ ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది.  కరోనా వైరస్ బారినపడి రోగుల శరీరంలోకి ఈ యాంటీబాడీస్‌ను పంపించినట్టయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకుని నియంత్రిస్తుంది.  ఇది ప్రయోగపూర్వకంగా నిరూపణ అయింది.  ఇజ్రాయేల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఇజ్రాయేల్ ఇనిస్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) కలిసి ఈ శుభవార్తను వెల్లడించాయి.

అన్న క్యాంటీన్లను రద్దు చేసి మద్యం దుకాణాల్ని తెరుస్తారా?

జ‌గ‌న్‌ ప్రభుత్వంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో మద్యం దుకాణాలు తెరచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను రద్దు చేసి.. పేద మహిళల పుస్తెలు తెంపే మద్యం దుకాణాలను తెరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో వైకాపా నేతలు కబ్జాలు, దౌర్జన్యాలు, దందాలు చేస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా.. నవరత్నాలు పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఒక ముద్దాయి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ఏపీని చూసి దేశ ప్రజలు తెలుసుకోవాలని కళా వెంకట్రావు హితవు పలికారు. సీఎం జగన్‌లో నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని కళా వెంకట్రావు విమర్శించారు. అధికారం చేపట్టిన 12 నెలల్లోనే రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి నెట్టారని ఆయన దుయ్యబట్టారు.

ఏమిటీ దారుణం? పంట అమ్మ‌డానికి నిబంధ‌న‌లా?

మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? అంటూ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఘాటుగా స్పందించారు. రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో రైతులు తాము పండించిన పంటను రోడ్లపైకి తెచ్చి పారబోస్తున్నారు. ఈ దారుణం కడప జిల్లా గొల్లపల్లి గ్రామంలో జరిగింది.  ఈ విషయాన్ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. "రైతు తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోతోంది. కడపజిల్లా, గొల్లపల్లి గ్రామంలో తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోశారంటే ఎంత బాధాకరమైన విషయం! మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? ఏమిటీ దారుణం?" అంటూ నిలదీశారు.

అమెరికా కీలక పదవుల్లో భారతీయులు!

అమెరికాలో మరో ముగ్గురు భారతీయులకు కీలక పదవులు లభించాయి. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ వారిని నామినేట్ చేశారు. ఇందులో అత్యంత కీలకమైన న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి పదవి కూడా ఉంది. ఈ పదవికి ప్రముఖ మహిళా న్యాయవాది సరిత కోమటిరెడ్డిని ట్రంప్ ఇప్పటికే నామినేట్ చేశారు. ట్రంప్ ప్రతిపాదించిన మిగతా ఇద్దరిలో భారతీయ అమెరికన్ న్యాయవాది అశోక్ మైఖేల్ పింటో, భారతీయ అమెరికన్ సీనియర్ దౌత్యవేత్త మనీషా సింగ్ ఉన్నారు. అశోక్ మైఖేల్ పింటోను ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభాగమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికా ప్రతినిధిగా నామినేట్ చేయగా, పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)కి తన రాయబారిగా మనీషా సింగ్‌ను ట్రంప్ నామినేట్ చేశారు.

చావుకి 10... పెళ్లికి 20... మరి, వైన్‌షాప్‌ దగ్గర?

తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్‌ ఏరియాల్లో తప్ప రెడ్‌ జోన్లలోనూ బుధవారం నుండి లిక్కర్‌ షాపులు తెరచుకున్నాయి. పలు ప్రాంతాల్లో మందుబాబులు ఉదయం నుండే షాపుల ముందు బారులు తీరారు. మహారాష్ట్రలో, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మందు షాపులు ఓపెన్‌ చేసినప్పుడు... కరోనా వచ్చినా పర్లేదు. మందు లేకపోతే మనుగడ కష్టమన్నట్టు జనాలు ఎగబడ్డారు. భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరు తీసుకొంటూ మందు కోసం ఎగబడిన వీడియోలు ఇంటర్‌నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. పలవురు సినిమా సెలబ్రిటీలు మందు వాటిపై తమ స్పందన తెలిపారు. అవన్నీ చూసి తెలంగాణలో కేసీఆర్‌ లిక్కర్‌ షాపులకు ఎందుకు అనుమతి ఇచ్చారనేది కొందరు తలలు పట్టుకున్నారు. లిక్కర్‌ షాపులకు అనుమతి ఇవ్వడం తప్పని ‘నీదీ నాదే ఒకే కథ’ దర్శకుడు వేణు ఊడుగుల అభిప్రాయపడ్డారు. ‘‘చనిపోతే 10 మంది... పెళ్లికి అయితే 20 మంది... మరి, వైన్‌ షాప్‌ దగ్గర?’’ అని వేణు ఊడుగుల ట్వీట్‌ చేశారు. మందుషాపుల దగ్గర ఎంతమంది ఉండాలనేది ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. లిక్కర్‌ కోసం షాపుల దగ్గర వందల మంది పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే. మనిషి మరణిస్తే చివరిచూపుకు, జీవితంలో ముఖ్యమైన వేడుక పెళ్లికి ఎక్కువమంది హాజరు కాకూడదని నిబంధనలు విధించిన ప్రభుత్వాలు... వైన్స్‌ దగ్గర ఎంతమంది ఉండాలో చెప్పలేదనే అంశాన్ని వేణు ఊడుగుల లేవదీశారు. ప్రజల్లో ఆలోచన రేకెత్తించే అంశమే ఇది. షాపుకు వచ్చిన మందుబాబుల్లో ఒక్కరికి కరోనా ఉన్నా... మిగతా వాళ్లకు సోకే ప్రమాదం ఉంది.

ముఖ్యమంత్రి మాట్లాడడు, మంత్రులు నోర్లు విప్పరు, మీడియా రాయదు

హైదరాబాదులోని కొత్తపేటలో ఉండే పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించిన సంగతి తెలిసిందే. కోహెడలో తాత్కాలికంగా షెడ్లను నిర్మించి పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేశారు. అయితే, గాలివాన బీభత్సానికి కోహెడ పండ్ల మార్కెట్ షెడ్ మొత్తం కూలిపోయింది. రేకులు ఎగిరిపడటంతో పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కనీసం రైతులని పరామర్శించలేదని కాంగ్రెస్ నేతలు విమరిస్తున్నారు. తాజాగా ఇదే ఘటనపై కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. "ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దది, ఆధునికమైనది అని చెప్పి, హడావిడిగా కనీసం ఇనుప రాడ్లను నట్టులు, బోల్టులతో బిగించకుండా, బట్టలతో కట్టిన షెడ్డు రైతుల, పండ్లు అమ్ముకునే వ్యాపారుల జీవితాల మీద కుప్పకూలిపోయింది. కొత్తపేట నుండి కోహెడకు తరలించిన పండ్ల మార్కెట్ దుస్థితి ఇది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా సప్పుడు చెయ్యకుండా ఉంటరా? ఇది న్యాయమేనా? రైతుల మీద కరోనా కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. రైతుల గురించి ఎంతో గొప్పగ మాట్లాడుతారు...మరి ఇది న్యాయమేనా? వందలాది మంది రైతులు, పండ్ల విక్రయదారులు నష్టపోయారు. చాలా మందికి తీవ్రంగా గాయాలైనవి. ప్రాణాలు పోయినవారు ఉన్నరో లేదో ఇంకా తెలియలేదు. ఇంత జరిగినా ఒక్క మాట కూడా మాట్లాడకపోతే....మీ ప్రేమ రైతుల మీద ఉన్నట్టా లేక దీని వెనుక ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఉన్నట్టా? ఇప్పటి వరకు కనీసం ఆ షెడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ మీద కానీ, పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద కానీ, నాయకుల మీద కానీ ఎటువంటి విచారణ లేదు, చర్య తీసుకోలేదు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ భూముల మీద ఉన్న ప్రేమ రైతుల మీద ఉంటే...ఈ ప్రమాదం జరిగేది కాదు. కనీసం టాయిలెట్స్ లేకుండా ఆసియాలోనే అత్యాధునిక, అత్యంత పెద్ద ఫ్రూట్ మార్కెట్ నిర్మించిన ఘనులు. కోహెడ కు తరలించిన తరువాత రైతుల పంటకు ధరలు సగం కూడా వస్తలే. గిరాకీ లేక చిన్న వ్యాపారుల బతుకు ఆగం అయిపోయింది. అయినా ఈ విషయం మీద ఒక్క మాట మాట్లాడరు. ముఖ్యమంత్రి మాట్లాడడు, మంత్రులు నోర్లు విప్పరు, మీడియా రాయదు. హాస్పిటల్ లో చావుబతుకుల్లో ఉన్న వారి ఏడ్పులు, మాటలు విన్న తర్వాతనైనా నమ్ముదాం. ఇప్పుడు చెప్పండి తెలంగాణలో స్కామ్ స్టర్స్ ఎవరు? ఎవరు సామాన్యులను దోచుకుంటున్నది? రియల్ ఎస్టేట్ వ్యాపారం, కమీషన్ కోసం మామిడి పండ్ల సీసన్ లో హడావిడిగా మార్కెట్ ను కొత్తపేట్ నుండి కోహెడకు మార్చి, ఇటువంటి ప్రమాదకరమైన షెడ్డులు నిర్మించి పేద రైతుల, చిరు వ్యాపారుల బతుకులను చిదిమేస్తున్నది ఎవరు?" అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.