ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు
posted on May 19, 2020 @ 2:19PM
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై సుప్రీం కోర్టు కు వెళ్లిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి చుక్కెదురైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎన్జీటీలో విచారణ తరువాతే సుప్రీం కోర్టులో విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈకేసును సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎన్జీటీ కి లేదని ఎల్జీ పాలిమర్స్ వాదనలు వినిపించగా.. ఆ విషయాలన్నీ ఎన్జీటీ ఎదుట ప్రస్తావించాలని ధర్మాసనం తెలిపింది.
ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.50 కోట్లు జమ చేశామని, అంతకుమించి ఎన్జీటీకి విచారణ అధికారం లేదని ఎల్జీ పాలిమర్స్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ లలిత్ ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది. అంతేగాకుండా, ఎన్జీటీలో న్యాయపరమైన అంశాలు లేవనెత్తేందుకు అవకాశం కల్పించింది.
ఎన్జీటీ, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గ్యాస్ లీక్ ఘటన జరిగిన వెంటనే ఎన్జీటీ ఎల్జీ పాలిమర్స్ పై చాలా సీరియస్ అయింది. నోటీసులు ఇవ్వడంతో పాటు రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై ఎల్జీ పాలిమర్స్ సుప్రీం కోర్టు కు వెళ్ళింది. తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడాన్ని ఎల్జీ పాలిమర్స్ సవాల్ చేసింది.