కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై 40 ఏళ్ల వివరాలు ఇవ్వండి! తెలుగు రాష్ట్రాలను కోరిన నిపుణుల కమిటీ
posted on May 14, 2020 @ 11:01AM
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు సంబంధించి 40 సంవత్సరాల వివరాలు ఇవ్వాలని మిగులు జలాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది. అయిదుగురితో కూడిన ఈ కమిటీలోని నలుగురు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్ విజయ్ శరణ్, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు హరికేష్ మీనా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీర్లు నరసింహారావు, నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు సంబంధించిన వివరాలు కోరినా ఇవ్వలేదని, వాటిని త్వరగా ఇస్తే అధ్యయనం చేసి జూన్ మొదటి వారంలో మళ్లీ చర్చిద్దామని జలసంఘం చీఫ్ ఇంజినీర్ సూచించినట్లు తెలిసింది. ప్రాజెక్టుల వారీగా పది రోజుల వంతున వచ్చిన ప్రవాహం, బయటకు వదిలిన నీటికి సంబంధించి 40 ఏళ్ల వివరాలు కావాలని కోరినట్లు తెలిసింది. అందుబాటులో లేకపోతే 20 సంవత్సరాల వివరాలైనా వెంటనే ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. పూడిక పెరిగినందున తాజా నీటి నిల్వ సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని వచ్చిన అభిప్రాయంతో జలసంఘం చీఫ్ ఏకీభవించినట్లు తెలిసింది.