హైకోర్టులో జగన్ సర్కార్‌కు మళ్ళీ ఎదురుదెబ్బ.. జీవో 623 రద్దు

జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ కార్యాలయలకు రంగులపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 623ను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జీవో ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జీవో ఇవ్వడంపై ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర పంచయతీ రాజ్ సెక్రెటరీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28లోపు రంగులు తీసేయాలి లేదా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 28లోపు రంగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని హైకోర్టు పేర్కొంది. గతంలో పంచాయతీ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలని, ఎటువంటి రంగులు వేయాలనే దానిపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ 623 జీవోను జారీ చేసింది. ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులతో పాటు టెర్రా కోట్(ఎర్రమట్టి రంగు) రంగును బార్డర్‌గా వేయాలని జీవోలో పేర్కొంది. పైగా ఈ రంగులు దేనికి సంకేతమో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే మళ్లీ అవే రంగులు వేస్తూ జీవో ఎలా ఇస్తారంటూ.. జీవో 623ను సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన సోమయాజులు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించగా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న హైకోర్టు.. 623జీవోను కొట్టివేస్తూ.. జీవోను ఎందుకిచ్చారో ఈ నెల 28లోపు వివరణ  ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

వరంగల్ లో కలకలం.. ఒకే బావిలో ఏడు మృతదేహాలు

పొట్టకూటికోసం పశ్చిమ బెంగాల్‌, బీహార్ రాష్ట్రాల నుంచి తెలంగాకు వచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ బావిలో శవాలుగా తేలారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. నిన్న బావిలో 4 మృతదేహాలు లభ్యం కాగా, ఈరోజు మరో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 7కు చేరింది. కోల్‌కతాకు చెందిన మక్సూద్‌ (50) దాదాపు 20 ఏళ్లుగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని కరీమాబాద్‌లో నివసిస్తూ.. ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. అతడికి భార్య నిషా(45), ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్తతో విడాకులు తీసుకున్న అతడి కుమార్తె కూడా.. తన కొడుకుతో కలిసి తండ్రి మక్సూద్‌ వద్దే ఉంటోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మక్సూద్‌ కుటుంబం ఇండస్ట్రియల్‌ ప్రాంతంలోని సాయిదత్తా బార్‌దాన్‌ ట్రేడర్స్‌లోని భవనంలోనే నెల రోజులుగా ఉండిపోయింది. ఆ భవనంపైనే బీహార్ ‌కు చెందిన ఇద్దరు యువకులు ఉంటున్నారు. గురువారం సాయిదత్తా ట్రేడర్స్‌ యజమాని వచ్చేసరికి.. వీరెవరూ కనిపించకపోవడంతో గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ చుట్టుపక్కల వెతుకుతుండగా బావిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. వాటిని వెలికితీసిన పోలీసులు.. మక్సూద్‌, నిషా, కుమార్తె (22), మనవడి(3)గా గుర్తించారు. ఎవరైనా హత్య చేశారా? వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే విషయంలో స్పష్టత లభించడం లేదు. అయితే శుక్రవారం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. ఇవాళ లభ్యమైన మూడు మృతదేహాల్లో మక్సూద్ కుమారుడు షాబాద్(22), బిహార్ కు చెందిన కార్మికుడు శ్రీరామ్ గా గుర్తించారు. మరొ మృత దేహం వివరాలు తెలియాల్సి ఉంది. బావిలో నీటిని అధికారులు బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఏపీలో మళ్ళీ 60 కి పైగా కరోనా కేసులు.. ఒకరు మృతి

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సగటున రోజుకి 50 కేసులకు పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 8,415 శాంపిల్స్ ను పరీక్షించగా 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 51 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికవరకు నమోదైన మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,514 కి చేరింది. ఇప్పటివరకు 1,734 మంది డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 55కి చేరింది.

జియోలోకి పెట్టుబడుల వెల్లువ.. కేకేఆర్‌ రూ.11,367 కోట్ల పెట్టుబడి

రిలయన్స్‌ డిజిటల్‌ యూనిట్‌ జియోలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు అంతర్జాతీయ సంస్థలు జియోలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా, న్యూయార్క్‌కు చెందిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ కేకేఆర్ జియోలో రూ.11,367 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. దీంతో జియోలో 2.32 శాతం వాటా కేకేఆర్ సొంతం చేసుకోనుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి కానుందని ఆర్ఐఎల్ తెలిపింది. ఈ పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లకు, ఎంటర్‌ప్రైజెస్‌ విలువ రూ. 5.16 లక్షల కోట్లకు చేరనుందని తెలిపింది. కాగా, గత నెలలో ఫేస్‌బుక్‌ జియోలో రూ. 43,574 కోట్లు పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్‌ సంస్థలు కూడా జియోలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా కేకేఆర్‌ కూడా ఈ జాబితాలో చేరడంతో.. జియో కొద్ది కాలంలోనే రూ. 78,562 కోట్ల పెట్టుబడులను సేకరించింది.

కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ గవర్నర్

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌(ఆర్‌బీఐ) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను చేసింది. రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. రివర్స్‌ రెపోరేటు 3.35శాతానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థలో మరిన్ని నిధులను అందుబాటులో ఉంచేందుకే రెపోరేటు తగ్గించామని వివరించారు. టర్మ్‌ లోన్లపై మారటోరియం మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని, ఆర్థికరంగ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు చాలా తీవ్రమైన సవాళ్లు ఉన్నాయని.. ఆర్థిక ఏడాది ద్వితీయార్థం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని ఆయన చెప్పారు. లాక్‌డౌన్ కాలంలో సిమెంట్‌ ఉత్పత్తి 25శాతం తగ్గిందని, పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడిందని‌ వెల్లడించారు. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 15శాతం పడిపోయిందని, ఏప్రిల్‌లో తయారీరంగంలో ఎన్నడూ లేనంత క్షీణత కనిపించిందని పేర్కొన్నారు. అయితే, ఈ పరిస్థితులు వ్యవసాయ రంగానికి మాత్రం మరింత ప్రోత్సాహకంగా ఉన్నాయని చెప్పారు. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోందని తెలిపారు. వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం అంచనా వేయడం క్లిష్టంగా మారిందని శక్తికాంత్ దాస్‌ తెలిపారు.

భారత్‌లో కరోనా తీవ్రరూపం.. ఒక్క రోజులో 6 వేలకు పైగా కేసులు

భారత్‌లో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గత కొద్దిరోజులుగా రోజుకి ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్న కరోనా.. ఇప్పుడేకంగా ఆరు వేలలోకి అడుగుపెట్టింది. ఒక్కరోజులో తొలిసారిగా ఆరువేల కంటే అధికంగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 6,088 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 118,447కు చేరింది. గత 24 గంటల్లో 148 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో.. భారత్‌‌లో కరోనా మృతుల సంఖ్య 3,583కి చేరింది. ఇప్పటివరకూ 48,533 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 66,330 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అయోధ్య‌లో బయటపడిన శివలింగం, దేవ‌తా విగ్ర‌హాలు

అయోధ్య రామజన్మభూమి వద్ద స్థలం చదును చేస్తుండగా పురాత‌న దేవ‌తా విగ్ర‌హాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దేవ‌తా విగ్ర‌హాల‌తో పాటు శివలింగం కూడా లభ్యమైంది. ఈ శివలింగం ఎత్తు ఐదు అడుగులు ఉన్నట్టు గుర్తించారు. రామజన్మభూమిలో కొన్నిరోజులుగా భూమి చదును చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడి శిథిలాలను తొలగిస్తుండగా.. విరిగిన దేవతా విగ్రహాలు, ఐదు అడుగుల శివ‌లింగం, 7 నల్లరాతి స్తంభాలు, 6 ఎర్రరాతి స్తంభాలు, ఓ క‌ల‌శంతో పాటు ప‌లు పురాత‌న వ‌స్తువులు బయటపడ్డాయి.  దీనికి సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ఈ నెల 11 నుంచి కార్మికులు రామజన్మభూమి స్థలం చదును చేస్తున్నారన్నారు. ఈ త‌వ్వ‌కాల్లో స్తంభాలతో పాటు ప‌లు శిల్పాలు వెలుగు చూశాయ‌న్నారు. వీహెచ్‌పీ నేత వినోద్ భ‌న్సాల్‌ మాట్లాడుతూ.. మే 11న రామాయ‌లం ప‌నులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి త‌వ్వ‌కాల్లో పూర్ణ కుంభం వంటి ఎన్నో అవ‌శేషాలు ల‌భించాయ‌ని తెలిపారు.

తెలంగాణలో కరోనా పరీక్షల పై కేంద్రం అసంతృప్తి.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్న మంత్రి

తెలంగాణలో జరుగుతున్న కరోనా పరీక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నాయని.. కానీ, తెలంగాణలో మాత్రం ఈ విషయంలో అలసత్వం కనిపిస్తోందని కేంద్రం వ్యాఖ్యానించింది. తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం 21వేల టెస్టులు మాత్రమే జరిగాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ సగటుతో పోలిస్తే చాలా తక్కవ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్‌లో తీవ్ర నష్టం ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. కరోనా‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు.  కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖపై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కరోనా పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, తమ పటిష్ట చర్యల వల్ల కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్టు పరీక్షలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలపై ప్రజలెవరూ ఆందోళన చెందటం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి ఈటల అన్నారు.

విశాఖలో మళ్లీ కలకలం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం

విశాఖలో ఇటీవల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ అయి 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి పూర్తిగా కోలుకోకముందే విశాఖలో మళ్లీ కలకలం రేగింది. హెచ్‌పీసీఎల్‌ కంపెనీ నుంచి ఒక్కసారిగా దట్టమైన తెల్లని పొగలు అలుముకున్నాయి. పొగ రావడంతో స్థానికులు భయాందోళనకు గురై.. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే కాసేపటికే పొగ తగ్గిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలోని ఎస్‌హెచ్‌యూని తెరిచే సమయంలో ఈ ఘటన జరిగింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్టు గుర్తించామని, సమస్యను వెంటనే చక్కదిద్దామని, ఎలాంటి ప్రమాదం లేదని హెచ్‌పీసీఎల్‌ వర్గాలు అంటున్నాయి.

ఇంగ్లీష్ మీడియం పై జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలనే కృత నిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. తాజాగా దీనికి సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్ మీడియం అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వేను ఒక ప్రముఖ థర్డ్ పార్టీ సంస్థతో చేయించాలని చేయించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతను ఓ ఇంగ్లీష్ ఛానల్ కు అప్పగించింది. సమగ్ర శిక్షణా అభియాన్ కింద షార్ట్ ఫిల్మ్‌లతో పాటు సర్వే చేయించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. మే నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆర్థిక శాఖ, ట్రెజరీ విభాగాలకు ఆదేశాలు అందాయి. ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించేందుకు వీలుగా ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో సిఎఫ్ఎంఎస్ మార్పులు చేయనున్నది. గడిచిన రెండు నెలల్లో తగ్గించిన వేతనాల బకాయిలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే జగన్ సర్కార్ చెల్లించింది. లాక్ డౌన్‌లో సడలింపులు చేయడంతో ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మా వాడు హైకోర్టునే పీకి పారేశాడు.. జగన్‌పై జేసీ సంచలన వ్యాఖ్యలు

'మా వాడు.. మా వాడు' అంటూనే ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేయడం టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి బాగా అలవాటు. తాజాగా ఆయన మరోసారి సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. రాష్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని.. వాళ్లదే రాజ్యమని అన్నారు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా మా వాడు పట్టించుకోవడం లేదని... హైకోర్టునే పీకి పారేశాడని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని కోసం 158 రోజులుగా రైతులు, మహిళలు దీక్ష చేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదని.. కనీసం మీ సమస్య ఏంటని కూడా అడగడం లేదని విమర్శించారు. మా టీడీపీ నేతలు ఎందుకు దీక్షలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. నిజంగా నిరాహార దీక్ష చేసినా ప్రజలు నమ్మరు.. బిర్యానీ తిని చేస్తున్నారనుకుంటారు అన్నారు. దీక్షలు చేసినంత మాత్రాన జగన్ లో మార్పు రాదని చెప్పారు. రాష్ట్రంలోని సగం జనాలు ఆయన ఇంటి ముందు కూర్చుంటే జగన్ వింటాడేమో అని జేసీ అన్నారు. అయితే, పోతిరెడ్డి పాడు విషయంలో మాత్రం మా వాడు చాలా సిన్సియర్‌గానే ఉన్నాడు అనిపిస్తోంది అని జేసీ వ్యాఖ్యానించారు.

లోకేష్‌ ను వేధించిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలి: పవన్

తాడేపల్లిగూడెంకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఉన్నమట్ల లోకేష్.. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిసి ఎంతో బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. లోకేష్ ను సీఐ రఘు వేధించినట్టు తమకు తెలిసిందని, ఆ సీఐ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందన్నారు. అక్రమాలను ప్రశ్నించిన వారిని వేధించడం చట్ట సమ్మతమా? అని ప్రశ్నించారు. పోలీసులు ప్రజలకే జవాబుదారీ తప్ప అధికార పక్షానికి కాదని హితవు పలికారు. లోకేశ్‌కు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని జిల్లా నాయకులకు పవన్ సూచించారు. పోలీసు వేధింపులు, అధికార పార్టీ నాయకుల వేధింపులపై ప్రజాస్వామ్య ధోరణిలో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతోపాటు, ఆ ప్రాంతంలో అధికార పక్షం చేస్తున్న ఇసుక దందా వంటి అక్రమాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా నాయకులకు పవన్ సూచించారు.

గాంధీ కరోనా పేషెంట్ మిస్టరీపై స్పందించిన మంత్రి ఈటెల

కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా కరోనాతో మృతి చెందిన తన భర్త దహన సంస్కారాలు అధికారులు చేశారంటూ ఓ మహిళ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం వారి కుటుంబ సభ్యులకు చెప్పే డెడ్ బాడీని పోలీసులకు అప్పగించామని చెప్పారు.  తాజాగా, ఈ ఘటనపై మంత్రి ఈటెల రాజేందర్ కూడా స్పందించారు. ఈశ్వరయ్య అనే వ్యక్తి ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లో చనిపోయారని.. ఆయన కుమారుడు మధుసూదన్ అదే రోజు ఆస్పత్రికి వచ్చాడని.. 1న చనిపోయాడని అన్నారు. మధుసూదన్ మృతి గురించి పోలీసులకు చెప్పామన్నారు. మొత్తం కుటుంబం కరోనాతో బాధ పడుతుండంతో, భార్యకు తెలిస్తే షాక్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని కుటుంబానికి చెప్పలేదని అన్నారు. ఆ సమయంలో కుటుంబం అంతా ఆస్పత్రిలోనే ఉండటం వల్ల తామే దహన సంస్కారాలు చేసినట్లు తెలిపారు. వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. అప్పటికే ఒకరిని కోల్పోయారని, మరొకరి మృతి చెందారని చెప్తే తట్టుకోలేరని వాళ్ల సన్నిహితులు అన్నారని చెప్పారు. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టే పరిస్థితి లేదని మంత్రి ఈటెల అన్నారు.

చిరంజీవి విన్నపం.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు అనుమతి...

హైదరాబాద్‌ ‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో తెలంగాణ సినీమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసరావు సమావేశమయ్యారు. షూటింగులు, సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభించే అంశంపై చిరంజీవి, అల్లు అరవింద్, దిల్‌ రాజు, నాగార్జున, రాజమౌళి, కొరటాల శివతో పాటు పలువురితో తలసాని చర్చించారు.  సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘షూటింగ్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి?.. థియేటర్లు ఎప్పటి నుంచి పున:ప్రారంభమవుతాయి? అనే విషయాలపై ప్రభుత్వం నుంచి ఏదో ఒక సమాధానం రావాలి అనే దానిపై మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల కోసమో లేక షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాల దర్శకనిర్మాతల కోసమో చేస్తున్న వినతి కాదు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న 14 వేల మంది రోజువారీ సినీ కార్మికులను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న విన్నపం. ఈ 14 వేల మంది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రిగారికి, ముఖ్యమంత్రిగారికి నేను విన్నవిస్తున్నా.’’ అంటూ ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తలసాని.. అందరి అభిప్రాయాలు తీసుకుని షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై ముందుకు వెళ్తామన్నారు. ఇండస్ట్రీలోని సమస్యల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, వాటికి అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. సినిమాల చిత్రీకరణపై ప్రాధాన్యాతలు గుర్తించాలని, వాటిపై మరింత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. మరొకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 8,092 శాంపిల్స్‌ను పరీక్షించగా 45 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,452కి చేరుకుంది. నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందగా.. కరోనాతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 54కి చేరింది. కొత్తగా 41 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 1,680మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 718 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలి

ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు కూడా ఉందని తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు భగ్గుమంటాయని హెచ్చరించింది.  ఇక గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో మూడు రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం 47.2 డిగ్రీల  గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల 42-43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. రేపటి నుంచి ఆదివారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా పేషెంట్ మిస్సింగ్ మిస్టరీ.. కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన మహిళ

తన భర్త కనిపంచడం లేదంటూ మాధవి అనే మహిళ ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివాసముండే తాము కరోనా బారిన పడ్డామని.. అయితే తామంతా కోలుకుని ఇంటికి తిరిగి రాగా తన భర్త మధుసూదన్ జాడ మాత్రం తెలియలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 27న తన భర్తను కింగ్‌ కోఠి ఆసుపత్రిలో చేర్చుకున్నారని, ఆ తర్వాత ఏప్రిల్‌ 30న గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. తన భర్త గురించి ఆరా తీయగా ఆసుపత్రి సిబ్బంది పొంతన లేకుండా సమాధానం చెప్పారని, ఒకసారి చనిపోయాడని, మరోసారి వెంటిలేటర్ పై ఉన్నాడని సమాధానం ఇచ్చినట్టు ఆమె తెలిపారు. తరువాత మే 1న తన భర్త చనిపోయాడని, మే 2న అంత్యక్రియలు పూర్తి చేశామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని, అయితే ఆ విషయంలో తమ నుంచి అనుమతి తీసుకోలేదని, మృతదేహాన్ని గుర్తించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని మహిళ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందిస్తూ మే 1న మధుసూదన్ చనిపోయినట్టు నిర్దారించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే నాటికే ఆయన ఆరోగ్యం క్షిణించిందని.. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన 23 గంటల్లోనే చనిపోయాడని తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు చెప్పే డెడ్ బాడీని పోలీసులకు అప్పగించామని చెప్పారు. కుటుంబ సభ్యుల నుండి తీసుకున్న సంతకాలు కూడా తమ రికార్డ్స్‌లో ఉన్నాయని అన్నారు. కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకి ముందుకు రాకపోతే ఆ కార్యక్రమాలను జీహెచ్ఎంసీ నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.

వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. టీడీపీ ప్రతిపక్ష హోదా పోవడం ఖాయమా?

ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వైసీపీ మళ్లీ ప్రారంభించిందా? టీడీపీ ముఖ్య నేతలపై గురి పెట్టిందా? ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశమైంది. ఈ కరోనా కష్టకాలంలోనూ..  ప్రతిపక్ష టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీలను తమవైపు రాబట్టుకునేందుకు అధికారపార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ కి తెరలేపినట్లు సమాచారం. అయితే అధికారపార్టీ నేతల ప్రయత్నాలకు కొందరు టీడీపీ నేతలు బ్రేకులు వేస్తుండగా, ఒకరిద్దరు నేతలు మాత్రం మాటలు కలుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల పార్టీ మార్పు వ్యవహారంపై విస్తృత చర్చ నడుస్తోంది. విషయం తెలుసుకున్న టీడీపీ అధిష్ఠానం కూడా పార్టీ జిల్లా నాయకులకు ఫోన్లు చేసి మాట్లాడటం ప్రారంభించిందని సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య నాయకులను టీడీపీకి రాజీనామా చేయించి.. వైసీపీలో చేర్పించేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ లకు వైసీపీ అధిష్టానం బాధ్యతలను అప్పజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొందరు టీడీపీ ముఖ్య నేతలు పార్టీ మారే ప్రసక్తే లేదని తెగేసి చెబుతుండగా.. మరి కొందరు మాత్రం అధికార పార్టీ నేతలతో మాటలు కలుపుతున్నారట. ముఖ్యంగా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఆపరేషన్‍ ఆకర్ష్ ప్రారంభించారట. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కూడా వైసీపీలో చేర్పించేందుకు కరణం ప్రయత్నిస్తున్నారని వారితో ఆయన టచ్‍లో ఉంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ మాజీ ఎమ్మెల్యేలతో నిత్యం చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ప్రకాశం జిల్లాలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రధానంగా టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వివిధ వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో వీరిపై ఒత్తిడి ఉందంటున్నారు. మరోవైపు, ఎమ్మెల్యేల‌ పార్టీ మార్పుపై టీడీపీ అధిష్టానం కూడా అలెర్ట్ అయిందని, వారితో అధినేత మాట్లాడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మే 30 కి వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతుంది. మే 30 లోపు పార్టీలో చేర్చుకుని చంద్రబాబుకు ప్రతిపక్షనాయకుని హోదా లేకుండా చేయాల‌నే యోచనలో అధికారపార్టీ ఉందంటున్నారు. అందులో భాగంగానే ముందుగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిందని అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ 23 మందిలో ఇప్పటికే ముగ్గురు పార్టీ ఫిరాయించారు. మరో ముగ్గురు కనుక పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే చంద్రబాబుకు ప్రతిపక్షనాయకుని హోదాపోతుంది. దానికి జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముహూర్తంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. ఆరోజు టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఇదంతా పధకం ప్రకారం వైసీపీ ఆడుతోన్న మైండ్‍ గేమ్‍ అని కూడా టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ పార్టీ మారేందుకు సిద్దంగా లేరని అంటోంది. మరి అధికార పార్టీ నిజంగానే ఆపరేషన్‌ ఆకర్ష్ కు తెరలేపిందా? ఆ ఆకర్ష్ కు టీడీపీ నేతలు ఆకర్షితులవుతారా? తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాలి.